వరకట్న నిషేధం ,వితంతు వివాహ ప్రోత్సాహం తోపాటు ‘’ఆంధ్ర ‘’శబ్ద వ్యాప్తికి ,స్త్రీజనాభ్యుదయానికి కృషి చేసిన తెలంగాణా సంఘ సేవకురాలు,శాసన సభ్యురాలు –శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారి
1-1-1911 న జన్మించిన శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారి ,విద్వాన్ పరీక్ష పాసై ,సికందరాబాద్ కీస్ గరల్స్ హైస్కూల్ లో తెలుగు పండిట్ గా చేరి భాషా సాంస్కృతిక అభి వృద్ధికి విశేష కృషి చేశారు .జాతీయోద్యమ కాలం లో హైదరాబాద్ లో ఖాదీ వస్త్రాలు అమ్మారు .ఇంటింటికి తిరిగి ఖాదీ ప్రచారం చేశారు .భర్త శ్రీ వై వి ఎల్ నారాయణ రావు సర్వోదయ కార్యకర్త .
1934లో ఖమ్మం లో నిజం రాష్ట్ర మహా సభ జరిగినప్పుడు ,ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించారు .హైదరాబాద్ లో ఆంధ్ర యువతీ మండలి స్థాపనకు కృషి చేశారు .’’ఆంధ్ర’’ శబ్దాన్నివిస్తృత ప్రచారం చేయటానికి సీతాకుమారి చేసిన సేవ అనన్య సదృశం .చిక్కడ పల్లిలో’’ ప్రమదా మండలి ‘’స్థాపించారు .స్త్రీ విద్య స్త్రీ సంక్షేమం స్త్రీ స్వాతంత్ర్యం ,వరకట్న నిషేధం ,వితంతు వివాహాల ప్రోత్సాహం కోసం ఈ మండలి ద్వారా విశేష కృషి చేశారు .
నిజాం నిరంకుశత్వ పాలనలో అక్కిరెడ్డి పల్లి గ్రామం లో స్త్రీలపై జరిగిన అత్యాచారాలను విచారించటానికి వెళ్ళిన కమిషన్ లో సీతాకుమారి సభ్యురాలు .కల్లోలిత ప్రాంతాలను పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పి ఊరట కలిగించారు .వితంతువులకు అనాధలకు ,భర్తల చే పరిత్యజిపబడిన మహిళలకు ఆశ్రయం కల్పించి ఉదారంగా సేవ లందించారు .
సీతాకుమారి ‘’విశాలాంధ్ర ‘’కోసం పాటు పడిన ధీర వనిత.1957లో నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ నియోజక వర్గం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ లేకుండా గెలిచి రికార్డ్ సృష్టించారు .ఆంధ్రులకు సంబంధించిన అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు .అనేక కధానికలు రచించిన రచయిత్రి సీతాకుమారి .ప్రజా సంబంధ విషయాలను గురించి ఎప్పటికప్పుడు గోల్కొండ పత్రిక లో రాసే వారు .నిర్భీకత సేతాదేవ సహజ లక్షణం.75 వ ఏట ఈ ధీర వీర సంఘ సేవాపరాయణురాలు శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారి 2-1-1986 న నిర్యాణం చెందారు .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-24-ఉయ్యూరు .
