ఆంజనేయ పాత్రకు చిరునామా –శ్రీ బేతా వెంకట రావు
బట్టలు నేయటం కుల వృత్తిగా ఉన్న శ్రీ బేతా వెంకటరావు రామస్వామి గయిరమ్మ దంపతులకు 1918లో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు .ఆయన స్వయం గా బట్టల వ్యాపారం 1934 లో ప్రారంభించారు .వ్యాపారంతో పాటు వీధి నాటకాలలో కూడా చురుగ్గా పాల్గొనే వారు .వీటికి తోడూ భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికి తలలో నాలుకగా ఉన్నారు .
పిత్రార్జితంగా వచ్చిన ఎకరన్నర పొలం అమ్మేసి నాటకాలకు ఖర్చుపెట్టారు వెంకటరావు .హరిశ్చంద్ర ,భక్త రామ దాసు పాత్రలను అద్భుతంగా నటించి మెప్పు పొందారు .తనజీవితాన్ని నాటక రంగానికే అంకితం చేయాలని నిశ్చయించుకొని పెద్దాపురం నివాసి శ్రీ మాల్యాల జయరామయ్య గారితో కలిసి ‘’లంకా దహనం ‘’నాటకం రాయించారు .1938లో శ్రీ బద్ది రెడ్ది కోటేశ్వర రావు తో ‘’రామంజనేయయుద్ధం’’ రాయించి ,ఈ రెండు నాటకాలలో తాను ఆంజనేయ పాత్రను పరమాద్భుతంగా పోషించి శెభాష్ అనిపించుకొన్నారు.తూర్పు గోదావరి జిల్లా పల్లెటూర్లలో అంతా పర్యటించి వీటితోపాటు మరికొన్ని నాటకాలు ఆడి రక్తి కట్టించారు .
1941లో రాజ మ౦డ్రి చేరి ,ఒక ట్రూపు ను ఏర్పాటు చేసుకొని టికెట్లు పెట్టి రామాంజనేయ యుద్ధం నాటకం ఆడి,ప్రజాహృదయాలను ఆకర్షించారు .ఆ రోజుల్లో బేతా వెంకటరావు గారు తప్ప ఆంజనేయ పాత్ర పోషించే నటుడు ఎవరూ లేరు .తెలుగు నేల నలుమూలల నుంచి ఆయనకు విపరీతంగా ఆహ్వానాలు వచ్చేవి .అడిగిన ప్రతిచోటా ఆనాటకం ఆడి ఆంజనేయ పాత్రలో చిరయశస్సు సాధించి ప్రజా హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆంజనేయ పాత్ర పోషిస్తే బేతా వారే పోషించాలి ఆయనకు ఎదురు ఎవరూ లేరు అనిపించుకొన్నారు .
రామండ్రి నుంచి ఆంధ్రా వెనిస్ తెనాలికి మకాం మార్చారు వేంకట రావు .1944లో 300 రామాంజనేయ నాటకాలు ఆడి రికార్డ్ సృష్టించారు .1948లో ఏడాదికి 325రామాంజనేయ నాటకాలు ప్రదర్శించి నభూతో నభవిష్యతి ఆని పించుకొన్నారు .ఒక మినీ బస్ కొని నాటక ట్రూప్ ను అందులో తీసుకు వెళ్లి ,విరామం లేకుండా నాటకాలు ఆడి జనాలకు మరింత దగ్గరయ్యారు .ఆంజనేయ పాత్రలో ,ముఖ్యంగా పద్య పఠనం లో తనదైన ముద్రతో విప్లవమే సృష్టించారు . .సంభాషణా విధానాన్నే మార్చేశారు .పద్యం పాడినా ,సంభాషణలు ఉచ్చరించినా ,ప్రేక్షకులు వన్స్ మోర్ లతో హర్ష ధ్వానాలతో ఆన౦దపడి ఆనంద పరచి ఉత్సాహం నింపేవారు .అదో మహా నాటక తపస్సుగా కొనసాగేది .
నాటకంలో ఆ౦జనేయుడు ఒకపక్క విపరీతమైన రామ భక్తి ప్రదర్శిస్తూ మరో వైపు తన ప్రాణ రక్షణకై చెంత చేరిన యయాతి మహారాజు ను కాపాడే ప్రయత్నం లో రాముడిని ‘’చింతకాయ దులిపినట్లు ‘’దులిపేయటంఏమీ ఎరుగనట్లు అమాయకత్వాన్ని ప్రదర్శించటం తో ప్రేక్షకులు ఫిదా అయి పోయేవారు .కోతి చేష్టలైన కళ్ళు ఆర్పటం ,మధ్యమధ్య ఒళ్ళు గోక్కోవటం ‘’ఇది మా జాతి లక్షణము ,కోతి లక్షణము ‘’,అంటూ రాముడిని ఎద్దేవా చేస్తూ ,రాముని ఎదుట వినమ్రంగా నిలబడటం ,పద్యాలు పాడటం లో ఎగిరి కుప్పి గంతులు వేయటం ,నృత్యంలో శ్రీరామనామాన్ని భక్తి యుతంగా ప్రదర్శించటం ,కోతి చేష్టలతో పాటు అమాయక రామ భక్తిని ప్రదర్శించటం ఆయనకు మాత్రమె సాధ్యమైన విషయాలు .
మైలవరం రాజా బేతా వారి ఆంజనేయ పాత్ర చూసి ,వెండి కిరీటం బహూకరించి ఘన సన్మానం చేశారు .1954 డిసెంబర్ 24 న రేపల్లె లో బేతా వారి రామాంజనేయ యుద్ధం ‘’మహా రంజుగా సాగుతోంది .యయాతికి అభయం ఇచ్చి ,ఆవేశంతో శపథం చేస్తుండగా ఆంజనేయస్వామి గుండెలో మంటలు చెలరేగాయి .’’రామరామా శ్రీరామా రామా ‘’అంటూ రంగస్థలం మీదనే ఒరిగి పోయి తన ప్రాణాలను తన హృదయేశ్వరుడైన శ్రీరామ చంద్ర ప్రభువు లో కలిపేశారు ఆ మహా నట చక్రవర్తి .ఇదొక అపూర్వ సన్ని వేశం తెలుగు నాటక రంగ చరిత్రలో .
ఆధారం –ప్రముఖ కవి రచయిత ,విమర్శకుడు శ్రీ మిరియాల రామకృష్ణ గారి వ్యాసం .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-24-ఉయ్యూరు .

