దూర విద్యా దిక్సూచి ,ఫాదర్ ఆఫ్ ఓపెన్ యూని వర్సిటీస్ ,సమాజ శాస్త్ర నిష్ణాతుడు,యుజిసి చైర్మన్ –శ్రీ .జి.రాం రెడ్ది
4-12-1929 న కరీం నగర్ జిల్లా మైలారం గ్రామం లో రా౦రెడ్డి మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం లో జన్మించారు .ఉస్మానియాలో రాజకీయ శాస్త్రం లో మాస్టర్స్ డిగ్రీ ,పిహెచ్ .డి.పొందారు .1977వరకు ఉస్మానియా యూని వర్సిటిలో ప్రొఫెసర్ గా పని చేశారు .1977-82 మధ్య ఆయూని వర్సిటి వైస్ చాన్సలర్ గా సేవలందించి పేరు ప్రఖ్యాతులు గడించారు .
ప్రజలను విజ్ఞాన వంతులుగా ,బాధ్యతా యుత పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యతసామాజ శాస్త్రానిదే ఆని గట్టిగా నమ్మిన రాం రెడ్ది హైదరాబాద్ లో ‘’భారతసమాజ విజ్ఞాన పరిశోధనా మండలి’’ ఏర్పాటు చేసి ,దక్షిణ ప్రాంతీయ కేంద్రానికి వ్యవస్థాపక డైరెక్టర్ గా సమాజ శాస్త్ర రంగం లో అనేక ప్రయోగాలు చేసి ప్రజా విజ్ఞానానికి కృషి చేశారు .
1980 లో రెడ్ది గారి దృష్టి దూర విద్య పై పడి,దానిపై గొప్ప అధ్యయనం చేశారు . బ్రిటీష ఓపెన్ యూని వర్సిటి అప్పటికే దూర విద్యపై విశేష కృషి చేయటం గమనించి ,ఆ విధానాన్ని కూలం కషంగా లోతుగా అధ్యయనం చేసి ,రాష్ట్ర ప్రభుత్వానికి ఓపెన్ యూని వర్సిటి అంటే సార్వత్రిక విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయటం కోసం విపులమైన నివేదికసమర్పించారు రెడ్డీ జీ .దీన్ని ప్రభుత్వం ఆమోదించి భారత దేశం లోనే మొట్ట మొదటి ఓపెన్ యూని వర్సిటిని ‘’డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటి ‘’గా పేరుపెట్టి 1982లో హైదరాబాద్ లో నెలకొల్పి గొప్ప ముందడుగు వేసింది .దీనికి మొదటి వైస్ చాన్సలర్ శ్రీ రాం రెడ్ది గారే అవటం మన అదృష్టం .తమపాలనా కాలం లో దీన్ని అనేక రీతులలో తీర్చి దిద్దిన ఘనత రెడ్ది గారిదే .
రెడ్ది గారి కృషిని గమనించిన కేంద్ర ప్రభుత్వం 1985లో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ‘’ఇందిరా గాంధి నేషనల్ ఓపెన్ యూని వర్సిటి ‘’కి వైస్ చాన్సలర్ గా నియమించి గౌరవించింది .ఇందులో రెడ్ది గారు చేసిన కృషి అ౦తర్జాతీయంగా గుర్తింపు ప్రశంసలు పొందింది .కామన్ వెల్త్ సెక్రెటరిజనరల్ రాం ఫాల్ ‘’కామన్ వెల్త్ లోని 49 దేశాలలో రెండు పెద్ద సార్వత్రిక విద్యావ్యవస్థలను భారత దేశం లో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో సుస్థిరం చేశారు ప్రొఫెసర్ రాం రెడ్ది ‘’ఆని మెచ్చారు .దీనితో రెడ్ది గారిని ‘’కామన్ వెల్త్ ఆఫ్ లెర్నింగ్ సంస్థ ‘’కు ఉపాధ్యక్షునిగా నియమించి గౌరవించారు .
1991లో భారత ప్రభుత్వం రాం రెడ్ది గారిని న్యు ఢిల్లీ లోని ‘’యూని వర్సిటి గ్రాంట్స్ కమిషన్ ‘’కు చైర్మన్ చేసింది .రెడ్ది గారు ప్రపంచ దేశాలలోని ముఖ్యమైన ఓపెన్ యూని వర్సిటీ లను సందర్శించి సార్వత్రిక వ్యవస్థకు ఒక మంచి నమూనా తయారు చేసి ఆసియా అభి వృద్ధి బాంక్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో మొదటి సారిగా వివరించి అందరి మన్ననలు పొందారు . ఈ నమూనా అనేక దేశాలకు రోల్ మోడల్ అయి ఆచరణ పొందింది .సార్వత్రిక విశ్వ విద్యాలయ రూప శిల్పి గా రాం రెడ్ది గారిని గుర్తించి బంగ్లా దేశ్ ప్రభుత్వం తమ దేశ మొదటి ఓపెన్ యూని వర్సిటికి సలహాదారుగా నియమించి అంతర్జాతీయ గౌరవాన్ని కలుగ కేసింది .అందుకే ఆయనకు ‘’ఫాదరాఫ్ ఓపెన్ యూని వర్సిటీస్ ‘’అనే సార్ధక బిరుదు లభించింది .
రాం రెడ్ది మొదటి నుంచి ఆధిపత్య,పెత్తందారీ వ్యవస్థ ,కేంద్రీకృత వ్యవస్థలకు వ్యతిరేకి .’’అధికారం కేంద్రీ కృతమైతే వ్యవస్థలు భ్రష్టు పట్టి౮౯౦- పోతాయి .శరీరం లో కొవ్వు పెరిగితే హృద్రోగం వచ్చినట్లు ,అధికారం పెరిగితే నియంతృత్వం ,డబ్బు పెరిగితే పెట్టుబడి ,భూమి పెరిగితే భూ స్వామ్యం ,సంతానం పెరిగితే పేదరికం తప్పవు ‘’ఆని నిర్భయంగా చెప్పారు రెడ్ది గారు .స్త్రీ విముక్తికి దూర విద్య గొప్ప ఆశా కిరణం ఆని నమ్మకం గా చెప్పి ఆ దిశలో విప్లవమే సాధించారు .విశ్వ విద్యాలయ స్థాపక సంఘం లో రెడ్డిగారు సభ్యులు .తిరుపతిలో మహిళా విశ్వ విద్యాలయం రాం రెడ్ది గారి కృషి ఫలితమే .
ఆంధ్ర దేశం లోని అన్ని విశ్వ విద్యాలయాలు శ్రీ రాం రెడ్ది గారిని ఆహ్వానించి సన్మానించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి తమల్ని తాము గౌరవి౦చు కొన్నాయి .స్వయం కృషితో ఇంతింతై వామన మూర్తిగా ఎదిగిన రాం రెడ్ది గారికి రాజలక్ష్మి ఫౌండేషన్ వారి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది .ఉస్మానియా డిస్టంట్ ఎడ్యుకేషన్ విభాగం కు రాం రెడ్ది గారి పేరు పెట్టి గౌరవించారు .ఈ ఆధునిక దూర విద్యా భగీరధుడు శ్రీ రాం రెడ్ది గారు 2-7-1995 న లండన్ లో 86ఏళ్ళ వయసులో సరస్వతీ సాన్నిధ్యాన్ని పొందారు .
ఆధారం –డా.వెలగా వెంకటప్పయ్యగారి వ్యాసం .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-24-ఉయ్యూరు .
