గౌరవపూర్వక ‘’22 గన్ సాల్యూట్ ‘’తో శ్రీ కృష్ణ పాత్రకు సత్కారం అందుకొన్ననటుడు -శ్రీ నాగలింగ భాగవతార్
శ్రీ వి నాగలింగం కడపలో 12-5–1910 నజన్మించి అతి చిన్నవయసు 7ఏళ్లప్పుడే నాటకరంగ ప్రవేశం చేశారు .1912లోనే కడపలో గుంటూరు బాలమిత్ర సభ వారుకృష్ణలీలలు నాటకం ప్రదర్శిస్తుండగా సభ యజమాని శ్రీ దంటు వెంకట కృష్ణయ్య గారు రిహార్సిల్స్ శ్రద్ధగా చూస్తున్న ఈకుర్రాడిని చూసి ముచ్చటపడి,ఒకసీను నటిస్తావా అంటే ‘’వా యస్ ‘’అంటూ నదురు బెదురులేకుండా అద్భుతంగా నటించి అందరి ప్రశంస అందుకున్నాడు .అందరూ ఈబాలుడిని విపరీతంగా ముద్దాడి ఆశీర్వదించారు . బాలుడి అభినయానికి మెచ్చి సభవారు నేలకు యాభై రూపాయలు ఇంటికి పంపే ఏర్పాటుపై తలిదండ్రులను ఒప్పించి తమతో గుంటూరు తీసుకు వెళ్లారు .
బాలమిత్ర సభలో అనేక పాత్రలు పోషిస్తూ రాష్ట్రంలోనేకాక రాష్ట్రేతరంగా మైసూర్ బొంబాయి కలకత్తాలలో కూడా కృష్ణపాత్రలు ధరించి మెప్పుపొంది 100బంగారు పతకాలు ,12వెండి పిల్లన గ్రోవులు ,30వెండికప్పులు ,4 షీల్డులు పొందారు నాగలింగం. 1916నుండి 1928వరకు పన్నెండు ఏళ్ళు ఆ సమాజం లో అనేక పట్టణాలలో నాటకపాత్ర పోషించారు .ఇందులో మెరికల్లాంటి బాలురు టి రామకృష్ణ ,శాస్త్రి కె రఘురామయ్య ,పైడిబాబు ,రావుల లక్ష్మీకాంతం ,తంగిరాల అంజి ,పువ్వుల సూరిబాబు ,తమ నటనా విశ్వరూపం చూపి గొప్ప పేరు పొందారు .హైదరాబాద్ లో నాగలింగం కృష్ణ పాత్రాభినయానికి మెచ్చి రాజా యార్లగడ్డ కృష్ణప్రసాద్ 1000రూపాయల వెండి కృష్ణ విగ్రహం వెండి కృష్ణ బహూకరిస్తూ౦డగా , గౌరవంగా 22 ఫిరంగులు పేల్చారు. ఇది ఆంధ్రనాటక రంగ చరిత్రలో అద్వితీయ ఘట్టం .ఏ నటుడికీ దక్కని అరుదైన గౌరవం .క్రమంగా బాలమిత్ర సభ సమాజం కనుమరుగైపోగా అనేక నాటక సమాజాలలో నటించారు .
1944లో సూరిబాబు శ్రీమతి రాజేశ్వరి కలిపి స్థాపించిన రాజరాజేశ్వరి నాట్య మండలి లో నాగలింగం గారికి ఆహ్వానం లభించి తారాశశాంకం లో జంబుకేశ్వర శాస్త్రి వేషం వేసి తననటనతో మన్ననలు అందుకొన్నారు ఈనాటకం కొన్ని వేలసార్లు ప్రదర్శింపబడింది .మైసూరులో జరిగిన ప్రదర్శనలో సుప్రసిద్ధ కన్నడ హాస్య నటుడు శ్రీ గుబ్బి వీరన్న నాగలింగంగారి నటనకు మెచ్చి బంగారు పతకం బహూకరించాడు .
ఎన్నో పాత్రలను నాటకరంగం పై పోషించిన నాగలింగంగారు ,నాటక రంగం నుంచి నిష్క్రమించాక, హరికథా కాలక్షేపాలు చేస్తూ నాగలింగ భాగవతారు గా కీర్తి ప్రతిష్టలు పొంది ,అనేకమంది సంగీతజ్ఞుల ప్రశంసలు కూడా అందుకొన్నారు .1970లో 60వ ఏట నాగలింగ భాగవతార్ జీవిత నాటక రంగం నుంచి నిష్క్రమించారు .
వీరి ఫోటో కూడా ఎక్కడా దొరక్కపోవటం ఆశ్చర్య౦ .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-8-24-ఉయ్యూరు .

