రంగస్థల ‘సరస్వతి’-శ్రీ కోడూరిపాటి సరస్వతీ రామారావు
తెలుగు నాటకానికి బహుముఖాలుగా సేవలందించిన ప్రొఫెసర్ కోడూరిపాటి సరస్వతి రామారావు ఈనాటి కళాకారులకు ఆదర్శప్రాయుడు.
తెలుగు నాటకానికి బహుముఖాలుగా సేవలందించిన ప్రొఫెసర్ కోడూరిపాటి సరస్వతి రామారావు ఈనాటి కళాకారులకు ఆదర్శప్రాయుడు. ఆయన నాటకరచయిత, నటుడు, దర్శకుడు. ఎన్నో విప్లవాత్మకమయిన రచనలు చేసారు. స్వీయదర్శకత్వం చేసి, తనే నటుడిగా పాల్గొని ఎన్నో నాటకాల్ని విజయవంతం చేసిన ఘనుడు. వీరు రచించిన ‘రంగూన్ రౌడి’ నాటకం అనేక ప్రదర్శనలను పూర్తి చేసుకుని అఖిలాంధ్ర ప్రేక్షకుల మన్ననలని అందుకుంది. నవరసాలను ఒకే పాత్రలో సృష్టించుకోవాలనే ఆలోచనతో కష్టపడి, కృషిచేసి, సాహసించి ‘సాని సంసారి’ అనే నాటకం రూపొందించారు. ఈ నాటకం బాగా విజయవంతమయినప్పటి నుంచి ఆయన ప్రేక్షకులకు ఆరాధ్యదైవమయ్యారు.
అదృష్టవశాత్తు ఆ మహానుభావుడు స్వయంగా రచించి దర్శకత్వం వహించిన ‘వీర పాండ్య కట్టబ్రహ్మన్న’ నాటకంలో నాకు మంచి పాత్ర వేసే అవకాశం దొరికింది. ఈ నాటకం ద్వారా అనేకమంది రంగస్థల నటులు సాంకేతిక నిపుణులు పరిచయమయ్యారు. మహారాజు సుపుత్రుడిగా అప్పటి బాలనటుడు, ఇప్పటి సినీ నేపథ్య గాయకుడు నాగూరుబాబు ఈ నాటకంలో మాతోబాటు ఒక పాత్ర వేశాడు.
ఈ నాటకంలో పాల్గొనడం ద్వారా, నేను ఆయన వ్యక్తిత్వాన్ని, దర్శకత్వ మెళకువలని గమనించేవాడ్ని. ఆయన ఇతర దర్శకుల్లాగాక తన నటనా శైలిని ప్రతి నటుడికి నేర్పించేవారు. నటుడి ముఖంలో కళ్ళు, ఎక్స్‌ప్రెషన్ ముఖ్యం అని చెప్పేవారు. స్వయంగా నటుడవడం వల్ల నటించి చూపించేవారు. ‘నటుడు భటుడు కాడు, నారాయణాంశ సంభూతుడు’ అని నటుల్ని గౌరవించేవారు. ఆంధ్రనాటక కళాపరిషత్‌లో ఆయన నటన చూసి ముగ్ధుడైన వంగర వెంకటసుబ్బయ్య గారు కోడూరుపాటి వారికి సాష్టాంగదండ ప్రణామం చెయ్యడం, ఆయన నటజీవితంలో మర్చిపోలేని రోజు. గుర్రం జాషువా గారు ఆయన్ని ‘సంగీత, సాహిత్య నటసార్వభౌమ’ బిరుదుతో గౌరవించారు. 1909లో జన్మించిన సరస్వతి రామారావుగారు 1982 జనవరి 28న నటరాజులో ఐక్యమైనారు. సంపూర్ణ జీవితాన్ని తెలుగు నాటకాభివృద్ధికి అంకితం చేసి, నాటకం కోసం అహర్నిశలు శ్రమించిన కళాపిపాసి ఫ్రొఫెసర్ కోడూరిపాటి ఇటువంటి మహనీయుల అనుభవాలే తెలుగు నాటకానికి దిక్సూచి.
పి.పాండురంగ
మాజీ సంచాలకులు, ఆకాశవాణ
సరస్వతీ రామారావు ఏలూరు దగ్గర శనివారప్పేట లో జన్మించారు .తల్లి మాణిక్యాంబ తండ్రి చిన కృష్ణయ్య .ఏలూరులో చదివి శ్రీ తీర్ధాల వెంకట శేష మాణిక్య శాస్త్రి గారివద్ద సంగీతం నటన లలో ప్రావీణ్యం సాధించారు .1932లో బాల్యమిత్రుడు శ్రీ బి వీరయ్య భాగవతార్ ప్రోత్సాహంతో ఏలూరులో శ్రీ రాయల్ ఆర్ట్ ధియేటర్ స్థాపించారు .’’వీడె రంగూన్ రౌడి వీడే కోదూరుపాటి రౌడీ ‘’అంటూ దేశమంతా తిరిగి రంగూన్ రౌడి పాత్రతో ఘన కీర్తి పొందారు .దీని తర్వాత ‘’రంగూన్ మెయిల్ ‘’నాటకం ఆడారు .అందులో రాజారాం అనే దుష్టపాత్ర ఆయనే ధరించారు .కె.రఘురామయ్య స్థానం నరసింహారావుగార్లు కూడా ఇందులో పాత్ర దారులు .
తర్వాత నవరసాలు కురిపించే పాత్ర సృష్టించి ‘’సాని-సంసారి’’ నాటకం రాసి అనేక ప్రదర్శనలు ఇచ్చారు .ఆంధ్రాలోనేకాక ఒరిస్సా తెలంగాణా లో కూడా దీనికి మంచి పేరు వచ్చింది .’’దీని నమ్మ బోకుమమ్మ ,దేహమనగా మట్టి బొమ్మ ‘’అనే ఆధ్యాత్మిక గీతం ఆయన రసవత్తరంగా పాడుతూ తన్మయులను చేసేవారు .దీన్ని చూసిన ఒక భక్తురాలుఅప్పటికప్పుడు చేతికున్న బంగారు గాజులు తీసి ఆయనకు కానుకగా ఇచ్చేసింది .విశాఖలో ఈ నాటకం చూసిన ఒక తెల్లదొర ఆనందంగా తనమనీ పర్సు మొత్తం ఆయనకోసం స్టేజి మీదకు విసిరి చప్పట్లతో పరవశించాడు .పౌరాణిక నాటక హవా నడుస్తున్న ఆకాలం లో ఈ సాంఘిక నాటకానికి అరుదైన గౌరవం తెచ్చిపెట్టారు రామారావుగారు .
సినీ డైరెక్టర్ బి.వి .రామానందం పిలుపుతో కలకత్తా వెళ్ళి ‘’పెంకిపిల్ల ‘’చిత్రానికి సంభాషణలు రాశారు .అందులో విలన్ పాత్ర కూడా ధరించి మళ్లీ ఇంటికి చేరారు .అప్పటికి ఆయన రంగస్థల అనుభవం మూడు దశాబ్దాలు .తర్వాత తన జీవితాన్నే కథా రూపంగా ‘’రంగస్థలం ‘’నాటకం రాసి అనేక పట్టణాలలో ప్రదర్శించారు .1962గుడివాడ పరిషత్తులో ఈనాటకం ఉత్తమ ప్రదర్శనకు ,ఉత్తమ హాస్యనటుడికి ,ఉత్తమనటికి బహుమానాలు లభించాయి .బాపట్లలో కూడా ఇన్ని బహుమతులు పొందారు .ఆయన ఉత్తమ నటుడే కాదు ఉత్తమ రచయితకూడా .జమీందారు విప్లవం ,రామశాస్త్రి కట్ట బ్రాహ్మన,రంగస్థలం ,సాని –సంసారి నాటకాలు ఆయన రాసినవే .అనేక సంస్థలు ఆయన్ను సన్మానించాయి .’’నాటకరంగ అభి వృద్ధికోసం అహరహం తపించి కృషి చేసిన శ్రీ కోడూరు పాటి సరస్వతీ రామా రావు వృద్ధాప్యం లో నాటక రంగ ఎడారిలో నిలబడి పోయారు’’ఆని బాధపడ్డారు శ్రీ మిక్కిలి నేని . ,
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -16-8-24-ఉయ్యూరు

