[ఆంధ్ర నట పితామహ,నటావధూత –శ్రీ హరి ప్రసాద రావు
చతుర్విధ ఆభినయాలను సమపాళ్ళలో మేళవించి ,ప్రతిపాత్రకు పాత్రోచిత అభినయాన్ని అందించి ఆపత్రలను జీవి౦ప జేసిన వారిలో ప్రధములు శ్రీ హరి ప్రసాద రావు .ధార్వాడ నాటక సమాజం ఊరూరా నాటకాలు ప్రదర్శించి వెర్రెత్తిస్తున్నకాలం ,ఔత్సాహికులు నాటక సమాజాలు స్థాపించిన కాలం అది .నటులను పంక్తి బాహ్యులుగా చూస్తున్న కాలం కూడా .అలాంటి సమయంలో 1882లో గుంటూరు లో ఫస్ట్ కంపెని అనే హిందూ నాటకసమాజం స్థాపించబడి ,అందులో అద్వితీయ నటనా వైదుష్యాన్ని ప్రదర్శించి ,,నాటకాగ్రేసరులుగా ,ఆంధ్ర నాటక పితామహులుగా కీర్తి పొంది శ్రీ కొండుభోట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి ,పాతూరి శ్రీరాములు ,పోలూరి హనుమంతరావు ,తోలేటి అప్పారావు వంటి వారిఅఖండుల చేత తీర్చిదిద్దబడిన వారు హరి ప్రసాదరావు గారు .
కృష్ణా జిల్లా కూచిపూడిలో కూచిపూడి భాగవతులు అయిన హరి వారి వంశంలో 1851 లో జన్మించి ,అక్కడే చదివి ప్రసాదరావు ,మెట్రిక్ పాసై ,కొంతకాలం టెలిగ్రాఫ్ సిగ్నలర్ ఉద్యోగం చేసి ,మరికొంతకాలం గుంటూరు జిల్లా కోర్టు లో కాపీయిస్ట్ గా పనిచేశారు .తర్వాత జీవితమంతా నాటక రంగానికే అంకితం చేసి గుంటూరులోనేతుదిశ్వాస విడిచారు .
స్ఫురద్రూపి ఆజానుబాహువు ,విశాలముఖం ,గంభీర గాత్రం ,అభినయ ప్రధాన నేత్రద్వయం ,ఠీవిగా ఏ పాత్రకైనా సరిపోయేట్లు ఉండేవారు ప్రసాదరావు .గుంటూరు ఫస్ట్ కంపెని నాటకాలలో అన్ని పాత్రలు దారించి అద్వితీయ నటనా సామర్ధ్యాన్ని ప్రకటించారు .వేణీ సంహారంలో దుర్యోధన ,చిత్ర నలీయ౦ లో నలుడు బాహుకుడు ,చంద్రహాసలో చంద్రహాసుడు ,హరి శ్చంద్రలో హరిశ్చంద్రుడు ,సారంగధరలో సారంగ ధరుడు ,శాకుంతలం లో దుష్యంతుడు పాత్రలు ధరించి తమ నటనా వైభవంతో ఆపాత్రలకు విశిష్టమైన స్థానం కల్పించారు .తనకు తానె అనిపించారు .ఆయన నటన అనుకరణకు అలవి కానిది అయింది .
పద్యాన్ని భావ యుక్తంగా పాడటం ,ఆపాట యేభావానికి యెంత మోతాదులో ఉండాలో ఖచ్చితంగా లెక్కవేసి ఆ లపించటం హరి వారి ప్రత్యేకత అన్నారు డా మిక్కిలినేని .పాటకంటే భావానికే ఎక్కువ ప్రాదాన్యమిచ్చేవారు .సన్నివేశ స్వారస్యానికి తగినట్లు సమపాళ్ళలో చతుర్విధ అభినయం జోడి౦చేవారు .హద్దులు దాటకుండా నిగ్రహంగా నటించటం’’ ప్రసాద రావీయం’’ అయింది .పాత్రలో లీనమైనట్లు నటించే వారే కానీ ,తాదాత్మ్యం చెందేవారు కాదు హరివారు అంటారు కళాప్రపూర్ణ మిక్కిలినేని .అందుకేఆయన తర్వాత ఎంతమంది నటులు వచ్చినా ‘’నటపితామహులు’’గా ‘’ఉండిపోయారు హరి ప్రసాద రావు .’’వీరి చూపులు, రాచ పోకడలు ,భావ వైదుష్యం ,అవయవ చాలనం ,గాత్ర వైఖరులు మొదలైనవి ఉత్తమ నాయక ప్రౌఢత్వానికి వన్నె పెట్టాయి ,వీరిగానామృతం ,అభినయ రీతులు ,,నాట్యాదర్శాలు ,పలువురచే ప్రశంసించ బడినవి ‘’అనిమెచ్చారు స్థానం నరసింహారావుగారు .
శృంగార ,కరుణ రసాలను ఒప్పించడం లో హరి వారికి హరి వారే సాటి .ఆనాటినుంచి నేటి వరకు ఆయన హరిశ్చంద్ర పాత్ర చిరంజీవి .ఆయన్ను మించిన వారులేరు .అందులో కరుణ రస౦తో ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించేవారు .ధీరోదాత్త పాత్రలకు ఆయన కేరాఫ్ అడ్రస్ .ప్రతిపాత్రకు ఆపాత్ర వ్యక్తిత్వాన్ని ,మాటలో ,పాటలో ,అభినయం వేషధారణ లలో ఒక్కొక్క అభినయాన్ని చిత్రి౦చు కొనేవారు .ఒకపాత్ర ప్రభావం మరో పాత్రపై పడకుండా జాగ్రత్త పడేవారు అన్నారు మిక్కిలినేని .లోహితాస్యుని శవాన్ని చూసి గుండె కరిగి నీరై హృదయవిదారకపు ఘట్టంలో పాడే పద్యం గుండెల్ని పిండించి కన్నీరు కార్పించేది .ఒడలు జలదరించేది .
అభిజ్ఞాన శాకుంతలం నాటకం లో ‘’వాసన జూడనట్టి ప్రసవంబు ‘’మొదలైన పద్యాలను చదవటంలో శకుంతలను ఊహించి దుష్యంతుడు చేసే ప్రౌఢ శృంగార అభినయం అనన్య సదృశం అన్నారు మిక్కిలినేని .చిత్ర నలీయ౦ లో నలుడు పాత్రలో విదర్భ నగరాన్ని వర్ణించే సందర్భంగా ‘’ఈ పుర వైభవ మెన్న నద్భుతము ‘’అనే రగడనుకీర్తనగా అద్వితీయంగా గానం చేసి ప్రేక్షక నీరాజనాలు అందుకోనేవారు హరివారు .దేవతలనే వరించమని దమయంతితో నలుడు చెప్పే సందర్భం లో ‘’మగువా !దాపగనేల ‘’పద్యం లో చివరి భాగాన్ని వదిలేసి ,రెండు మూడు సార్లు చదివిందే చదివి ,చివరకు ‘’ఆ నలుడే,వీడు సుమ్ము బి౦బాధరా ‘’అంటూ పరమ రామణీయకంగాపూర్తి చేసి ప్రేక్షకులలో నెలకొన్నా సస్పెన్స్ కు తెరదించి తన్మయానందంలో ముంచి తెల్చేవారు అన్న మిక్కిలినేని గారి మాటలు అక్షర సత్యాలు . ఈ పద్యాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా పాడి ఆశ్చర్య చకితుల్ని చేసేవారట . అందుకని ఎవరికీ అనుకరణ సాధ్యం కాకపోయేదని కళాప్రపూర్ణ ఉవాచ .
ధీరోదాత్త నాయకుల భక్తీ శృంగారకరుణ రసాలను ఒప్పించటం లో అమిత ప్రజ్ఞకలవారు ప్రసాదరావు గారు .ఆయన ప్రక్క కోపల్లె హనుమంతరావు గారు కూడా అలాగే నటించేవారట .హరివారి నలుడు పాత్రను చూసి నాటక పితామహులు రచయిత శ్రీ ధర్మవరం కృష్ణమాచార్యులవారు ‘’నేను రచనలో ఊహించని ,ఉదాహరించని ఎన్నో మనోభావాలను హరి ప్రసాదరావు గారు అభినయించి నా పాత్రకు సార్ధకత కల్పించారు ‘’ఆని విపరీతంగా మెచ్చుకు న్నారని మిక్కిలినేని కోట్ చేశారు .
అతి గంభీర పాత్రలనుఎంత ఇష్టపడి నటించారో అతి సామాన్య పాత్రలను కూడా అలాగే ఇష్టపడి నటించి పాత్రలకు జీవం పోసేవారు హరివారు .ముసలితనం మీద పడుతున్నా సారంగధర మొదలైన యువక పాత్రలను అద్భుతంగా నటించటం గొప్ప విషయం అన్నారు డా.రాధా కృష్ణ మూర్తి .జీవితం అంతా నాటకానికే అంకితం చేసిన నట పితామహ ,నటావదూత శ్రీ హరి పరసాదరావు గారు గుంటూరులోనే 1936 వ ఏట ఆ నటరాజ సన్నిధి చేరారు .
మనవి- గూగుల్ లో వెతికితే హరి వారి గురించి దొరకలేదు .అందుకని తెలుగు వెలుగులు ,మిక్కిలి నేని గారి ‘’నటరత్నాలు ‘’వెదికి దొరికిన సమస్త విషయాలు ఇందులో పొందు పరచ్చాను .ఇంకా ఎవరి వద్ద అయినా మరిన్ని విశేషాలు ఉంటే తెలియజేయ మనవి .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-8-24-ఉయ్యూరు .
[6:48 pm, 22/08/2024] V

