శ్రీ కృష్ణాష్టమి -1
విష్ణువు క్షీరాబ్ది శాయి .అనంత పద్మనాభుడు .ఆయన నాభీ కమల సంజాతుడు పద్మాసనుడు చతుర్ముఖుడు .వీణాపాణి సరస్వతి బ్రహ్మ రాణి .
శేషుడు విష్ణుని శయ్య .,మడుగు పాన్పు .ధన్వి అంటే మన్మధుడు .బ్రహ్మ ,మన్మధుడు విష్ణు కుమారులే .విష్ణువే యాదవ కృష్ణుడు .విష్ణువు అవతారాలలో కృష్ణావతారం గొప్పది .
‘’స ఏష భగవాన్వి ష్ణుః- కృష్ణేతి పరికీర్తతే –అనాద్య౦త మజం దేవం ప్రభుం లోక నమస్కృతం’’ (మహాభారతం )
విష్ణువు కృష్ణుడు గా అవతరించినపుడు ,అతని కుమారుడు ప్రద్యుమ్నుడుగా అవతరించాడు .ఇతని కొడుకు ఆని రుద్దుడు బాణుడు అనే రాక్షసరాజు కుమార్తెను ప్రేమించి అంతః పురం లో ఉండగా ,బాణా సురుని అన్తఃపురకావలి శివుడు తో కృష్ణుడు యుద్ధం చేశాడు .ఇదంతా భాగవతం లో అద్భుతంగా వర్ణించ బడింది .
ఆకాశం లో సూర్యుడు ఉషస్సును ప్రేమించి ఆమె వెంట పడినట్లు వేదం లో చాలా చోట్ల వర్ణించబడింది .సూర్యుడు ఆని రుద్దుడై ఉషాకన్యను ప్రేమించినట్లు పురాణకధనం .
సూర్యుడు –ఉషస్సు .అనిరుద్ధుని తండ్రి ప్రద్యుమ్నుడు .-మన్మధుడు –అనిరుద్ధుడు –ఉషా కన్య –మన్మధుడు .ధన్వి –ధనుస్సు రాశి .
ధనుస్సు శేషాహి మండలం మధ్య క్షీరోదనాభి ఉంది శేషుడు సంకర్షణుడు .విష్ణువు రాముడైతే సంకర్షణుడు లక్ష్మణుడు .విష్ణువు కృష్ణుడు అయితే సంకర్షణుడు బలరాముడు అవుతాడు .కనుక అనిరుద్ధ ,ప్రద్యుమ్న ,సంకర్షణ ,వాసు దేవులకు క్రమంగా జ్యోతిర్మండలం లో సూర్య ,ధన్వి ,శేష మండల ,విష్ణు మండలాలతో సంబంధం ఉంది .వాసుదేవుడు విష్ణు నామాలలో ఒకటి .వసుదేవుడి కొడుకుకనుక కృష్ణుడు వాసు దేవుడు .కృష్ణుడు ,వాసుదేవుడు ,జ్యోతి శ్శాస్త్ర రీత్యా ,సూర్యుడు ధన్వితో సంకర్షణు ని ఆశ్రయించి పరమ పదం చేరటం నిజం .ఈ భావన చతుర్యూహ భావాన్ని కలుగ జేస్తోంది .’’వాసుదేవః సంకర్షణః ప్రద్యుమ్నఃపురుష స్స్వయం -అనిరుద్ధః ఇతి బ్రాహ్మన్ మూర్తి –వ్యూహో అభిదీయతే ‘’-భాగవతం .ఇందులో సూర్య ,ప్రద్యుమ్న ,సంకర్షణ ,వాసుదేవ లతో సంబంధం ,,జ్యోతిశ్శాస్త్ర రీత్యా చతుర్వ్యూహం తో సరిపోతుంది .ఇవన్నీ భారత శాంతిపర్వంలో ,నారాయణ సంహితలో ఉన్నాయి అందులోని భావం తెలుసుకొందాం –చనిపోయాక జీవులు ముందు సూర్యలోకం చేరతాయి .సూర్యుడు ఊర్ధ్వ లోకం ద్వారం దగ్గర ఉన్నాడు .అక్కడ పాపాలన్నీ భస్మమై పోతాయి .జీవులు పాప విముక్తులై ,పరమాణు రూపం లో కొంతకాలం ఉండి,తర్వాత అనిరుద్ధులై ముసలితనాన్ని వదిలి ,స్థూల ద్రవ్య సంవదను త్యజించి ,ఆధ్యాత్మిక శక్తితో ప్రద్యుమ్నుని చేరతాయి .తర్వాత సంకర్షణు డిని ఆశ్రయించి ఉత్తమ జీవులై ,గుణత్రయ విముక్తులై ,పరమపదం పొందుతారు.
డాక్టర్ భండార్కర్ వాసుదేవ శబ్దాన్ని వృష్ణి వంశ సంభవుడు ,హరికులేశుడు ,వాసుదేవ సుతుడు ,శ్రీ కృష్ణుడు .వైష్ణవమతంలో వీరంతా ఒక్కరే .పాణిని వ్యాకరణానికి మహాభాష్యం రాసిన పతంజలి ‘’వాసుదేవుడు పూజ్యపాదుడు ,పరాత్పరుడు ‘’అన్నాడు .పాణినికి ముందు వాసుదేవ ఆరాధన ఉండేది మన దేశం లో .ఇతర శిలా శాసనాలలో కూడా వాసుదేవ ఆరాధన కనిపిస్తుంది .మత చారిత్రిక వైజ్ఞానికంగా కూడా దానికి ప్రాధాన్యం ఉంది .రాజస్థాన్ లోక్రీ.పూ 200నాటి ఘోసు౦ది శాసనం లో వాసుదేవ ,సంకర్షణ వ్యూహాల చుట్టూ గోడకట్టినట్లు తెలుస్తోంది .వాసుదేవుడికి ధ్వజ ప్రతిష్ట కూడా ఉంది .క్రీ.పూ ఒకటవ శతాబ్ది నానాఘాట్ దగ్గర గుహలలో సంకర్షణ వాసుదేవులు ద్వంద్వ సమాసంతో చెప్పబడ్డారు .వృష్ణి వంశోద్భవ వాసుదేవుడే పాణిని లో ,పతంజలి భాష్యం లో ఉన్నది .వాసుదేవ బలరామ శబ్దాలు అవ్యవదానంగా పేర్కొనబడింది .బలదేవ వాసుదేవులు వసుదేవుని కుమారులే .కనుక కృష్ణడు క్రీశ 7వ శతాబ్దం వాడు అన్న పాశ్చాత్యులమాట తప్పు అన్నారు భండార్కర్ .
రాసక్రీడ
‘’పశ్యామ స్త్వాం పరమాకాశ మధ్యే –నృత్యంతం తే మహిమానం స్మరామి –సర్వాత్మానం బహుదా సన్ని విష్ట౦-బ్రహ్మానందాను మనుభూయాను భూయ –యోగాత్మానాం నృత్యంతం దివ్య నృత్యం ‘’
భావం –పరమాకాశం లో నువ్వు దివ్య నృత్యం చేస్తూ ,ఉండటం చూసి ఆన౦దిం చాం .సరవజీవుల అంతరాత్మలో ఉంటూ ,అనేక రకాలుగా ఈ దృశ్య ప్రపంచం లో కనిపించే నిన్ను స్మరిస్తున్నాం.బ్రహ్మాన౦దాను భూతిగల నిన్ను సేవిస్తున్నాం . ఆని నటరాజమూర్తిని ఒక భక్తుడు స్తుతించాడు .భాగవత రాసక్రీడలో 16000 మండి గోపికలతో శ్రీ కృష్ణుడు రాస నృత్యం చేసినట్లు ఉంది .ఇద్దరు గోపికలమధ్య కృష్ణుడు , ఇద్దరు కృష్ణుల మధ్య ఒక గోపిక చక్రాకారంగా నిలిచి వాద్యఘోష మధ్య నృత్యం చేశారు .అలాన్ లీ అనే ఒక పాశ్చాత్యుడురాసిన జాతక మీమాంస ఉద్గ్రందంలో రాసలీలను ఇలా వర్ణించి చెప్పాడు –‘’ఇవాల్టికీ రాజస్థాన్ లో ఏటేట రాసలీలా మహోత్సవం జరుపుతారు .ఇడి జ్యోతిశ్శాస్త్ర రీత్యా కృష్ణుడు అనే సూర్యుని చుట్టూ గ్రహ ,నక్షత్రాది జ్యోతిర్గోళాలు అనే గోపికలు పరిభ్రమించటం ఇది ఒక చిహ్నం .ఇలాంటి నృత్యాలు మన దేశం లోనే కాదు పాశ్చాత్య దేశాలలో కూడా ఉంది .అమెజాన్ అనే జాతి స్త్రీలు ముఖ్య దేవతా ప్రతిమ చుట్టూ నృత్య గీతాలతో తిరుగుతారు . షిల్లో కూతుళ్ళు కూడా ఇలా చేసినట్లు బైబిల్’’జడ్జెస్ అధ్యాయం లో ఉందట .డేవిడ్ రాజు ‘’ఆర్క్ ‘’అనే పెద్ద వోడ చుట్టూ తిరిగాడని ‘’ఐరిస్ అన్వీల్డ్ ‘’గ్రంధంలో ఉందట .కానీ కృష్ణుడు అనే సూర్యుడి చుట్టూ ,గ్రహనక్షత్రాలు తిరగటం నాన్సెన్స్ అన్నారు శ్రీ గొబ్బూరి .సూర్యుడి చుట్టూ గ్రహాలూ తిరుగుతున్నాయిఅనటం వరకు ఒకే.నక్షత్రాలుద్వాదశ రాసులు సూర్యుని చుట్టూ తిరగటం అబ్సర్డ్ .సృష్టిలో సూర్యుడు ఒక మిణుగురు పురుగు అంతే ఆయన సీన్ .లియో దొర చెప్పింది నిజం కాదు .
రాసక్రీడ చేసిన వారు కృష్ణుడు ,గోపికలు.అది గోకులం లో జరిగింది .సమస్త భువనాలకు గోపుడు కృష్ణుడు .ఆయన చేత రక్షి౦ప బడే జ్యోతిర్గోళాలు గోపికలు .మిల్కీ వె లో ఉన్న గోళాలు అన్నీ గోపికలే .ప్రతిగోళం మధుర నాదం-కాస్మిక్ హిస్ చేస్తుంది .భ్రమణం ,పరిభ్రమణం చేస్తున్నాయి .50కోట్ల సంవత్సరాలకు ఒకసారి పూర్తిగా తిరిగే మిల్కి వె గతికి రాస క్రీడ ఒక చిహ్నం .ఒక సంజ్ఞ.ఈ మండల పరిభ్రమణం లో ఒక్కోసారి ఒక ప్రదేశం నుంచి ఒక్కొక్క విధంగా ఉంటుంది .ఒక్కొక్క గోళం అనే గోపిక అనేక విధాలుగా అభినయిస్తుంది .అనింద్య శృంగార భావాన్ని ప్రదర్శించే విశ్వ గోపుని ప్రేమ పొందేభాగ్యం కలుగుతుంది .ఈ శృంగార అభి వర్ణణకు ఈ క్రింది శ్లోకం సాక్ష్యం –
‘’అంగ ప్రత్యంగగౌణ స్ఫుట సమ –విషయ వ్యంజక వ్యక్తి సిద్ధైః- శ్రు౦గారాద్యై రధిక- మభినయం వ్యన్జయంత్యో యువత్యః –
‘’రాసక్రీడా విలాసైర్వనభువి –నితరాం మాధవం తోషయంత్యః –తుష్టాః స్వైరా రమంతే చిర- మహి గురుణా శ్రీధరేణాప్తకామాః’’
కంటికి కనబడే నక్షత్రాలు 8వేలు .కనబడనివి మరో 8వేలు ఈమొత్తం 16వేలు .ఈపదహారు వేల నక్షత్రాలు గోపికలు ఆని అవి రాస క్రీడలో పాల్గొన్నాయని ఊహ .మిగిలిన విహయాలు రేపు .
ఆధారం –శ్రీ గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారి –జ్యోతిర్వేదం .
సశేషం
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభా కాంక్షలతో
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-8-24-ఉయ్యూరు

