కొందరు ప్రముఖ ఆంధ్ర నట దిగ్గజాలు-2

కొందరు ప్రముఖ ఆంధ్ర నట దిగ్గజాలు-2

4- బహుముఖ ప్రజ్ఞాశాలినాటక సినీ హాస్యనటుడు ,సంగీత నాట్య విద్వా౦సుడు,హార్మోనిస్ట్ –శ్రీ రాళ్ళపల్లి నటేశం ,

రాళ్ళపల్లి నటేశయ్య[నటేశం ] (1889 – 1968) సుప్రసిద్ధ హాస్య నటులు, బహుముఖ ప్రజ్ఞావంతులు.

వీరు 1889 సంవత్సరంలో నెల్లూరులో ఆదిశేషయ్య, భ్రమరాంబ దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం ముత్తరాజు సుబ్బరామయ్య గారి పాఠశాలలో ఏడవ తరగతి వరకు సాగింది. తరువాత వీరు చెన్నై వెళ్ళి సంగీతం మీద ఆసక్తి నిలిపారు. గూటాల వేంకట రామయ్య గారి వద్ద సంగీత శిక్షణ పొందారు. అనతికాలంలోనే సంగీత, నృత్య విద్యలలో విశేష ప్రతిభ సంపాదించారు. కందాడై శ్రీనివాసన్ వీరిని తమ నాటకాలలో సంగీత శిక్షణ కొరకు నెల్లూరుకు పిలిపించారు. అప్పటి నుండి చివరిదాకా నెల్లూరులోనే వివిధ రంగాలలో కృషిచేశారు. వేదం వెంకటరాయ శాస్త్రి స్థాపించిన ఆంధ్ర భాషాభిమాని సమాజం నాటకాలలో హార్మోనియం శ్రుతిగా మాత్రమే ఉపయోగించేవారు. వీరు దానికి తోడుగా ఫిడేలు వాద్య సహకారంతో నటకులను తీర్చిదిద్ది ప్రదర్శనలకు ఎంతో పుష్టిని చేకూర్చేవారు. తరువాత జ్ఞానోదయ నాటక సమాజంలో నటేశయ్యగారు స్వయంగా హార్మోనియం ప్రవేశపెట్టి దానికొక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. వీరు అనేకమంది హరికథా భాగవతార్లకు శ్రావ్యంగా ఫిడేలు వాద్యాన్ని వాయించడమే కాక కథాంశంలో హాస్యాన్ని, అభినయాన్ని ప్రదర్శించి సభికులను ఆనందపరిచేవారు. ఆ రోజుల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీమంతుల ఇళ్ళలో శుఖకార్యాలు జరిగేటప్పుడు విధిగా నటేశయ్యగారి హాస్యాభినయం ఉండేది.

వీరు మొదటిసారిగా రామా ఫిలిమ్స్ వారి సతీ తులసి చిత్రంలో నటించారు. దువ్వూరి రామిరెడ్డి గారి చిత్రనళీయం సినిమాలో సునందుని పాత్ర ధరించి కన్నులు కల్వపూలు అనే పద్యాన్ని అభినయంతో చదివి ఆ చిత్రానికే ఒక విశిష్టతను చేకూర్చారు. ప్రసిద్ధ నటులు చిత్తూరు నాగయ్య గారు నిర్మించిన త్యాగయ్య చిత్రంలో మార్తాండ పాత్రను పోషించి ఎన్నగాను రామభజన అనే కీర్తన ద్వారా తన సంగీత విద్వత్తును ప్రకటించి ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నారు. తర్వాత మళ్ళీ పెళ్ళి , గరుడ గర్వభంగం, దీనబంధు, కాలచక్రం, తాసీల్దారు, సువర్ణమాల మొదలైన తెలుగు సినిమాలలో నటించారు. వై.వి.రావు నిర్మించిన విశ్వమోహిని చిత్రంలో డుర్ బసవన్న పాత్రను, తాసీల్దారు చిత్రంలో వంటవాని పాత్రను పోషించి పేరుపొందారు.

“మై వైఫ్” [ En Manaivi ] అనే తమిళ చిత్రంలో వంటవాని పాత్ర ధరించి టెంకాయచిప్ప ఫిడేలును వాయిస్తూ సంగడ మాను అనే పాట పాడి ఒక్క చిత్రంతో తమిళ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. తర్వాత లవంగి, భామా పరిణయం మొదలైన తమిళ సినిమాలలోనూ నటించి గొప్ప పేరు సంపాదించారు.

నటేశయ్య గారి ప్రతిభను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు ఒక ఉన్నత సంగీత విద్యా గురుకులాన్ని నెల్లూరులో స్థాపించి దానికి అధిపతిగా నటేశయ్య గారిని నియమించారు. ఆ విద్యాలయంలో అనేకమంది శిష్యులను తయారుచేశారు.

ఎందర్నో నవ్వించిన నటేశయ్యగారు డిసెంబరు 1968 సంవత్సరంలో స్వగృహంలో స్వర్గస్తులయ్యారు.

**నెల్లూరు లో ప్రస్తుతం ప్రతి ఏటా నిర్వహింపబడుతున్న త్యాగరాయ వారోత్సవాలు మొట్టమొదట ప్రారంభించింది శ్రీ నటేశం గారే **.కడ వరకు ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనైనా ప్రతి ఏటా క్రమం తప్పకుండా త్యాగరాయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.చరమాంకం లో భిక్షాటన చేసి త్యగరాయ వారోత్సవాలు నిర్వహించారు. వారి తదనంతరం శ్రీ సాంబముర్తి గారు ఆ పరంపరను కొనసాగించారు.నేటికీ నెల్లూరు లో భిక్షాటన పూర్వక త్యాగరాయ వారోత్సవాలు వారి శిష్య బృందం కొనసాగిస్తున్నారు .సుప్రసిద్ధ సినీ నేపధ్యగాయకులు శ్రీ యస్.పి.బలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారైన సాంబ మూర్తి గారు తమ హరికథ కచేరీలకు కీర్తనలను నటేశం గారి వద్ద స్వరపరచుకొనేవారు.

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-24-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.