కొందరు ప్రముఖ ఆంధ్ర నట దిగ్గజాలు -9

కొందరు ప్రముఖ ఆంధ్ర నట దిగ్గజాలు -9

26-’కళావర్ రింగ్ ‘’గా పేరున్న నటి సంగీత నాట్య విదుషీమణి ,హరికదా కళాకారిణి ,దానస్శీలి ఘంటసాలను ఆదుకొన్న దయార్ద్ర హృదయ –శ్రీమతి సరిదె లక్ష్మీ నరసయ్యమ్మ

 ఈమెనుగురించి శ్రీ పరుచూరిశ్రీనివాస్ చెప్పిన విషయాలు –

కళావర్ రింగ్ (1908-1964) అన్న పేరు నేను మొదటిసారి విన్నది 1981-82 ప్రాంతాల్లో. ఇదేదో గమ్మత్తుగా ఉందే అనుకున్నాను. తరువాత మరో మూడేళ్ళకు చదువుకోసం మద్రాసు వెళ్ళినప్పుడు వి.ఎ.కె.రంగారావుగారి దగ్గర ఆయనే ప్రచురించిన భువనవిజయం (1971, ఇది ఘంటసాల ఇంగ్లండు, జర్మనీ, అమెరికా దేశాలలో కచేరీలు ఇవ్వడానికి వెళ్తున్న సందర్భంలో ప్రచురించబడింది.) అన్న పుస్తకంలో ఆవిడ ఫోటో, ఆవిడ గురించి ఘంటసాల చెప్పిన కొన్ని మాటలు, ముఖ్యంగా ఆవిడ ఘంటసాలకి విజయనగరంలో ఎలా సహాయపడింది, చదివిన తర్వాత పేరున్న వ్యక్తే అని అర్థమయ్యింది. ఆవిడ అసలు పేరు సరిదె లక్ష్మీ నరసమ్మ. ఆవిడ గురించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుగు వికీపీడియాలో ఉన్నాయి.

గురజాడ కన్యాశుల్కంలో మధురవాణి పాత్రకు కళావర్ రింగ్ ప్రేరణ అని వాదన ఒకటి ఉంది. కానీ అది నిజం కాదు. కన్యాశుల్కం మొదటి కూర్పు 1897లోను, రెండవ కూర్పు 1909లోను అచ్చయ్యాయి. కళావర్ రింగ్ అన్న పేరు రావటానికి ఒక శృంగార పురుషుని చేతికున్న కళావర్ మార్కు ఉంగరం కావాలి అని మారాం చేస్తే అతడు ఆవిడను చేరదీసినట్లు, అప్పటి నుండి ఆ పేరు స్థిరపడిపోయినట్లు చెప్తారు. తొలిగా విజయనగరంలో మేజువాణీలలో చేసిన నృత్యాలతో పేరు పొందిన తరువాత నాటకాల్లో నటించడం, హరికథలు కూడా చెప్పటం జరిగింది. ఆమె రాసిన ‘రాతిరి నాటకమయినది మొదలుగా రాదు కదా నిదుర’ అన్న పాట బాగా ప్రాచుర్యం పొందింది. రంగారావుగారు చెప్పిన దాని ప్రకారం (చూ. ఆలాపన) ఆమె మొత్తం గ్రామఫోను కంపెనీలకి ఎనిమిది పాటలు–నాలుగు రికార్డులు–పాడారు. నా దగ్గరున్న 6 పాటల్లో నాలుగు పాటలు ఈ సంచికలో. ఈ పాటలలో రెండు తొలినాటి గ్రామఫోన్ గాయకులు అన్న సంకలనాల్లో కూడా చేర్చబడ్డాయి.

కళావర్ రింగ్‌తో పోలిస్తే పులిపాటి వెంకటేశ్వర్లు (1890-1972), వేమూరి గగ్గయ్య (1895-1955), గండికోట జోగినాథం, పువ్వుల రామతిలకం పేర్లు తరచుగా వినపడేవి. పులిపాటి, గగ్గయ్య చాలా ఏళ్ళు తెలుగు మాట్లాడే ప్రాంతాలలో నాటక ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా తెలుగు సినిమా తొలిరోజుల్లో (1933-1948) చాలా చిత్రాలలో నటించారు. అలాగే వారిద్దరు పాడిన చాలా పాటలు, పద్యాలు కూడా రికార్డులపై విడుదలయి మొన్నమొన్నటి వరకు కూడా తేలికగా అందుబాటులో ఉండేవి. రామతిలకం జీవించిన కొద్దికాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొంది. చివరిగా గండికోట జోగినాథం రేలంగి వెంకటరామయ్యకి గురువుగా ప్రసిద్ధుడు.

ఈ సంచికలో ఈ నలుగురూ కాళ్ళకూరి నారాయణరావు రాసిన చింతామణి నాటకంనుండి పాడిన కొన్ని పద్యాలు, సంభాషణలు ఇస్తున్నాను. రాబోయే సంచికల్లో వీరు పాడిన మరిన్ని పాటలు/పద్యాలు, ముఖ్యంగా గగ్గయ్య పైన ఆయన పాడిన పాటలు, పద్యాలు అన్నింటితో (దాదాపుగా!) ఒక పూర్తి వ్యాసం రాసే ప్రయత్నం చేస్తాను.

ఈ రికార్డులన్నీ 1935-36 ముందు నాటివి. అప్పటికే ‘సుబ్బిసెట్టి హాస్యం’ ప్రవేశించినట్లు తెలుస్తుంది. నిజానికి ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. గ్రామఫోను రికార్డులు వచ్చిన తొలినాళ్ళనుండే ద్వందార్థాలతో కూడిన మాటలతో ‘కామెడీ’ లేక ‘హాస్యపు’ పాటల రికార్డులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే విడుదలయ్యాయి. ఈ తొలినాటి కామెడీ పాటలపైనా కూడా ఎప్పుడైనా సమయం దొరికితే ఒక నిడివైన వ్యాసం రాయాలనే కోరికైతే ఉంది.

శ్రీ రాంభొట్ల నృసింహ శర్మ మరిన్ని వివరాలు అందించారు –

1908లో విజయనగరానికి దగ్గర కోరుకొండలో సూర్రెడ్డి సన్యాసి అఅప్పాయమ్మ దంపతులకు జన్మించింది .రెండవ ఏట కళావంతుల కుటు౦బానికి దత్తత వెళ్ళింది .పెంపుడు తల్లి సరిదేఆదేమ్మ విజయనగర ఆస్థాన నర్తాకి  ,పెంపుడు తల్లి దగ్గరే నాట్యం నేర్చింది అయిదవ తరగతి వరకు చదివింది మద్దిల లచ్చన్న వద్ద సంగీత విద్య నేర్చింది .మద్దెల సత్యమూర్తి, చాగంటి  గంగబాబు,కోటిపల్లి గున్నయ్య ల వద్ద ఎక్కువ కాలం తీవ్ర శిక్షణ పొందింది .హిందూస్తానీ జావళీలు ,క్షేత్రయ్య పద భంగిమలు మద్దెల హైమవతి దగ్గర నేర్చుకున్నది .8ఏళ్లకే మంచి నృత్యకారిణి ఆని పేరు పొందింది .12వ ఏట నాట్య బృంద నాయకీ మణి అయింది .

‘’కృష్ణ గీతం ‘’అనే అంశాన్ని స్వయంగా పరమాద్భుతంగా ప్రదర్శించేది .చొప్పల్లి సూర్య నారాయణ భాగవతార్ వద్ద హరికధా గానం అభ్యసించింది . అప్పుడే కళావర్ కింగ్ గా పేరుపొంది.1934లో గ్రామఫోన్ లకోసం ‘’కోకిల హాయని కూసెగా –వ్యాకుల మానస మాయెగా ‘’,’’పచ్చబొట్టు ప్రాణనాథా ‘’‘’,’’చిటపట చినుకులు దుప్పటి తడిసేను ‘’,’’సైపగా జాల ‘’,’’ఏరా నాప్రియా ‘’మొదలైన గీతాలను రికార్డ్ లుగా ఇచ్చింది .’’మేడ మీద చిన్నదోయి అమ్మలారా ‘’అనే భజన కీర్తనకూడా గ్రామఫోన్ కోసం పాడి రికార్డ్ చేసింది .

1935లో ‘’రానీ ప్రమీల ‘’సినిమాతో చలన చిత్ర రంగం లోకి కాలుపెట్టింది కళావర్ రింగ్ ‘’1947లో మద్రాస్ రేడియో ద్వారా సీతారామ కళ్యాణం ,’’సుందర కాండ ‘’,’’సక్కు బాయి ‘’,భక్త రామదాసు నాటకాలలో నటించింది .1952లో ‘’విజీనగరం ‘’ మునిసిపల్ కౌన్సిల్ కు పోటీ చేసింది .ఖాదర్ వలీషా బాబా భక్తురాలుగా 30 వేలరూపాయలు ఖర్చు చేసి నూతిని త్రవ్వి౦చి,ధన నష్టం జరిగినా ,ఫలితం రాకపోయినా స్థిత ప్రజ్నురాలుగా నిలిచింది ..రికార్డు ల ద్వారా వచ్చిన డబ్బు అంతా పేద విద్యార్ధుల జీతాలు కట్టతానికే ధారా పోసిన పున్యాత్మురాలు .అమరాగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు విజయనగరం సంగీత కళాశాలలో విద్యార్ధిగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు కళావర్ కింగ్ ఆదుకొన్నదని కృతజ్ఞతా పూర్వకంగా స్మరించుకొన్నారు .

1964 మార్చి 27నఆంధ్రప్రదేశ్ నాటక అకాడెమి ఏర్పాటు చేసిన ఆలిండియా డాన్స్ సెమినార్ లో కళావర్ రింగ్ శ్రీమతి సరిదె లక్ష్మీ నరసయ్యమ్మ ను నభూతోగా ఘనంగా సత్కరించారు .ఆమెను వరించిన నాట్య తరంగిణి,గానకోకిల ,గానకళా కోవిద బిరుదులు  అన్వర్ధాలు .1964లో ఈ గాన నాట్య కళా సరస్వతి కళావర్ రింగ్ కనుమూసి దేవెంద్రలోకం చేరింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-24-ఉయ్యూరు  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.