శ్రీ సుశర్మ రాసిన ‘’శ్రీ మట్టపల్లి నృసింహస్వామి దేవాలయ చరిత్ర ‘’
మట్టపల్లి అనగానే సుమారు ముప్ఫై ఏళ్ల క్రితం హుజూర్ నగర్ లో కాపురం ఉన్న మా శ్రీమతి చెల్లెలు దుర్గ ,ఒకసారి మా ఆవిడ వాళ్ళ ఇంటికి వెడితే దగ్గరుండి మట్టపల్లి క్షేత్రానికి తీసుకొని వెళ్ళి కృష్ణ వేణీ స్నానం చేయించి నరసింహస్వామి దివ్య దర్శనం చేయించటం అక్కడి వాతావరణం పవిత్రత ఆవిడ చాలాకాలం చెబుతూ ఉండటం గుర్తుకు వస్తుంది .మరొకటి –ఉయ్యూరులో ఆయుర్వేద మందుల షాపు నిర్వహిస్తూ ఉయ్యూరు దగ్గర గండి గుంటలో ఉన్న శ్రీ దత్త క్షేత్రం యాజమాయిషీ చేస్తూ ,ప్రతి ఉగాదికి సాయంత్రప్ అక్కడ నాతో పంచాంగ శ్రవణం చేయిస్తున్న శ్రీ పురుషోత్తమా చార్యులు గారు పదేళ్ళ క్రితం నేను బెజవాడనుంచి బస్ లో ఉయ్యూరు వస్తూంటే నాతో పాటు ప్రయాణిస్తూ మాటల సందర్భంగా తను మట్టపల్లి నుంచి వస్తున్నానని అక్కడి క్షేత్ర అర్చకస్వామి స్వయానా తనకు బావమరది ఆని చెప్పటం గుర్తుకు వచ్చింది .
పుస్తకం తెరిస్తే డా.తట్టా వారి ఆముఖం చూడగానే కొన్నేళ్ళ క్రితం ఆయనా ఆయన కుమార్తె శ్రీదేవి కలిసి ‘’శ్రీ శుభం ‘’అనేఆధ్యాత్మిక మాసపత్రిక నడపటం ,అందులో నేను వ్యాసాలూ రాయటం జ్ఞాపకానికి వచ్చింది . డా సర్వా వారి ముందుమాట చూడగా ఆయనతో సాహితీ స్నేహం ,తరచూ బెజవాడ సభలలో కలవటం ,ఒకసారి సరసభారతి సభలకు కూడా ఆయన్ను ఆహ్వానించటం ,ఆయన రాసిన పుస్తకాలు నాకు పంపుతూ ఉండటం నేను రాసిన సరసభారతి పుస్తకాలు ఆయనకు పంపటం ,సుమారు ఏడు ఎనిమిదేళ్ళ క్రితం ఆయన మృతి చెందటం విషాదంగా గుర్తుకొచ్చింది .
ఆలయ చరిత్ర
ఈఆలయచరిత్ర బహుళ ప్రయోజనంగా ఉండాలని రచయిత సంకల్పించి ,చరిత్రతోపాటు పూజా విధానం స్తోత్రాలు కూడా చేర్చారు .ముందుగ నరసింహావతారం గురించి సంక్షిప్తంగా తెలియ జేశారు .తెలంగాణా లో హుజూర్ నగర్ దగ్గర కృష్ణానదీ తీరాన ఉన్న ఉన్న మట్టపల్లి నరసింహస్వామి మాచి రెడ్ది అనే నరసింహునికి దర్శనమిచ్చాడు మొదటి సారిగా .కేశవ తీర్ధులు అనే నారసింహ హృదయంలో స్వామి తిష్ట వేశాడు .ఆయనతోనే నృసింహ ఉపాసనను బుర్రకథ రూపం లో ప్రకటింప జేసుకొన్నాడు .మరో నరసింహుడు నరహరి గోపాలునితో సుప్రభాత సేవ లిఖింప జేసుకొన్నాడు .అపర విశ్వ నాథుని చె ‘’శ్రీరామ కవచం ‘’తొడిగించుకొన్నాడు .అచ్యుత నరసి౦హునిచే కరావలంబ స్తోత్రాన్ని కరతామలకం చేయించాడు హరినామస్మరణతో నిరంతరం పరవశించే సోమయాజుల లక్ష్మీ నరసింహుని చే కళ్యాణ వైభవాన్ని చెప్పించుకొని వీనుల విందుగా అనుభవించాడు .ముక్కూరి నారసి౦హు నిచే నరహరి అష్టోత్తర శత నరసింహ యాగాలు నిర్వర్తింప జేసుకొన్నాడు భరతుని వచో వైభవాన్ని శ్రవణ పేయంగా విన్నాడు .ఈ సుబ్రహ్మణ్య వాచాలతతో తన ఆలయ చరిత్ర రాయించి ధన్యుణ్ణి చేశాడు .అంటే స్వామి ప్రతివారి హృదయ సీమలో ప్రవేశించి తనకు కావలసింది చేయించు కొన్నాడన్నమాట .
కృష్ణా తీరాన ఉన్న పంచ నరసింహ క్షేత్రాలలో మట్టపల్లి రెండవది నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ కు 24కిలో మీటర్లదూరం లో కృష్ణవేణీ తీరంలో పెద్ద అడవి మధ్య గుహాలయం లో వెలసిన స్వామి ఈనార సింహుడు .భారద్వాజాది మహర్షులు సేవించిన పవిత్ర క్షేత్రం.త్రేతాయుగ ద్వాపర యుగాలలో దేవతలు మునులు గుహాలయం లోకి వెళ్ళి స్వామిని దర్శించి తరించేవారు .కలియుగంలో స్వామి దర్శనం సామాన్యులకు గగన కుసుమం అయింది .
కృష్ణకు అవతలి ఒడ్డున ‘’తంగెడ ‘’గ్రామ ప్రభువు మాచి రెడ్డికి స్వామి కలలో కన్పించి కీకారణ్యంలో స్వయం వ్యక్తుడనైన తనను సేవించి తరించమన్నాడు .మర్నాడు రాజు మందీ మార్బలం తో స్వామి చెప్పిన గుర్తులను బట్టి వెతుకుతూ పోగా ఎంతసేపటికి స్వామికనిపి౦చక పొతె అలసి నిద్రిస్తే స్వామి కలలో సాక్షాత్కరించి ,ఒక ఆరె చెట్టు కనిపిస్తుంది.దానికి సూటిగా ప్రయాణిస్తే నదీ తీర గుహాలయం చేరుకోవచ్చు ఆని భరోసా ఇచ్చాడు .మర్నాడు మళ్లీ ప్రయాణం సాగించి గుహాలయం దర్శించి అందులో ద్వారం పై గజలక్ష్మి శిలా విగ్రహం,,కింద రాజ్యలక్ష్మి శిలా విగ్రహం స్పష్టంగా కనిపించాయి .ప్రహ్లాదుని రూపం లో తిరునామాలు ,రెండు కాళ్ళు ఉన్నస్వామి నయనానందంగా మాచి రెడ్ది ప్రభువుకు దర్శన మిచ్చాడు. దేవతలు మునుల తర్వాత మానవ మాత్రుడుగా స్వామి దర్శనం పొందిన రెడ్ది ప్రభువు చిరస్మరణీయుడు .తర్వాత దేవాలయ ముఖమండపం మొదలైన నిర్మాణాలు చేసి అజరామరం చేశాడు .ఇప్పటికి వెయ్యేళ్ళ నాటి చరిత్ర ఇది .తర్వాత మట్టపల్లి దగ్గర ఉన్న పెదవీడు గ్రామానికి చెందిన’’చెన్నూరు ‘’వంశస్తులు ఆలయ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు .
వేద పండు శ్రీమాన్ మక్కూర్ నరసింహా చార్యుల వారు అహోబిల సింహాచల విజయవాడ క్షేత్ర వేద సభలలో ప్రసంగించి ఒకసారి మంగళగిరి పానకాలస్వామిని దర్శించి గా, ఒక రోజు స్వామి స్వప్నం లో వృద్ధ బ్రాహ్మణ రూపం లో దర్శనమిచ్చి స్వాతీ నక్షత్ర యుక్త మహాయజ్ఞం చేసి సమర్పించమని ఆదేశించగా ,మొదటి సారి 1981లో అలాగే చేసి స్వామిని సంతృప్తి పరిస్తే ,కలలో కనిపించి ,మట్టపల్లి లో కూడా యాగం నిర్వహించమని ఆజ్ఞాపిస్తే ,,మట్టపల్లి చేరి శతాధిక నృసింహ యాగాలు నిర్వహించారు .
చెన్నైలో ఆయన శిష్యబృందం ‘’స్వాతీ మహాయజ్ఞ ట్రస్ట్ ఏర్పాటు చేయగా దానికి చైర్మన్ గా ఉన్నారు .ట్రస్ట్ ఆధ్వర్యం లో మట్టపల్లి లో గోశాల ,ధ్యాన మందిరం ఏర్పడ్డాయి .ఆచార్యశ్రీ 1981నుంచి 2000 వరకు 121 నృసింహ యాగాలు నిర్వహించి 4-5-2000 న విష్ణు సాయుజ్యం పొందారు .
రచయితపరిచయం –తమ్మర సుబ్రహ్మణ్య శర్మ (సు శర్మ )నల్గొండ జిల్లా కోడాడు తాలూకా తమ్మర బండ పాలెం శ్రీ సీతారామాంజనేయ శర్మ ,శ్రీమతి సువర్చల దంపతులకు జన్మించారు. పితామహులు శ్రీ త్యాగరాజన్ గణపతి ,మాతామహులు శ్రీ నందుల అచ్యుత రామ శాస్త్రి సిద్ధాంతి (శ్రీ రామోదహరణ కావ్యకర్త .దీనినే శర్మగారు 2014లో పునర్ముద్రించారు )
శర్మాజీ గుడిబండ ,కోదాడ ,నేలకొండపల్లి ,హైదరాబాద్ లలో చదివి తెలుగు సంస్కృతం లో ఎం .ఎ .సంస్కృతంలో ఎంఫిల్ కూడా చేసి జర్నలిజం లో డిప్లమో సాధించి అధ్యాపకత్వం లో ఉన్నారు .నేను –వచన కవితా సంపుటి ,మూషిక దౌత్యం –సందేశ కావ్యం ,కార్తీక కృష్ణం –స్మృతి వీచిక ,అమృత సిద్ధి –ఎంఫిల్ వ్యాసం ,మాతామహుల కృతులపై పరిశీలన రచన ,ఉపనయన విధి ,లోగుట్టు –పెరుమాళ్ళకె కాదు ,మీనాక్షి సుందరేశ్వరులు రాశారు .
కోదాడలో శారదా సాహితీ సమాఖ్య తన అధ్యక్షతన ఏర్పరచి పుస్తకముద్రణ సాహితీ సేవాకార్యక్రమాలు విరివిగా చేస్తున్నారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-24-ఉయ్యూరు

