ప్రసిద్ధ జ్యోతిష ,ఆయుర్వేద పండితులు –సాహిత్యరత్న ,కవి సింహ శ్రీ గొల్లాపిన్ని రామ కృష్ణ శాస్త్రి

ప్రసిద్ధ జ్యోతిష ,ఆయుర్వేద పండితులు –సాహిత్యరత్న ,కవి సింహ శ్రీ గొల్లాపిన్ని రామ కృష్ణ శాస్త్రి

కర్నూలు జిల్లా కోడుమూరు లో వెలసిఉన్న ‘’పల్లెలా౦బా దేవి’’ని ఇల వేల్పుగా ఆరాధించే గోల్లాపిన్ని పండిత వంశం లో జన్మించారు శ్రీ గొల్లాపిన్ని రామ కృష్ణ శాస్త్రి .ఆవంశం వారందరికి ‘’కవేశ్వర ‘’బిరుదు వారసత్వంగా లభించింది .అక్ష విద్య ,జ్యోతిర్విద్య లలో  వారంతా సుప్రసిద్ధులు .గోల్లాపిన్నిమల్లికార్జున శాస్స్త్రి గారు ఈ వంశంలో లబ్ధ ప్రతిష్టులు .గొల్లాపిన్ని సోదర త్రయం లో  వాసుదేవ శాస్త్రి ,రామ చంద్ర శాస్త్రి ,రామ కృష్ణ శాస్త్రి ఆధ్యాత్మిక సంపన్నులు ,విద్వాంసులు అయిన శ్రీ గోల్లాపిన్ని సీతారామ శాస్త్రి ,శ్రీమతి సుబ్బమ్మ దంపతులకు జన్మించారు .వీరిలో  మన రామకృష్ణ శాస్త్రి గారు ఉభయభాషలలో ,ఆయుర్వేద జ్యోతిషాలలో  ఉద్దండ పండిత వరేణ్యులు .

  రామకృష్ణ శాస్త్రిగారు 1922లో జన్మించి 79వ ఏట 2001లో స్వర్గస్తులయ్యారు .సర్వ తంత్ర స్వతంత్ర ,కవిసింహ ,విద్యానిధి బిరుదాంకితులు .తమ్ముడు రామ చంద్ర శాస్త్రిగారు మంచికవి ,జ్యోతిశ్శాస్త్ర పారంగతులు .శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి గారు రచించిన ‘’రఘునాథీయం ‘’ కావ్యానికి రామకృష్ణ శాస్త్రి గారు కృతి భర్తలు .రాష్ట్ర ఎక్సైజ్ శాఖాలో కడపలో ఆఫీసర్ గా పని చేసి రిటైర్ అయ్యారు .నిత్యం ఊపిరి సలపని కార్యక్రమంలో ఉంటున్నా ,రోజూ కొంత సమయం సాహిత్యానికి కేటాయించేవారు .ఏపని అయినా ప్రతిఫలం ఆశించకుండా చేయటం ఆయన ప్రవృత్తి .అనంతపురంజిల్లా తాడిపత్రి లో ‘’రాయల కవితా కళా సమితి ‘’స్థాపించి మహాకవి గడియారం వెంకట శేష శాస్త్రి, సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణా చార్యులు మొదలైన వరిష్ఠ కవిపండితులను గజారోహణం ,గండ పెండేర ప్రదానం ,పౌరసన్మానం చేయించి ఘనంగా సత్కరించారు .పుట్టపర్తి వారి ‘’పాద్యం ‘’కావ్యావిష్కరణ రాయల  కళా సమితి లోనే గొప్పగా జరిగింది .కడప అనంతపురం జిల్లాల రచయితల సంఘాలు అనంతపురం విశ్వ కళా పరిషత్తు ,కర్నూలు జిల్లా బనగానపల్లి అరుణ భారతి ,అనంతపురం హిందూపురం స్వర్ణభారతి మొదలైన ప్రసిద్ధ సాహితీ సంస్థల లో శాస్త్రిగారు విశిష్ట సభ్యులై ఎన్నెన్నో  విశేష  కార్యక్రమాలు నిర్వహించారు .

  రామకృష్ణ శాస్త్రి గారికి అనంతపురం లోని ఇల్లే కార్యాలయంగా ,డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారితో కలిసి స్థాపించిన ‘’రాయల కళాసమితి ‘’తాడిపత్రిలో తమ కుటుంబ సభ్యులద్వారా ప్రముఖ జ్యోతిశ్శాస్త్ర పండితులు వశ్యవాక్కుఅయిన శ్రీ గొల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రిగారు రచించిన అపురూప గ్రంథాలు ‘’వాసు దేవానందం ‘’’’పురుషోత్తమశతకం’’. సవ్యాఖ్యానంగా ప్రచురించారు .రామకృష్ణ శాస్స్త్రి గారి సాహితీ సేవకు  హిందూపురం స్వర్ణభారతి ‘’సాహితీ రత్న ‘’బిరుదునిచ్చి ఘనంగా సత్కరించింది .2000లో కడప ‘’అల్లసాని పెద్దన సాహిత్య పీఠం ‘’శాస్త్రిగారిని మహోత్క్రుష్టంగా గౌరవించి సత్కరించింది .రాష్ట్రమంతా శాస్త్రిగారికి పలు సన్మానాలు పెద్ద ఎత్తున జరిగాయి .

   రామకృష్ణ శాస్త్రి గారు ‘’నాకవన కదంబం ‘’కవితాఖండికలను హైదరాబాద్ లోని విన్నకోట మాధవ రావు ట్రస్ట్ ప్రచురించింది..వీరు వచన కావ్యంగా  ‘’హంసానంద  యతీంద్రుల  జీవిత చరిత్ర ‘’రాశారు .వీరు రాసిన ఎన్నో సాహిత్యవ్యాసాలు విమర్శలు అనేక పత్రికలలో ప్రచురితాలు .గడియారంవారి ‘’శివ భారతం ‘’పై వచ్చిన విమర్శలపై  శాస్త్రి గారు శరపరంపరగా రాసిన ప్రతి విమర్శ వ్యాసాలు విద్వజ్జన ప్రశంసలు అందుకొని గడియారం వారి కీర్తి కిరీటం లో కలికి తురాయి లాభాసించాయి . .

 కడప, అనంతపుర౦ ఆకాశ వాణి కేంద్రాలనుండి శాస్త్రిగారి పురాణ కాలక్షేపాలు సాహిత్యోపన్యాసాలు ,సామెతలు బహుళంగా ప్రచారమై కీర్తికిమరింత వన్నెలు చిన్నెలు తెచ్చాయి ,ఎన్నో గ్రంథాలకు ,పరిశోధన వ్యాసాలకు ,సిద్ధాంత వ్యాసాలకు శాస్త్రి గారు  తనవంతు సహకార౦ పరోక్షంగా అందించారు.వాటికి మెరుగులు పెట్టటం ,పీఠికలు అభిప్రాయాలు రాయటం తో ఆయనకు చేతి నిండా ఎప్పుడూ పని ఉండేది .ఆధ్యాత్మిక రంగం లో ,జ్యోతిర్దర్శన విద్యలో ,ఆధునిక యోగాభ్యాసం ‘’రేకీ’’విధానంలో ఆయన గొప్ప సాధన చేశారు .

కర్నూలు జిల్లాలోకోడుమూరు లోని తమ కులదేవత ‘’పల్లెలాంబా దేవి ‘’ఆలయాన్ని అన్నగారు  రామ చంద్ర శాస్త్రి గారితో కలిసి జీర్ణోద్ధరణ చేశారు రామకృష్ణ శాస్త్రి గారు .దాదాపు 80ఏళ్ల జీవితాన్ని అత్యంత సార్ధకం చేసుకొన్నపుణ్యపురుషులు సాహితీ రత్న ,కవి సింహ  శ్రీ గొల్లాపిన్ని రామకృష్ణ శాస్త్రి గారు .ఈ విషయాలన్నీ శ్రీమతి గొల్లాపిన్ని వసుంధర గారు తెలియ జేశారు .చివరగా మచ్చుకు శాస్త్రిగారి పద్యాలు రెండు  రుచి చూద్దాం

1-      సీ. కాకతి క్ష్మాపతి కాంచుచున్నాడు హ
ర్షాశ్రు ముక్తామాల సంతరించి
హరిహర బుక్కరాయలు కాంచుచున్నారు
తెలినవ్వు చలువ వెన్నెలల బరసి
ఘనుడు విద్యారణ్యముని పలుకుచున్నాడు
సిరిలొల్క వైదికాశీస్సు గురుసి
శ్రీకృష్ణరాయలు వాకొనుచున్నాడు
శక్రుతో నాంధ్ర ప్రశస్తియేమొ

గీ. గురుని కెఱిగించు చుండె తిమ్మరుసుమంత్రి
ఆంధ్రమంత్రుల సాహసౌదార్యములను
గతచరిత్రకు నీకు దార్కాణవారె!
వచ్చియున్నారు నీయుత్సవంబుఁజూడ.
(మహాంధ్రోదయము నుండి)

2-      కొనకొమ్మ కోయిల –కొసరు కూతలలోన –ప్రియురాలి పిల్పు –విన్పిమ్పలేదే ?

నిండు జాబిల్లి పండించు  వెన్నెలలోన –వేల్లనౌ మోము కాన్పింప లేదే ?

చేరువ సరసి లో –చెంగల్వ రేకులో –చమరించు కనుల లక్షింప లేదే ?

రాయంచ నడకలో ,రవళించు  పల్కులో –నినదించు నందెల వినగా లేదే ?

నీవు తపియించు చుండ ,మై నీడ వోలె –ప్రకృతి లో లీనమౌచు నద్వైత భక్తి

జంట బాయక నీ వెను వెంటనున్న –నీ యశోధర నైన మన్నింప లెమ్ము ‘’( శాస్త్రి గారి ‘’నా కావన కదంబం ‘’లోని బుద్ధ దేవా! నమః ‘’అనే శీర్షికలోని పద్యం )

మీ- గబ్బిట దుర్గా ప్రసాద -16-10-24-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.