చదువుల తల్లి ,ఆటపాటల కల్పవల్లి ,వ్యాస వక్త్రుక్త్రుత్వ కాణాచి ,ఉత్తమ విద్యార్ధిని ,ఆదర్శ గృహిణి ,తలిదండ్రుల గారాల  కూచి,స్నేహితురా౦డ్రకు , అందరికి తలలో నాలుక’’ నాగూ ‘’ –నాగలక్ష్మి కి అప్పుడే నూరేళ్ళు నిండాయా ?

చదువుల తల్లి ,ఆటపాటల కల్పవల్లి ,వ్యాస వక్త్రుక్త్రుత్వ కాణాచి ,ఉత్తమ విద్యార్ధిని ,ఆదర్శ గృహిణి ,తలిదండ్రుల గారాల  కూచి,స్నేహితురా౦డ్రకు , అందరికి తలలో నాలుక’’ నాగూ ‘’ –నాగలక్ష్మి కి అప్పుడే నూరేళ్ళు నిండాయా ?

అందరిచేతా’’ నాగూ ‘’ఆని పిలువబడే ‘’నాగలక్ష్మిచెన్నైలో నిన్న ఉదయం  చనిపోయిందని ,ఆమె భౌతిక కాయాన్ని ఆమె అత్తవారిల్లు అయిన కంకిపాడు తీసుకొస్తున్నారని ,వాళ్ళ ఫామిలీ వాళ్ళంతా మీకు చెప్పమన్నారు మాస్టారూ .అడ్డాడ నుంచి మా స్నేహితులు రేపు ఉదయం కారులో వస్తున్నారు .మిమ్మల్ని పికప్ చేసుకొని వస్తారు ‘’ఆని మరొక అడ్డాడ శిష్యురాలు ,మాఉయ్యూరు ఆంజనేయస్వామి గుడికి ప్రతి మంగళవార౦ ,ముఖ్యమైన కార్యక్రమాలకు కొడుకుతో వచ్చే పరమేశ్వరి ?జగదీశ్వరి?నిన్నరాత్రి ఫోన్ చేసి చెబుతూ తాము ఉయ్యూరులో ఉండటం లేదని ,పోరంకిలో ఉంటున్నామని తెలియజేసింది .అయ్యో అనిపించింది నాగు మరణ వార్త విని .ఆతర్వాత అడ్డాడ నుంచి మరో శిష్యురాలు స్వప్న ఫోన్ చేసి ‘’మాస్టారూ !మీరు రాగలరా ?’’ఆని అడిగింది .’’వస్తానమ్మా తప్పకుండా’’అనగా రేపు ఉదయం ఏడున్నరకు అడ్డాడ లో బయల్దేరి వస్తున్నాము మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కంకిపాడు తీసుకు వెడతాం నాగు బాడీని పదింటికి తీసుకు వెడతారని చెప్పారు ‘’అన్నది .సరే అన్నాను .ఇవాళ ఉదయం వాళ్ళు కారులో రావటం  నన్ను ఎక్కించుకొని కంకిపాడు బస్ స్టాండ్ పక్క వీధిలో ఉన్న అత్తగారింటికి తీసుకువెళ్లటం జరిగింది .నాగు కడ చూపు అలా అనుకోకుండా దక్కింది .వీళ్ళంతా నేను అడ్డాడ హైస్కూల్ లో హెడ్ మాస్టర్ గా పని చేసినప్పుడు చదివిన వాళ్ళు .వీళ్ళతో పాటు సుమేధ ,పరమేశ్వరి అక్కయ్య ,బందరు ట్రేజరిలో పని చేస్తున్న ఇంకొక అమ్మాయి,భూషణం ,మొదలైన శిష్యులు ,చిలుకూరి వారి గూడెం లో శిష్యుడు రామారావు – నాగు భర్తకు ఫ్రెండ్ అందరు అనుకోకుండా కలిశారు .పేర్లు చెప్పారుకానీ గుర్తు లేవు .అడ్డాడ లో 1998లో రిటైరయ్యాను .అంటే26ఏళ్ళు అయిపోయాయి .వీరి సీనియర్ కోడూరి పావని బాగా గుర్తు అ అమ్మాయి అమెరికాలో ఉంటోంది .రెండు మూడేళ్ళ క్రితం వరకు నేను బ్లాగ్ లో రాసిన అవన్నీ పావనికి పంపెవాడిని ఆఅమ్మాయి రిప్లై ఇచ్చేది .

 ఇప్పుడు నాగలక్ష్మి జ్ఞాపకాలు తెలియజేస్తా .నేను అడ్డాడ లో చేరేసరికి స్కూల్ కు కరెంట్ లేదు.జాతీయ పతాకం లేదు.చేరినమర్నాడే స్వాతంత్ర్య దినోత్సవం .అప్పుడు ఎర్రగా ,బుర్రగా పంచె కట్టు చొక్కాతో ఉన్న లాబ్ అసిస్టెంట్ శ్రీ బాలకృష్ణ మర్నాటికి అన్నీ తానె తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని చెప్పటం ,సోషల్ మేష్టారుశ్రీ చీలి వెంకటేశ్వరరావు కూడా తోడ్పడతానని చేప్పటం ,నాకు పామర్రు హైస్కూల్ లో పరిచయం ఉన్న గుమాస్తా  అంజి రెడ్ది ,సెకండరి గ్రేడ్ టీచర్ ,శ్రీ డి.వీరభద్రరావు లు కూడా పనులు పూర్తి చేస్తామని హామీఇవ్వగా ,నోటీస్ బుక్ లో కార్యక్రమం రాసి సర్క్యులేట్ చేయి౦చి ఉయ్యూరు తిరిగి వచ్చి మర్నాడు ఉదయం 9కి అడ్డాడ వెళ్లటం తోనే కరెంట్ జెండా పిల్లలకు చాక్లెట్లు మొత్తం రెడీ గాఉంచారు .ఇందులో ముఖ్యపాత్ర బాలకృష్ణ దే.అలా ప్రాంభమై౦ది నా అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ .మొత్తం ఏడేళ్ళు పనిచేశాను .స్కూల్ ఆ చుట్టుపక్కల స్కూల్స్ లో చదువు ఆటాపాటా ,సాంస్కృతిక కార్యక్రమాలు అన్నిట్లో బెస్ట్ గా తయారయింది విద్యార్ధుల ఉపాధ్యాయుల ,కమిటీ వారి సహకారం తో.ఆడపిల్లల ‘’గరల్స్ మీట్ ‘’అంటే జిల్లాలోనివిద్యార్ధినులు అందరు పాల్గొనే క్రీడావేడుక  రెండు రోజులపాటు న భూతో గా జరిపాం .ప్రతియేడాది పిల్లలతో వరికోతలుకోయించి  మినపతీతలుతీయించి స్కూల్ రెవెన్యు పెంచి ఆడబ్బు పిల్లల కోసం వార్షికోత్సవాలకు, లాబ్, క్రీడా పరికరాలు కొనటానికి ఉపయోగించాం .సంచాయిక అనే పొదుపు కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా నడిపాం .వీటికన్నిటికి నాకు వెన్ను దన్నుగా నిలబడిన సైన్స్ మాస్టర్ ,స్టాఫ్ సెక్రెటరి శ్రీ కె వెంకటేశ్వరరావు ,డ్రిల్ మాస్టర్ నాగేశ్వరావు ,లేక్కలమాస్టారు రాజుగారు  సోషల్ మాస్టారు వెంకటేశ్వరరావు , లేడీ టీచర్స్ పార్వతి దేవి ,సుజాత విజయలక్ష్మి ,ఆఫీస్ గుమాస్తా అంజిరెడ్డి ఆతర్వాత వచ్చిన బాబు అందరూ అభినందనీయులే .కమిటి ప్రెసిడెంట్ శ్రీ రామబ్రహ్మం గారు ప్రతి కార్యక్రమానికి వచ్చేవారు విజయానికి తోడ్పడేవారు . ఎక్స్ట్రా క్లాసులు .తీసుకోవటం లో సోషల్ మాస్టారు బాగా సహకరించేవారు .ఇదంతా స్కూలు ఘనత .ఆఘనతలో భాగస్వామి నాగు .ఆ వివరాలు తెలియ జేస్తా .

  అందరు ఐదవక్లాస్ ఎలిమెంటరి స్కూల్ లో పాసయి ఆసర్టి ఫికేట్ తెచ్చి  హైస్కూల్ లో ఆరవ క్లాస్ లో చేరేవారు .ఇదికాక ఆరవక్లాస్ కు ఎంట్రెన్స్ టెస్ట్ కూడాఉండేది .నిర్ణీత తేదీలలో ఆ పరీక్ష నిర్వహించి వాల్యుయేషన్ చేయించి పాసయినవారి లిస్టు తయారు చేసి స్థానిక ఎం .యి .ఒ .కి డియివోకు పంపాలి .1993 జూన్ లో స్కూల్స్ రిఒపెన్ అయ్యాక అప్పటికే పామర్రు బదిలీ అయిన సోషల్ మాస్టారు  శ్రీ వెంకటేశ్వరరావు గారు ఒక రోజు నాదగ్గరకు వచ్చి ‘’సార్ !  మా అమ్మాయి నాగలక్ష్మి తో మనస్కూల్ లో ఆరవతరగతి ఎంట్రన్స్ పరీక్ష రాయించి ,ఇక్కడే చేర్చాలని ఉంది.’’అన్నారు .’’ఇక్కడ ఎవరూ ఎంట్రెన్స్ టెస్ట్ రాస్తామని వచ్చిన వారులేరు .పామర్రులో రాయించి తీసి తీసుకొస్తే చేరుద్దాం ఇక్కడ ‘’అన్నాను .’’కాదు సార్!ఇక్కడే మన స్కూల్ లోనే రాయించి ఇక్కడే చేర్పించాలి ఆని నాకు ఉంది కాదనకండి ‘’ఆని బ్రతిమాలారు .ఆయన మంచితనం నాకు బాగా తెలుసు .అందుకని ఒప్పుకోని నాగ లక్ష్మి ఒక్కమ్మాయికోసం టీచర్స్ తో పరీక్ష పేపర్లు తయారు చేయించి ఆ అమ్మాయితో రాయించి దిద్దించి ,లిస్టు తయారుచేసి  పైకి పంపి ఆమోదముద్ర పొంది ఆరవ తరగతిలో చేర్పించాము .ఇది నాకూ కొత్తే.తలిదండ్రులకు 14ఏళ్లకు కలిగిన ఒక్కగానొక్క కుమార్తె నాగలక్ష్మి .మగపిల్లాడిలా గారాబ౦గా ,ముద్దుగా పెరిగింది .

  ఆరవ తరగతి నుంచి పదవ తరగతి దాకా ప్రతి సబ్జెక్ట్ లో క్లాస్ లో ఫస్ట్ గా నిలబడి అందరికీ ముద్దు పిల్లగా ఉండేది నాగు .కబాడి ,ఖోఖో ,రింగ్ టెన్నిస్ ,త్రోబాల్ ,రన్నింగ్ రేస్ అన్నిట్లో బెస్ట్ .స్కూల్ లో జరిపే ప్రతి డిబేటింగ్ ఎస్సే రైటింగ్ లో కూడా ఆమెదే మొదటి స్థానం .పాటలు మహా గొప్పగా పాడేది. చక్కగా నృత్యం చేసేది .పిల్లల్ని మహాబాగా కంట్రోల్ చేసేది .నేను చేయించే ప్రతి సాంస్కృతిక కార్యక్రమాన్నీ తన ఇంట్లో ఉన్న రికార్డ్ ప్లేయర్ తెచ్చి రికార్డ్ చేసి కాసెట్ ఇచ్చేది .ఇంతటి నాలెడ్జి అప్పుడు మగ పురుషుడు ఎవడికీ ఉండేదికాదు .నాగు లేక పొతే స్కూలు స్తంభించి నట్లు ఉండేది .ఇప్పటికీ ఆఅమ్మాయి పోట్టిలాగు చొక్కాతో ఆడుతున్నట్లే అనిపిస్తోంది .వెరి టేలెంటెడ్ బ్రిలియంట్ స్టూడెంట్ నాగు .వివేకానంద స్వామి చికాగో పర్యటన శతజయంతి ,’’దివాకర్లవారి ‘’భారతావతరణం ‘’పద్య రూపకం ,ఉపాధ్యాయ దినోత్సవం ,స్వాతంత్ర్య, రిపబ్లిక్  దినోత్సవాలు,స్కూల్ యానివర్సరి,వరికోతలు ,మినపతీతలు .గరల్స్ మీట్ కు ఫండ్ రైజింగ్ ఒకటేమిటి అన్నిట్లో ముందుండేది నాగు .క్రమశిక్షణకు మారుపేరు .వినయవిధేయతలకు నిలువెత్తు అద్దం. ఎప్పుడు చూసినా చిరునవ్వు ముఖంతో కళకళ లాడేది .నేను రిటైరైన సంవత్సరం లో నాగు టెన్త్ పాసై స్కూల్ ఫస్ట్ రాగా ,మా తలిదండ్రుల పేరిట మొదటి నగదు బహుమానం 500రూపాయలు నాగలక్ష్మికి నా రిటైర్ మెంట్ రోజున వేదిక పై గజెటెడ్ ఎడ్యుకేషనల్ అఫీసర్ గారి చేతులమీదుగా అంద జేయించాను .ఆ తర్వాత కొన్నేళ్ళు అలా గే స్కూల్ ఫస్ట్ స్టూడెంట్ కు  స్కూల్ వారి ఆహ్వానంతో వెళ్ళి అంద జేసేవాడిని .ఆతర్వాత  అక్కడ ఎవరూ పట్టించుకోకపోవటం తో ఇవ్వటం కుదరలేదు .

  నాగు వాళ్ళ నాన్న గారు ప్రతి ఏడాది జనవరి ఫస్ట్ న ఉయ్యూరులో మా ఇంటికి వచ్చి పళ్ళు స్వీట్స్ ఇచ్చి హాపీ న్యు యియర్ చెప్పేవారు .అడ్డాడ లో నాగు పుట్టిన రోజు పార్టీ ,పెద్దమనిషి అయితే అందరికి విందు ఇచ్చేవారు వెంకటేశ్వరరావు గారు .స్కూల్ ఫస్ట్ వచ్చినందుకూ ఆయన పార్టీ ఇచ్చినట్లు గుర్తు .ఆయన యలమర్రు లో చిన్న దేవాలయం పూజరికూడా .ఆర్ధిక స్తోమత అంతంత మాత్రమె కానీ అన్నిటికీ ముందుండేవారు .పెంజేండ్ర అరవిందాశ్రమం అంటే వీరాభిమానం భక్తీ .అక్కడి రావుగారు అంటే ఆరాధ్య దైవమే .ఆయన వల్లనే పెంజేండ్ర ,అడ్డాడ అరవిందాశ్రమాలకు వెళ్ళేవాడిని .రావుగారి స్వగ్రామం లో జరిగే వేణుగోపాల స్వామి కల్యాణానికి కూడా రెండు మూడు సార్లు ఆయనతో వెళ్లాను .

  గుడివాడ లో ఇంటర్ లో చేరి పాసైన నాగు ఇంజనీరింగ్ చదువుతాను అన్నది .ఆవిషయం ఉయ్యూరు వచ్చి చెప్పారు వెంకటేశ్వరరావు గారు .తనకు చదివించే స్తోమత లేదన్నారు .నా సలహా కావాలని వచ్చానన్నారు ‘’మాస్టారూ !తెలివిగల అమ్మాయి నాగు .ఆ అమ్మాయే స్కాలర్షిప్ తెచ్చుకొంటు౦ది. మీకు బర్డెన్ గా ఉండదు ఆమె కోరిక తీర్చటం మంచిది ‘’ఆని చెప్పాను .అలాగే ఆని వెళ్ళి చేర్చటం ఆమె ప్రతి ఏడాది పాసవుతూ స్క్లాలర్శిప్  తెచ్చుకొంటూ బిటెక్ పూర్తిచేసి ఉద్యోగం కూడా తెచ్చుకొన్నది ‘,ఆమె వివాహం దుబాయ్ లో పని చేస్తున్న బిటెక్ కుర్రాడితో జరుగుతోందని స్వయంగా వచ్చి చెప్పారో లేక శుభలేఖ పంపారో గుర్తు లేదుకాని పెనమలూరు కళ్యాణ మంటపం లో రంగ రంగ వైభోగం గా వివాహం జరిగింది. వెళ్ళి ఆశీర్వదించి వచ్చాను .సుమేధ అనే నాగు స్నేహితురాలు ఇవాళ నాతో మాట్లాడుతూ ,అడ్డాడ లో చదువుతున్నప్పుడు ఉయ్యూరులో జరిగిన వ్యాసరచన ,వక్తృత్వ పోటీలలో పాల్గొనటానికి ఉయ్యూరు వచ్చి నాగు తానూ ,మా ఇంట్లో ఆరాత్రి పడుకొని మర్నాడు వాటికి హాజరయ్యామని జ్ఞాపకం చేసింది నాకు ఆమె చెప్పేదాకా గుర్తు లేదు.సుమేధ పెళ్లి అయి ఉయ్యూరు దగ్గర గరికపర్రులో ఉంటోందట .భర్త ఎం. పి. టి.సి .

  ఆతర్వాత కొన్నేళ్ళకు నాగు మద్రాస్ లో ఉందని ఎవరో చెప్పి నంబర్ ఇస్తే ఫోన్ చేసి మాట్లాడాను .అప్పటికి ఒక ఆడపిల్ల ఆ దంపతులకు .ఇవాళ తెలిసింది ఒక అబ్బాయి కూడా పుట్టాడని .ఎప్పటికప్పుడు ఫేస్ బుక్ లో స్టేటస్ పెట్టేది .నేను స్పందించే వాడిని .దాదాపు ఏడాది నుంచి అవి నాకు కనిపించలేదు .ఏదో బిజీగా ఉందేమో అనుకొన్నా .సుమారు రెండు నెలల క్రితం మా ఉయ్యూరు అమ్మాయి ,మాగుడి భక్తురాలు గుర్రాల శ్రీ లక్ష్మి తన తమ్ముడు ,నా శిష్యుడు నానాజీ కి సంబంధాలు ఉంటే చెప్పమని అడిగితె నాగలక్ష్మి నంబర్ ఇచ్చి నా పేరు చెప్పి మాట్లాడమన్నాను  ,రెండుమూడు రోజులు ట్రై చేసి లిఫ్ట్ చేయటం లేదని చెప్పగా ,నేనూ ప్రయత్నించా కానీ ఫోన్ తీయలేదు  .సాధారణంగా వెంటనే స్పందించే గుణం ఆమెది . నిన్న రాత్రి పరమేశ్వరి ?ఫోన్ కాల్ తో తెర వీడింది .  

నాగు నాన్నగారు అమ్మగారు చనిపోయారు చాలాకాలం క్రితం .నాగును కేన్సర్ కాటేసిందిట .అయినా ఎప్పుడు కనిపించినా చలాకీగా సరదాగా మాట్లాడేది ఆని ,తమ ఇళ్ళల్లో జరిగే ఫంక్షన్స్ అన్నిటికి గ్రీటింగ్స్ పెట్టడాని ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉండేదని’’నాకేమీ కాదె కంగారు పడకండి ,మళ్లీ మనం అందరం కలుస్తాం ‘’అనేదని  స్నేహితురాళ్ళు ఇవాళ దుఖాన్ని మింగు కొంటూ వాపోయారు .ఆమె మేనత్త మూడు నెలలనుంచి చెన్నైలో ఆమె దగ్గరే ఉన్నారట .ఇంత చలాకీ పిల్ల నాగు ఇంత అకస్మాత్తుగా అందరినీ వదిలేసి 43ఏళ్లకే వెళ్ళి పోవటం ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు .ఆమె భర్తను పలకరించాను ‘’మీ పోస్టింగ్స్ అన్నీ చూసేది మాష్టారు నాగు ‘’అన్నారు కన్నీరు కారుస్తూనే గుండె నిబ్బరంతో .నాగలక్ష్మి ఆత్మకు శాంతి కలగాలని ఆమె కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-10-24-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.