’పోర్ట్రైట్ ఆర్ట్ ‘’లో అఖండులు ,ఆంధ్ర చిత్రకళా ఉద్యమ సారధి –శ్రీ చామకూర భాష్యకార్లు రావు .
అలనాటి ప్రముఖ చిత్రకారులు శ్రీ చామకూర భాష్యకార్లు రావు గారు. వీరు దామెర్ల రామారావు, వరదా వెంకటరత్నం గార్ల మిత్రులు. వీరంతా కూల్డ్రే గారి శిష్యులు. వీరి సోదరులు చామకూర సత్యనారాయణ గారు కూడా ప్రముఖ ఆకృతి చిత్రకారులు..
భాష్యకార రావు 1896లో రాజమండ్రిలో వెంకటస్వామి గారికి కుమారుడుగా జన్మించి 1971లో చనిపోయారు . పోర్త్రైట్ చిత్రకాతుడు సత్యనారాయణ రావు ఈయన తమ్ముడే .భాష్యకార్లు 1921లో బెజవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశం లో పాల్గొన్న మహాత్మా గాంధీజీని దర్శించి ,ఆయన చిత్రాన్ని గీసి మన్ననలు ఆశీస్సులు అందుకొన్నారు .ఈయన చిత్రించిన ‘’బాలగంగాధర తిలక్ ‘’చిత్రాన్ని రాజమండ్రి మ్యూజియం వారు కొన్నారు .రాజమండ్రి టౌన్ హాల్ లో వీరు గీసిన కందుకూరి వీరేశలింగం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గార్ల చిత్రాలు ఇప్పటికీ పరమ ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి .వీరి వాటర్ కలర్ చిత్రం ‘’స్టిల్ లైఫ్ ‘’ ఫోటో అనిపిస్తుంది .అంత సహజ సుందరంగా ఉంటుంది .
భారతీయ చిత్రకళా ఉద్యమ కారులలో భాష్యకార్లు గారు కూడా ఒకరు .ఆకాలం లో పాశ్చాత్య చ్చిత్రకళ వైపు ఎక్కువమంది యువకులు ఆకర్షితమైతె కొద్దిమంది భారతీయ చిత్రకళా ప్రాశస్త్యాన్ని వినువీధుల్లో చాటే ప్రయత్నం చేశారు అలాంటి వారిలో దామెర్ల ,చామకూర సోదరద్వయం వంటి వారున్నారు .అలా గోదావరీతీరాన ఉద్భవి౦చి౦ దే ’’ఆంధ్రా స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ‘’.అంటే ఆంధ్ర చిత్రకళ.శ్రీ ఎ.ఎస్. రాం రాజమండ్రి ట్రెయినింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ,శ్రీ ఆస్వాల్డ్ కూల్డ్రే లు యువ చిత్రకారులను ఆకర్షించి నూతన చిత్రకళ వైపుకు మనస్సులను మళ్ళించారు .భాష్యకార్లు ప్రకృతిని ,మానవ ప్రకృతిని అద్భుతంగా తరచి పరిశీలించి ఆకృతి చిత్రాలలో పొందుపరచి విశేషంగా ప్రచారం చేశారు .
ఈయనలోనిచిత్రకళాభినివేశాన్ని గ్రహించిన పిఠాపురం రాజావారు ఆయన్ను బొంబాయిలోని జే.జే. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేర్పించారు .అక్కడ శిక్షణలో ఉండగానే గొప్ప అభి వృద్ధి సాధించి ,అక్కడి ఉపాధ్యాయులను డైరెక్టర్ ల మనసులను గెల్చారు .చిత్రకళలో జీవితాంతం అత్యున్నత స్థాయిని ,అసామాన్య స్థితిని సాధించి ,భారతీయ రేఖా చిత్రకారులలో అద్వితీయులని పించుకొన్నారు .శిక్షణ కాలం లోనే అనేక బహుమతులు ,స్కాలర్షిప్ లు అందుకొన్న మేధావి ఆయన .ఆ కళాశాల ప్రిన్సిపాల్ డబ్ల్యు .ఇ.గ్లాడ్ స్టన్ సోలమన్ భాష్యకార్లను గురించి పలికినమాటలు అన్నిటికన్నా మహా విలువైనవి –‘’భాష్యకార్లు ఈ సంస్థలో పొందిన గౌరవ ఆదారాలు గణనీయమైనవి.కళకోసం అంకిత మనస్సుతో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం .ఈస్కూల్ లో మేము ఆయనకు ఇవ్వ జూపిన ‘’చిత్రకళా బోధక ‘’ఉద్యోగాన్ని ఆయన కాదనటం ,తన స్వగ్రామం రాజమండ్రిలో స్థిరపడాలనుకోవటం ఈ సంస్థకు పెద్ద దెబ్బ గా మేము భావి౦చాము . ఇక్కడి బొంబాయి కంటే రాజమండ్రిలో చిత్రకళకు ప్రోత్సాహం ,,ఆయన క్రియాశీలతకు ఆనుకూల్యం తక్కువ ఆని మేము భావిస్తున్నాం’’ . ఇంత గొప్ప ప్రశంస పొందటం ఎవరికైనా అసాధ్యం .అదీ భాష్యకార్ల ప్రత్యేకత .
కానీ భాష్యకార్లు రాజమండ్రి వచ్చి ఆంధ్ర చిత్ర కలలో ప్రసిద్ధులైన దామెర్ల రామారావు వంటి ముఖ్యులతో కలిసి ఆంధ్ర చిత్రకళకు అనన్య సామాన్యమైన అభివృద్ధి సాధించి చూపించారు .1-అరణ్యంలో దైవ సాక్షాత్కారం ,2-అన౦త౦ తో ఏకీభావం ‘అనే ఆయన చిత్రించిన రెండు వాటర్ కలర్ చిత్రాలు ఆలోచనకు ఆచరణకు అత్యంత ఉన్నతస్థాయి చిత్రాలు ఆని పేరు పొందాయి .బొంబాయ్ ఆర్ట్స్ సొసైటీ 1923-24లో లండన్ లో వీటిని ప్రదర్శించే గొప్ప అవకాశం లభించటం మనకు గర్వకారణం .మొదటి చిత్రాన్ని ప్రిన్సిపాల్ గ్లాడ్ స్టన్ కొని బొంబాయిలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం లో ఉంచటం మరింత విశేషం .
భాష్యకార్లు ఇవేకాక ఆయిల్ వాటర్ కలర్స్ తో ‘’శకుంతల నిష్క్రమణం ‘’,శకుంతల ప్రేమ లేఖ ‘’చిత్రాలు అత్యద్భుతం .ఆయన కళా పరిణతకి అతిగొప్ప నిదర్శనాలు .ఆయన చిత్రాలలో సహోదరభావం మానవతా ,మతాలమధ్య ఐక్యత కనిపిస్తాయి ఆ రోజుల్లో అవే మృగ్యం.ఆయన చిత్రించిన ‘’బాలగందాధర తిలక్ ‘’చిత్రం మున్సిపల్ కౌన్సిల్ హాల్ కే గొప్ప వన్నె తెచ్చింది .ఆయన జన్మించి నడయాడి చరిత్ర సృష్టించిన రాజమండ్రిలో ఆయన చిత్ర రాజాలు గొప్ప అభిమానం పొంది, నీరాజనాలు అందుకోవటం గొప్ప విశేషం .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-24-ఉయ్యూరు .

