ప్రసిద్ధ ఆంధ్ర చిత్రకారుడు,’’ ’చామకూర ఆర్ట్ అకాడెమీ’’ స్థాపకులు’’ధ్యాన బుద్ధ ‘’చిత్ర ఫేం,ఆకృతి చిత్రకారులు –శ్రీ చామకూర సత్యనారాయణ రావు
ఎస్..ఎన్ .చామకూర గా పిలువబడే శ్రీ చామకూర సత్యనారాయణ రావు కర్నాటకలోని గుల్బర్గా జిల్లా గంజేటి లో 1901 లో జనవరి 8న జన్మించారు.వీరి తండ్రి ఆనాటి సుప్రసిద్ధ చిత్రకారులైన భాష్యకార్లు రావు గారికి సోదరులు .రావు గారు స్వగ్రామం లో ప్రాధమిక విద్య పూర్తి చేసి ,ప్రసిద్ధ చిత్రకారులు శ్రీ దామెర్ల రామారావు గారి వద్ద చిత్రలేఖనం లో శిక్షణ పొందారు .
193౦లో బొంబాయి వెళ్ళి సర్ జే.జే సర్కార్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరి డిప్లోమా ప్రధమా శ్రేణి లో ఉత్తీర్ణులయ్యారు .1930-32లో మద్రాస్ లో ఎం..ఎస్ .ఎస్. చారిటబుల్ సంస్థలో ఆర్ట్స్ మాస్టర్ గా రెండేళ్లు పని చేశారు .1942లో ‘’చామకూర ఆర్ట్ అకాడెమీ’’ప్రారంభించి అనేకమంది యువకులకు శిక్షణ అందించారు .రావుగారు చిత్రించిన ‘’ధ్యాన బుద్ధ ‘’చిత్రం విశేష ప్రసంశలు అందుకొన్నది .ఇదే తరహాలో 150మంది ప్రముఖుల ఆకృతి చిత్రాలు మనోహరంగా చిత్రించారు .వీరిలో మహాత్మాగాంధీ ,నెహ్రు ,రాధాకృష్ణన్ ,రాజాజీ ,ఇందిరాగాంధి ,ఆంధ్రకేసరి ,కామరాజు .సి.డి .దేశముఖ్ వంటి ప్రముఖులు ఉన్నారు ..
చామకూర చిత్రించిన గౌరీ కళ్యాణం ,నాగపూజ ,మురళీ రవం ,సముద్ర మధనం ,విలాస విముఖ సిద్దార్ధ ,రాధాకృష్ణ చిత్రాలు బహుళ ప్రచారం పొందాయి .వీరి చిత్రాలన్నీ ‘’ఆర్ట్ అండ్ బ్యూటి ‘’గ్రంథం లో చోటు చేసుకోవటం మనకు గర్వ కారణం .చామకూర వేంకటపతి కవి ఎంతటి ప్రసిద్ధ కవో,చిత్రకారుడు చామకూర సత్యనారాయణ రావు అంతటి సుప్రసిద్ధులు .రావుగారు ‘’దక్షిణ భారత చిత్రకుల సంఘం ‘’కు కొంతకాలం అధ్యక్షులుగా ఉన్నారు .’’ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడెమీ ‘’కి ఉపాధ్యక్షులుగా సేవలందించారు .1978లో ఎస్ .ఎన్ . చామకూర 76 ఏట హైదరాబాద్ లో మరణించారు .ఈ వివరాలన్నీ డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారు వ్రాసిన వ్యాసం లోనివి .ఇంతకు మించి ఆప్రముఖ చిత్ర కారుని విషయాలు తెలియలేదు .వీకీ పీడియాలోనూ లేదు.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-11-24-ఉయ్యూరు .

