మా పసలపూడి కథలు – 58
వంశీ
మా చెల్లాయత్త మొగుడు – 2
తాగుడుకి బాగా అలవాటు పడిపోయి చివరకి ఎక్కడ అప్పు పుడద్దా అని చూసే దశకొచ్చిన మా నాన్న చెల్లాయత్త మొగుడు దగ్గరకెళ్ళి ఎదురుగుండా బాసీపీట వేసుక్కూర్చుని ఎక్కడ సందు దొరుకుద్దా ఎక్కడ రెండ్రూపాయలు అప్పు అడుగుదావా అని చూస్తున్నాడు. పాడైపోయిన లక్క గ్రామఫోను రికార్డుతో యాష్ ట్రే తయారుచెయ్యడంలో లీనమైపోయి ఉన్న మా చెల్లాయత్తమొగుడు అసలు మాట్లాడ్డానికి సందివ్వడం లేదు మా నాన్నకి. రామచంద్రపురంలో దస్తావేజులు రాసే తాడి సూరెడ్డిగారు పెద్ద (రిక్షావాడి పేరు) రిక్షాలో వెళ్తుంటే ఆపిన మా చెల్లాయత్తమొగుడు ఆయన్ని లోపలికి తీసుకొచ్చి కంచుగ్లాసుడు బెల్లం టీ పట్టుకొచ్చి ఇస్తుంటే ఇప్పుడే ఇంట్లో అన్నం తిని బయల్దేరేను అన్నాడు తాడి సూరెడ్డిగారు.
పర్లేదు.. తోళం పుచ్చుకోండి బాయ్యా అని లోపలికెళ్ళి చిన్న కాయితం పొట్లం పట్టుకొచ్చి సూరెడ్డిగారికిచ్చేడు. పొట్లం విప్పి అందులో ఉన్నది చూసేకా ఆహోహో…హోహో…హో అరుస్తుంటే లోపల్నుంచి పరిగొత్తుకొచ్చింది మా చెల్లాయత్త. ఆ పొట్లంలో ఉన్నదేంటంటే – మనిషి చిటికెనవేలుతో తయారు చేసిన పాళీ.
మీ కొట్లో పొద్దుట్నించి రాత్రిదాకా దించిన తల ఎత్తకుండా, పెట్టుకున్న పెన్ను పక్కనెట్టకుండా రాస్తానే ఉంటారుగదా బాయ్యా మీకేవన్నా పనికొస్తదేమో అని ఏణ్ణర్ధం పాటు నా చిటికెన వేలు గోరు పెంచి వారం క్రితమే దాన్ని గిల్లి మీకోసం చేసేనీ పాళీ అన్నాడు. సూర్రెడ్డిబాయ్యా అని మొదలెట్టి తన దగ్గరున్న రెండు ఆస్టిన్ కారు పార్టులు గురించి చెప్పి తక్కినియ్యి ఎక్కడ దొరుకుతాయంటావ్ అనడిగేడు.
ఓరోజున పనిగట్టుకు మరీ సూర్నాణతోపాటు రాజమండ్రీ వెళ్ళిన మా చెల్లాయిత్తమొగుడు మరికొన్ని పార్టులు కొనుక్కొచ్చేడు. పిచ్చిక ఒకో గడ్డిపూచా ఏరుకు తెచ్చుకుని గూడు అల్లుకున్నట్టు ఆ
అక్కడో పార్టూ అక్కడో పార్టూ సంపాయించి చిన్నకారు తయారు చేసేసుకున్నాడు మొత్తానికి. ఒకరోజు డిగ్ డిగ్ మని చప్పుడు చేస్తున్న ఆ చిన్నకారుని నడుపుకుంటూ వస్తుంటే ఊరి జనవంతా విరగబడి చూశారు.
మాకు దగ్గర్లో ఉన్న రామచంద్రపురం వరకూ వెళ్ళివచ్చేవాడు సరదాగా, చిత్ర విచిత్రమైన పనులు మాత్రమే చేసేవాడు.
అడవుల్లోపల నలభై ఏళ్ల వయసున్న బాగా ముదురు వెదురు చెట్లూ కనిపించాయట. వాటిని నరికించి చిత్రమైన మంచాలు చేయించి తను తయారు చేసుకున్న కారు వెనకాల పెట్టించి తనకి బిల్లులు పాస్ చేయించిన ఆఫీసరు దొరగారికి కానుకగా ఇచ్చేట్ట.
ఒకసారి ఫారెస్టు బంగళాలో కుటుంబంతో పాటు బస చేసిన మినిస్టరుగారు మా చెల్లాయత్త మొగుడి చిత్రమైన కారు చూసి అది నాక్కావాలి అన్నాడట. ప్రేణం పోయినా ఇవ్వనని మా చెల్లాయత్తమొగుడు అనేసరికి పెద్ద గొడవైందట. కాంట్రాక్టులన్నీ ఆపించేసేడట.
ఆడేం చేసినా నా కారివ్వనని శపథం చేసి పసలపూడొచ్చేసేడు రివటలా సన్నగా పొడుగ్గా ఉండే మా చెల్లాయత్తమొగుడు.
కాకినాడ ధర్మాసుపత్రిలో చచ్చిపోయేడట మా చెల్లాయత్తమొగుడు. శవాన్ని కార్లో వేసుకుని తీసుకొస్తున్నారట.
డిక్కీ ఓపెన్ చేసి శవాన్ని తియ్యడానికి బదులు చింతపండు బుట్టలాంటి ఒక తాటాకు బుట్టని తీసేరు.
జనానికి వివరంగా చెప్పిందేంటంటే — బాగా పొడుగవ్వడం వల్ల శవం కారు డిక్కీలో పట్టక ఆ శవాన్ని నడుందాకా విరిచేసి మడతెట్టి తాటాకు చాపలో చుట్టేరంట. కాళ్ళూ చేతులూ కూడా పొయ్యిలో పెట్టేముందు పుల్లల్లాగా విరిచేసేరంట.
ఆ రకంగా బతుకు పొడుక్కీ ఎన్నో చిత్ర విచిత్రాలు చేసిన మా చెల్లాయత్తమొగుడు చిట్టచివరి సీను కూడా అలా చిత్రంగా జరిగింది.

