వాయులీనం ఉచ్చ్వాస నిశ్వాసాలుగా జీవించి ,అరుదైన గజా రోహణ సత్కారం పొందిన సంగీత విద్వాంసుడు – మహా మహోపాధ్యాయ శ్రీ కొచ్చెర్ల కోట రామరాజు
వాయులీనం ఉచ్చ్వాస నిశ్వాసాలుగా జీవించి ,అరుదైన గజా రోహణ సత్కారం పొందిన సంగీత విద్వాంసుడు – మహా మహోపాధ్యాయ శ్రీ కొచ్చెర్ల కోట రామరాజు
కొచ్చెర్ల కోట సంస్థానానికి చెందిన సంగీత విద్వాంసుడే కొచ్చెర్లకోట రామరాజు గారు…తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ గ్రామంలో 1878 లో జన్మించారు. బాల్యం నుంచీ సంగీత సాహిత్య విద్యాధురీణులైన నాదయోగి బ్రహ్మశ్రీ చేబోలు వెంకటరత్నం గారి దగ్గర సంగీత సాధన చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యులైన సి.యస్. కృష్ణస్వామి దగ్గర కొంతకాలం..జంత్రగాత్రాలని అభ్యసించారు.1914లో రాజా కొచ్చెర్లకోట కృష్ణారావు జమీందార్ మేడలో సంగీత సభ చేసి కీర్తి సాధించి ,కస్తూరి శివ శంకర కవి వద్ద సాహిత్య శిక్షణ పొంది స్వర జాతులు ,తాల వర్ణాలు ,తిల్లానాలు ,కీర్తనలు అష్టోత్తరాలు రచించారు .గాయక మనో రంజని సరళీ స్వరాలనుండి పల్లవి వరకు పంచరాగ మాలికలు ,పదాలు ఘనరాగ గీతాలు ,రచించి కృతార్ధు లయ్యారు .తిరుపతి వెంకటేశ్వర్లు దర్బారు లో బిలహరి స్వరజతి కూర్చారు .సోదరుడు లక్ష్మణ రాజు సహ గానం చేసేవారు .
ప్రతి శనివారంఇంట్లో భజన చేసేవారు .మాతృ, గురు, దైవ,అతిధి పూజ అంటే మహా శ్రద్ధగా చేసేవారు. నిరాడంబరుడు .అత్యంత వినయ సంపన్నుడు .పండితసత్కారాలు అనేకం పొందారు .అన్నోదకాలకు కొదవ లేకపోవటం చేత 1896నుంచి అనేక మంది విద్యార్ధులకు ఉచితంగా గాన బోధ చేసి శిక్షణ నిచ్చారు.వీరి శిష్యులలో ముఖ్యులు –నడింపల్లి వెంకట నరస రాజు ,అడబాల నరసింహం ,షేక్ బాబా ,లచ్చిరాజు ,పిన్నెల మల్లయ్య ,వేనపల్లి నరసింహం గార్లు .దేశ్ ముఖ్ కొప్పోలు జమీందార్లు ఈయనను ఘనంగా సన్మానించారు .
సాధన అంటే రాక్షస సాధన రాజు గారిది.
అదే దీక్ష.. అదే పట్టుదల.. అదే ధ్యాస.
అసలు అదే రహస్యం. ఏ విద్యన్నా పట్టుపడాలీ అంటే అర్జునుడికి కనిపించిన పక్షి కన్నులాగా..
మరో దానిమీద దృష్టి ఉండకూడదు. అదే గదా తపస్సంటె…
వాయులీనాన్ని ఆవాహన చేసేసుకున్నాడు రామరాజు..
రాముడి కోదండం లాగా.. రామరాజుకి వాయులీనం.
కమాను సంధించాడంటే నాద వర్షం.
ఆఖరికి వాయులీన రహస్యాల్ని ఎంత ఆకళింపు చేసుకున్నాడంటే…
కమాను లేకుండా.. కేవలం చేతివేళ్ళతో తీగల్ని మీటే
కావల్సిన ధ్వనుల్నీ…రాగాల్నీ వాయించే స్థితికొచ్చాడు…
అంటే వాయులీనం ఆయన ఉఛ్ఛ్వాస…నిశ్వాసం..
వాయులీనం…ఆయన గుండెకాయ..
వాయులీనం…ఈయనలో విలీనం.
సరళీ స్వరాలు, జంట స్వరాలు సంగీతాభ్యాసకులు ఉపయోగపడే విధంగా ’గాయక మనోరంజని’ అనే సంగీత గ్రంథాన్ని రాశారు. స్వరపల్లవులు గూడా రాశారు. శ్రీ కృష్ణ కర్ణామృతం నూట యెనిమిది కీర్తనలు కూడా రాశారు.
ఈయన కీర్తి ప్రతిష్టలు విని పోలవరం సంస్థానాధీశులు కొచ్చెర్లకోట కృష్ణారావు గారు రామరాజు గారిని ఆస్థానానికి ఆహ్వానించి కచేరి పెట్టించారు. పోలవరం సంస్థానంలో జరిగిన… అద్భుతమైన కచేరీలో ’ఇదొకటి’ గా శాశ్వతమైన అనుభూతి మిగిల్చిందట!
అలాగే శ్రీరామకీర్తన కర్ణామృతం అనే మరో సంగీత గ్రంథం రాశారు. అది పాడుకోడానికి సులువుగాను..మధురంగానూ కూడా ఉందని.. మిత్రులు కొంత మంది కోరగా.. అది ప్రింటు కావడం జరిగింది. అందులో శంకరాభరణం, ఖరహరప్రియ, కేదార, బిళహరి హరికాంభోజీ, పుష్పతిలక, జంఝాటి, కానడ, నాదనామక్రియ, దర్బార్, చక్రవాకం వంటి ప్రసిద్ధ రాగాల్లో ఎన్నో కీర్తనలు రాశారు.!
ఉదాహరణకి, ఖరహరప్రియ రాగంలో.. రాముడి చరితం..
పల్లవి : శ్రీ రఘురాముని చరితము వినుడీ
రాతిని ప్రేమతో నాతిగ జేసి, ఖ్యాతిగ విల్లుద్రుంచీ
సీతను గైకొని భూతలేశుడని పౌరులు పొగిడిన
వానర వీరుని వాలిని ద్రుంచీ, దినకరపుత్రుని ఘనమున బ్రోచీ అనిల సుతునికెంతో
ఆదరమొసిగిన
దారి కొరకు బలు వారధి కట్టి క్రూరుని లంకేశుని కూలగసేసి నీరజనేత్రని నేర్పుతో తెచ్చిన..
కృతికీ కీర్తనకూ గల లక్షణాలలో కృతికంటె, కీర్తనలో సాహిత్యానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది.
కిర్తన పురాతనమైన రచన..రామరాజుగారు అదే పాటంటారు..
అలాగే..దైవాన్ని నిలదీసి..దెప్పి పొడిచి.. తన కోరిక తీర్చమనే నిందాస్తుతి..
ఏరా.. నాపై దయరాదు నేనెంత వేడుదునో రామా
చిన్ననాటి నుండి సేవ చేసెదనని చెప్పుకొంటి
జావుమని కరి రాజు ప్రార్ధింపగా…గక్కున ఏలుట అబధ్దమా!
మిత్రునితో బ్రోవ వచ్చేవు..
వంటివి.. ఎంతో ఆర్ధ్రంగా.. హృద్యంగా ఉంటాయ్.!
1938 లో రాజోలులో వకీలు సంఘం వారు.. రామరాజుగారి షష్టిపూర్తికి ఘనంగా సన్మానం చేశారు. సన్నాయిమేళం ఏర్పాటు చేసీ.. ఏనుగు.. అంబారీపై ఊరేగించారు.. మంగళ వాయిద్యాలతో ,తప్పెట్లు తాళాలతో ,ద్వారం వెంకటస్వామి నాయుడు గారి ఫిడేల్ కచేరీ ,హరి నాగభూషణ౦ గారి గానకచేరితొ పూల వర్షంతో హర్షధ్వానాలతో నభూతోగా గజారోహణ మహోత్సవం జరిపించి అత్యంత ఘనం గా సత్కరించారు చరిత్రలో అది సువర్ణాధ్యాయంగా నేత్ర పర్వంగా జరిగి చరిత్రలో నిలిచి పోయింది ఆ సాయంత్రం ఏర్పాటు చేసిన పౌరసభలో …ఊరు ఊరంతా చప్పట్లతో దద్దరిల్లి పోయేలా..‘’మహామహోపాధ్యాయ’’ అన్న బిరుదు కూడా ప్రదానం చేశారు.
ఎన్నో సత్కారాలూ..సన్మానాలూ…పొందిన..కొచ్చెర్లకోట వారు నిగర్వి.. నిరాడంబరులు..చివరి దశలొ తాను గోదావరి ప్రాంతంలోని తాటిపాక లో స్థిరపడి..అక్కడ తన ఇంటినే పూజా మందిరాన్ని ఏర్పాటు చేసి.. ఉచితంగా సంగీతాన్ని నేర్పించేవారు..1946లో రామైక్యం పొందారు
సంగీతం కోసం తమ సర్వస్వన్నీ త్యాగం చేసిన…మహానుభావులు ఎందరో..
వారిని స్మరించుకోవడం…మన అదృష్టం..
ఆధారం –రాగ సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి గారి వ్యాసం,సిలికానాంధ్ర సుజన రంజని లోని శ్రీ తనికెళ్ళ భరణి వ్యాసం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-24-ఉయ్యూరు
