శృంగేరికి చెందినశ్రీ ఎరుకలపూడి సుబ్రహ్మణ్యశర్మ గారి ‘’భవానీ !’’పద్య శతక కావ్యం

శృంగేరికి చెందినశ్రీ ఎరుకలపూడి సుబ్రహ్మణ్యశర్మ గారి ‘’భవానీ !’’పద్య శతక కావ్యం

ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా కృష్ణా తీరం కామేపల్లి లో 1943జులై లో జన్మించి ,విజయవాడ లయోలా కాలేజిలో బిఎస్ సి చదివి ,సౌత్ వేస్ట్రేన్ రైల్వే -హుబ్లి లో చీఫ్ యార్డ్ మాస్టర్ గా ఉద్యోగించి ,రిటైరై,శృంగేరిలో విశ్రాంత జేవితం గడుపుతూ సాహిత్యాభిమానం తో సాహితీ సేవ చేస్తున్నారు .తలిదండ్రులు లక్ష్మీ నరసమ్మ ,రామభద్రయ్య గార్లు. అర్ధాంగి సీతారామ వినయ .

 కవి గారి గురు  దేవులు –శ్రీ శిష్ట్లా లక్ష్మీ కాంత శాస్త్రి శ్రీ ,చెరుకుపల్లి జమదగ్నిశర్మ ,శ్రీ పాటి బండ్ల మాధవ శర్మగార్లు .శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధమహాస్వాములు కవిగారి ఆరాధనీయ జ్ఞాన మూర్తి .వీరికే ఈ శతకం అంకితమిస్తూ –‘’శంకరాద్వైత దక్షిణా విరాజి  – పీఠ పతి యౌచు ,శుచిత కృపీటభవుని –కైన గరపెడు మహిత వాగార్ధ మూర్తి –భారతీతీర్ధ గురుసార్వభౌము కెరగి –గృతిని ‘’శాంభవి ‘’నర్పింతు నతినియతిని ‘’ఆని సవినయ సమర్పణ చేశారు .వీరి ఇతర కృతులు –ధూర్జటి, రాఘవా శతకాలు ,కుహనాకిరాటకం –లఘు కావ్యం ,మంజు ఘోష –ఖండ కావ్యం .

 ఆముఖం లో –‘’మకరా౦క హారి ప్రణయిని –సకలాగమ వినుత ,సదయ శతకము నందున్ –మకుటముగా గొనుము ‘’శాంభవి ‘’-చికురాభరణాయమాన శీత మయూఖా ‘’ఆని మకుట నిర్దేశం చెప్పుకొన్నారు అమ్మవారికి .తన పితామహుడు తనలో నాటిన సాహిత్య నారు నేడు తెలుగు సంస్కృతాలలో గాదెలకేత్తి నట్టిఘనకావ్యపు భిక్ష ‘’ఇవ్వటం శాంభవి కటాక్షమే అన్నారు ..తర్వాత గురు ,కులదైవ మైన రాముని, సరస్వతీ,వినాయక ,నారసింహ స్తుతి చేసి ,పూర్వకవులను స్తుతించి రంగంలోకి దిగారు .శతకాన్ని మత్తేభ శార్దూల చంపక ఉత్పలమాలలతో నింపారు . మొదటి పద్యం శార్దూలం –‘’శ్రీ శైలేశ్వర హృత్పయోజ మధు లిట్స్స్నిగ్దా కృతీ !శృంగభూ –ద్రాశా కిల్బిష హారి వామతరుణీ ,రాజార్ధ కోటీర ,శ్రీ-కాశీ క్షేత్ర వసద్విశాల నయనా ,క్షౌమామ్బరాలం కృతా –ఆశాస్య౦బు లనుగ్రహించు జననీ ,అర్చింతు శ్రీ శాంభవీ ‘’అమ్మ వారిని’’సహజ శిరోజగాంధ విలసచ్చ శిఖండ మనోహరామ్కా .సింహహయా ‘’అంటూ చంపక మాల వేశారు .ఎంత తపం చేశావో ఈశుని మేన సగం కోసం మన్మడుడిని బూడిద చేయగా నీపతి ,ఔచిత్య౦గా కటాక్షించావు అన్నారు ఉత్పలమాలలో .

‘’కనక క్ష్మాధర చాప ధారిణివి ,గా౦డీవికి వరం ఇచ్చేవేళ ,ముని హంసుడు వ్యాసుడిని కాశీ నుంచి నిష్కాసనం చేసే సమయంలో మౌనంగా సూచన ఇచ్చి లోక హితమే ధ్యేయంగా ఉన్నావు ఆని మత్తేభంలో విక్రీ డించారు .కర్త కర్మ క్రియ నీవే .’’రసన సరీ సృపా’’అన్నారు శాంభవిని .శాత్వతమైన పరమాత్మను చేరటమే జీవితఫలం . అంబా బాల విలంబమేల ఆని ఆర్తిగా వేడుకొన్నారు శార్దూలంలో .’’సమయా ,మాయ ప్రమాదముల్ సమయ నిన్ స్వాన్తస్తితం చేసుకొంటే ‘’అన్నారు రమ్యంగా .మరో మనోహర పద్యంలో –‘’అమ్ములు తీర , వింటిగొని ,యాగక తాకగ విల్లు మాయమై –నెమ్మది యుమ్మలింప ,రణ నీతిని –పైకొని మల్లయుద్ధ య-త్నమ్మొనరించు దూకుడుకు నవ్వుచు ,కవ్వడి పిల్ల చేష్టల –ట్లిమ్మున జూచిరమ్మ .వరమిచ్చితి రబ్బురమంది శాంభవీ ‘’ఆని ఆదృశ్యాన్ని కళ్ళకు కట్టించారు కవి .ఆనందం దానికి కార్యం తాత్కాలిక ఆనంద౦  ఎలా ఉంటుందో ,శాశ్వతానందం ఎలా ప్రాప్తిస్తుందో ,ఆత్మానంద౦  అంటే ఏమిటో మొదలైన ప్రశ్నలకు సమాధానం శాంభవి మాత్రమె అంటారు మరో శార్దూల విహారం లో .’’అనిశము సుప్రసన్న వదనాబ్జ వినిర్గత దృక్ప్రసారముల్ –ప్రణత సమస్త శిష్యజనరాజికి శ్రేయము గూర్చు దీవెనలు ‘’ఇవ్వమని వేడుకొన్నారు .

చివరలో శంకర భగవత్పాదుల –‘’గిరామా హుర్దేవీ దృహిణగృహిణీ మాగమ విదో – హరేఃపత్నీ౦ పద్మాం,హరసహచరీ మద్రి తనయాం –తురీయా కాపీ త్వం దురధిగమ నిః సీమ మహిమా –మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ‘’

మరియు మూక శంకరుల –‘’క్రీడాలోల కృపా సరోరుహముఖీ సౌధాంగణేభ్యఃకవి –శ్రేణీ వాక్పరి పాటికామృత ఝరీ సూతీ గృహేభ్యః,శివే –నిర్వాణా౦కురసార్వ భౌమ పదవీ సి౦హాసనే భ్యస్తవ –శ్రీ కామాక్షి మనోజ్ఞ మంద హసిత జ్యోతి ష్కణేభ్యో నమః ‘’  

అన్న రెండు శ్లోకాలు చేర్చటం శతకానికి హైలైట్ గా నిలిచింది .భక్తకవి శేఖరుల జాబితాలో శర్మగారు ముందు వరుసలో నిలబడే పద్యాలు రచించి శాంభవీ వరప్రసాదులయారు .చిక్కని చక్కని భక్తి శతక కావ్యం చదివి,మనమూ ధన్యులమౌదాం.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-24-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.