కథా’’ సాహితీ’’ ,వైమానిక దళ ‘’ సమరాంగణ ‘’ త్రివిక్రమ్ ,ఉన్నత న్యాయవాది –శ్రీ కాటూరి రవీంద్ర
సౌమ్యులు ,చిరునవ్వే ఆహ్వానం ,మంచిమనసున్న న్యాయవాది ,రచయితలలో పెద్దమనిషి ,ప్రతిభను ప్రోత్సహించే విశాలహృదయులు ,చిన్నా పెద్దా సాహితీ సమావేశాలకు తప్పని సరిగా హాజరై నిండు మనసుతో ప్రోత్సహించే నిగర్వి సరసభారతికి ఆప్తులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు ఈ డిసెంబర్ 18న విజయవాడ కృష్ణలంక స్వగృహం లో 79వ ఏట మరణించారు .వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .
శ్రీ రవీంద్ర త్రివిక్రమ్ గారితో సుమారు పాతికేళ్ళ అను బంధం నాది .బందర్లో సాహితీ మిత్రుల పక్షాన శ్రీ రావి రంగారావు ఒక కథా సదస్సు నిర్వహిస్తున్నారని తెలిసివెళ్లాను ,ఆంధ్రపత్రిక సంపాదకులు శ్రీ వీరాజీ సభాధ్యక్షులు ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి వేణు గోపాలరావు,ప్రసిద్ధ కథకులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ మొదలైన వారు వక్తలు .అందరూ మంచి కథల గురించి ,ఆయా రచయితల గొప్ప తనం గురించి సాధికారంగా మాట్లాడారు .కొమ్మూరిని ,కాటూరినీ అప్పుడే మొదటి సారి చూసాను.అంతా బాగానే ఉంది.అయితే అప్పుడే ఒక ప్రసిద్ధ కథానికి ఆంధ్ర దేశమంతా కొత్త వరవడి సృష్టించి , దుమ్ము దులిపెస్తూ హల్ చల్ చేసి పాఠకుల హృదయాలను రసప్లావితం చేసిన కథను వీరంతా మరచి పోయినందుకు నాకు ఎక్కడో కాల్తోంది .అధ్యక్షుల వారిని నాకు ఒక అయిదు నిమిషాల సమయం ఇవ్వమని కోరగా ఏ కళలో ఉన్నారొ ఇచ్చారు .నేను వేదికపైకి వెళ్ళి శ్రీ రమణ రాసిన ‘’మిథునం ‘’కథ గురించి నాకు తెలిసిందంతా చెప్పి అంతటి గొప్ప కథ కొన్నేళ్లుగా మనకు రాలేదని దాన్ని ఇందరు ప్రసిద్ధ వక్తలు ప్రస్తావించక పోవటం దురదృష్టకరమని ఆని చెప్పి కూర్చున్నాను .వీరాజీ వెంటనే స్పందించి ‘’ఈ మాస్టారు చెప్పింది అక్షర సత్యం .అన్నారు.అప్పుడే రవీంద్ర గారి ఫోన్ నంబర్ తీసుకొన్న జ్ఞాపకం .సాయంత్రం ఉయ్యూరు వచ్చేశాను .మర్నాడు ఉదయం త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి ‘’దుర్గా ప్రసాద్ గారూ!నిన్న రాత్రి మేము బెజవాడ చేరాక కొమ్మూరి ఫోన్ చేసి మీరు మాట్లాడిన తీరుకు మహా ముచ్చట పడ్డారు మీకు అభినందనలు తెలియ జేయమన్నారు .ప్రతి రోజూ రాత్రి 12 వరకు మేము ఫోన్ లో మాట్లాడు కొంటూనే ఉంటాం .మళ్లీ తల్లవారాక కూడా ఒకరితో ఒకరంమాలాడక పొతే మా ఇద్దరికీ తోచదు.అంతటి గాఢ సాహితీ బంధం మాది . మిమ్మల్ని నేనూ అభినదిస్తున్నాను .ఇచ్చిన కాస్త సమయంలో మిథునం కథను మా ముందు గొప్పగా ఆవిష్కరించారు మీరు ‘’అన్నారు .ధన్యవాదాలు చెప్పాను .
అప్పుడు నేను ఉయ్యూరు సాహితీ మండలి కన్వీనర్ గా ఉన్న జ్ఞాపకం .ప్రతినెల మూడవ ఆదివారం తప్పక సాహిత్య కార్యక్రమం నిర్వహించే వాళ్ళం..త్రివిక్రమ్ గారిని ఒక నెల మూడవ ఆదివారం సాయంత్రం ఆహ్వానించగా వారి కథానికా విశేషాలు ,జీవిత విశేషాలు చక్కగా వివరించారు .వారికి ఉడతా భక్తీ సన్మానం చేసి మా తలి దండ్రుల పేరిట నూట పదహారు రూపాయలు, శాలువా బహూక రించాం . అప్పటి నుంచి దాదాపు వీలైనప్పుడల్లా ఫోన్లో మాట్లాడుకొనే వారం .కొమ్మూరి మరణాన్ని ఆయన ఫోన్ లో చెప్పారు తట్టుకోలేక పోయారు అనిపించింది వారి మాటలు వింటూ ఉంటే . కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యక్రమాలలో తప్పక కలుస్తూ ఉండేవారం .ఆయన నన్ను ఎప్పుడూ తమ ఇంటికి రమ్మని ఆహ్వానించే వారు .వెళ్లటం కుదరలేదు .ఆయన మా కటుంబ ఆత్మీయురాలు శ్రీమతి సీతంరాజు మల్లిక గారి ఆడపడుచు భర్త గారు .అంటే మల్లికగారి భర్త శ్రీ వెంకట రావు గారి సోదరి భర్త . కృష్ణ లంకలో మల్లికామ్బగారి తండ్రిగారిల్లు ,కాటూరి వారి ఇళ్ళు దగ్గర దగ్గరే .వారి వీధిపేరు –‘’కాటూరి వారి వీధి ‘’ఆని గుర్తు .
మేము సరస భారతి స్థాపించిన తర్వాత పుస్తక ప్రచురణ చేయటం, రవీంద్ర గారికి మా పుస్తకాలు పంపిస్తూ ఉండటం జరిగేది .అందిన వెంటనే ఆయన ఫోన్చేసి చెప్పి పుస్తకం లోని విషయాలను మెచ్చుకొనేవారు .ఒక సారి ఆయన ,ఆయన అర్ధాంగి ఉయ్యూరు కు మల్లిక గారింటికి వచ్చి ,మా ఇంటికి కూడా ఇద్దరూ వచ్చి ఒక ‘గంట సేపు కూర్చుని మాట్లాడారు .అదొక పండుగ అనిపించింది మాకు .సరస భారతి ‘’మా అన్నయ్య ‘’శీర్షికతో ‘ఒక ఉగాది కవి సమ్మేళనాన్నినిర్వహించింది .ఆకవితలను పుస్తక రూపంగా తేవాలని అనుకొంటూ ఉండగా సరసభారతి కార్యవర్గ సభ్యురాలు మల్లికగారు తాను స్పాన్సర్ చేస్తానని తమ తలి దండ్రులు స్వర్గీయ తాడేపల్లి మల్లికార్జునరావు శ్ర్రేమతి లలితాంబ దంపతులకు అంకితం ఇవ్వాలని కోరగా ,అలాగే ఆని పుస్తకం రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ గారి ద్వారా ముద్రి౦పి౦చాం .పుస్తకావిష్కరణ విజయవాడలో చేస్తే బాగుంటుందని అందరంసంప్రదించుకొని ఆ బాధ్యతకూడా చలపాక పై పెట్టగా ,ఆయన శ్రీ మాకినేని బసవ పున్నయ్య హాల్ లో ఏర్పాటు చేశారు .పుస్తక ఆవిష్కారానికి తగిన వ్యక్తి శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు ఆని అందరం నిర్ణయించి ,వారికి నేను ఫోన్ చేయగా తప్పకుండా వస్తాను అన్నారు .కార్యక్రమం ఒక ఆదివారం ఉదయం 10గం లకు ఏర్పాటు చేశాం.మల్లికగారి చెల్లెళ్ళు వారి సంతానం ,బెజవాడ సాహితీ మిత్రులు అందరూ విచ్చేశారు .త్రివిక్రమ్ గారు ‘’మా అన్నయ్య ‘’కవితా సంకలనం ఆవిష్కరించి అందులోని కవితల విశేషాలు తెలియజేశారు .ఈ కార్యక్రమం ఘనంగా జరగటానికి చలపాక కృషి ,మల్లిక గారి సహకారం మరువలేనిది .ఆతర్వాత కృష్ణలంకలో మల్లికగారి కుమార్తె శ్రీమతి దుర్గాలు ఇంట్లో అందరికి ఘనమైన విందు భోజనం .అప్పుడే కొంతఖాళీ దొరికితే, రవీంద్ర గారి ఇంటికి కూడా వెళ్ళి వచ్చాం .అదే మొదటి సారి ,చివరి సారి చూడటం .
నేను ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’పుస్తకం రాసి సరస భారతి తరఫున ముద్రించాను .ఆ పుస్తకం త్రివిక్రమ్ గారికి పంపాను .ఆయన చదివి ఫోన్ చేసి ‘’ఇలాంటి పుస్తకం నేనూ రాయాలనే అనుకొన్నాను కానీ రాయలేక పోయాను .మీరు చాలా గొప్పగా రాశారు. మీకు గుర్తున్న వారినందర్నీ బాల్యం ఆదిగా చాలా బాగా గుర్తుచేసుకొని వాళ్ళ పర్సనాలిటీలు,హావభావాలు మనసు హృదయం వారిలోని సహృదయత మనసుకు హత్తుకోనేట్లు రాశారు. ఎంత అభినందిన్చినా తక్కువే అవుతుంది మీ కృషికి ‘’అంటూ మనసారా మెచ్చుకొన్న సంస్కారం కాటూరి వారిది .
ఈ మధ్యనే మల్లికాంబ గారి ద్వారా ,వార్తాపత్రిక కథనం ద్వారా ఆయన అనారోగ్య విషయం తెలిసింది .ఇంతలో జరిగిపోయింది .
ఆరు వందల కథలు రాయటం మామూలు విషయంకాదు .నాటకం నవలిక ,నవల గీతాలు హరికథలలోకూడా తమ సామర్ధ్యం చూపారు .ఆకాశవాణి లో వందకు పైగా నాటకాలు రాసి ,కీర్తిని దిగంతాలకు వ్యాపింప జేసుకొన్నారు .దూరదర్శనం లో కూడా ప్రవేశించి ప్రగతి భారతం సీరియల్ ,గ్రీష్మం ,అమ్మలగన్న యమ్మ లతో హిట్లు కొట్టారు .వారి ‘’అంతర్నేత్రం ‘’అందరికి కనువిప్పు కలిగించే ఆధ్యాత్మిక అంజనం .స్వీయ జీవన రేఖలు అందర్నీ ఆకట్టుకొన్నాయి .అయిర్ ఫోర్స్ లో రిటైరయ్యాక పంజాబ్ నేషనల్ బాంక్ లో 20ఏళ్ళు సమర్ధంగా పని చేశారు .హైకోర్ట్ లాయర్ గా మంచి పేరు తెచ్చుకొన్నారు .అంతర్జాతీయ లయన్స్ క్లబ్ లో సేవలకు అంతర్జాతీయ పురస్కారం పొందారు .జాతీయ వినియోగదారుల ఫెడరేషన్ కు వ్యవస్థాపక అధ్యక్షులు .ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘానికి గౌరవ సలహాదారు .ఇన్ని విభిన్నమైన రంగాలలో ఒక వ్యక్తి వ్యవహరించి గుర్తింపు పొందటం అరుదైన విషయం .భారత వైమానిక దళం లో పని చేసినప్పుడు1965,1971 యుద్ధాలలో స్వయంగా పాల్గొన్నారు .అందుకే నేను ‘’ కథా’’ సాహితీ’’ ,వైమానిక దళ ‘’ సమరాంగణ ‘’ త్రివిక్రమ్ ,ఉన్నత న్యాయవాది –శ్రీ కాటూరి రవీంద్ర ఆని శీర్షిక పెట్టాను .
‘’ఒకసారి రవీంద్ర గారి కథానికల శీర్షికలను సరదాగా తడిమి చూద్దాం –అక్షరాలపందిరితో అరచేతిలో స్వర్గం చూపించి ,ఆద్య౦తాల మధ్య ప్రేమికుడు విజయ్ కు ఆపరేషన్ చేసి ,ఈ ఇల్లాలి మనసెం కావాలి ఆని ప్రశ్నించి ,ఎన్నికలో ఋణం తీర్చి ,ఎరలో పడి ఎవరితో లేచిపోవాలో తెలీక ఓం యమాయనమః ఆని ఓన్లి వన్ మర్డర్ చేసి ,గొడుగులో వానకు గ్రీన్ లైట్ చూపి ,చెట్టు నీడలో జననీ, జన్మభూమినీ చూసి, డబ్బు చెట్టుకు డప్పు కొట్టి ,తెల్లకాకికి దుప్పటికప్పి , నువ్వు నన్ను ప్రేమించకు అంటే నగ్నశిఖరాలు చూపించి ,నిలువెత్తు నిజాయితీకి నీళ్ళు వదిలి ,పుత్రికా కామేష్టి చేసి పాపం అరుణను కనీ ,బుల్లి పేషెంట్ బుల్లబ్బాయి భార్య బతుకు బండి గాడితప్పితే, వెన్నెల కోవిలలో వెన్నెలే కాటేస్తే,శవాలు వేలం వేస్తె, హాట్ హోమ్ లో స్నేహలత,హాలికులైతేనేమి మీరే మా హీరో ‘’అన్నది సుజాత ‘’.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-24-ఉయ్యూరు .

