1864ఫిబ్రవరి ,మార్చి నెలలలో కేశవ చంద్ర సేన్ మద్రాస్ పర్యటన చేసి అనేక ఉపన్యాసాలిచ్చి సంఘ సంస్కరణలపై ప్రసంగించి ప్రజలను చైతన్యవంతుల్ని చేశాడు .స్త్రీ విద్య ప్రోత్సహించట ,కులనిర్మూలన చేయటం ,సంస్కరణ ఉద్యమాలకు సంఘాలు స్థాపించటం గురించి ప్రచారం చేశాడు .ఇవి హిందూ యువకులపైనా ,విద్యార్దులపైనా గొప్ప ప్రభావం చూపాయి .’’హిందూ మతానికి వేదకాలం నాటి ఔన్నత్యాన్ని మళ్లీ కలిగించాలి ‘’అనే బ్రహ్మ సమాజ భావన విద్యావంతుల్ని బాగా కదిలించింది .సేన్ మద్రాస్ లో ఉన్న మూడు నెలల లోపలే బెంగాల్ లోని బ్రహ్మ సమాజం నమూనాలో మద్రాస్ లో ‘’మద్రాస్ వేద సమాజం ‘’ప్రారంభమైంది .ఏకగ్రీవంగా నిబంధనలు తయారు చేశారు .ఆస్తికత ,ఏకేశ్వరోపాసన,విగ్రహారాధన మానటం ,కులభేదాలను విస్మరించటం ,మత ద్వేషాన్ని విడిచిపెట్టటం ,స్త్రీ విద్య ,వితంతు వివాహ ప్రోత్సాహం ,దేశ భాషలలో పుస్తక ప్రచురణ వీరి ఆశయాలు .వేదం మీద విశ్వాసం ఉండటంతో వేద సమాజం ఆని పేరు పెట్టుకొన్నారు .ఈ సంఘానికి వి.రాజగోపలాచార్యులు ,సి సుబ్బరాయలు శెట్టి ,అధ్యక్ష ,కార్యదర్శులు .ఇద్దరూ న్యాయవాదులే .సంఘానికి తంజావూర్ సేలం కోయంబత్తూరు బెంగుళూరు లలో అనుబంధ సంస్థలేర్పడ్డాయి .సభ్యులు ఉపన్యాసాలకు ప్రార్ధన సమావేశాలకు మాత్రమె పరిమితమయ్యారు .సనాతన ఆచారాలమీద ,ఉపనిషత్కాల౦ తర్వాత వాడుకలోకి వచ్చిన సంప్రదాయాలమీద విమర్శలు చేయటంతో ఈసమాజం సంప్రదాయ వాదులకు సామాన్య ప్రజలకు దగ్గర కాలేక పోయింది .అధ్యక్ష కార్యదర్శుల మరణం తర్వాత సంస్థ కొంతకాలం నిర్వీర్యమైంది .అయితే మద్రాస్ రేసిడేన్సిలో మత, సాంఘిక సంస్కరణ లమీద ప్రజలలో జిజ్ఞాస రేకిత్తించ టానికి వేద సమాజం సఫలమైందని చెప్పచ్చు .
శ్రీ సి .వి .రంగ నాధ శాస్త్రి (1819-1881 )
వేద సమాజం స్పూర్తితో శ్రీ కలమూరు వెంకట రంగనాధ శాస్త్రి ,ఆయన మిత్రులు బాల్యవివాహాలకు వ్యతిరేకం గా ఉద్యమాలు చేశారు .శాస్త్రిగారు చిత్తూరు జిల్లాలో ఒక పండిత కుటుంబంలో జన్మించారు .పావెల్ పర్యవేక్షణలో 1842లో అత్యున్నత శ్రేణిలో ప్రోఫీషి ఎంట్’’ గా హైస్కూల్ విద్య పూర్తి చేసి ,మద్రాస్ హై కోర్ట్ లో ఉద్యోగం లో చేరి ,అనేక యూరోపియన్ భాషలు నేర్చారు 1859 మద్రాస్ స్మాల్ కాజ్ కోర్ట్ జడ్జి అయ్యారు .విద్యాభిమాని శాస్త్రి ని పాశ్చాత్య విద్యావిధానం ఆకర్షించి ప్రజలు విద్యావంతులైతే తప్ప దేశం అభి వృద్ధి చెందదని గట్టిగా నమ్మి ,స్త్రీ విద్యనూ కూడా ప్రోత్సహించాడు .తన కుమార్తెకు చదువు చెప్పించాడు ..హిందూ మత గ్రంథాలను క్షణ్ణంగా చదివి ,ఆమతం సర్వోత్క్రుష్టం ఆని గ్రహించాడు .వర్ణ భేదాలమీద విశ్వాసం పూర్తిగా తొలగిపోయింది .వేద సమాజం కలిగించిన స్పూర్తితో హిందూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సాంఘిక దురాచారాలను అధ్యయనం చేశాడు .ఈ విషయాలలో శాస్త్ర గ్రంథాలు ఏమి చెప్పాయో పరిశీలించాడు .ఈ అనుశీలనతో బాల్యవివాహ వ్యవస్థ దారుణమైనదని గ్రహించాడు .
బాల్య వివాహాలను నిరసిస్తూ దక్షిణ భారతం లో వచ్చిన మొదటి పుస్తకం ఎవరు రాశారో తెలియదు .కేశవ చంద్ర సేన్ వచ్చిన సంవత్సరమే బాల్యవివాహాలను నిరసిస్తూ తెలుగులో ఒక పుస్తకం వచ్చి౦దని తెలుస్తోంది .’’హిందూ వివాహ శాస్త్ర సంగ్రహం ‘’అనే అనువాద గ్రంథం మనుస్మ్రుతిని ఉల్లెఖిస్తో ,రజస్వలానంతర వివాహాలను ,వితంతు వివాహాలను శాస్త్రాలు అనుమతిచాయని వాటిపై నిషేధం లేదని తెలిసింది .కలియుగం లో ఆయుస్సు తక్కువ కనుక ఆడపిల్లకు 16యేండ్ల లోపల’’ పెళ్ళి చేయక పోవటం’’ వాంఛ నీయం .ఎట్టి పరిస్థితులలోనూ 12ఏళ్ల లోపు పిల్లకు పెళ్ళి చేయకూడదు ఆని ఆ రచయిత గట్టిగా వాదించి నట్లు తెలుస్తోంది .
శ్రీ స్వామినేని ముద్దు నరసింహం 1862 ప్రాంతం లో ‘’హిత వాది ‘’పత్రిక లో సాంఘిక విషయాలపై అనేక వ్యాసాలు రాశారు.’మద్రాస్ వేద సమాజ పత్రిక ,’తత్వబోధిని ‘’లో సంస్కరణ బాలికా విద్య ,,వితంతు పునర్వివాహం మొదలైన విషయాలపై వ్యాసాలూ ప్రకటింప బడ్డాయి .రంగనాథ శాస్త్రి తన మిత్రుడు చదలువాడ అనంతరామ శాస్త్రి గారిని ‘’రజస్వలానంతర వివాహాలు శాస్త్ర సమ్మతమే’’ ఆని నిరూపిస్తూ ఒక పుస్తకం రాయమని కోరాడు .ఆయన కోరిక తీరుస్తూ అనంతరామ శాస్త్రిగారు సంస్కృతం లో శ్లోకాలలో ‘’వివాహ్య కన్యాస్వరూప నిర్ణయం ‘’అనే గ్రంథం రాశారు .తర్వాత ఏమి జరిగిందో తర్వాత చూద్దాం .
సశేషం
ఆధారం –డా .కాళిదాసు పురుషోత్తం గారి’’ఇంగ్లిష్ జర్నలిజం లో తొలి వెలుగు దంపూరు నరసయ్య ‘’పుస్తకం.
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -8-1-25-ఉయ్యూరు .

