బడుగుజీవుల జీవిత కథలు రాసిన, ‘’బడి ‘’కధ ఫేం -శ్రీ అరిగే రామారావు
బుచ్చిబాబు కథా స్మారక కదంబం లో మొదటి భాగాన్ని శ్రీ అరిగే రామారావు ‘’శ్రీ అరిగే రామారావు కథలు ‘’తెచ్చాడు వేద గిరి రాం బాబు .అందులో’’ మనసులో మాట’’ చెప్పాడు రామారావు .తాన 1958ఉత్తరార్ధం లో కథా రచనకు శ్రీ కారం చుట్టానన్నాడు .అప్పటికి తనవయసు 22-23మధ్య .అప్పుడే బెజవాడ ఎస్. ఆర్. ఆర్. కాలేజీనుంచి బి .కాం .పట్టా చేతిలో పుచ్చుకొని బయట ప్రపంచం లోకి అడుగు పెట్టాడు .1959లో ఆర్ .టి .సి. ఉద్యోగం వచ్చేలోపల నూజివీడు చెరువు గట్లమీద ,తోటలు దొడ్లు గుడులు గోపురాలలో రాజాగారి పాడు బడిన దివాణాలలో,లైబ్రరీలో నిరుద్యోగి పోజులో చొక్కా గుండీలు పెట్టుకోకుండా ,కళ్ళ నిండా బోల్డు శూన్యాన్ని నింపుకొని ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ,వంటరిగా తిరిగేవాడు . చూసిన ప్రతిదృశ్యం ,కనిపించిన ప్రతి మొగం ,వినిపించిన ప్రతిమాట ,చాల బలంగా వివరంగా లోతుగా మనసులో ముద్ర పడి పోయేది.
రోజూ మునిమాపు వేళలలో వాళ్ళ వూరు శివాలయం లో నిశ్శబ్దంగా దీపాలు వేల్గించే గుడి పూజారి గార్ని చూసి ,’’ఇన్స్పైరై ‘’,మొదటి సారిగా ‘’పూజారి పున్నయ్య ‘’కథ రాశాడు .అది ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో మొదటిసారి అచ్చయింది .పొలాల్లో గడ్డి మోపులు కట్టుకు వచ్చి చీకటి పడగానే గంగానమ్మ రావి చెట్టు కింద గడ్డి మోపులు ఆమ్మె అమ్మీల నల్ల అందాలను రోజూ చూసి చూసి ‘’నచ్చి నోడు ‘’కథ రాశాడు .ఈరెండోకథ కూడా ఆంధ్రపత్రికలో అచ్చయి,రచయితగా నిలబెట్టింది .1958 బాపుగారు మంచి కథలను ఏరి సంచలీకరించిన మొదటి కథల సంపుటి లో పైన చెప్పిన మొదటి కథ చోటు చేసుకొన్నది .మల్లాది రామ కృష్ణ శాస్త్రి, రావి శాస్త్రి వంటి లబ్ధ ప్రతిష్టుల కథలతో పాటు రామారావు కథకు స్థానం పొందటం ‘’కథా చక్రవర్తుల ‘’సరసన ‘’బుల్లి పీట ‘’ వేసి కూర్చోబెట్టినట్లనిపించింది .
ఆతర్వాత తర్వాత తారసపడ్డ కుంటోళ్ళు,గుడ్డోళ్ళు,క్వారీ కూలీలు ,పట్నం లో రోడ్డు పక్కన కూర్చుని రోళ్ళు చెక్కే కష్ట జీవులు ,రోడ్లపై బొమ్మలు వేసే అనామక చిత్రకారులు ,కాట్లో శవాలు కాల్చే వెట్టోళ్ళు,సానికొంపల్లో వ్యభిచారం చేసే అభాగినులు ,,సిన్మాల్లో ‘’డూప్ ‘’వేషం వేసే వాళ్ళు ,పాచిపనులు చేసే పని పిల్లలు ,రిక్షా వాళ్లకు కిరసనాయిలు ఆమ్మే ఆడవాళ్ళూ , లారీల వాళ్లకు పాత గుడ్డ పేలికలు అమ్మే పడుచు పిల్లలు ,విజయవాడ కాలువ గట్లమీద గుడిసెల్లో తలదాచుకొనే నిర్భాగ్య లేబరు జీవులు,చరిత్రహీనులు ,ఇలా ఎంతోమంది దీనులు హీనులుచరిత్ర హీనులు తన కంట బడ్డప్పు డల్లా ,తన కంటిలో నీటి ఊటలు ఊరి నప్పుడల్లా , ,గుండెల్లో నిట్టూర్పు నెగళ్లు వెలిగేటప్పు డల్లా,వాళ్ళను పాత్రలుగా చేసి ఎన్నో కథలు అల్లాడు .ఇలా రాసినవి 150 దాకా కథలున్నాయి .కొన్నిటికి బహుమతులొచ్చాయి కొన్ని ఇతర భాషలలోకి అనువాదం చెందాయి .
‘’ బడి’’ కథ సినిమాగా తీశారు ఇందులో పాత్రధారిని ‘’బడి తాతాజీ ‘’అంటారు .స్వాతి అనుబందాలుగా నవలికలు వచ్చాయి .స్వాతిలో ‘’అర్ధనారి ‘’ సీరియల్ గా వచ్చింది .కానీ ప్రత్యెక కథా సంపుటి గా ఏదీ రాలేదు .వేదగిరి రాంబాబు ఈవిషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు .ముక్కున వేలేసుకొన్నాడు .’’తమను గురించి పట్టించుకోని ,ఇతరులు వారిని గురించి పట్టించు కోని రచయితల జాబితాలో అరిగే రామారావు వస్తారు ‘’ఆని విశ్లేషించాడు .మిత్రుడు ఆదివిష్ణు ‘’మీ ‘’షెల్’’ లో నుంచి మీరు బయటికి రావాలి నలుగురిలో కలవాలి .సెల్ఫ్ ప్రొజెక్షన్ చేసుకోవాలి ‘’ఆని హితవు పలికాడు .ఇలా ముప్ఫై ఏళ్ళు గడిచిపోగా ,ఇక గడవదా అనుకొంటున్న సమయంలో వేదగిరి కలిసి అభిమానం చూపి ,,ఆయన ప్రారంభించిన ‘’కథా యజ్ఞం ‘’లో రామారావు ను భాగస్వామిని చేశాడు .స్పాట్ చేశాడు .’’మీ లాంటి పాతతరం రచయితల కథలు కాలంతో పాటు కనుమరుగై పోకూడదు మీ పాత ఫైళ్లలలో చివికి పోకూడదు ..చీకటిని చీల్చుకొని వెలుగులోకి రావాలి ‘’ఆని గట్టిగా పట్టుబట్టి ఈ కథా సంకలనాన్ని రూపొందించాడు .పైగా సుప్రసిద్ధ కథకుడు బుచ్చిబాబు స్మారక కథా కదంబం లో ‘’మొదటి కథా గుచ్చం ‘’గా వెలువరించి,పది వేల రూపాయల నగదు కానుకగా ఇచ్చి దీనికొక పట్టం కట్టాడు ఆని మురిసిపోయాడు రామారావు .ఆలస్యమైనా అందలం ఎక్కించారు ఆని ధన్యవాదాలు చెప్పుకొన్నాడు .ఇంతకంటే ఏం కావాలి ?అంటూ ‘’రూక కొకటి చొప్పున పదివేలకృతజ్ఞతా కుసుమాంజలి ‘’సమర్పించారు ‘’కథా వేదగిరి ‘’రాంబాబుకు అరిగే రామారావు .ఈ కథలకు మామూలుగా అయితే సాహితీ సుగంధం ఉందొ లేదో తెలీదుకాని –ఆమహారచయిత బుచ్చిబాబు ‘’స్మారక కథా కదంబం ‘’గా వెలువరించటం వల్ల ,’’పువ్వులకు కట్టిన దారానికి ‘’కూడా సుగంధం అబ్బినట్లు అయిందని ,ఆయన పేరుతోపాటు తన పేరు,కథలు కూడా పరిమళిస్తాయని ఎంతో సంతృప్తి పొందాడు .
ఈ విషయాలన్నీ 29-5-1955 న వెలువడిన’’ అరిగే రామారావు మొదటి కథా సంకలనం లో ఆయన మనస్సులోని మాటగా చెప్పాడు .రామారావు ఇద్దరు అమ్మలకు ఈ సంకలనాన్ని అంకితం చేశాడు .ఒకమ్మ తన్నుకన్న తన అమ్మ మహాలక్షమ్మకు .తన కథలలో మధ్యతరగతి గృహిణుల వాడుక భాషలోని సొగసులు ,స్వగతాల సొంపులు,ఒకి౦చుక న ఏమైనా ఉన్నాయంటే ,అవన్నీ తన మనసులో పడ్డ ‘’తన అమ్మ మాటల ముద్ర’’ మాత్రమె అంటాడు అరిగే .మరో అమ్మ –తనను అన్ని విధాలా చల్లగా చూస్తోన్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మ వారికి అంకితం చేశాడు.
ఈసంకలనం లొ ఆడమనసు ,డూప్ ,దొంగలరాజ్యం ,వెంటాడే నీడ, నచ్చినోడు ,ప్రతిఫలం ,దీపం , విరిగిన వెన్నెముక ,ఆఖరిపువ్వు ,శీలం ,ఎవర్ని నమ్ముకోవాలి ,అద్దం ,కొత్తనీరు ,ఇదొక వెర్రి తల ,తెరమీద బొమ్మలు ,పాములపుట్ట ,న్యాయానికి సంకెళ్ళు ,రాళ్ళు ,మరి మీరేమంటారు ,నోరులేని వారు చెట్టునీడ ,బొమ్మ, జై దేవరా ,మాకు ప్రేమలున్నాయ్ ,వయస్సు ,రూట్ కాజ్ కథలున్నాయి .
అరిగే రామారావు 1936లో నూజివీడులో జన్మించాడు. నూజివీడు, బెజవాడల్లో విద్యాభ్యాసం సాగింది. 1959లో ఆర్టీసీ లో అకౌంట్స్ గుమాస్తాగా చేరి 1994లో జిల్లా ముఖ్య అకౌంట్స్ అధికారిగా పదవీ విరమణ చేశాడు.[1
మనవి –నిన్న రాత్రి శ్రీ యామిజాల ఆనంద్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ,అరిగే రామారావు గురించి మీకు తెలుసా ?’’ఆని అడిగితె ‘’పేరు విన్నా కానీ వివరాలు తెలీదు .’ మీరుఅడిగారు కనుక తెలుసుకొని రాస్తాను’’ఆని చెప్పాను .నెట్ లొ రెండు మూడు మాటలే ఉన్నాయి . తెలుగు వెలుగులు లేదు.మా అబ్బాయి శర్మకు ఈ విషయం చెప్పి వెతకమంటే కష్టపడి పై కథా సంకలనంనెట్ లొ పంపాడు .దాన్ని ఆధారంగా చేసుకొని ఈ వ్యాసం రాశాను .నాతో ఈ వ్యాసం రాయించిన ఆనంద్ గారికి ధన్యవాదాలు .మాశర్మకు అభినందనలు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-1-25-ఉయ్యూరు .

