ఆదర్శ రాజకీయ నాయకుడు ,నిస్వార్ధ ప్రజాసేవకుడు ,మూడు సార్లు మంత్రి పదవి అలంకరించిన -శ్రీ పరకాల శేషావతారం గారు
పరకాల శేషావతారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా పనిచేశాడు.[2][3]
రాజకీయ జీవితం
పరకాల శేషావతారం కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1962, 1972, 1978లో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 1976, 1978, 1981లో కాంగ్రెస్ ప్రభుత్వంలో జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య మంత్రివర్గంలో పనిచేశాడు.
ఆయనకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు .పరకాల ప్రభాకర్ పెద్ద కుమారుడు .ఈయనకు అక్కయ్య ,తమ్ముడు ,చెల్లెలు ఉన్నారు .తండ్రి రాజకీయాలలో బిజీ గా ఉండేవారు .తరచూ కా౦పులు మీటింగులలో క్షణం తీరిక ఉండేదికాదు .పిల్లలను ఒక్కమాట అనేవారుకాదు.ఆయన కోపం ఈ పిల్లలు ఎరగరు .చాలా ఆప్యాయత చూపేవారు .అంతటి సహనం,శాంతం తమాయి౦చుకోవటం తండ్రికి ఉండటం అసాధ్యం .తల్లే కొట్టేది, తిట్టేది, గాడి తప్పకుండా చూసేది .సంతానం పైనేకాదు అయన నియోజక వర్గం లొ ఏమనిషిని కూడా ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని పరుషంగా మాట్లాడే వారు కాదు అందరిపైనా ఒకే రకమైన ఆత్మీయత ఆదరణ, మన్నన, గౌరవం చూపేవారు .ఆయన సలహా , సహాయం, మేలు పొందని కుటుంబం ఆ చుట్టు ప్రక్కల గ్రామాలలో లేదు .అందరూ ఆయన వలన లబ్ధి పొందిన వారే .మూడు సార్లు మంత్రిపదవి లొ ఉన్నా ఎప్పుడూ అధికార దుర్వినియోగం చేయలేదు .ఒక్క రూపాయి అవినీతి చేశారని అనిపించుకొనని అచ్చ స్వచ్చమైన సేవామూర్తి శేషావతారం .కాదు ‘’సేవావతారం’’ .
ప్రాచీన సాహిత్యంతో పాటు ఆధునిక సాహిత్యం కూడా ఆయనకు మహ ఇష్టం పోతనగారి పద్యాలు ఎంత బాగా పాడేవారో శ్రీశ్రీ కవిత్వాన్నీఅందులో -‘’గతమంతా తడిసిన రక్తమే ‘’ అలాగే కోట్ చేసేవారు. ఎవరినో దేనికోసమో యాచించి మనం పబ్బం గడుపుకోవటం హేయం నీచం అనే భావన ఆయనకు ఉండేది .రచనలూ చేసేవారు .నాటకాలు రాసే వారు ప్రదర్శించేవారు 18ఏళ్లవయసులో1943లొ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో భీమ వరం దగ్గర ఎండ్రగండిలో నాటకం వేస్తుండగా శేషావతారం గారిని తోటి నటులను అరెస్ట్ చేసిజైలుకు పంపారు .ఎస్ ఎస్. ఎల్సి. లోపే చదువుకున్నా ,తెలుగు సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసేవారు .ఆయనపై అన్నగారికుమారుడు ఉద్యమశీలి ,కమ్యూనిస్ట్ భావజాలమున్న పరకాల పట్టాభిరామారావు గారి ప్రభావం ఉండేది .’కూడు గుడ్డా’’ పేరుతొ రైతులను, చేనేత వారినీ ముఖ్య పాత్రలుగా చేసినాటకం రాసి గొప్ప ప్రభావం ,ఉత్తేజం కలిగించారు .’’నవ్యాంధ్ర ‘’పేపర్ నడిపారు .దీని ప్రభావం కూడా చాలా ఎక్కువే .
శేషావతారం గారిది కులాంతర వివాహం.భార్యపేరు కాళికాంబ. తండ్రి గారిది చాలా సా౦ప్రదాయకుటుంబం .కనుక ససేమిరా .ఆమె తలిదంద్రులూ ఒప్పుకోలేదు .చివరకు ప్రేమ వివాహం అరెంజేడ్ మారేజ్ గా ఇరువైపులవారి ఒప్పుదలతో సుఖాంతమైంది.పెళ్ళి సంప్రదాయ పద్ధతిలోకాక ఆధునికంగా దండలమార్పు రిజిస్ట్రేషన్ తొ జరిగి సంచలనం సృష్టించారు .
ఆయన బంధువు కమ్యూనిస్ట్ నాయకుడు రణదివే అనుయాయులు అయిన౦దున పోలీస్ జులుం చాలాఉండేది .ఉభయ కుటుంబాల మీద పోలీసుల దాడి ఎక్కువగా ఉండేది. శేషావతారంగారు అజ్ఞాతం లోకి అంటే అండర్ గ్రౌండ్ లొ ఎక్కువగడిపారు . పోలీసులు ఇళ్లలో జొరబడి సామానంతా చిందర వందర చేసి గోడకున్న ఫోటోలు కిందపడేసి పగలగొట్టి, ‘’ఊరగాయ జాడీలలో ఉచ్చలు ‘’కూడాపోసేవారని ప్రభాకర్ జ్ఞాపకం చేసుకున్నారు.’’మా అమ్మ అప్పుడు తోమ్మిదోనెల గర్భిణి .పోలీసులు వచ్చి శేషావతారం ఎక్కడ ఆని నిలదీస్తే ఆమె నాకు తెలీదు ఆని చెబితే ,’’తెలీక పొతే నీకు ఇంతకడుపు ఎక్కడిది ?’’ఆని దుర్భాషలాడారని బాధ వేదనతో చెప్పారు ప్రభాకర్ శ్రీమతి పురాణపండ వైజయంతి గారికిచ్చిన ఇంటర్వ్యు లొ .
మూడు సార్లు మంత్రిపదవి చేసినా ఏనాడు శేషావతారం గారు తన అధికారాన్ని, కొడుకు చదువు విషయ౦ లొ కాని మరెందుకోసం కాని ఉపయోగించుకొనని ఉత్తమ సంస్కారి .హైదరాబాద్ లొ అసెంబ్లీకి శాసన సభ్యుడుగా హాజరవాలంటే ఎం. ఎల్ .ఎ. క్వార్టర్స్ నుంచి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన బస్ లోనే వెళ్ళి వచ్చేవారు . ఆకాలం లొ అందరూ అలాగే విలువలు పాటించేవారు .శేషావతారం గారి కుమారులు కుమార్తెలు నలుగురు ప్రేమ వివాహాలే చేసుకొన్నారు తల్లి తండ్రీ లాగానే . శేషావతారంగారి భార్య కాళికాంబ తన ‘’అనుభవాలు -జ్ఞాపకాలు’’ పుస్తక రూపం గా తెచ్చారు .అందులో విశేషాలు ఎక్కువగా తెలియవచ్చు.
ఆంధ్ర రాష్ట్రం లొ ప్రభావ వంతమైన పాత్ర పోషించే సమయం లొ శేషావతారం గారు56వ ఏటనే చనిపోవటం రాష్ట్రం దురదృష్టం . .పల్లె టూళ్లకు బస్ సౌకర్యం కలిగించాలనే ఆలోచన అప్పుడే చేసిన వారాయన .గ్రామ స్వరాజ్యం ,గ్రామీణాభి వృద్ధి మీద ,పంచాయితీ రాజ వ్యవస్థపై గొప్ప అభిరుచి ఆలోచన ఉన్నవారు.ప్రభుత్వం లొ గ్రామీణాభి వృద్ధిశాఖ ,పంచాయితీ రాజ్ శాఖ ,రవాణా మంత్రిగా కూడా సేవ లందించారు.రవాణా మంత్రిగా ప్రతి పల్లెటూరికి రోడ్డురవాణాశాఖ బస్ సౌకర్య౦ కలిగించి సామాన్యులకు, రైతులకు గొప్ప సౌకర్యం కలిగించారు.
శేషావతారంగారు 1925లొ జన్మించి 1981లొ 56వ ఏట మరణించారు .
మనవి -ఇవాళ మధ్యాహ్నం యు ట్యూబ్ లొ ఏదో నొక్కుతుంటే’’ ‘’వ్యూS’’చానెల్ లొ శ్రీమతి పురాణపండ వైజయంతి గారు శ్రీ పరకాల ప్రభాకర్ గారితో చేసిన ఇంటర్వ్యు కనపడితే చూశా . అందరికి ఫార్వర్డ్ చేశా .చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది.ఇది శ్రీ పరకాల శేషావతారం గారి శత జయంతి ఆని తెలిసింది .ఆయన గురించి ఆర్టికల్ రాద్దామని వీకీ పీడియా ,20 వ శతాబ్ది తెలుగు వెలుగులు వెతికా .పీడియాలో మాత్రం ఈ వ్యాసం లోని ముందు అయిదు వాక్యాలు తప్ప ఏమీ దొరకలేదు .తెలుగు వెలుగులు లొ అస్సలు సమాచారమే లేదు.ఫోటోకూడా లేదు. .అప్పుడు వైజయంతి గారి ఇంటర్వ్యు పెట్టుకొని ,కొద్దికొద్దిగా వివరాలు రాసి పూర్తి చేశా .మధ్యలో వదిలేసినవి ఉండచ్చు అది నా తప్పు .ఇందుకు వైజయంతి గారు ,ప్రభాకర్ గారు క్షమించాలి .ఇంత గొప్ప నాయకుని గురించి ప్రభుత్వం ఏమాత్రమూ శ్రద్ధ వహించక పోవటం ఎంతటి దురన్యాయం ?
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-25-ఉయ్యూరు .

