కలకత్తా ఇంగ్లిష్ ప్రొఫెసర్ ‘’స్టీఫెన్ మోషాయ్’’అనే -డా.స్టీఫెన్
ప్రముఖ గాంధేయవాది శ్రీ తల్లాప్రగడ ప్రకాశ రాయుడు గారు 1919లొ కలకత్తా యూని వర్సిటి లొ చదువుతున్నప్పుడు ఇంగ్లిష్ బోధించిన డా .స్టీఫెన్స్ గురించి తమ ఆత్మకథ ‘’నా రాట్న చక్రం ‘’లొ అద్భుతం గా వివరించారు .ఆ విషయాలు ఇక్కడ పొందు పరుస్తున్నాను .అయన ఫోటో మాత్రం లభ్యం కాలేదు .
‘’నన్ను ఎక్కువగా ఆకర్షించిన అధ్యాపక పాత్ర డా.స్టీఫెన్ ది.వయసు ఎంతోకాని ముదుసలి లా కనిపించే వారు పండ్లు ఊడిపోయి ఉన్నాయి .ఆ బోసిమాట లు సరిగా వినిపించేవికావు .నాలుగైదు చాక్ పీసులు నల్లని కోటు జేబులో వేసుకొని క్లాసుకు వచ్చే వారు. తాను పలికే ప్రతిమాటా బోర్డు మీద రాసే వారు. అది చూసి అందులో మాకు కావాల్సింది నోట్స్ లొ రాసుకొనే వాళ్ళం .పోయిట్రీ స్వభావం వివరిస్తూ ఆయన ‘’I saw a man on the strand with a hat in his hand ‘ ఆని రెండు పాదాలు బోర్డు మీద రాసి ,’’Is this poetry ?’’ఆని పగలబడి నవ్వి ,,మమ్మల్నీ నవ్వించే వారు .మేము క్లాసులో వందమంది ఉండే వాళ్ళం.మమ్మల్ని చూస్తె ఆయనబోసి నవ్వు మరీ ఎక్కువయ్యేది .తనపాఠం బోర్డు నిండా తెగరాసి ,దస్టర్ గుడ్డ తొ తుడిచి ,మళ్లీ రాసి ,సున్నంతో ఖరాబైన కుడి చేతిని నల్లని కోటి జేబు అడుగున దులిపేస్తే ,అదంతా తెల్ల బడి పోయేది .తాను ఏం చేస్తున్నాడో తనకే ఎరుక అయ్యేట్లు ఉండేదికాదు .కోటు కొస అంతా సున్నపు బూడిదతో తెల్లబడి పోయేది .ఆయనకు అదేమీ పట్టేదికాదు .అంత అమాయకుడైన ఆ ప్ర్రసిద్ధ యూని వర్సిటి ప్రధాన ఇంగ్లిష్ ప్రొఫెసర్ డా.స్టీఫెన్ .
ఎం ఏ క్లాస్ విద్యార్ధులు ఆయనను అతి గౌరవంగా ‘’ స్టీఫెన్ మోషాయ్’’అంటే స్టీఫెన్ మహాశయుడు ఆని అత్యంత గౌరవంగా చెప్పుకొనేవారు .అమాయకమైన ఆ తేజో రాశి పట్ల విద్యార్దులకున్న అపార భక్తీ వినయాలు ,ఆమహోన్నతుడి శీల సంపదకు సరిపోయిందని అరవై ఏళ్ళు పైగా గడచిపోయిన ఈ రోజు వరకు నేను ఆనందాన్ని పొందుతున్నాను .మిగతా ప్రొఫెసర్లు ఎవరూ ఇప్పుడు నాదృక్పధం లొ లేనే లేరు .స్టీఫెన్ స్కాట్లాండ్ మనిషి .ఆయన మకాం ‘’కలకత్తా గ్రాండ్ హోటల్ ‘’లొ .తన నెల జీతంలో తనకు ముఖ్య అవసరాలమట్టుకే తీసుకొని ,నెలఖర్చుక్రింద దాన్ని గ్రాండ్ హోటల్ కి ఇచ్చేసి ,మిగతా డబ్బు కలకత్తా యూని వర్సిటికే జమ కట్టే వారు .అలాంటి మహోన్నత వ్యక్తులు అరుదుగా ఉంటారు . ఒకరోజు స్టీఫెన్ మోషాయ్ మామూలుగా క్లాసుకు వచ్చి ,బోర్డు మీద రాయటం మొదలు పెట్టారు .నేను మరికొందరం ఆయన ఎదుట ముందు బెంచీలో కూర్చొనే వాళ్ళం .నా సహ మిత్రుడు గ్యాన్ నన్ను నెమ్మదిగా గోకి ‘’మిస్టర్ రాయుడూ ‘’See,see look at his shoes ‘’అన్నాడు .చూశాను .స్టీఫెన్ గారి బూట్లకు కట్టినవి బజారులో దొరికే లేసులు కావు .ఆయన నౌకరు పోగు చేసిన పాత పొగచూరినమంచం నులక తాడు .ఆ అమాయక చక్రవర్తి వాటిని చూడనైనా చూడకుండా కట్టుకొని వచ్చారన్నమాట .యూని వర్సిటి ప్రధాన ప్రొఫెసర్ నిరాడంబరత ఎలాంటి డో చెప్పటానికే ఈ దృష్టాంతం చెప్పాను .’’Take no thought of what you shall eat or drink,and wear ,’seek ye first the kingdom of God and all the rest shall be added unto you .’’ఆని ఏసు క్రీస్తు చెప్పిన మాటలే డా. స్టీఫెన్ తన జీవితం ద్వారా మాకు చూపించారు .జర్మని వేదాన్తి,కవి ,మారదర్శి గోదే జీవన సూత్ర సారం కూడా ఇదే .పాద రక్షలు కట్టటానికి లేసు లైనా ఒకటే ,నులక తాడైనా ఒక్కటే .జాన్ రస్కిన్ తన ఆర్ధిక వేదం అయిన ‘’Un to the last ‘’లొ మంగలి వృత్తికి ,లాయర్ వృత్తికి అణుమాత్రం కూడా భేదం లేదు అన్నాడు.ఆర్ధికంగా నైతికంగా రెండిటికీ ఒకే విలువ ,ఒకే మర్యాద .పేరును ప్రధానంగా చూసుకొనే మాట సాంప్ర దాయాలన్నిటినీమించిన’’ సజీవ సన్మతం’’ మా ప్రొఫెసర్ స్టీఫెన్ గారిది .ఆయన్ను క్రైస్తవుడు అందామంటే అది క్రీస్తు సూచించిచూపించిన శిలువ ధర్మ౦ .ఆయన దేశం స్కాట్లాండ్ ప్రముఖకవి రాబర్ట్ బర్న్స్ అన్నికాలాలకు సర్వ ప్రపంచానికి సర్వాధికారి యై చెప్పిన ‘’The rant is but the gunea stamp .Man is man for all that .For a thousand and for all that man is man for all that ‘’ఇదే అసలు సిసలు మానవ ధర్మం .డాక్టర్ స్టీఫెన్ జీవితమనే ప్రత్యక్ష పాఠాన్నికండ్లారా చూడటానికేనేమో నా కలకత్తా చదువు ఏర్పాటు అయిందేమో ?భగవన్మహిమ ‘’మైమరపించే వి౦త చేతలు ‘’అంటూ పారవశంతో రాశారు ప్రకాశ రాయుడు గారు .ఒక మహోన్నత వ్యక్తి గురించి మరో మహోన్నత ఆదర్శ మూర్తి చెప్పిన మాటలు ఇవి మానవాళి కి శిరోధార్యం .
అంబేద్కర్ జయంతి శుభా కాంక్షలతో
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-25 -ఉయ్యూరు .

