సూక్ష్మాకార ప్రకృతి దృశ్య చిత్రారుడు,కళాతపస్వి -శ్రీ వరాహ గిరి వెంకట భగీరధి
ఉదయారున రాగరంజిత హిమాలయ పర్వత శ్రేణులను ,సాయం సంధ్యలో కు౦గుతున్న సూర్యని, నిద్రకు ఉపక్రమిస్తున్న తూర్పు కనుమల సౌ౦దర్యం ,తుషారావృత నీలగిరి కొండల శ్రేణులను చీల్చుకొంటూ గంభీరంగా దుముకుతున్న జోగ్ జలపాతం ,డుడుమా ఎత్తిపోతల జలపాతాల సొంపు ఇంపు ,పూర్ణ గర్భిణులా ఉన్నఫలభరిత వృక్షాల సౌ౦దర్యం , మెల్లగా దూది పింజల్లా పయనించే మేఘ దృశ్యమాలిక,లను సూక్ష్మాకార దృశ్యాలుగా చిత్రించిన వారు శ్రీ వరాహ గిరి వెంకట భగీరధి.
పురాణ పురుష రుషి భగీరధుడులా ఈ చిత్ర భగీరధి ఐహికం కంటే ఆముష్మికానికి ఎక్కువ విలువనిచ్చారు .కఠోర నియమ నిష్టలు ,వదలని పట్టుదల ,కష్టాలకు ఎదురునిలిచే ధైర్యం ,ఆయన సోత్తు .పంచ భూతాలలో ఒకదానిని ఆయన శాసిస్తే ,ఈయన యావత్ ప్రకృతి సౌందర్యాన్ని తన చిత్రాలలో నిబద్ధం చేశారు .కళను ఒక యోగ సాధనగా చేసిన భగీరధివత్తుగా ఉన్న గడ్డాన్నీ ,దృఢ శరీరాన్నీ ,సౌజన్యాన్ని చూస్తె ,అపరిచితుడికయినా , ఒక ఉపాసకుడుగా కనిపిస్తారు .
21-7-1901 న అనకాపల్లి దగ్గర ప్రకృతికి ఆలవాలమైన మామిడిపాలెం లొ అతి సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో భగీరధి జన్మించారు .చిన్నతనంలోనే మేనమామల స్వస్థలం రాజమండ్రి చేరి విద్యప్రారంభించాడు .ఆంధ్ర చిత్రకళా వైతాళికుడు శ్రీ దామెర్ల రామారావు రాజమహేంద్రవరం లొ స్థిరపడి ,కళా సరస్వతికి అనర్ఘ రత్నాలు సమర్పిస్తున్న తరుణం లొ శ్రీ భగీరధిలొ నిబిడీకృతమైన కళాభినివేశాన్నిఆ మహనీయుని దర్శనంతో పెల్లుబికింది .చదువుకు స్వస్తి చెప్పి ,చిత్రకళలో ఓనమాలు దిద్దారు .తర్వాత శ్రీ బ్రహ్మానంద సరస్వతీ మహారాజ్ శుభాశీస్సులతో కొన్ని నెలలు బొంబాయి లొ చిత్రకళా శిక్షణ పొందినా ,అనారోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చారు .వివాహమై కుటుంబభారం పెరిగి జీవికకోసం జగ్గం పేటలో బడి పంతులుగా చేరి నా,కళపై తీరని తమకం వెన్నాడుతూనే ఉండి ,తరచుగా ఊరువదిలి అందమైన ప్రకృతి దృశ్యాలను చూసి పరవశిస్తూ ,తన్మయంగా చిత్రాలు గీసే వారు .తన ఉనికి బాధ్యతా మర్చిపోయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి ,కళాసాధన చేసేవారు .విరామకాలం లొ యోగుల సన్యాసుల దర్శనం చేస్తూ తత్వోపదేశాలు వింటూ మానసిక ఆనందాన్ని పొందేవారు .ఆయన జీవితం దుర్భర దారిద్ర్యంతో,అడుగడుగునా తీరని కష్టాలతో గడిచింది.నిస్పృహ చెందకుండా ,ఓర్పు నేర్పు,పట్టుదల తో భగవంతునిపై అచంచల విశ్వాసంతో కళా తపస్సు కొనసాగించారు .
దైవభక్తి ఎంతదాకా వెళ్లిందంటే ఒక్కోసారి చిత్రాలపై తన సంతకం బదులు దేవుడిపేరే రాసేవారు .కేవలం దృశ్య చిత్రాలకే అంకితమై నవారు మన దేశంలో అరుదు .ఇండియాలో స్థిరపడిన రష్యన్ నికోలస్ రోరిచ్ లాగా భగీరధి ఫక్తు చిత్ర రచనలో రోరిక్ ను మించిన చిత్రరచన చేశారని,ప్రజ్ఞ ప్రదర్శించారని నిపుణులు అంచనా వేశారు .రోరిక్ రంగులు ‘టే౦పెరా ‘’ రంగులైతే భగీరదివి ‘’ట్రాన్స్పరెంట్ నీటి చిత్రాలు ‘’ .టే౦పేరా రంగుల్లో తప్పులు దొర్లితే దిద్దుకొనే వీలుంటుంది .పూర్తి వాటర్ కలర్స్ లొ ఆ అవకాశం బొత్తిగా ఉండదు .అయినా భగీరధి నైపుణ్యాన్ని ఆంధ్రదేశం లొ ఎవరూ గుర్తించక పోవటం దురదృష్టం .దుర్భర దారిద్ర్యంలో వేలాది వెలకట్టలేని చిత్రాలను రూపాయికి , అర్ధరూపాయికి, కాఫీ కి అమ్ముకొని బతికిన దీనత్వం ఆయనది .జీవితంలో కొన్ని మెరుపులు చమక్కులు కన్పించినా ,అవి లెక్కలోకి రావు .అదొక విషాద గాధ .కన్నీటి వ్యధాకావ్యం.1950లొ అర్ధాంగి మరణించిన రెండు రోజులకే నవంబర్ 19న అపర చిత్రకార భగీరధుడు భగీరధి మరణించారు .’’1959లొ మద్రాస్ లోని దక్షిణ భారతీయ చిత్ర సమాజం ,ప్రభుత్వ మ్యూజియం కలిసి భగీరదిచిత్రాలలో అత్యుత్తమమైన 50చిత్రాలుసేకరించి ప్రదర్శించారు .అన్నీ అన్నే .మేలిమి కళా ఖండాలే .వాటిలో ‘’మంచుతెరలో గిరి దుర్గం ‘’,’’దారి ప్రక్కన ‘’చిత్రాలు అనేకుల మన్ననలు పొందాయి .ప్రకృతి దృశ్య చిత్ర రచనతో పాటు ,రూప చిత్రణలో కూడా ఘటికులు .దీనికి సాక్ష్యం భగీరధి చిత్రించిన మైసూర్ మహా రాజు చిత్రమే ‘’అన్నారు శ్రీ మామిడిపూడి కృష్ణమూర్తి .
ఆధారం -ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర రాసిన శ్రీ మాదేటి రాజాజీ వ్యాసం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-25-ఉయ్యూరు .

