చిత్రకళా ప్రతిభాశాలి, బౌద్ధ చిత్రకళా ప్రవీణుడు, ఫోటోగ్రాఫర్ -శ్రీ కాళహస్తి పార్వతీశం
భావ ఔచిత్యానికి లోటురాకుండా రంగులప్రపంచం లొ తన కుంచె విన్యాసాలను అద్భుత రీతుల్లో వందలాది రూపకల్పన చేసిన సిద్ధహస్తుడు శ్రీ కాళహస్తి పార్వతీశం రాజమండ్రిలో 21-5-1923న శ్రీతమ్మారావు పాపాయమ్మ లకు జన్మించాడు.బాల్యంలోనే శ్రీ వడ్డాది పాపయ్య గారి సహకారం తో చిత్రకళా మెలకువలన్నీశ్రీ దామెర్ల రామారావు గారి ఆర్ట్ స్కూల్ లొ ఆచార్య వరదా వెంకట రత్నం గారి శాస్త్రీయపద్ధతులలో చిత్రకళ నేర్చి రాటు తేలాడు .రాష్ట్ర ,జాతీయ స్థాయిలలో అనేక చిత్ర ప్రదర్శనలు నిర్వహించి బహుమతులెన్నో పొందాడు .
బొంబాయి ఢిల్లీ కలకత్తా మైసూర్ హైదరాబాద్ లలో జరిగిన జాతీయ చిత్రకళా ప్రదర్శనలలో పార్వతీశం చిత్రాలు ప్రదర్శింప బడ్డాయి .గౌతమ బుద్దుని జాతక కధలపై అనేక చిత్రాలు రచించాడు 1958లొ అఖిలభారత బౌద్ధ చిత్రకళా ప్రదర్శనలో కాళహస్తి పార్వతీశం చిత్రించిన ‘’బోధ ‘’చిత్రానికి ప్రధమ బహుమతి లభించింది .
ఈయన చిత్రాలలో స్త్రీ మూర్తుల చిత్రణ వర్ణ సంయోజనం స్వకీయ రచనా విధానం ఆకట్టుకొంటాయి .కూర్పు నేర్పు ఇంప్రెషనిష్టుల పోకడలో కనిపిస్తాయి .నాగార్జున ,పంటలు ,త్యాగరాజు చిత్రాలు ఉత్క్రుష్టంగా ఉంటాయి వీరి చిత్రాలు దామెర్ల ఆర్ట్ గాలరీలో ప్రదర్శిపబడుతాయి .
ఫోటోగ్రఫిలో లొ కూడా పార్వతీశానికి ప్రావీణ్యం ఉంది.అవి జాతీయస్థాయి ఫోటో ఎక్సి బిషన్లలోప్రదర్శితాలు .ఈయన ఆంధ్రప్రదేశ్ ఫోరోగ్రఫీ అసోసి ఏషన్ లొ కార్యవర్గ సభ్యులు ..కళా సాధనకే అంకితమై ప్రచార ప్రశంసలకు దూరంగా ఉంటారు .ఎత్తిన కుంచె దించకుండా అప్రతిహతం గా తూలికా విన్యాసం చేసిన ధన్యజీవి 8-6-1995న పురప్రముఖులు పెద్దలు , శ్రేయోభిలాషులు అసంఖ్యాక అభిమానులు ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనతో బాటు ఘన సన్మానం ఏర్పాటు చేయగా ,అందుకోవటానికి తన ఇంటి మెట్లు దిగుతుండగా హఠాత్తుగా మరణించారు .ఆయన అంత్యక్రియలు పూర్తి అయి ఇంటికి వచ్చిన వారికి ఆయన ధర్మపత్ని శ్రీమతి పద్మావతి గారి మరణం పరమాశ్చర్యం కలిగించింది .అన్యోన్యత ఆత్మీయత ఆదర్శాలలో వారిద్దరూ విడదీయ రాని జంట ఆని రుజువయింది .ఆయన ఫోటో,చిత్రాలు కూడా అందుబాటులో లేకపోవటం ఆశ్చర్యం .
ఆధారం -శ్రీ ఆర్ పి రాజు గారి వ్యాసం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-25- ఉయ్యూరు .

