జల వర్ణ చిత్రాల జలతారు ,కళావిశారద ,కళా ప్రపూర్ణ -శ్రీ అద్దంకి వెంకటేశ్వర రావు
దేశ విదేశాలలో ప్రఖ్యాతి గడించిన చిత్రారుడు శ్రీ అద్దంకి వెంకటేశ్వర రావు రాజమండ్రి దగ్గర కాటూరు గ్రామం లోమధ్యతరగతి కుటుంబం లో 9-11-1905 జన్మించారు .రాజమండ్రిలో చదివి 1928నుంచి చిత్ర లేఖనం లో ప్రవేశించి బొంబాయి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరి అయిదేళ్ళు ప్రత్యెక కృషి చేసి 1935లోడిగ్రీ పొందారు.
ఢిల్లీ మద్రాస్ కలకత్తా బొంబాయి హైదరాబాద్ రాజమండ్రి విశాఖ భీమవరం లలోజాతీయ చిత్ర కళా ప్రదర్శనలలో పాల్గొని ప్రశంసలు పొందారు .ఆ నాటి గవర్నర్లు శ్రే బూర్గుల రామ కృష్ణారావు శ్రీ త్రివేది శ్రీ భీం సేన్ సచార్ వంటి ప్రముఖుల మన్ననలు అందుకొన్నారు .అనేక సంస్థలు సన్మానించాయి .
శ్రీ అద్దంకి జల ,తైల వర్ణ చిత్రాలు అనేకం రచించారు .జ్ఞానసుందరి ,వసంత ఋతువు గ్రీష్మ ఋతువు ,పండిత నెహ్రు చిత్రాలు అద్భుతం .రాజమండ్రి విక్రం హాల్ లో ఆయన తైలవర్ణ చిత్రం’’విజ్ఞాన సుందరి ‘’ప్రత్యెక ఆకర్హణ గా నిలిచింది .భావం లో ఔన్నత్యం, రేఖలలో సారళ్యం ,రంగులలో రమ్యత ,వంపులలో సొంపు అభివ్యక్తం చేస్తుంది .మైమరపించి మత్తెక్కించే చిత్ర రాజం ఇది .
1962లో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి జయంతి సభలో అద్దంకి వారికి ‘’ కళా విశారద ‘’బిరుదు నిచ్చి సత్కరించారు .1967లో భారతీయ సమితి ‘’కళాప్రపూర్ణ ‘’అందజేసి ఘన సత్కారం చేసింది .1975మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో అద్దంకి వేసిన ‘’తిక్కన సోమయాజి ‘’వర్ణచిత్రం ఆమహా సభలకు వన్నె వాసి తెచ్చి పెట్టింది .
‘’చిత్రకళ జీవితం, జీవితమే చిత్ర కళ ‘’గా జీవించిన శ్రీ అద్దంకి వెంకటేశ్వరరావు 26-7-1986 న 81వ ఏట ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు .. ఆయన ఫోటోకాని చిత్రాలు కానీ దొరక్క పోవటం దురదృష్టం
ఆధారం -శ్రీ కోమలి రాం ప్రసాద్ వ్యాసం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-25-ఉయ్యూరు .

