మనం మర్చిపోయిన అలనాటి తెలుగు కవులు -1
1-తొలి లక్షణ గ్రంథం ‘’కావ్యాలంకార చూడామణి ‘’ రాసిన -విన్నకోట పెద్దన
విన్నకోట పెద్దన 15వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, ప్రథమ తెలుగు లాక్షణికుడు. ఇతడు కావ్యాలంకారమనే లక్షణగ్రంధాన్ని రచించాడు. ఇతడు కౌశిక గోత్రానికి చెందిన నియోగి బ్రాహ్మణుడు. తండ్రి గోవిందరాజు. నివాస స్థానము రాజమహేంద్రవరము. తాను రచించిన కావ్యాలంకారచూడామణి అనే అలంకార గ్రంథమును రాజమహేంద్రపురాధీశ్వరుడను ఎలమంచిలి చాళుక్య వంశానికి చెందిన విశ్వేశ్వరునికి అంకితము చేసెను. ఈ విశ్వేశ్వరుడు రాజరాజ నరేంద్రునకు ఏడవ మనుమడు అని,15వ శతాబ్దానికి చెందిన వాడని భావన.
విన్నకోట పెద్దన వ్యాకరణాంశములతోపాటు చందోలంకార రూపమగు కావ్య లక్షణాలను కూడా చేర్చి కావ్యాలంకార చూడామణిని తెలుగు పద్య రూపంలో రచించాడు. తొమ్మిది ఉల్లాసాలుగా విభజించి విన్నకోట పెద్దన రచించిన ఈ లక్షణ గ్రంథంలో మొదటి ఆరు అధ్యాయాలు కావ్య లక్షణాల గురించి, తరువాతి రెండు అధ్యాయాలు ఛందస్సు గురించి ఉంటాయి. తొమ్మిదో అధ్యాయంలో పెద్దన తెలుగు వ్యాకరణాన్ని 171 పద్యాలలో వివరిస్తాడు. “ఆంధ్రభాషయున్ బ్రాకృతాన్వయ”మని ఆంధ్రభాషకు ప్రాకృతమని మరో పేరు కలదని చెప్పుతాడు. తెలుఁగు అన్న పదం త్రిలింగ శబ్దభవమన్న ప్రతిపాదన కూడా మొదటిసారి ఈ వ్యాకరణంలోనే కనిపిస్తుంది.
తత్త్రిలింగపదము తద్భవమగుటచేఁ
దెలుఁగుదేశమనఁగఁ దేటపడియె
వెనుకఁ దెనుఁగుదేశమునునండ్రు కొందఱ
బ్బాస పంచగతులఁ బరగుచుండు
విన్నకోట పెద్దన, ప్రద్యుమ్నచరిత్ర అనే మరో గ్రంథాన్ని రచించెనని శ్రీ మానవల్లి రామకృష్ణ కవి తన కుమారసంభవము టిప్పణిలో పేర్కొనెను. పెద్దన రాజమహేంద్రవనాన్ని వర్ణించినట్లు ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది
సీసము గంభీర పంషు నాగస్త్రీల కశ్రాంత
కేళీవిహార దీర్ఘిక యనంగ
నిత్తాలసాల మన్యుల కుచ్చిదివిన్ బ్రాన్ కన్
జేసి నదీర్ఘనిశ్రేణి యనన్ గన్
జతురచాతుర్వర్ణ్య సంఘ మర్ధులపాలి
రాజితకల్పకారామ యనన్ గన్
భ్రాంత సుస్థితయైన భవజూట వాహిని
భక్తి యుక్తి ప్రదస్ఫూర్తి యనన్ గ
నెప్పుడును నొప్పు రాజమహేంద్రవరము
ధరణిన్ గల్పించె నేరాజు తనదు పేర
నట్టి రాజు మహేంద్రుని యనున్ గుమనుమన్
డెసన్ గున్ జాళుక్య విశ్వనరేశ్వరుండు.
2-మదన విలాస భాణ౦ రచించిన సంస్కృత పండితుడైన తెలుగుకవి -పశుపతి నాగనాథ కవి
పశుపతి నాగనాథ కవి తెలుగు కవి, సంస్కృత పండితుడు.
జీవిత విశేషాలు
నాగనాథ కవి శాసన ప్రమాణాల ప్రకారం ఇతను సా.శ.1369 కాలం నాటి వాడు. ఇతని తండ్రి గారు పశుపతి. అందుకే ఆయనను పశుపతి నాగనాథ కవిగా వ్యవహరిస్తారు. ఇతను అనపోతనాయకుని ఆస్థాన కవి. అనపోతనాయకుడు పద్మ నాయకులలో ఆరవ వాడు. ఇతని గురువు విశ్వేశ్వర కవి చంద్రుడు. గురువు గారు చమత్కార చంద్రిక అనే కావ్యాలంకార గ్రంథం వ్రాసాడు. ఇందులో కావ్య గుణ దోషాల గురించి విపులమైన చర్చ జరిపాడు. ఇదియే కాక విశ్వస్వర కవి చమత్కార చంద్రిక, కందర్ప సంభవం, కరుణాకందళం, వీర భద్ర విభ్రున్జనం వంటి పెక్కు రచనలు చేసాడు. అతని శిష్యుడైన నాగ నాథ కవి సంస్కృత, తెలుగు భాషాల్లో పండితుడు.
నాగనాథ కవి రచనలు
మదన విలాసం అనే భాణం వ్రాసినట్లు విష్ణు పురాణాన్ని తెనిగించినట్లు శాసన ప్రమాణాల ద్వారా తెలియవస్తున్నది గానీ ఇవి రెండూ అలభ్యాలు. మదన విలాసం గురించి నిడదవోలు వెంకట రావు గారు, చాగంటి శేషయ్య గారు పరిశోధనలు చేసారు. సా.శ. 1530-1550 మధ్యన వెన్నెలకంటి సూరన కుడా విష్ణు పురాణాన్ని తెనిగించాడు. నాగనాథ కవి ముఖ్యంగా శాసన లేఖకుడు. చారిత్రాత్మకమైన ఐనవోలు శాసనం సా.శ. 1369 నాటిది. దీని లేఖకుడు నాగనాథ కవి.
ఇతనిని కొరవి గోప రాజు పూర్వ కవిగా స్తుతించాడు. కొరవి గోప రాజు పెద తండ్రులు అనపోతనాయిని గారి కుమారుడైన సింగమనాయినమంవారి ఆస్థానంలో మంత్రులు. అందుచేత అప్పటికి పద్మ నాయిక ఆస్థానంలో ప్రముఖుడైన పశుపతి నాగ నాథ కవిని స్తుతించి ఉండవచ్చు.
3–ప్రథమాంధ్ర వచన నిర్మాత ,’’సింహగిరి వచనాలు ‘’రచించిన -శ్రీ కాంత కృష్ణమాచార్యులు
శ్రీకాంత కృష్ణమాచార్యులు లేదా కృష్ణమయ్య లేదా సింహగిరి కృష్ణమాచార్యులు 13 వ లేదా 14 వ శతాబ్దానికి చెందిన యోగి. మొదటి తెలుగు వచన వాజ్ఞయాచార్యుడిగా, ప్రథమాంధ్ర వచన నిర్మాతగా పేరొందిన వాడు. ఈయన జననకాలం, జన్మస్థలం కచ్చితంగా తెలియవు. కొంతమంది పండితులు ఈయన రచనలను సింహగిరి వచనములు అనే పేరుతో 250 దాకా పుస్తకాలు ప్రచురించారు. నిడుదవోలు వేంకటరావు, తిమ్మావజ్జల కోదండ రామయ్య భారతి పత్రికలో ప్రచురించిన వ్యాసాల ప్రకారం ఈయన కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుని (1295-1323) కాలానికి చెందినవాడిగా భావించారు.
కృష్ణమయ్య ను గురించి కొన్ని సంగతులు
సింహాచలంలో వెలసిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి పరమ భక్తుడు, అన్నమయ్యలాంటి సంకీర్తనాచార్యులకు, పోతన వంటి భాగవతోత్తములకు స్ఫూర్తినిచ్చిన వాగ్గేయకారుడు. వారికంటే ప్రాచీనుడు. కృష్ణమయ్య ఆళ్వారు శ్రేణికి చెందిన తెలుగులో మొదటి పద కవితాచార్యుడు. భగవద్ శ్రీ రామానుజాచార్యుల్ని అధ్యయనం చేసిన వైష్ణవపండితుడు.
పుట్టుక సంగతులు
కృష్ణమయ్య పూర్తి పేరు శ్రీకాంత కృష్ణమాచార్యులు సా.శ. 1295 నుండి క్రి.శ.1323 మధ్య కాలంలో ఓరుగల్లును రాజధానిగా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలానికి చెందిన వాడు. ` ప్రతాప చరిత్ర ‘సిద్దేశ్వర చరిత్ర’తిరగవేస్తే ఈయన జీవితం కనిపిస్తుంది.కృష్ణమయ్య తన `జన్మ సంకీర్తన’ లో తాను `తారణ’ నామ సంవత్సరం, భాద్రపద కృష్ణ చతుర్దశి, మంగళ వారం నాడు జ్యేష్టా నక్షత్రములో సంతూరు అనే గ్రామంలోజన్మించాననీ, తాను పుట్టుకతోనే అంధుడననీ, అందువల్ల తనజననీజనకులు తనను ఒక పాడైపోయిన నూతిలో పడవేయగా కృష్ణ కువ్వారు స్వామి అనే ఒక సాధువు తనను కాపాడి తమ ఆశ్రమానికి తీసుకుపోయి పెంచి పెద్దచేసారనీ నృసింహస్వామి అనుగ్రహంతో తనకి చూపు వచ్చిందనీ, ఆయన ఆదేశం మేరకే తాను నాల్గు లక్షలకీర్తనలతో వాక్పూజ చేసినట్టు రాసుకున్నారు .. కృష్ణమయ్య సంకీర్తనం చేస్తూ ఉంటే నరసింహస్వామి బాలుని రూపంలో వచ్చి నాట్యం చేసేవారని ప్రతీతి. కృష్ణమయ్య వయసు వచ్చాక తన మహిమలతో ప్రజలని దిగ్భ్రాంతుల్ని చేసి`పదకొండవ అవతారుని’గా కొనియాడబడినట్టు చెపుతారు.
కృష్ణమాచార్యునికి మేనమామ కూతురితో వివాహం జరిగింది. వీరి ఏకైక కుమారుడు తన ఏడవ యేటనే మరణించటంతో, ఆ ఆవేదననధిగమించే ప్రయత్నంలో తన సంకీర్తనలో మరింతగా మునిగిపోయాడు. ఇక్కడే ఈ జగత్తు మాయాజాలం ప్రదర్శిత మౌతుంది. అప్పటికి పరిపూర్ణ యవ్వనంలో నున్న ఆచార్యులవారు స్వామి ఎదుట చిరుతాళాలు మోయిస్తూ, దండెం మీటుతూ, సింహాద్రినాథుని కీర్తిస్తున్న దృశ్యం చూసి, జగన్మోహిని అనే దేవదాసి ఆయనపై మరులుగొన్నదట.ఆమె అసమాన సౌందర్యం, హావభావాల చొరవ, కపటం లేని సాహచర్య కాంక్షతో, ఆచార్యుల వారి హృదయాన్ని ఆకట్టుకున్నదా మోహనాంగి. ఇంతటి మహాభక్తునికీ వికారా లేమిటనిపించవచ్చు. ఈ జగత్తనేది ఉన్నదే, ఇది వింత మాయావి! పోనీ ఆ స్వామి అయినా ఒక అడ్డుపుల్ల వేయవచ్చు గదా! ఇలాంటి సమయాల్లో ఆయన కేవలం సాక్షీభూతుడుగా ఉంటాడుట. వేమన వంటి యోగుల విషయంలో జరిగినట్లుగానే కామిగాని వాడు మోక్షగామి కాడనేదిద కృష్ణమయ్య విషయంలోనూ నిజమే నని తేలింది.ఈ మలుపు ముక్తిపరంగా వీరిద్దరూ అనుభవించి తీర వలసిన కర్మశేషంగా భావించవచ్చు.
ఈ మహాభక్తుడు తన 16వ యేటనే సంకీర్తన సేవకు శ్రీకారం చుట్టాడు. సంకీర్తనకు అతడెంచుకున్న మార్గం వచనం. వచన భక్తి వాజ్ఞ్మయంలో ఇతడే ప్రథమా చార్యుడు.
యశస్సు
ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థానంలో వ్రాయసకారుడిగా ఉన్నప్పుడు కృష్ణమయ్య సింహాద్రి నరసింహుని స్తుతిస్తూ గానం చేస్తే కనక వర్షం కురిసిందని చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
కృష్ణమయ్య రచన, సంగీతం, నాట్యం, భక్తి గల బహుముఖ ప్రజ్ఞాశాలి,.ప్రతిభావంతుడు అన్నింటికీ మించి అభ్యుదయవాద.వచన రచన చేయడం, మాల దాసర్లతో సహపంక్తి భోజనం చేయడం, దేవదాసీ కాంతలతో సహవాసం చేస్తూ, భక్తీ గీతాలు పాడుతూ నాట్యం చేయడం, నాటి మూఢ ఆచారాలను అతిక్రమించడం, చాందస ఆచార్యులను ఎదిరించడం కులమత భేదాలను పాటించకపోవడం వంటివి ఎన్నో అభ్యుదయ భావాలు కృష్ణమయ్య రూపు రేఖలు.వారి కృతుల సారాంశం కూడా ఇదే!. పురాణ, ఇతిహాసిక గాథలు సంస్కృత భాషలో వ్రాయబడిన కావ్యాలుగా స్థిరపడిపోయాయి.సంస్కృతంలో వ్రాసిందే కావ్యంగా ప్రసిద్ధికెక్కింది.ఆ రకంగానే సంస్కృతంలో రచించిన కావ్యాలూ, దైవం కూడా సామాన్య జనానికి దూరం అయిపోతూ వచ్చాయేకాని, సన్నిహితం కాలేకపోయాయి.ఆ కావ్యాలు ప్రజలకి అందుబాటులో ఉండాలనీ, భక్తి భావం సామాన్య జనానికి అందించాలనే సత్సంకల్పంతో, సంసార ఖేదాలని రూపుమాపటానికి కంకణం కట్టుకుని కృష్ణమయ్య వేదాలనీ, ఉపనిషత్ సారాన్ని తెలుగులో తేలికైన మాటలతో వచన రచన చేసి సంగీత, నాట్య శాస్త్రాలని మిళితం చేసి సామాన్య జనానికి అర్ధం అయ్యే రీతిలో గానం చేసి ప్రదర్శించేవారు. కృష్ణమయ్య ది జానపద విలక్షణమైన పద్ధతి.పాండిత్య ప్రకర్ష తక్కువగాను, జనాకర్షణ ప్రక్రియ ఎక్కువగాను కనిపిస్తుంది.ఈయన పామర భాషలో భక్తిని అందించి, వారిలో ధర్మ ప్రవర్తనను పెంపొందించడం అసామాన్యమైనది.అయితే భాషా, భావాల్లోని వైప్లవ్యమే ఇతని పాలిటి శాపమైంది.ఇంతటి బహుముఖప్రజ్ఞాశాలిని వైష్ణవ ఛాందసులు ఒక అనాచార్యుడిగాను, భ్రష్టాచారిగాను ముద్ర వేసి వైష్ణవం నుండి వెలివేయడం అన్నది ఒక్క వీరి పాలిట శాపమే కాదు యావత్ వైష్ణవ లోకానికీ శాపమైంది.
| “ | దేవా!విష్ణుభక్తి లేని విద్వాంసుని కంటే హరికీర్తనము జేయునతడే కులజుండు .శ్వపచుండైననేమి?ఏ వర్ణంబైన నేమి? ద్విజునికంటే నతడే కులజుండు. | ” |
సాహితీ సేవ
ఈయన .వేదపండితుడు.పదాలలో ఛందస్సు శృంఖలాలను విసర్జించి, భావాలకి విశృంఖల సోయగాలను అందించిన భాషా విప్లవ వాది. కృష్ణమయ్య సింహగిరినరహరి ఆదేశంతో, అనుగ్రహంతో స్వామిని స్తుతిస్తూ `సింహగిరి వచనాలు’అనే పేరిట నాలుగు లక్షల కీర్తనలతో వాక్పూజ చేసి వాటిని రాగి రేకులపై నిక్షిప్తం చేసి సింహాచలేశునికి సమర్పించినట్టు చరిత్ర చెబుతోంది.వాటిలో చాలామట్టుకు పారిస్ లోని కింగ్స్ లైబ్రరీ కి తరలించినట్టు చారిత్రిక ఆధారాలున్నాయి.తంజావూరు సరస్వతీమహల్ లో రెండువందల దాకా కీర్తనలు లభ్యం అయ్యాయి,మిగతావి ఏ అంధకార బిలం లోనో అజ్ఞాతవాసం చేస్తున్నాయి.
| “ | దేవా!గంగోద్బవమైన మీ దివ్య శ్రీపాద యుగళమ్ము గంటి……….ఇంద్రాది దిక్పతులు మిమ్ము సేవింపగా గంటికనకపీతాంబర ప్రభావమ్ము గంటి | ” |
మకుటం
పరిపూర్ణ భక్తి పరిమళంతో, మన అంతరంగమంతా నిండి పులకింపజేస్తాయి. ఆర్తి, శరణాగతితో నిండి లయ బద్ధంగా, రాగయుక్తంగా ఉండటం వల్ల, వచన గేయాలుగా ప్రసిద్ధికెకృష్ణమాచార్యుల వచనాలుక్కాయి. ప్రతి వచనమూ ।దేవా* అనే సంబోధనతో మొదలై, ।సింహగిరి వరహరీ! నమో నమో దయానిధీ* అన్న మకుటంతో ముగుస్తుంది. వీటిలో వ్యక్తమయ్యే దృఢభావాలు।సింహగిరి నృసింహుని మించిన దైవం లేదు శ్రీ వైకుంఠం కంటే మరో ప్రయోజనం లేదు* అని.
ప్రతి వచనం ‘దేవా!’ అనే సంబోధనతో మొదలై ‘సింహగిరి నరహరి నమోనమో దయానిధీ’ అనే మకుటంతో ముగుస్తుంది. రాగభావంతో తాళానుగుణంగా తంత్రీ శ్రుతి సమన్వితంగా ఈ వచనాలు గానం చేయబడ్డాయని తెలుస్తోంది. ఈ వచనాలు శ్రీమన్నారాయణుని స్వరూప గుణ విభవాదుల్ని ప్రతిపాదించేవి కాబట్టి వేద తుల్యాలుగా భావించారు. వీటిని ‘తెలుగు వేదాలు’ అనీ అన్నారు. ‘‘వేదంబు తెనుగు గావించి సంసార/ఖేదంబుమాన్చిన కృష్ణమాచార్య’’ అనే ప్రశస్తి పొందాడు. కృష్ణమాచార్యులు వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తుడు. ఇతని ప్రభావం బమ్మెర పోతనపై వుందంటారు. తాళ్లపాక వారి కీర్తన వాజ్ఞయానికి ప్రేరణ, స్పూర్తి కృష్ణమాచార్యుల వచనాలే అంటారు. ‘‘దేవాతనువుల మాయ/తలపోసి తలపోసి చెప్పెదనంటినా కఱకఱల మోహమిది! ఆశల పాషాణంబిది/అతుకలు జల్లెడయిది…. ….నాటకములాడెడు బూటకమ్ముల బొమ్మ/అమ్మమ్మా రుూ బొమ్మ’’ అంటూ సాగే వచనాలతో దేశ్య పద్యాలకే ప్రాధాన్యం గమనిస్తాం. ‘‘రణించు-జోడించు-తుండించు’’ వంటి విశిష్ట ఇంచుక్కు రూపాలు చూస్తాం. ‘‘విదురనాటి వాదా’’, ‘‘ద్వార వాకిళ్లు’’ వంటి ప్రయోగాలు 13వ శతాబ్దంలో చెయ్యడం విశేషం. కృష్ణమాచార్య వచనాలను నామసంకీర్తనా వచనాలు, పౌరాణిక వచనాలు, కథా వచనాలు సాంప్రదాయ వచనాలు…అనేవిధంగా విభజించవచ్చు. నేటి అంత్యప్రాసలకి కృష్ణమాచార్యులే ఆద్యుడు అనిపించే విధంగా రాశాడు. తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పించిన కృష్ణమాచార్యులు మనకు ఆరాధ్యుడే!
| “ | దేవా…! పెద్దతనంబు చేసి మిము మెప్పించెదనంటినా … జాంబవంతుడు మీ సన్నిధినే యున్నాడే ..! దేవా..! బుద్ధినినే మెప్పించెదనంటినా … విభీషణుండు మీ సన్నిధినే యున్నాడే ..! దేవా..! బంటుదనంబు సేసి మిము మెప్పించెదనంటినా … యంజనాసుతుండు హనుమంతుండు మీ సన్నిధినే యున్నాడే …! దేవా..! తీర్థంబులాడి మిము మెప్పించెదనంటినా … గంగా భవాని మీ యంగుష్ఠంబు నందే ఉద్భవించి యున్నదే …! దేవా…! ప్రదక్షిణములుచేసి మిము మెప్పించెదనంటినా … సూర్యచంద్రాదులు మీ సన్నిథినే యున్నారే …! దేవా…! వేదవేద్యుండనై మిము మెప్పించెదనంటినా … బ్రహ్మ మీ నాభి కమలమం దుద్భవించి యున్నాడే ..! దేవా…! గీతప్రబన్ధములచేత మిము మెప్పించెదనంటినా … కిన్నర కింపురుష గరుడ గంధర్వ సనక సనందన సనత్కుమార పరమ భాగవతులు.., నారదాదులు మీ సన్నిథినే యున్నారే ..! దేవా…! సత్యంబులచేత మిము మెప్పించెదనంటినా … సత్యహరిశ్చంద్రుడు మీ సన్నిథినే యున్నాడే ..! దేవా…! ధనదాన్యంబులచేత మిమ్ము మెప్పించెద నంటినా … శ్రీ మహాలక్ష్మి మీ యుదరమందే యున్నదే …! దేవా…! శాంత శమదమాది గుణంబులచేత నోర్పు గలిగి యుండెద నంటినా … భూదేవి మీ సన్నిథినే యున్నదే …! దేవా…! విందులు పెట్టి మిమ్ము మెప్పించెద నంటినా … విదుర భరద్వాజ శబరి మొదలైనవారు మీ సన్నిథినే యున్నారే …! దేవా…! ఏకాదశీ వ్రతాదుల మిమ్ము మెప్పించెద నంటినా … రుక్మాంగదుండు మీ సన్నిథినే యున్నాడే …! దేవా…! భక్తివైరాగ్యంబుల జేసి మిమ్ము మెప్పించెద నంటినా … ప్రహ్లాదుడు మీ సన్నిథినే యున్నాడే …! దేవా…! వాహనరూపుండనై భరింతు నంటినా … గరుత్మంతుండు మీ సన్నిథినే యున్నాడే …! దేవా…! మీ పాద పద్మంబులు నా కన్నుల జూచుకొని మీ ద్వారంబు కాచుక యుండెద నంటినా … ద్వారపాలకులు మీ సన్నిథినే యున్నారే …! దేవా…! నేనా మిమ్ము నుతించగలవాడను …!!?? ఎనుబది నాలుగు లక్షల కోట్ల జీవజంతువులలో నేనొక నరజీవుండనే … ! దేవా…! మిమ్ము …, వేయి శిరస్సులు..,రెండువేల జిహ్వలుగల శేషాహి నుతియించి కొనియాడుకొనవలె నంతె గాక ..!!! యతిరామానుజా …! అనాథపతీ ..! స్వామీ …! సింహగిరి నరహరీ …! నమో నమో దయానిథీ …!!” | ” |
అబ్బురమనిపించే జీవిత కథనం
ఒకనాడు కృష్ణమాచార్యులు స్వామి సన్నిధిలో గానం చేస్తూండగా, స్వామి బాలకుని రూపంలో వచ్చి, వారి తొడ మీద కూర్చుని, ఆ వచనాలను తాళపత్రం మీద గంటంతో రాయసాగాడుట. అంతవరకూ ఆశువుగా, ఎప్పటికప్పుడు భావావేశంతో గానం చేస్తున్న ఆచార్యుల వారికి, ఈ సంఘటన తర్వాత, తన వచన సంకీర్తనలను అక్షర బద్ధం చేయాలన్న ఆదేశంగా తోచిందట. అప్పటినుంచీ అలాగే చేస్తూ వచ్చాడు.
కృష్ణమాచార్యుని వచనాలు నాలుగైదు లక్షల పైమాటేనని విశ్వసిస్తున్నా, ఇప్పటి వరకూ లభించినవి 60 మాత్రమే. వీరి వచనాలిలా అదృశ్యం కావటానికొక రమ్యమైన గాథ బహుళ ప్రచారంలో ఉంది. రామానుజాచార్యులవారు సింహాచలం విచ్చేసి, ఆ క్షేత్రంలో తపస్సు చేసుకుంటు న్నారు. వారిని కృష్ణమాచార్యులు అంతగా లక్ష్య పెట్టలేదు. తన భక్తి తరంగాలతో సాక్షాత్తూ నృసింహునే పరవశింప జేస్తున్నానన్న గర్వరేఖ దీనికి కారణం. ఇది తొలగించకపోతే అతడి పురోగతికి ఆటంకంగా నిలుస్తుంది. పరమాచార్యులైన రామానుజులు, తన సహజ కృపా దృష్టితో ఈ పనికి పూనుకున్నారు. వారు కృష్ణమా చార్యునితో, తాము నృసింహుని సన్నిధికి వచ్చామని, కృష్ణమాచార్యులు భగవంతునికి బహు సన్నిహితులు గనుక, తనకు ముక్తి లభిస్తుందో లేదో స్వామిని విచారించి తనకు తెలియజేయమని కోరారు.
తన స్థాయిని రామానుజులు గుర్తించినందుకు కృష్ణమా చార్యులు పరమానందంతో దీనికంగీక రించాడు. ఆ రోజు తన గాన నృత్య కలాపం ముగిసిన తర్వాత, రామానుజుల వారి ముక్తి గురించి స్వామిని విచారించారు. ఆ పరమాత్ముడాశ్చర్యం నటిస్తూ, తాను రామానుజునికి ముక్తి ప్రసాదించటమేమిటి? ఆయనే అందరికీ ముక్తిని ప్రసాదించగల మహానుభావుడన్నాడు. కృష్ణమాచార్యులకిది గట్టిగా తగిలింది. నిర్విణ్నుడైపోయాడు.
ఇంతకాలంగా ఇంతటి భక్తితో స్వామిని సేవిస్తున్న తనకు లేని ఆధిక్యత, నిన్నగాక మొన్న వచ్చి, ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న ఈ సన్యాసికి దక్కటమా? తానిన్నాళ్లూ ఎవరినైతే లక్ష్య పెట్టలేదో అతడే అందరికీ ముక్తినిచ్చేవాడని ఈ స్వామి చెప్పటమా? ఏమిటీ దేవుని న్యాయరీతి? ఒక పక్క గుండెలు రగులు తూంటే స్వామినడిగాడు॥పోనీ, నా జీవిత మంతా నీ కైంకర్యానికే వినియోగించాను కదా! మరి నాకైనా నీవు ముక్తినిస్తావా?** అని.
॥నీకైనా ముక్తిని ప్రసాదించగలవాడు రామానుజుడే** అని సమాధానం. కృష్ణమాచార్యుడిక నిగ్రహించుకోలేక పోయాడు. ఎవరినైతే తానిన్నాళ్లూ నిరాద రించాడో, తన ముక్తి కొరకు అతడి పాదాలనే ఆశ్రయించాలా? తన జీవితమంతా ఎవరి సేవ కొరకు వినియోగించాడో, ఆ సింహాచల నాథుడనవలసిన మాటేనా ఇది? క్రోధావేశం తన్నుకు వచ్చింది. తిట్లు లంకించుకున్నాడు. స్వామి కూడా మొహమాటమేమీ లేకుండా నిష్కర్షగానే ఉన్నాడు.
॥ముక్తియంతటి స్థితి నీకివ్వటానికి, నేనేమీ నీకు రుణపడిలేను. నీవు సంకీర్తనతో నన్ను పరవశింపజేస్తే, నేను నాట్యంతో నీకు పరమానందం కలిగించాను. బాకీ చెల్లి పోయింది. అయినా అకారణంగా దైవ దూషణ చేశావు గనుక, ఏ పద వాఙ్మయం చూసుకుని నీవింతగా గర్విస్తున్నావో, అది భావితరాలకు అందకుండా పోతుంది** అని శపించాడు.
ఈ అఘాతానికి ఆచార్యుల మతి స్థిమితం కూడా పోయింది. ముక్తి సంగతి అలా ఉంచితే, శాపమా తనకు దక్కేది! ప్రతీకారేచ్ఛ రగులుతూంటే, ॥నీ ఆలయం ఏడు రోజులపాటు అగ్నికి ఆహుతి అవుతుంది** అని ప్రతి శాపమిచ్చాడు. ఈ శాపాల ప్రభావమా అన్నట్లు, 18వ శతాబ్దంలో జరిగిన విదేశీ దండయాత్రల్లో ఈ క్షేత్రం విధ్వంసానికి గురికాగా, ఆచార్యుల సంకీర్తన వాఙ్మయం అంతరించి, నేడు కేవలం రెండు వందల సంకీర్తనలు మాత్రమే లభ్యమౌతున్నాయి
శ్రీకాంత కృష్ణమాచ్చర్యులవారి సాహిత్యం పై పరిశోధన చేసిన విశాఖపట్నంకి చెందిన సంగీతవేత్త, స్వరకర్త, సాంస్కృతిక విలేకరి శ్రీ వినుకొండ. మురళీమోహన్ 1983 ప్రాంతంలో ఆంధ్ర ప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రికలలో వ్యాసాలు ప్రచురించారు .ఆయన వారి వచన సంకీర్తనలని అందరూ పాడుకునేందుకు వీలుగా పల్లవి, చరణాలతో కూడిన కీర్తనలుగా పరిష్కరించి స్వరబద్ధం చేసి తొలిసారిగా 2009జులై మాసంలో శ్రీకాంత కృష్ణమాచారులవారి వర్ధంతి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో గానం చేశారు.
తదుపరి అదే రోజున శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనువంశిక ధర్మకర్త గౌరవనీయులుశ్రీ ఆనంద గజపతి గారి అధ్యక్షతన కృష్ణమయ్య ప్రాజెక్ట్ స్థాపించారు
సశేషంమీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -10-5-25-ఉయ్యూరు

