హోసూరు మాండలిక హొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్ అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’
ఆతను సాహిత్య రాక్షసుడు ,ప్రాణాలు నిలబెట్టే భిషగ్వరుడు , మా౦డలిక భాస్కరుడు ,తెలుగును బతికించాలని అనుక్షణం పరితపించే భాషా వనౌషధి, అతడే డాక్టర్ అగరం వసంత్.అందుకే అతడు సాహిత్య నిత్య వసంతుడు .కృష్ణ గిరి సాహితీ రసాయనానికి మూల ఘటిక . ఇన్ని మాటలెందుకు ?అతడు మాండలిక భాషా చిరంజీవి .భాషా సంజీవి .అతని పలుకులలో ‘’ఆ తావు పలుకుల పల్లకి ‘’ .2000 జనవరి 5నుంచి ఏడాదిన్నర కాలం లో తాను రాసిన 101 చిటిపోటి కతలను ‘’మాటల మూట ‘’గా కట్టి ఈ మార్చి నెలలో మనకు ఆ విలువైన సంపదను అందించాడు . .ఈ సంఖ్యకు ఒక ప్రాముఖ్యత ఉన్నది . ఇది అదృష్ట సంఖ్య, కోడ్ , ప్రధాన సంఖ్య. ప్రేమ, ఆధ్యాత్మికత మరియు సాంకేతికత వంటి రంగాలలో దీనికి నిర్దిష్ట అర్థాలు ఉన్నాయని సంఖ్యా శాస్త్రం అంటోంది . హోసూరు మాండలిక హొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్ అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’ఇదీ.ఆక్షర లక్షలు చేసే సాహిత్యనిధి .కేంద్ర సాహిత్య అకాడెమీ గుర్తించి గౌరవి౦చాల్సిన రచయిత వసంత్ అనిపిస్తాడు .ఈపదాల మూటకు సాహిత్య అకాడెమీ విలువైన గుర్తింపు నివ్వాలని అనిపిస్తుంది .పుస్తకం నాకు అతడు పంపి దాదాపు నెలన్నర దాటినా నిన్నా ఇవాళ మాత్రమె చదివే అవకాశం దొరికి, ప్రతి అక్షరం చదివి స్పందిస్తున్నా .శీర్షికల పేర్లు అవసరము౦టేనే ప్రస్తావిస్తూ ,లోని భావ ధారామృతాన్నిమీకు పంచుతాను .అందరం సాహితీ చిరంజీవుల మవుదాం . ఇందులోని వన్నీ డైలాగులే .ఒకప్పుడు గ్రీకు దేశం లో ప్లేటో వంటి వారు ,మనదేశంలో మహర్షులు మార్గదర్శులు, వేదోపనిషత్ పురాణ విషయాలతోపాటు చెప్పిన అనుదిన వైజ్ఞానిక మూల సూత్రాలే ,సత్య ప్రియాలే .తెలుసుకోదగిన ప్రశ్నలు ,వాటికి అనుభవం, లోకజ్ఞాన సమాధానాలతో దారి చూపిన దీపాల సమాహారమే .
కానుగ మాను చీట్లాట ,చి౦తపిక్కలాట గవ్వలాట లకు మాత్రమె కాదు ‘’సత్య శోధనకు మార్గం చూపే తావు .దేవుడూ దేయ్యమూ సత్యం కాదు .అవి సత్యసాధనకు పనికి రావు .దారి చూపమని సాములోరిని అడిగితె ‘’ఒకరు చూపిస్తే కనబడేది దోవ కాదు .మనకు మనం గా కనుక్కోనేదే దారి .భూగోళం సత్యం .ఆనిఎరుక చెబితే ఆక్షణం కానుగమాను ‘’బోధి వృక్షమైంది .అన్నం ముద్దను చేతి వేళ్ళతో పిసికి చారులో కలిపితింటే దాని మజా బాగుంటాది .’’ఇస్పూన్ల తో తి౦ టే రుచీ తెల్వద్, మజా ఉండద్’’.పసిపాపలు బుజాన కేజీల కొద్దీ బరువుగల సంచులు మోసుకు౦టూ ఇస్కూల్ కు వెడుతూ ఉంటే వాళ్ళు కూలోళ్ళు కాదు. వాళ్ళు దేశాన్ని దాటిపోయే ,దేశ దేశాలు తిరిగే కూలోళ్ళు.తనకొడుకు కూడా అలా అవాలంటే ఎంజేయాలని అడిగితె ‘’ఇస్కూలు కు పంపీయాలి ‘’ఆని అబ్బిగాని సమాధానం .పాకెట్ ఫుడ్ హాని కరమే .అయినా తప్పులో కాలేస్తున్నారు ‘’విద్యలు , బుద్దులు ఏనాడో సంకరం అయ్యాయని ఇక చేసేది లేదని చేతులెత్తేసిన సాములోరు .రోజుకు పది లీటర్లకు పైగా డైరీకి పోసే ఇల్లాలు పాలుతోడు(ఎప్పు ) కోసం పొరుగమ్మ ఇంటికి వెడితే ఆమె నువ్వు ఇంటికి రాణి అంటే ,గోడకు చెవులుంటాయి నెమ్మదిగా అనక్కా .లేకుంటే నాకాపురానికే ఎప్పు పెట్టిస్తుందిపక్కింటి గౌరీ ఆని అంటూ తోడుకు మజ్జిగ తీసుకు వెడుతుంది .ఆ కాశ మంత ఎదిగిన చెట్టు ఒకే దెబ్బకి ఒరిగి కింద పడుతుంది ఆని మిడిసి పోతున్న ఒక గర్వపోతుకు ఒక పెద్దాయన కొట్టిన సమాధానం చెంప దెబ్బ .తారలు గ్రహాలూ ,మనుషులు జంతువులూ చెట్లు పక్షులు కొండలు పర్వతాలు నదులు సంద్రాలు అన్నీ వేరే వేరే .కాని దేవుడు మాత్రం ఒకడే .ఈ అర్ధంతోనే మన పెద్దలు ‘’మన్నునీ మానునీ దేవుడు ‘’ఆని కొలిచారు .మన౦దరిపెద్దతనం గాతము (లోతు ) ప్రకృతిదే. గతాన్ని గలీజు చేయద్దు .అన్నాడు తాత .
నాగరికతలు అన్నీ గతం గతః ఎందుకు ఆని అడిగితె అది మనిషి కత ఆని ,మడిసి దశనుంచి దశకు ,దిశనుంచి దిశకు పరిణామం చెందాడు ఆని చెప్పే గుర్తులవి .ఇప్పటి కంప్యూటర్ ఎలెక్ట్రానిక్స్ ఎ.వి. కూడా పరిణామం లో భాగమే ,యాదృచ్చికమే .ఇవి జరగటానికి లెక్క .లేనన్ని సంవత్సరాలు పడుతుంది అన్నాడొక అన్న .మనం పుట్టకముందు లేకుండా పుట్టి, చచ్చాక లేకుండా పోతామా ? ఆని అడిగితె ఇక్కడే శిలేసుకొని ఉందామనా ?ఆని అడిగి ‘’కాదప్పా ముందు ,ఎనకాలనాదే అన్నట్లుందిరా నాయాలా అంటే బలేకాదు ‘’బాళే నాయాల్ని ‘’అంటే అలాఉంటేనే ‘’బాళే’’కి అంటే బతకటానికి వీలు అన్నాడు ‘’అనా (అన్న ).ఉత్త మాటలతో విశ్వాన్ని కొలుస్తారా ?ఆని అడిగిన మిడిమిడి జ్ఞానికి జ్ఞానం కలిగించే ఒక గొప్ప బుక్ ఇస్తే , ‘’మనిషిని మనిషిగా చూడని మీరా సృష్టి రహస్యం చెప్పేది ‘’ఆని విసురుగా దాన్ని చి౦చి పారేస్తే ,ఆకాకితాలు గాలికి ఎగిరి పక్కపక్కల చేరి ‘’జరాసంధుడై ‘’తిరిగొచ్చాయి ‘’
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-25-ఉయ్యూరు .–

