ప్రముఖ డోలు విద్వాంసుడు,’’ఆంధ్ర పంచాపకేసరి’’ ,’’డోలు చక్రవర్తి’ -శ్రీ ఈమని రాఘవయ్య
ప్రకాశం జిల్లా మద్దిపాడు లో ఈమని వెంకట స్వామి కనకమ్మ దంపతులకు శ్రీఈమని రాఘవయ్య 2-10-1914 జన్మించారు .ఉప్పు గుండూరు కు చెందిన పేరాల వే౦క సుబ్బయ్య ,అమృతలూరు కు చెందిన మోదుకూరి బాలకోటయ్య గార్ల వద్ద డోలు విద్య నేర్చి విద్వా౦సులయ్యారు .తంజావూరు బాణీ కోసం నీడా మంగళం ఎన్. టి.ఎం. మీనాక్షి సుందరం గారి వద్ద విద్యాభ్యాసం చేశారు .
సున్నితమైన తిరుగుళ్ళతో ,కీర్తనకు అనుకూలంగా ఈమని వారి డోలు వాద్యం సాగేది .వేగంగా డోలు వాయించటం వీరితోనే ఆంధ్ర దేశం లో ప్రారంభమైంది .చిలకలూరి పేట చిన పీరు సాహెబ్ ,కృష్ణాజిల్లా దాలిపర్తి పిచ్చిహరి ,షేక్ ఆదం సాహెబ్ ,షేక్ చిన మౌలానా వంటి ప్రసిద్ధ నాదస్వర విద్వాంసు లందరికి సహకార వాయిద్యంగా డోలు వాయించారు .’’ఆంధ్ర పంచాపకేసరి’’ ,’’డోలుచక్రవర్తి ‘’బిరుదులు పొ౦దారు .దొడ్డవరం త్యాగరాజ ఆరాధనోత్సవం లో గండ పెండేరం , ఒంగోలులో కవి పాదుషా జాషువా అధ్యక్షతన వెండి డోలు కవచం ,పోతవరం లో స్వర్ణ సింహ తలాటం అందుకొన్న మహా విద్వాంసులు రాఘవయ్య ఆంధ్ర ప్రదేశ్ .సంగీత నాటక అకాడెమీ ఘనంగా సన్మానించింది.స్వగ్రామం మద్ది పాడు లో నటరాజ కళా సమితి విశిష్టస్తాయిలో సత్కరించి బంగారు కంఠ హారం బహూకరించింది .
దక్షిణ భారత దేశం లోని అన్ని ముఖ్యమైన ఆకాశ వాణి కేంద్రాలలో తమ డోలు వాద్య వైదుష్యం ప్రకటించారు .అనేక మందికి విద్యాదానం చేసిన విద్యాదాత రాఘవయ్య గారు .వీరి ముఖ్య శిష్యులు భూసురపల్లి ఆది శేషయ్య ,పుసులూరి గురవయ్య ,నిడమానూరి లక్ష్మీ నారాయణ వంటి లబ్ధ ప్రతిష్టితులైన డోలు విద్వాంసులున్నారు .23-12-1994 న 80 సంవత్సరాల వయసులో శ్రీ ఈమని రాఘవయ్య పరమపదించారు .
వీరి ఫోటో దొరకలేదు .
ఆధారం -శ్రీ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారి వ్యాసం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-25-ఉయ్యూరు

