మా శారదక్కయ్య
ఈనెల 20 వ తేదీ మంగళ వారం ఉదయం బెజవాడ నుంచి శేఖర్ ఫోన్ చేసి ‘’మామయ్యా ! అమ్మ ఇవాళ ఉదయం నాలుగున్నరకు వెళ్ళి పోయింది ‘’అన్నాడు మా శారదక్కయ్య రెండవకొడుకు శేఖర్ .’’అవున్రా .దాదాపు ఏడాదిన్నర కాలం గా మంచానే ఉంటూ మన స్పృహలో లేకుండా గడిపిన ఆమె, అన్ని బంధాలు తెంచుకొని వెళ్లిపోయింది ఆ జీవి .ఆమె చివరి రోజుల్లో పడిన వేదన ,మీరు పొందిన ఆవేదన మాటలలో చెప్పలేనివి .ఎప్పుడూ గలగలా నవ్వుతూ ,నుదుట పెద్ద బొట్టుపెట్టుకొని ,నేత చీరలతో ఆకర్ష వంతమైన ముఖం తో అందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ ఎప్పటెప్పటి కబుర్లో చెబుతూ బంధుత్వాలను కలుపుతూ అందరికి తలలో నాలుకగా ఉండేది మా శారదక్కయ్య .చివరి సారిగా సుమారు ఏడాది క్రితం ఉయ్యూరులో వాళ్ళ మామ్మఅంటే మా బుల్లిమామ్మ ఆమెకు రాసిచ్చిన పొలం అమ్మటానికిరెండవకూతురు ఇందు అల్లుడు లతో కలిసి, వ్యవహారం అయ్యాక మా ఇంటికి వచ్చి అందరం వాకిట్లో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవటం నన్ను తమ్ముడూ అంటూ దుర్గాపతీ అంటూ ఆప్యాయంగా పిలిచే అక్కయ్య .అప్పటిదాకా సికందరాబాద్ లో పెద్దకొడుకు లక్ష్మణ్ దగ్గర ఉన్న ఆవిడ ఇప్పుడు చిన్న కొడుకు శేఖర్ దగ్గర ఉంటూ పైన చెప్పిన జబ్బు కారణంగా నిరంతర వైద్య పరిరక్షణలో ఉండాల్సి వచ్చి బెజవాడలో కూతురు ఇందు దగ్గర ఉండి తుదిశ్వాస విడిచింది .కబురు తెలిసినా ఆరోజు నుంచి మూడు రోజులు మా దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమాలు ఉండటం తో పాటు ఆమెను విగత జీవిగా చూడలేక పోవటం వలన బెజవాడ లో కడసారి దర్శనం చేసుకోలేక పోయాను .జాబ్బు పడి చికిత్సలు జరగటం మొదలైన దగ్గర్నుంచి శేఖర్ ఫోన్ చేసి చెబుతూనే ఉన్నాడు మధ్యమధ్య నేను అడిగి తెలుసుకొంటూనే ఉన్నాను .ఆమెను ఆ స్థితిలో చూడలేక పోవటం నా బలహీనత .అందుకే అప్పుడు కూడా ఒక్కసారైనా వెళ్ళలేకపోయాను .చైతన్య స్రవంతిగా ఉన్న శారదక్కయ్య ఒక అచేతన వస్తువుగా ఉండే స్థితిని భరించలేకపోయి వెళ్ళలేదు .పోయే సమయానికి ఆమెకు 93ఏళ్ళు .
ఇంతకీ ఎవరీ శారదక్కయ్య ?మా నాయనమ్మలు నలుగురు .మా మామ్మ నాగమ్మగారు .ఆమె అక్క రేపల్లెలోని రాయప్రోలు శివరామ దీక్షితులు బాబాయి తల్లిగారు .మా ఆమ్మ పెద్ద చెల్లెలు బ్రహ్మాజోశ్యుల కళ్యానమ్మ గారు చిన్నమామ్మ .ఉయ్యూరులో మా ఇంటికి దక్షిణం వైపు ఇల్లు .ఆవిడ జీవితం సుఖమయం కాదు .ఆమె కొడుకు , మనవడు అంటే కోడలు పాపాయిపిన్ని కొడుకు తీరని వ్యధ కలిగించారు .అందువల్ల ఆ ఇంటిని మా పాపాయి పిన్ని మాకు మాత్రమె అమ్ముతానని పట్టుబట్టి అమ్మితే మా మేనమామ మాచేత కొనిపించి ఒకరకంగా ఆ ఇంటిని నిలబెట్టించాడు .
మా మామ్మ చివరి చెల్లెలు భాగ్యమ్మ గారు అనే సూరి సౌభాగ్యమ్మ అనే బుల్లిమామ్మ .వాళ్లకు మా ఆంజనేయ స్వామి దేవాలయం బజారు దగ్గర స్వంత పెంకుటిల్లు పొలం ఉన్నాయి .ఆమెకు ఒక కొడుకు శ్రీరామ మూర్తి బాబాయి .ఆయనకు రాధాకృష్ణమూర్తి సరోజినీ పిల్లలు .బుల్లిమామ్మ కూడా పై మామ్మల్లాగానే నాచిన్నప్పటికే వైధవ్యం అనుభవిస్తున్నవారు .బుల్లిమామ్మ మరోకొడుకు లక్ష్మణ స్వామిబాబాయిని తెలంగాణాలో హుజూర్ నగర దగ్గర శోభనాద్రిగూడెం సంపన్నులైన వెలమకన్ని వారికి పెంపుడిచ్చింది .భార్య సత్యవతి పిన్ని .ఈ దంపతులకు శారదక్కయ్య ,శోభనాద్రి ,రాముడు సంతానం .శోభనాద్రి, రాముడు నాకు బెజవాడలో ఇంటర్ డిగ్రీ లలోసహాధ్యాయులు బుల్లిమామ్మ ఇంట్లోనే ఉండి మేముగ్గురం రాధాకృష్ణమూర్తి కలిసి చదువుకొన్నాం .ఆతర్వాత ఎవరి జీవితాలు వారివి .లక్ష్మణ స్వామి బాబాయిని పగలతో ప్రతీకారంతో శోభనాద్రి గూడెం లో హత్య చేశారు .ఆకోర్టు వ్యవహారాలూ అన్నీ మా బుల్లిమామ్మ చూసుకొంటూ ఆస్తిని అన్యాక్రాంతం కాకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ కాపాడింది. ఆతర్వాత మా సత్యవతి పిన్ని అజమాయిషీలో ఆ కుటుంబం వర్ధిల్లింది .
శారదక్కయ్యను బెజవాడలో ప్రసిద్ధ లాయర్ శ్రీ చెరుకుపల్లి పట్టాభి రామయ్య గారి పెద్దకుమారుడు అప్పటికే డిగ్రీ పాసై ,లా చదివి,స్కాట్ నవల ‘’ది టాలిస్మన్’’వంటి నవలలు అనువాదం చేసిన సాహితీ మూర్తి శ్రీ సీతా రామ చంద్రమూర్తిగారికిచ్చి వివాహం చేశారు .ఈ దంపతులకు లక్ష్మణ్ ,శేఖర్ ,ఉషా ఇందు లు సంతానం .ఇంటిపెత్తనం అంతా మా శారదక్కయ్య కే అప్ప గించారు మామగారు ఆమె సమర్ధత గుర్తించి .అక్కయ్య అతి జాగ్రత్తగా ఇంటి అజమాయిషీచేస్తూ అత్తా మామలకు తలలో నాలుక లాగా వ్యవహరించేది .మామగారికి కూడా బంధువులంటే గొప్ప అభిమానం .మేమంటే ,మానాన్న గారంటే ఇంకా ఎక్కువ అభిమానం గా ఉండేవారు .మేముకూడా ఆగౌరవాన్ని కాపాడుకోనేవాళ్ళం . శారదక్కయ్యకు మరిది శాస్త్రి ,ఆడపడుచు భారతి ఉన్నారు .శాస్త్రి మేము బెజవాడలో చదివేటప్పుడు మకాలేజీ ఎస్ ఆర్ ఆర్ కాలేజి లోనే చదివేవాడు బి.కాం. భారతికూడా .భారతి కుందనపు బొమ్మ ఆమె ణు విశాకః భర్త పొట్లపల్లి వారి అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు .ఆయన విశాఖలో లెక్కల లెక్చరర్ .వీళ్ళ అందరి పెళ్ళిళ్ళకు మాకు ఆహ్వానాలు వచ్చేవి. వెళ్ళే వాళ్ళం . పట్టాభి రామయ్య గారు రెండుపూటలా సంధ్యావందనం ,పూజ చేసేవారు .చలికాలం లో భోజనాల దగ్గర కుంపటి లో బొగ్గులు రాజుతూ ఉండేవి భార్య గారుకూడా ఎంతో ఆత్మీయంగా,బంధుప్రీతి గా ఉండేవారు .ఆయనకు బెజవాడలో సాహితీ ప్రియులందరికీ ఆరాధ్యం .చలం ,పౌరాణిక నాటక నటుడు అబ్బూరి వరప్రసాదరావు మొదలైన వారంతా ఆయన ఆతిధ్యం పొందినవారేఅని ఆయనే నాకు చెప్పారు .బెజవాడలో లీడింగ్ లాయర్ పట్టాభి రామయ్య గారు.ఇదీ శారదక్కయ్య కుటుంబం .శారదక్కయ్యకు ఒక ఆడపడుచు కూడా ఉండేది .శారదక్కయ్య తండ్రి ,రాధాకృష్ణమూర్తి తండ్రి శ్రీరామమూర్తి బాబాయిలు మా నాన్న గారి శిష్యులే .ఇంకోబాబాయి భార్యసీతమ్మ పిన్ని మాకు పెళ్ళిళ్ళు మొదలైన శుభకార్యాలకు తప్పక వచ్చేది మాకు తెలిసేటప్పటికే ఆమె విధవరాలు . నా చిన్నప్పటి నుంచి శారదక్కయ్య మా ఇంటికి ఆన్ని శుభ అశుభ కార్యాలన్నిటికీ హాజరయ్యేది .ఎంతో పనిని కబుర్లు చెబుతూ చేసేది .మా అమ్మను ‘’దొడ్డమ్మా ‘’ఆని పిలి చేది .ఆమె సహాయం మరువలేనిది .బుల్లిమామ్మ లక్ష వత్తులనోము ఉయ్యూరు లోనే మా ఇంట్లోనే చేసుకొన్నది .శారదక్కయ్య వచ్చింది అంటే ఇంకా ఎవరికోసమూ చూడక్కర లేదు .పది మంది పెట్టు మా శారదక్కయ్య .మా అమ్మ, మా శ్రీమతి ప్రభావతి ఎప్పుడూ చెబుతూ ఉంటారు ‘’మన ఇంట్లో ఏ కార్యక్రమం అయినా శారద తమాషాగా సమయానికి హాజరై అన్ని పనులు నిర్వర్తించేది .అలసట ఎరగని మనిషి ‘’ఆని గొప్పగా చెప్పేవారు .ఒక సారేప్పుడో ఉయ్యూరు వస్తే మన గుడికి తీసుకు వెళ్లి పూజ చేయించి భోజనం చేయించి చీర సారే పెట్టి పంపాము .ఆమె ఎప్పుడు వచ్చినా మా అక్కయ్య లిద్దరి లాగానే భావించి గౌరవి౦చె వారం .మా ఇంటి ఆడపడుచుగానే చూసే వాళ్ళం .చిన్న కూతురు ఇందు దంపతులు అమెరికాలో ఉంటే ఒకటి రెండు సార్లు వెళ్లి వచ్చింది శారదక్కయ్య .అక్కడి కబుర్లు ఎంతో ఉత్సాహంగా చెప్పేది. అప్పుడే ఇందుకు 117వ మూలకం కనిపెట్టిన సైంటిస్ట్ శ్రీ ఆకునూరి వెంకటరామయ్య గారు ,శ్రీమతి కృష్ణమయి గారు దంపతులతో గాఢ పరిచయం ఏర్పడి,కొనసాగుతోంది .సంపదలతో తులతూగుతున్న వెలమకన్ని వారి కుటుంబం లో ఆడపడుచుగా పుట్టి ,సంపదకు విద్యకు నిలయమైన చెరుకుపల్లి వారింటి కొడలై రెండు కుటుంబాలకు ఎనలేని కీర్తి సంపాదించి పెట్టిన మా శారదక్కయ్య మా కళ్ళముందు లేదు అనుకోవటం చాలా కష్టంగా బాధ గా ఉంది .ఉత్తమా ఇల్లాలు మా శారదక్కయ్య ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నాను .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -29-5-25-ఉయ్యూరు .


