హోసూరు మాండలిక హొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్ అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’-3(చివరిభాగం )
తనకి స్వతంత్రం వచ్చిందా లేదా అనే సందేహానికి మందు కలియ దిప్పితే తెలుస్తుంది ..వోటు విలువ ప్రధానికైనా పెదోనికైనా ఒకటే .ఇంకా వివరంగా తెలియాలంటే ఒకసారి కనీసం వార్డు మెంబర్ గా పోటీ చేయాలని హితవు .దేశం లో గలాటాలు పౌరసత్వం వల్లనే వస్తాయి .మనం భూమిమీదు వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చి వెళ్లి పోయేటప్పుడూ అలాగే వెళ్ళిపోతాం .సమాది అంటే మనిషిని పూడ్చే గుంత అన్నాడు తాత .పుట్టటం పని మాత్రమె కాదు సృష్టికార్యం కూడా .బండం అంటే వెంట్రుకలు బ్రహ్మా౦డమే .బువ్వ పెట్టు అనేది బుద్ధికాదు .బువ్వ పెట్టేట్లు చేసేదే బుద్ధి .ఆశ చచ్చిపోవాలంటే పొద్దున్న మంచు ను చెంబులో పట్టుకొని ముఖం కడుక్కోవాలి .మిట్టమధ్యాహ్నం ఎండిపోయిన చెరువులో నిల్చుని కాళ్ళు కడుక్కోవాలి .మనకి ఉనికి ఉంది. దేవునికి ఉనికి ఉందా ?ఉనికిఉంటే హాయిగా తెలుసుకోవచ్చు .జగత్తులో మనిషి మనిషిలో జగత్తుకాదు .మితిమీరిపోయే ఏ దేశమైనా గతి మీరి పోతుంది .గడ్డి ముందు పుట్టి కొలత తర్వాత పుట్టింది .
నీళ్ళలో పుట్టిన జీవి పాకుతున్నప్పుడు కండబలం వచ్చి ఎగిరింది దుముకుతూపోయి నేలమీద పడి ,నేలవాసనకు స్పందన వచ్చి ,ముందుకు నడిపించి నీటి జీవి నేల జీవి అయింది.సత్యం తెలిసి సర్దుకుపోతే సమస్యే ఉండదు .మనిషి జంతువును తిని ఆకలి తీర్చుకొని ,మనిషిలో ఆకలి చావగా మనిషి చచ్చిపోయాడు మన్ను ఆకలి తీర్చటానికేనేమో.మానవ పరిణామం ఎప్పుడూ ఆగిపోదు జరుగుతూనే ఉంటుంది .మనిషి కత అయిపోతే కొత్తకత ఆరంభమౌతుంది .’సచ్చేదాకా మనం మన పని చేస్తూ పోతు౦డాలి ‘’. ఏసు, బుద్ధుడు , మహమ్మద్ లకు మతం లేదు .వాళ్ళు మతాతీతులు . సృష్టిలో మార్పు అత్యంత సహజం .మనిషిని మనిషిగా చూడనివాడు ‘’నీయాక్సిన గాడు’’అంటే భడవాఖానా గాడు.మన్నించే గుణం అమ్మకేకాదు బిడ్డకీ ఉంది.చదివిన వాళ్ళంతా యోగ్యులు కారు .ఊరును బట్టే యోగ్యులు .గుర్తింపు వచ్చేట్లు బతికితేనే జీవితం .’’పొత్తాలు సదవటం మాని , మనుషులను చదవటం ‘’విద్య . చావుకు హామీ ఏమీ లేదు . యోచన చేయగా చేయగా శూన్యం కనిపిస్తుంది .అప్పుడు మనం లేకుండా పోతాం .భూమి మీద ఉండటం సుఖంగా భావించాలి .
జీవించటమే జీవితానికి అర్ధం .పుట్టిపెరిగే నియమం మాత్రం ఉంటుంది .ఏదీ మనదికాదు మనతో వచ్చేది ఏదీ ఉండదు .సృష్టి లో అన్నీ మారతాయి ఏదీ శాశ్వతం కాదు .’’తగులుడిగి పరతత్వ సంధానమున యోగ సాధన సేయవే మనసా .బ్రహ్మాడమంతయు బయలవు .నామాట బద్ధమని తెలియవే మనసా ‘’అన్నారు శ్రీ కైవారం తాతగారు .
ఇన్ని పసిడి పలుకులమూట మనకు అందించాడు జ్ఞాని విరాగి కవి విశ్లేషకుడు తల్లిబాసపై అమిత ప్రేమతో నిత్యం ఆ మాండలిక భాషా సరస్వతికి భక్తీ శ్రద్ధలతో పూజచేస్తున్న డాక్టర్ అగరం వసంత్ ధన్యుడు .తాను ధన్యుడై తరించి మనల్నిధన్యులను చేశారు .అతనికి అభినందన చందనం .
ఈ బంగారు పలుకులమూట ను తమిళనాడు కృష్ణనగరం పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ లో తెలుగులో ప్రమాణం చేసి,తమిళ సభలో తెలుగు దీపాన్ని వెలిగించిన తెలుగు జోదు, హోసూరు ప్రజల గుండె చప్పుడుగా ఉన్న శ్రీ కే గోపీనాథ్ అన్నకు అ౦కితమివ్వటం ఎంతో సముచితంగా ఉన్నది .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -30-5-25- ఉయ్యూరు .

