ఆనందవాణి పత్రిక సంపాదకుడు -శ్రీ ఉప్పులూరి కాళిదాసు
4-12-1915విజయ నగరం లో జన్మించారు శ్రీ ఉప్పులూరి కాళిదాసు.అక్కడే విద్య పూర్తి చేసి పాతికేళ్ళ వయసు లోపే పత్రికా రంగం లో ప్రవేశించి పత్రిక స్థాపకులయ్యారు .1932లో చదువుకొనే రోజుల్లోనే ,శ్రీ మల్లాజోశ్యుల వెంకన్నపంతులు గారి ప్రోత్సాహంతో పత్రికా విలేకరి అయ్యారు .హిందు ,బాంబే క్రానికల్ పత్రికలలో ఈయన రాసిన వార్తలు అచ్చయేవి . తెలుగు ఇంగ్లీష్ లలో వ్యాసాలూ రాసేవారు .ప్రముఖ సంపాదకుడు శ్రీ ఖాసా సుబ్బారావు ,రచయితలు శ్రీ మల్లాది రామ కృష్ణ శాస్త్రి ,న్యాయమూర్తి సర్ ముత్తా వెంకట సుబ్బారావు గార్లతో ఆంతరంగిక పరిచయం ఉండేది .రాజాజీ తో సాన్నిహిత్యం ఉండేది .
1939లో స్వాతంత్ర్యోద్యమకవి శ్రీగరిమెళ్ళ సత్యనారాయణ గారితో కలిసి ‘’ఆనందవాణి ‘’వార పత్రిక మద్రాస్ లో స్థాపించారు కాళిదాసు .2-1-1939న మొదటి సంచిక శ్రీ రాజాజీ ముఖ చిత్రంతో వెలువరించారు .ఇది యువ రచయితలకు కళాకారులకు గొప్ప ప్రోత్సాహం కల్పించింది .శ్రీపాద, మునిమాణిక్యం ,మల్లాది మొదలైన ప్రసిద్ధ రచయితలకు అది వేదిక .1945లో వారపత్రిక ను మాస పత్రిక గా మార్చారు .1960లో కార్యస్థానం మద్రాస్ నుంచి హైదరాబాద్ కు మార్చారు .
జాతీయోద్యమకాలం లో ఆనందవాణి కాంగ్రెస్ కు వెన్ను దన్నుగా ఉంటూ ఎన్నెన్నో రాజకీయ సాంఘిక విష యాలపై చర్చలు ప్రచురించేది .శ్రీశ్రీ ‘’వారం వారం ‘’శీర్షిక ,’గళ్ళనుడికట్టు ‘’ .శ్రీ రావూరు వెంకట సత్యనారాయణ ‘’కప్పు కాఫీ ‘’ శీర్షిక నిర్వహించేవారు .రాజాజీ రాసిన రామాయణ భారత భాగవతాలను వ్యాస ప్రచురణాలయం ద్వారాప్రచురించారు .సంపాదక శ్రేష్ఠులు శ్రీ ఎం .చలపతి రావు గారి ‘’ఆల్ ఇన్ ఆల్’’కు అనువాదంగా ‘’ఎందరో మహానుభావులు ‘’గ్రంథం ప్రచురించారు .
శ్రీ వేంకటేశ్వర స్వామి అనే పుస్తకం రాశారు ఉప్పులూరి .’’రాధాకృష్ణన్ రీడర్ ‘’అనే అభినందన సంచిక కూడా వెలువరించారు .ఆనంద వాణి ఉప సంపాదకులుగా శ్రీ ఆండ్ర శేషగిరిరావు ,ముద్దా విశ్వనాధం ,మహంకాళి శ్రీరామమూర్తి శ్రీనివాస శిరోమణి ,వడలి మందేశ్వర రావు, ఆరుద్ర వంటి సాహితీ జగజ్జెట్టీలు పని చేశారు .ఆ రోజుల్లో చదువుకొన్న వారెవరైనా మద్రాస్ హైదరాబాద్ లకు వెడితే వారికి తమ పత్రికలో ఉద్యోగ కల్పనతో సాయం చేసేవారు .27-10-1995న ఎనభై ఏళ్ల వయసులో ఆనందవాణి పత్రికా నిర్వాహకులు శ్రీ ఉప్పులూరి కాళిదాసు మహాకవి కాళిదాసు ను చేరారు .
ఆధారం -శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారి వ్యాసం .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-25-ఉయ్యూరు

