స్త్రీ పునర్వివాహ ప్రోత్సాహకులు ,విద్యావేత్త ,లాయర్ ,జిల్లా మున్సిఫ్ ,వేద పాఠశాల స్థాపకులు ,యజ్ఞాలలో పశు హింస మాన్పించినకృష్ణా జిల్లా వాసి -శ్రీ ఆత్మూరి లక్ష్మీ నృసింహ సోమయాజులు
కృష్ణా జిల్లా నూజివీడులో 25-8-1845న శ్రీ ఆత్మూరి కృష్ణమూర్తి శ్రీమతి రాఘవమ్మ దంపతులకు శ్రీ ఆత్మూరి లక్ష్మీ నృసింహ సోమయాజులుజన్మించారు .తండ్రి కుగ్రామం లో పనిచేయటం వలన యాజులుగారు 12వ ఏడు వరకు చదువుకోలేక పోయారు.1858లో బందరు హిందూ స్కూల్ లో చేరి .1965లో మెట్రిక్,ఉపాధ్యాయ పరీక్ష పాసై ,1866లో ఎఫ్. ఎ.బంగారు పతకం తో కృతార్దులయ్యారు .14వ ఏటనే శ్రీమతి యశోదాంబతో వివాహం జరిగింది .
1866,1869,1873లలో రెవిన్యూ శాఖవారి క్రిమినల్ ,సివిల్ పరీక్షలు పాసై ,1872,1874లలో బి .ఎ., బి .ఎల్.డిగ్రీలు పొందారు .1866-67లో బందరు చర్చి మిషన్ స్కూల్ లో ,1868-70మధ్య రాజమండ్రి ప్రొవిన్షియల్ స్కూల్ లో ఉపాధ్యాయులుగా పని చేశారు .1871-73మధ్య గంజాం జిల్లా డిప్యుటి ఇన్స్పెక్టర్ఆఫ్ స్కూల్స్ గా ఉద్యోగించారు .
తర్వాత న్యాయవాద వృత్తిలో చేరి 1873-77మధ్య బరంపురం జిల్లా కోర్టు లో ,1878లో హైకోర్ట్ లో లాయర్ గా పని చేశారు .1878-80 లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చేసి ,1879-99వరకు ఇరవై ఏళ్ళు జిల్లా మున్సిఫ్ గా పలు చోట్ల పని చేసి గొప్ప పేరు ప్రతిష్టలు పొందారు .
భారతీయ వాజ్మయాన్ని అవపోసన పట్టిన నృసింహ సోమయాజులుగారు బూజుపట్టిన సనాతన భావాల బూజు దులిపి ,వేదాలకు భగవద్గీత కు గూడార్ధాలు చెప్పటం లో నిష్ణాతులయ్యారు .మఠాధిపతుల ప్రశంసలు పొందారు.వేద ధర్మ శాస్త్ర గ్రంధాలు సేకరించి వేద పాఠశాల స్థాపించారు .యజ్ఞ యాగాలలో పశు బలిని నిరసించారు .వేదాలు శూద్రులు ,స్త్రీలు కూడా వినవచ్చునని ఘంటా పదంగా తెలియజేసి ప్రోత్సహించారు .’’వేదార్ధ ప్రకాశిక ‘’మాసపత్రిక నెలకొల్పి ,వేదాల భగవద్గీత సారాన్ని అందరికి తేలికగా అర్ధమయ్యేలా సులభ శైలిలో రాసి మహా ప్రచారం చేశారు .మూఢా చారాలను సమర్ధించే ఎంత గొప్పవారినైనా దూది ఏకినట్లు ఏకి పారేసేవారు.వేదాలలో స్త్రీల పునర్వివాహ విషయం ఉందని ఊరూ వాడా ప్రచారంచేశారు .విరూపాక్ష శంకరస్వామి దీన్ని వ్యతిరేకిస్తే, మద్రాస హైకోర్ట్ లో కేసు వేసి సాములోరికి రెండు వందల జుల్మానా వేయించిన ఘనాపాటీ లాయర్ సోమయాజులు గారు .
సముద్రాలు దాటి వెళ్ళరాదనే చాందస వాదాన్నిఖండించి అలా చేసిన వారిపై దండన విధించటం పై పోరాడి విజయంసాధించారు .బాల్య వివాహాలను ఖండించారు .మద్రాస్ లో ఉన్న ’’సర్వజాతీయ నీతి ప్రచారక సంఘం ‘’ లో సభ్యులుగా చేరి ,వివిధ రాష్ట్రాలు పర్యటించి ఉపన్యాసాలిస్తూ నీతి ధర్మాలను ప్రచారం చేశారు .13-6-1906 న 61వ ఏట ‘’అపర ఆంధ్ర వివేకానంద స్వామి ‘’లాంటి బ్రహ్మశ్రీ ఆత్మూరి లక్ష్మీ నృసింహ సోమయాజులు గారు పరమ పదించారు .
ఆధారం -శ్రే మాధవ పెద్ది గోఖలే (మా గోఖలే )వ్యాసం .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-25-ఉయ్యూరు .

