· కాలం మారుతోంది .సంస్కృత రచనలు ,పద్య రచనలు చదివి జీర్ణి౦చుకొనే శక్తి నేటి తరానికి లేదు.కానీ ఆస్తికత వారి నరనరాలలో జీర్ణించి ఉంది.వీరిని ఆకర్షించాలి అంటే వచనమే ,అందులోనూ సులభతర మైన వచనమే శరణ్యం ఆని ఆంధ్ర గీర్వాణ ఉపన్యాసకులుగా ,ఆచార్యులుగా లబ్ధ ప్రతిష్టులైన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు సులభ వచన రూపంగా ఆహ్లాదంగా ,ఆనందంగా చదువుకొని,తొందరగా అర్ధం చేసుకొనే వీలుగా శ్రీదేవీ మహాత్మ్యాన్ని రచించారు .. కేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కారం అందుకున్న గొప్ప గ్రంథ రాజం ఇది .ఆచార్యశ్రీ శేముషీ వైభవానికి, ఆంధ్ర గీర్వాణాలలో వారికున్న అపార శక్తి సామర్ధ్యాలకు ఇది అద్దం పడుతోంది .ఒకరకం గా ఇది ‘’చేతిలో ఉన్న ఆధ్యాత్మిక నవనీతం ..గుటుక్కున మింగటమే మనం చేయగలిగేది .అంత సులభంగా ‘’డౌన్ టు ఎర్త్ ‘’ గా మనకందించారు . దీనిని జన్మ నిచ్చిన తలిదండ్రులకు ,పునర్జన్మ నిచ్చిన గురు దేవులకూ అంకితమిచ్చి మాతా,పితృ, గురు ఋణం తీర్చుకొన్నారు .అప్పటికే వారికి మురారి సంస్కృత అనర్ఘ రాఘవం నాటకానికి సురుచిర వ్యాఖ్యానం తో అర్ధతాత్పర్యాలు రచించిన అనుభవం ఉండనే ఉంది.
· ఇప్పుడు దేవీ భాగవతం లోఆచార్యశ్రీ సృజనాత్మప్రత్యేకతలను దర్శిద్దాం .
· సృజనాత్మకత అంటే –
· ‘’కొత్త విలువైన ఊహలను, ఆలోచనలను,రచనలను చేసే సామర్ధ్యమే సృజనాత్మకత .లక్ష్యసాధనకు కొత్త పరిష్కా రాలు కనిపెట్టటం అన్నమాట .దీనివలన ప్రజలకు నూతన విధానాలలో సమస్యల పరిష్కారం సాధ్యమౌతుంది . పునరుజ్జీవన కాలం లో దీనికి కొత్త రూపు వచ్చింది .దీనిపై ఆసక్తి మనస్తత్వ శాస్త్ర ,మానవీయ శాస్త్రాల పై ఎక్కువగా కన్పిస్తుంది .వాస్తవికత సృజనాత్మకత తో కలిసి పని చేస్తుందని అందులో నిష్ణాతులు అన్నారు .సృజనాత్మకతను సౌందర్యాభిరుచి పరంగా కొందరు,సామాజిక ప్రభావంగా కొందరు భావించారు .
· అనువాదం లో సృజన పాత్ర ఏమిటి ?
· అనువాదం అంటే పునః కథనం .ఒక భాషలో చెప్పిన దాన్ని మరొక భాషలో చెప్పటం అనువాదం .అంటే మూలం లోని దాన్ని చెప్పదలచుకొన్న భాషలో సరిగ్గా సహజం గా చెప్పటం .దీనిపై అనేక అధ్యయనాలు జరిగాయి .
· అనువాదంలో సృజనాత్మకత ఉండాలా ?
అనువాదం అంటే ముక్కకు ముక్కానువాదం కాదు .ఒక భాష నుండి మరొక భాషకు అనువాదం చేసేటప్పుడు, అనువాదకుడు అసలు రచన యొక్క భావాన్ని, శైలిని ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, కొత్త భాషలో అదే భావాన్ని సృష్టించగలగడం. ఇది కేవలం పదాలను మార్చడం కాదు, కానీ ఒక కళాత్మక ప్రక్రియ, ఇక్కడ అనువాదకుడు తన సృజనాత్మకతను ఉపయోగించి అసలు రచన యొక్క ఆనందాన్ని, భావాలను కొత్త భాషలో కూడా సృష్టించగలడు. అంటే మన కవిత్రయ మహాభారతం లాంటిది అన్నమాట .ఇవాళ ప్రపంచమంతా సృజనాత్మక అనువాదాన్ని కోరుకొంటున్నారు.దీనినే ‘’కంటెంట్ ట్రాన్స్ క్రియేషన్ ‘’అన్నారు .ఇక్కడ ఎవరికీ చెప్పాలి ? వారికి మూలం ఏమి చెప్పాలను కొంటో౦ది అన్నవి చాలా ముఖ్యం . ఇవన్నీ ఆచార్య బేతవోలుగారికి కొట్టిన పిండి, నల్లేరుపై నడక .
·
· ‘’ఏయే జన్మలలో ఏ దేవిని అర్చి౦చానో నాకు ఈ జన్మలో రెండు ముక్కలబ్బాయి.దానితో నీ మహిమావళిని ఆకాశ గంగా సదృశ వాక్కులతో అభి వర్ణిస్తాను అనుగ్రహించ’’మని శ్రీ రాజ రాజేశ్వరీ దేవిని ప్రార్ధించారు అత్యంత వినయ భూషణులై . సాక్షాత్తు జగన్మాత ప్రధాన పాత్రవహించిన ఈ పురాణం పురాణ రాజమే అన్నారు .భుక్తి ,ముక్తి దాయకం ఆని మనకు అభయమిచ్చారు .ఇందులో ధర్మార్ధ కామ మోక్షాలనిచ్చే మనోహర కథలున్నాయని ,యోగ, తంత్ర , మంత్రాది శాస్త్రాలు నిక్షిప్తమయి ఉదాత్తత ను కలిగించాయని చేతిలో మిఠాయి పట్టుకొని బాలురను ఆకర్షించినట్లు చదువరులను ఆకట్టుకొన్నారు .ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతం లో తాంత్రిక మతానుయాయులున్నారని అందుచే దేవీ భాగవతం ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందిందని, దీనికి కారణం జగజ్జనని విజయవాటిక అయిన బెజవాడ లో శ్రీ కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై కొలువై ఉండటం కూడా గొప్ప విషయం అన్నారు .తమకున్న అనుభవం వలన కథాభాగాలు తేలికగానే అనువదించగలిగానని, తాత్విక విషయాలు కొంత ఇబ్బందిపెట్టినా, నీలకంఠుల వారి తిలక్ వ్యాఖ్యానం ,బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారి సౌభ్రాతృత్వం తో ఒడ్డుకు చేరగలిగానని కృతజ్ఞతలు ప్రకటించారు .తాంత్రిక -ఉపాసనా విషయాలలో ఏవైపుకు మొగ్గకుండా మధ్యేమార్గాన్ని అనుసరించానని చెప్పుకొన్నారు .వ్యాస భగవానుడే గుట్టుగా ఉంచిన వాటిని ,గురువే శరణ్యం అనుకొన్న చోట్లా వివరించే ప్రయత్నం చేసి పాఠకులను కీకారణ్యం లో పడవేయటం ఇష్టం లేక వివరించే ప్రయత్నం విరమించి మార్గం సుగమం చేశానన్నారు .ఇది తన తెలియని అజ్ఞానానికి నిదర్శనం ఆని నిర్భయంగా ఒప్పుకొన్నారు .తీర్ధ క్షేత్ర దైవతాల వర్ణన విషయ౦ లో వ్యాసవాణి అమృతధారలను చిలికిస్తుందని ,ఆనంద లాస్యం చేస్తుందని ,,వాటిని వచనం లో పెడితే బాణీలో మార్పు వస్తుంది కనుక ఆ బాణీ పట్టుకోవటానికి తన శక్తి ధార పోయాల్సి వచ్చిందన్నారు .ధ్వని సంపుటీకరణం వలన వ్యాసోద్దేశ ప్రయోజనాన్ని యధా తధంగా అందించే ప్రయత్నం చేశారు బేతవోలు వారు .ప్రధాన స్తోత్రాలలో మనం దీన్ని గమనించవచ్చు .తెలుగు పాఠకులకు ,దేవీ భక్తులకు ఇది పారాయణ గ్రంథం గా ఉండాలని ఆయువు పట్లు అయిన అన్ని శ్లోకాలను ఉదహరించారు .కవితా సౌరభాలను గుబాళించే శ్లోకాలను కూడా యధావిధిగా ఉదాహరించి మహోపకారం చేశారు .ఇవి అనువాదానికి అదనపు విలువలను అందించాయి .సాంకేతిక ,అప్రసిద్ధ పదాలకు బ్రాకెట్ లలో అర్ధాలు ఇవ్వటం గొప్పగా ఉంది.కొత్తపదాల పరిచయానికి ఇది రాజమార్గం అవుతుంది .సులభ తెలుగు శైలోలోనే రాసినా, ఉదాత్తత కు భంగం రాలేదు ,చిక్కదనం సడలలేదు .మూలం లోని అందాలను చెదరనివ్వలేదు, మాసిపోనివ్వలేదు .తెలుగు వచనానికి ఉన్న ఒడుపు ఒయ్యారాలను త్యాగం చేయలేదు .శైలీ రామణీయకతకోసం కారకాన్ని మార్చుకొన్నారు .అవసరమైన చోట్ల ఒకటి రెండుపదాలు అదనంగా చేర్చారు .సంస్కృత మూలం లో దేనినీ మార్చలేదు .ఉన్నదేదీ జార్చలేదు .
· ‘’యద్యచ్చరితం దేవ్యా స్తత్సర్వం లోకహేతవే -నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యధా తధా’’ అన్నట్లు అమ్మ వడిలో మాతృ వాత్సల్యం అనుభవించారు బేతవోలు గారు .
· తృతీయ స్కంధం లో ‘జనులకు హితమైనదే సత్యం .జ్ఞానులు విముక్తులు అంతర్యజ్ఞం చేయాలి .నిర్దుష్టంగా యుక్తి యుక్తంగా ,అత్యంత జాగ్రత్తగా యజ్ఞం చేస్తేనే సత్ఫలితాలు లభిస్తాయి .మునులకు, మోక్షకాములైన మహాత్ములకు విరాగులకు పూర్ణ యజ్ఞమైన మానవ యజ్ఞం చెప్పారు .దీనికి ఏ దోషాలు అంటవు . విష్ణుమూర్తి దేవీ యజ్ఞం చేసి దేవాధి దేవుడయ్యాడు .ఆని యజ్ఞ ధర్మాన్ని చాలా వివరంగా తేలికభాషలో చెప్పారు .
· మహాదేవిని యోగ విద్యా రహస్యం చెప్పమని హిమవంతుడు అడిగితే ‘’జీవాత్మ పరమాత్మల సమైక్యమే యోగం ‘’ఆని చెప్పింది సప్తమ స్కంధం లో.విశ్వమే బ్రహ్మ అనే అనుభవం కలిగినవాడు బ్రహ్మ భూతుడు ,ప్రసన్నాత్ముడు .దేనికీ వెరవడు. ఉత్తమ దేవీ క్షేత్రాలను వివరిస్తూ కామాఖ్యాయోని మండలం కంటే ఉత్తమోత్తమ దేవీ స్థానం ఎక్కడాలేదు అన్నది .ధర్మం వల్ల భక్తీ, భక్తి వల్ల పరం లభిస్తాయి . అష్టమ స్కంధ౦ లో మేరుపర్వత శిఖరం పైన ఉన్న నేరేడుచెట్టునుంచి ఏనుగు తలలంతటి జంబూ ఫలాలు రాలి పగిలి పోగా జంబూ నది ఏర్పడింది, ఆని, భవుడు ఒక్కడే దేవుడు ఆని ,ఆయన బ్రహ్మ అక్షిగోళాలనుంచి జన్మించాడని,ఆయన సంకర్ష ణుడిని సదా ధ్యానిస్తూ దేవీగణం తో ఇలావృతం లో ఉంటూ, లోకకార్యం చేస్తాడని నారద మాహర్షికి విష్ణువు బోధించాడు . రాధికారాధన,దుర్గా రాధనా ఉన్నాయి .
· దశమ స్కంధం లో అగస్త్యుని దక్షిణ యాత్ర ,స్వాయంభువు వి౦ధ్య వాసినిని ఉపాసి౦చటం ,మన్వంతరాలలో వివిధ నామాలతో దేవీ ఉపాసన ,మహిషాసురవధ,భ్రామరీ ఉపాసన ,ఏకాదశ స్కంధం లో సదాచార నియమాలు ,శౌచం ,రుద్రాక్ష భేదాలు ,భస్మ ధారణా ,,జపం ,వైశ్వ దేవం,ప్రాజాపత్యం మొదలైనవి ఉన్నాయి
· చివరి ద్వాదశ స్కంధం లో గాయత్రి మంత్రాక్షర మహిమ ,కవచం ,గాయత్రీ హృదయం ,స్తోత్రం ,అష్టోత్తర సహస్రనామాలు ,దీక్షా ప్రదానం ,స్కండిలకుండల సంస్కారాలు ,దీక్షా స్వీకారం ,ఇంద్రాదిదేవతలు దైత్యులతో యుద్ధంచేసి, నిర్జించి విజయ గర్వంతో సంబరాలు చేసుకొంటుంటే ‘’కేనోపనిషత్ ‘’లోని విధంగా వారి గర్వాన్నిఉమాదేవి అణచటం ,మహాదేవి ఆత్మావిష్కారం ,గాయత్రీ మహిమ ,దేవీ శక్తులు పరిచారికలు,అష్ట మాతృకలు ,షోడశ దళ పద్మం ,చింతామణి గృహం శ్రీమాత ,జనమేజయుని మనశ్శాంతి ,శ్రీ దేవీ భాగవత ఫలశ్రుతి చెప్పి
· ‘’సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం -నమామి హ్రీమ్మయీం దేవీం ధియో నః ప్రచోదయాత్’’అంటూ వచన శ్రీ దేవీ భాగవతాన్ని ముగించారు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు . .
· గబ్బిట దుర్గా ప్రసాద్ -27-5-25-ఉయ్యూరు .9989066375
· ఈ క్రిందిది ప్రసారం కాని నేను రాసుకొన్న స్క్రిప్ట్
· ద్వాదశ స్కంధ శ్రీదేవీ భాగవతాన్నిబేతవోలువారు సూటిగా ప్రారంభించి చరాచర జగత్తు అంతా ఆపరాశక్తి కి ఒక క్రీడా విలాసమని ,సృష్టించేవేళ సృజన ,రక్షణ పాలించే సమయంలో పాలన స్వరూప ,సంహార వేళ రౌద్రస్వరూప అనీ ,పరా పశ్యంతి మాధ్యమా రూప వాక్కు ఆ మాతస్వరూపమేనని ,త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అమోఘ వాక్ శక్తి అనుగ్రహించాలని అమ్మకు నమస్కరించి ,నరనారాయణ ,సరస్వతి ,వ్యాస మహర్షి లను స్తుతించి ఏ పురాణమైనా ప్రారంభించాలన్నారు .పరమ పావనం ,సులభంగా భుక్తి ముక్తులనిచ్చే మహా పురాణాన్ని అనుగ్రహించమని నైమిశంలో శౌనకాదులు కోరితే సూతమహర్షి ‘’లోకహితం కోరారు కనుక సకల శాస్త్రసారం పరమ పావనమైన దేవీ భాగవతం వినిపిస్తానని ,అది పాపారణ్యాలకు గండ్రగొడ్డలి ,తమస్సుకు పొద్దు పొడుపు ఆని ప్రారంభించి ,భగవాన్ వేద వ్యాస మహర్షి జననాది విషయాలు వేదవిభజన ,అష్టాదశ పురాణ రచన వివరించి , దేవీ భాగవతాన్ని అందరు అన్ని వేళలా వినవచ్చు మానవులైతే చాలు అన్నాడు .అయితేదేవీ నవరాత్రులలో నవాహయజ్ఞం గా వింటే విశేష పుణ్యం .శ్రవణ మహా యజ్ఞాన్నిస్తుంది .అందుకే దేవీ మఖం అంటే దేవీ యజ్ఞం అన్నారు .దేవీ భాగవత గ్రంథ దానం విశేష పుణ్య ఫలదం .ఆని శ్రవణ, దాన ఫలితం కూడా చెప్పాడు . అవసరమైన చోట్ల మూల శ్లోకాలను ఉదహరించి ,భావం నేరుగా వివరించారు .అందుకని కథా ప్రవాహం లో అలా అలా కొట్టుకు పోతూనే ఉంటాం .ఎక్కడా విసుగు అనిపించదు.ఇది బేతవోలు గారి ప్రత్యేకత,చాతుర్యం .
· ‘’యోగ నిద్రా మీలితాక్షం విష్ణుం దృష్ట్వా౦బుజే స్థితః -అజస్తుష్టావ యాం దేవీం తామహం శ్రవణం భజే ‘’విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు ,నాభికమలం లోని బ్రహ్మ సగుణ నిర్గుణ మాయా స్వరూపిణి ,ముక్తి దాయిని అయిన ఆపరాశక్తికి నమస్కరించి దేవీ భాగవతం చెప్పటం మొదలు పెట్టాడు . .తర్వాత వ్యాసజననం ,హయగ్రీవ ఉత్పత్తి చెప్పాడు .ఒకసారి విష్ణు వును నిద్రలేపటానికి వమ్రి, ఆయన ధనుస్సు ను కొరికితే ఆయన తల తెగి పడింది .ఎంత వెతికినా దొరకలేదు .త్రిమూర్తులు దేవతలు దిక్కు తోచక తబ్బిబ్బు అయి జగన్మాతను ‘’బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తధా-యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం స చరాచరం ‘’అంటూ స్తుతించాలని భావించగా బ్రహ్మ నాలుగుముఖాలు వేదాలు మాతృ సూక్తం ఆలపించాయి .అమ్మ ప్రత్యక్షమై వారిని ఊరడించి గుర్రం ముఖాన్ని తెచ్చి విష్ణుమూర్తి మొండానికి దేవ శిల్పి చేత అతికి౦ప జేయగా ఆయన హయగ్రీవుడై ,హయవదనరాక్షస సంహారం చేసి లోకాలను కాపాడాడు . అందుకే శ్రావణ పౌర్ణమినాడు,అంటే రాఖీ పౌర్ణమినాడు వైష్ణవ దేవాలయాలలో శ్రీ హయగ్రీవ జయంతి జరుపుతారు .
· గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-25-ఉయ్యూరు .

