మనం మర్చిపోయిన భోపాల్ లో స్థిరపడిన మన ఆంధ్ర చిత్రకారుడు,రచయిత శ్రీ వేలూరి రాధాకృష్ణ

మనం మర్చిపోయిన భోపాల్ లో స్థిరపడిన మన ఆంధ్ర చిత్రకారుడు,రచయిత శ్రీ వేలూరి రాధాకృష్ణ

కృష్ణా జిల్లా చిరివాడలో జన్మించి ,పెద్ద చదువులు చదివి ఎదిగి మధ్యప్రదేశ్ భోపాల్ లో స్థిరపడిన ఆంధ్ర చిత్రకారుడు శ్రీ వేలూరి రాధా కృష్ణగారి గురించి ఈ తరానికి అస్సలే తెలియదు .కాశీనాథుని వారి భారతి మాసపత్రికలలో ఆయన చిత్రాలు ,వ్యాసాలూ తరచుగా దర్శనమిచ్చేవి .మా అమ్మ’’ ఆయన మన చిరివాడ వాడేరా’’ ఆని చెప్పేది  ఆయన వేలూరి శివరామ శాస్త్రి గారి తమ్ముడు రామ మూర్తి గారి అబ్బాయి .మరో తమ్ముడు వేలూరి కృష్ణమూర్తి గారి కుమారుడే మా చిన్నక్కయ్య దుర్గ గారి భర్త మా బావ గారు ..అంటే మా బావగారు రాధాకృష్ణ అన్నదమ్ముల పిల్లలు అన్నమాట .సంతోషించేవాళ్ళం .అంతకన్నా ఎక్కువ తెలియదు .ఒక సారి ఎప్పుడో మా బావ అక్కయ్య శ్రీ వేలూరి వివేకానంద శ్రీమతి దుర్గ గార్లు భోపాల్ లో ఉండగా వెళ్లినట్లు ,.అప్పుడు రాధా కృష్ణ గారి౦టికి తీసుకు వెళ్ళినట్లు గుర్తు .వారి తల్లిగారు కూడా అక్కడ ఉండేవారని జ్ఞాపకం .ఆతర్వాత ఎప్పుడో ఆంధ్రా కు వస్తే హైదరాబాద్ లో మాబావ గారింట్లో చూసినట్లు లీలగా  గుర్తు . మధ్య ప్రదేశ్ చిత్రకారుల జాబితాలో ,ఆంధ్ర చిత్రకారుల జాబితాలో 20వ శతాబ్ది తెలుగు వెలుగులు లో  వెతికితే వారి పేరే కనిపించక పొతే ,మా అబ్బాయి శర్మ కు  పై వివరాలు చెబితే వెతికి ,కొన్ని వివరాలు ,ఆయన రాసిన వ్యాసాలూ ఆయన మోనోకట్ చిత్రాలు పంపాడు వాటి ఆధారంగా ఆయన జీవిత విషయాలు పొందు పరుస్తున్నాను .ఇంకా ఎవరికైనా అదనపు విషయాలు  తెలిస్తే .అందజేయమని కోరుతున్నాను  .

  శ్రీ తిరుమల రామ చంద్ర గారికి శ్రీ వేలూరి రాదా కృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యు ‘’హైదరాబాద్ నోట్ బుక్ ‘’లో వచ్చింది అందులోని విషయాలే రాస్తున్నాను .’’నిరంతర కళా సేవే నా లక్ష్యం .మా తండ్రి శ్రీ వేలూరి రామమూర్తిగారు ,పెదతండ్రి శతావధాని శ్రీ వేలూరి శివరామ శాస్త్రి గారు నాకు ఆదర్శం.వారి అడుగుజాడలలో నడచుకోవటమే నా కర్తవ్యమ్ ‘’అన్నారు  వేలూరి వారు  తిరుమల వారితో .ఇదీ ఆ వంశానికి తగిన మాట ఆని మెచ్చారు  రామచంద్ర .వేలూరి వారందరూ ఆకార సదృశ ప్రజ్ఞులు ,ప్రజ్ఞా సదృశాగములు ,ఆగమ సదృశ క్రియా శీలురు ,ప్రాతస్మరణీయులు.వేలూరి శివరామ శాస్త్రి గారిని తలచుకొన్నప్పుడు ‘’పులిగడిగినముత్తేము’’వంటి వారి రూప లావణ్య గుణ పాండిత్య ప్రజా సేవలు సాక్షాత్కరించి ,మనసు ఆనంద తు౦దిలమవుతుంది .ఆ వంశం వారంతా అలాంటి వారే .ఏదో ఒక సాధన ,ఏదో ఒక తపస్సు ,ఏదో ఒక మానవ సేవ లో పునీతులు .అలాంటి రామమూర్తి గారింటి కళాకారుల తనయుడు రాదా కృష్ణ మాటలు వేరుగా ఎలా ఉంటాయి ?అన్నారు తిరుమల ప్రజ్ఞాని .

  శ్రీ వేలూరి రాధాకృష్ణ 1930 లో కృష్ణా జిల్లా చిరివాడ అగ్రహారం లో పుట్టారు. అది సకల ఆగమ విద్యల ‘’సిరివాడ ‘’  .నెరవాడ ,పేర్వాడ .తండ్రి రామమూర్తి గారు సుప్రసిద్ధ కళా చార్యులు శ్రీ  ప్రమోద కుమార్ ముఖర్జీ శిష్యులు. తనకొడుకు కూడా అంతటి  కళాకారుడు కావాలని కోరుకున్నారు తండ్రి రామమూర్తి .తగిన శిక్షణ తండ్రిగారు పుత్రరత్నానికి ఇచ్చారు .తర్వాత మద్రాస్ వెళ్లి లలిత కళాశాలలో దేవీ ప్రసాద్ చౌదరి గారి వద్ద కళాభ్యాసం చేసి డిప్లమో పొందారు రాధా కృష్ణ .పిమ్మట శాంతినికేతన్ లో శ్రీ నందా లాల్ బోస్ వద్ద ప్రత్యెక శిక్షణ పొందారు .కొన్నేళ్ళు ఆంధ్రపత్రికలో కళా కారులుగా పని చేశారు .తర్వాత కళోపాధ్యాయ వృత్తీ చేబట్టి ,మధ్యప్రదేశ్ లోని ‘’పచ్ మర్హి’’లో ఆర్ట్ లెక్చరర్ గా కొనసాగారు .

  రాధాకృష్ణ లలితా కళా రంగం లో చేపట్టని ప్రక్రియ లేదు .చేబట్టి దిట్టతనం చూపనినిది ఏదీ లేదు.ఎన్నో నీటి వర్ణ చిత్రాలు తైల వర్ణ చిత్రాలు ,రేఖా చిత్రాలు , లినోకట్ చిత్రాలు,గ్రాక్ లను ఆయన తూలిక సుసంపన్నం చేసింది .అనంత కళా ఖండాలను సృజించినది .దానికి ప్రాచీన ఆర్వాచీన భేదం లేదు.ఇజాలజోలి లేనే లేదు .దానిది నిజమైన గతి, రీతి .తెలుగు ప్రజాజీవితం రమణీయంగా ఆయన తూలిక చిత్రించింది .తెలుగుప్రజలు వాటిని ఆదరించి స్వంతం చేసుకొన్నారు .ఆయన చిత్రాలలో పూజకోసం ,బాటసారులు ,క్షేత్రయ్య ,అప్రత్యక్ష శిష్యుడు ,నాట్య కౌశలం మొదలైనవి మన రాష్ట్ర ,దేశ ,అమెరికా ,స్విట్జర్లాండ్ ,,ఫిలిప్పీన్స్ మొదలైన ఇతర దేశాల కళా హృదయులనూ ఆకర్షించి అబ్బుర పరచాయి .అనేక చిత్రాలు మధ్యప్రదేశ్ గవర్నర్ రాజభవనాన్ని ,విదేశ ప్రముఖుల నివాసాలను అలంకరించాయి .

  వేలూరి  రాదా కృష్ణ అనేక వ్యక్తిగత ,సమష్టి కళా ప్రదర్శనలు నిర్వహించారు .విశేష ప్రశంసలు బహుమతులు అందుకొన్నారు .కవి విమర్శకుడు అవటం అరుదు .కళాకారుడు రచయిత ,కళా విమర్శకుడు కావటం కూడా అంతే.’’తన సుందర చిత్రాలలాంటి చక్కని శైలిలో రచన చేసి ,మౌలిక కళా విమర్శ చేసే ఇద్దరిలో ఒకరు వేలూరి రాధా కృష్ణ ఆని నా వ్యక్తిగత అభిప్రాయం’’ఆని కీర్తి కిరీటం పెట్టారు తిరుమల రామ చంద్ర ఆచార్యవర్యులు.తెలుగు ఇంగ్లీష్ లలో రాధాకృష్ణ కళారీతుల గురించి ముఖ్యంగా తెలుగు కళా వైదగ్ధ్యాన్ని గురించి అనేకానేక వ్యాసాలు  రాశారు .కళాకారుల జీవితాలను నిష్పక్ష పాతం గా చిత్రించారు .ఆయన రాసిన ‘’కళోదంతం ‘’  అనే గ్రంథం కళపై వచ్చిన ఉత్తమ గ్రంథం అన్నారు ఆచార్య .నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం ‘’కాశ్మీర్ ‘’పుస్తకం రాశారు .ఆంధ్రకళావైభవాన్ని లిఖిత పూర్వకంగా చాటటం ఆయన లక్ష్యం .ప్రవాసం లోఅంటే ఇతర రాష్ట్రం లో  ఉన్నా తెలుగుతనం కాపాడుకోవటం ఆయనకు చాలా ఇష్టం .ఆంధ్రప్రదేశ్ లలితా కళా అకాడెమీ ఆదరించక పోయినా ,,మధ్యప్రదేశ్ లలితకళా అకాడెమీ సభ్యత్వమిచ్చి గౌరవించి అక్కున చేర్చుకొన్నది .

  ‘’నేను 1965లో భోపాల్ రాగానే ‘’ఆదర్శ సాంస్కృతిక పరిషత్ ‘’స్థాపించాను .మధ్యప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొంది రిజిస్టర్ అయిన సంస్థ ఇది . అయినా గుర్తింపు పొందలేదని ప్రతిభావంతులైన కళాకారులు విజ్ఞానమూర్తులు బాధ పడుతున్నారు .ప్రతిభావంతులైన చిత్రకారుల ను వారి శిల్పాలు చిత్రాలను ప్రదర్శించి ఆకర్షించటం నా లక్ష్యం .ఇక్కడే ‘’అఖిలభారత కళా ప్రదర్శన ‘’నిర్వహించాను .రెండు కళాసదస్సులు జరిపాను .అరడజను మంది ప్రముఖ కళాకారులను సత్కరించి గౌరవించాను .వ్యష్టి ప్రదర్శనలు అనేకం నిర్వహించి ప్రోత్సహించాను .భారత ప్రభుత్వం ఈ సంస్థను గుర్తించింది .దీనికి కేంద్ర లలితా కళా అకాడేమికి,ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడేమికి సంబంధం ఉన్నది .   ఇటీవలే ‘’రిధం ఆర్ట్స్ సొసైటి ‘’పేరున ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్ తెరచి ,వర్ధమాన కళాకారులను తయారు చేస్తున్నాను ‘’ఆని తిరుమల రామచంద్రజీ  చేసిన ఇంటర్వ్యు లో వేలూరి రాధా కృష్ణ మనసులోని భావాలు పంచుకొన్నారు .  

  తాను మధ్యప్రదేశ్ లో ఉండిపోవటం వలన తనను ఆంధ్ర ప్రజలు మర్చిపోయి ఉంటారని బాధపడ్డారని రామచంద్ర ఉవాచ .వేలూరి రాధాకృష్ణ ఆసేతు హిమాచల పర్యంత భారతావని తనదే ఆని గర్వపడే మహా వ్యక్తి ఆని ,ఆకళాసేవ అలానే కొనసాగాలని, తెలుగు వారు గుర్తించనంత మాత్రాన ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదని ,ప్రచారానికి, పైమేరుగులకు ఆశించక కళకే అంకితమై వేలూరి రాదా కృష్ణ కళామతల్లి సేవ చేయాలని మనసారా ఆకాంక్షించారు తిరుమల రామ చంద్ర .

 కొసమెరుపుగా లోకజ్ఞులైన శ్రీ  సంపత్కుమార చక్రవర్తి ఉత్తరాలలో చివర ‘’తక్షక ‘’ఆని రాస్తారని, దాని అర్ధం ‘’తప్పులుంటే క్షమించ కలరు ‘’ఆని వివరించారు .తిరుమల వారిఈ వ్యాసం  దొరకక పొతే ప్రజ్ఞామూర్తి వేలూరి రాధా కృష్ణ గారి గురించి పూర్తిగా తెలిసేది కాదు .

‘’ శ్రీ వేలూరి రాధాకృష్ణ చిత్రలేఖన వైదుష్యం గురించి మధ్యప్రదేశ్  గవర్నర్ శ్రీ కే.వెంగళరాయరెడ్ది  హెవి ఎలెక్ట్రికల్స్ కమ్యూనిటి హాల్ లో స్థానిక ఆంధ్ర విజ్ఞాన సమితి ఏర్పాటుచేసిన రాధాకృష్ణ చిత్ర ప్రదర్శనను జనవరి 15న ప్రారంభిస్తూ (సంవత్సరం ?)రాధాకృష్ణ చిత్ర కళారీతులను,ప్రాభవాన్ని  ప్రశంసిస్తూ తమ రాజభవన్ అల౦కరణకోసం మూడు త్రివర్ణ చిత్రాలు కొన్నారు .రాధాకృష్ణ జాతీయ రక్షణ నిధికి అందించిన రెండు చిత్రాలను వేలం వేయగా వచ్చిన 20  వేల రూపాయలను రక్షణ నిధికి సమర్పించారు .ఈ సందర్భంగా రాధా కృష్ణ ఆంధ్ర విజ్ఞాన సమితికి ఒక వర్ణ చిత్రం బహూకరించారు ‘’ఆని స్థానిక భోపాల్ పత్రిక జనవరి 15నప్రచురించింది .సంవత్సరం తెలియదు .

  శ్రీ వేలూరి రాధా కృష్ణ మరణం  సంగతి కూడా మనకు తెలీదు.ఇంకో 5ఏళ్లలో ఆయన శతజయంతి కూడా వస్తోంది .దేశ దేశాలలో ఉన్న వేలూరి వారైనా  సమష్టిగా నిలబడి ఆ శత జయంతిని సగర్వంగా నిర్వహించాలని కోరుతున్నాను .మన అకాడేమీలు, కళాపరిషత్తులు ఈపనికి ముందుకు వస్తాయని నాకు నమ్మకం లేదు .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-25-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.