మా పాపాయి స్వయం సిద్ధ వేదవల్లి -2(చివరి భాగం )
మా అన్నయ్య శ్రీ గబ్బిట లక్ష్మీ నరసింహ శర్మ ,వదిన శ్రీమతి కమలమ్మ దంపతులకు మా అన్నయ్య హాస్పేట్ లో రైల్వే స్టేషన్ మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు అమ్మమ్మ పుల్లాభట్ల సుబ్బమ్మ గారింట పగోజి పోలసానిపల్లి లో జన్మించింది .నా దగ్గరున్న జాతకాల పుస్తకం ప్రకారం 1953లో రుధిరోద్గారి నామ సంవత్సరం శ్రీరామనవమి వెళ్ళిన దశమి మంగళవారం పుష్యమి నక్షత్రం రాత్రి 11గం .లకు జన్మించింది .అంటే 24-3-1953.కానీ స్కూల్ లో రికార్డ్ షీట్ లో మాత్రం 10-8–1952 గా రికార్డ్ అయింది .ఇదే అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ గాచలామణి అవుతోంది .వేదవల్లి ఆని నామకరణం జరిగింది .మా ఇంట్లో మా పెద్దక్కయ్య పేరు వేదవల్లి .ఆమె ఒక కొడుకును ప్రసవించి చనిపోయిందని మా అమ్మ చెప్పేది .ఆమె జ్ఞాపకార్ధం వేదవల్లి పేరు పెట్టి ఉంటారు .మా వేదవల్లి అక్కయ్య నేను పుట్టకముందే చనిపోయిందని గుర్తు మా అక్కా బావ ల ఫోటో మా పెంకుటింటి ఉత్తరం వైపు గోడపై మేము డాబా కట్టేదాకా ఉండేది .చాలా అందమైన ముఖం ఆమెది చదువుల సరస్వతి గా మా అమ్మ చెప్పేది మా నాన్నకు ఆమె అంటే విపరీతమైన అభిమానం .అందుకే పాపాయి ఆని పిలిచేవారట .ఆ పేరే ఈ వేదవల్లికీపెట్టి అదే పాపాయిగా పిలిచేవారు .మేమందరం కూడా వేదవల్లిని’’ పాపాయి’’ అనే ముద్దుగా పిలిచేవాళ్ళం .అందరికీ అదే అలవాటయింది .పాపాయి పుట్టిన ఆరేళ్లకు మా అన్నయ్య దంపతులకు రామా నాద బాబు శ్రీ విళంబి నామ సంవత్సరం మాఘ బహుళ పంచమి స్వాతి నక్షత్రం లో శుక్రవారం తెల్లవారుజామున 5-45గం లకు 28-2-1959జననం . బాలసార జరిగిన నెలలోపే మా అన్నయ్య హార్ట్ ఎటాక్ తో హాస్పేట్ లో మరణించాడు .ఈ విధంగా పాపాయి అరవయేట ,రాంబాబు పుట్టిన నెలలోపలె తండ్రిని కోల్పోయిన దురదృష్టవంతులయ్యారు .
మా అమ్మ భవానమ్మ నాన్న మృత్యుంజయ శాస్త్రి గార్లు ఈ మనవరాలిని మనవడిని కళ్ళల్లో పెట్టుకొని పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు .మానాన్న గారు 1961లో మరణించాక మా అమ్మ వాళ్ళిద్దర్నీ అలాగే పెంచింది .ఆమె 1982లో చనిపోయింది .నా వివాహం 1964ఫిబ్రవరిలో ప్రభావతితో జరిగింది .అప్పటి నుంచి మేమిద్దరం బాధ్యత వహించాం .పాపాయి ఉయ్యూరు హైస్కూల్ లో చదివింది .తోమ్మిదోక్లాస్ లో ఉన్నప్పుడు నేను సైన్స్ మాస్టర్ గా ఆక్లాస్ కు బోధించేవాడిని .పాపాయి క్లాస్ మేట్స్ కాళీ ప్రసాద్ చెల్లెలు రాజా కామేశ్వరి ,అలాగే మా ఇంటికి దక్షిణాన ఉన్న బెల్లంకొండ సుబ్బయ్యగారి అబ్బాయి హనుమంతం గారి అమ్మాయి సుశీల .ఈ ఇద్దరు నాదగ్గరే ట్యూషన్ చదివేవారు .పాపాయి బాగా నే చదివేది మంచి మార్కులతోపాసయ్యేది .SSLC పాసయ్యాక బెజవాడ లో స్టెల్లా కాలేజి పియుసి లో చేరి హాస్టల్ లో ఉండి చదివింది .అక్కడ నీళ్ళు వాతావరణం పడేదికాదు .వారానికో పదిహేనురోజులకో నేను మా అమ్మా వెళ్లి చూసి వచ్చేవాళ్ళం .పరీక్ష తప్పింది .ఆరోగ్యం బాగా లేదని మా ఫామిలి డాక్టర్ వెంపటి కుమారస్వామి గారికి చూపించి మందులు వాడినా తగ్గక పొతే ఆయన లెటర్ రాసిచ్చి గైనకాలజీ డాక్టర్ ను కన్సల్ట్ చేయమంటే మద్రాస్ లో మాపెద్దక్కయ్య లోపాముద్ర బావ కృపానిధి గారింటికి షినాయ్ నగర్ వెడితే ,లేడీ గైనకాలజిస్ట్ దగ్గరకు అక్కయ్య మమ్మల్ని తీసుకు వెళ్లి చూపిస్తే ‘’గైనకాలజిస్ట్ చూడాల్సిననంత జబ్బేమీ లేదు హాస్టల్ భోజనం పడక పోవటమే అంతకంటే ఏమీ లేదనిచేప్పి బలానికి మందులు రాసిచ్చి పంపింది ఈ ప్రయాణం లో మా మామయ్యగారమ్మాయి ’’ పాపి’’ ఆని మేము పిలిచే లక్ష్మీ నరసు కూడా మా ఇద్దరికీ ఉయ్యూరు నుంచి తోడు వచ్చింది .కధ సుఖాంతం కనుక హాయిగా వెంటనే ఉయ్యూరు తిరిగివచ్చాం .
పాపాయి పెళ్ళి ప్రయత్నాలుచేయటం మాబావగారు వేలూరి వివేకానండంగారి తండ్రిగారు కృష్ణమూర్తిగారికి చిరివాడ ఉత్తరం రాయటం ఆయన వెంటనే ‘’ఎక్కడో వెతకక్కర లేదు .చిరివాదలోనే మావాడే వేలూరి వెంకటేశ్వర్లు గారి పెద్దబ్బాయి రామకృష్ణ ఉన్నాడు బికాం పాసయ్యాడు చాలా బుద్ధిమంతుడు మంచి కుటుంబం..స్థితిమంతులు .గుడివాడదగ్గర బేతవోలులో కాపురం ఉంటున్నారు పిల్లల చదువుకోసం . ప్రయత్నం చేయమని చెప్పటం నేనూ మా తమ్ముడు మోహన్ వెళ్లి మాట్లాడటం వారంతా సుముఖంగా ఉండటం ,ఉయ్యూరువచ్చి పిల్లను చూసుకోవటం నచ్చిందని చెప్పటం రామకృష్ణ నాయనమ్మ తాతయ్యలతో సహా ఆడపడుచులు మరుదులు నిరంజన్ పతంజలి తో సహా వచ్చి చూడటం ,తాంబూలాలు పుచ్చుకోవటం శ్రావణ మాసం లో జోరున వర్షం లో మా ఇంట్లోనే వివాహం మాడంపతులం పీటలమీద కూర్చుని జరిపించటం చక చకా జరిగిపోయాయి .సాధారణంగా ‘’కతికితే అతకదు ‘’అంటారు కానీ మాపాపాయి పెళ్ళి ‘’‘కతికినా అతికింది ‘’.నేనూ మా తమ్ముడు ఆబ్బాయినిచూడటానికి బేతవోలు వెడితే మా వియ్యంకుడుగారు ఇంట్లో లేకపోతె మా వియ్యపురాలు ఎంతో మర్యాదగా మాట్లాడి అబ్బాయినిచూసి వెడుతుంటే ‘’మా ఇంట్లో భోజనం చేస్తేకాని వీల్లేదు .మనం బంధువులం .‘’ఆని ‘’ఆర్డర్ ‘’ఆప్యాయంగా వేస్తె రసం మామిడిపళ్ళతో కమ్మని భోజనం పెడితే తిని ఉయ్యూరు వచ్చాం .ఆతర్వాత రాంబాబు డిగ్రీ ,భోపాల్ లో చదువు ,బందరులో బిఎడ్ ట్రెయినింగ్ ,తర్వాత మా పెద్దక్కయ్య బావ ల చిన్నకూతురు జయలక్ష్మి తో వివాహం ,వాడు స్వంతిల్లు కట్టుకోవటం వాళ్లకు ఒక కొడుకు కళ్యాణ్ పుట్టటం అరిగాయి .
పెళ్ళి అయ్యాక అల్లుడు రామకృష్ణ విశాఖ లో ఉద్యోగం లో ఉన్నందున పాపాయినికాపురానికి విశాఖ తీసుకొని వెళ్లి దింపాం .రెండు మూడు రోజులున్నట్లు జ్ఞాపకం.పతంజలి మమ్మల్ని విశాఖ బీచ్ ,భీమ్లీ కూడా చూపించిన గుర్తు .ఆతర్వాత రామకృష్ణ గరివిడి FACOR కంపెనిలో ఉద్యోగం లో చేరటం ఫామిలి మార్చటం వీలున్నప్పుడల్లా మేము వెళ్లి రావటం జరిగేది .అక్కడినుంచి అరసవిల్లి ,శ్రీకూర్మం చూసి రాటం మామాలు అయింది .అంచెలంచెలుగా అతడు ఎదిగి కంపెనీ బాస్ ల విశ్వాసం చూరగొని తలలో నాలుకగా మెలిగాడు .పియుసి తో ఆపిన పాపాయి మెల్లగా డిగ్రీ ప్రైవేట్ గాకట్టి పాసై బిఎడ్ కూడా చేసి ,ఆతర్వాత’’ law’’కూడా పాసై కంపెని స్కూల్ లో సోషల్ టీచర్ గా చేరి రిటైరయ్యింది .చదువులతల్లి అయింది మా పాపాయి .ఇవన్నీ భర్త రామకృష్ణ సహాకారంతో స్వయం ప్రయత్నం తో సాధించిందే అందుకే మాపాపాయిని ‘’స్వయం సిద్ధ ‘’అన్నాను సార్ధకం గా .ఈలోగా ఇద్దరు మగపిల్లలు రవికిషన్ ,హరి కిషన్ బంగారుతంద్రులకు జన్మ నిచ్చి వారి వివాహాలు జరిపి మనుమళ్ళ తో హాయిగా ఉన్నారు .రవి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు భార్య గాయత్రి .ఉత్తమా ఇల్లాలు .కొడుకు రేయాన్ష్ .హరి అమెరికాలో సెటిల్ అయ్యాడు .భార్య శారిక .మంచి అమ్మాయి .ఇద్దరు అబ్బాయిలు .అమెరికాలో రాలీలో స్వంత ఇల్లు ఉంది .రవి ఇంకా స్వంతింటి వాడుకాలేదు .తోడికోడళ్ళు ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు .
రవికి అనుకోకుండా బైక్ ఆక్సిడెంట్ జరిగి కాలికి ఆపరేషన్ జరిగింది వాడు కోలుకోవటానికి దాదాపు ఏడాది పట్టింది తర్వాత తండ్రి రామకృష్ణకు హార్ట్ కంప్లైంట్ వచ్చి బైపాస్ జరిగింది .ఆయన కోలుకోవటానికీ ఏడాది పైనే పట్టింది . మెల్లమెల్లగా పాపాయి ఆరోగ్యం క్షీణించటం మొదలైంది చాలా విపరీతంగా బాధపడింది .ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో జరిగేది తండ్రి తల్లి లను కంటికి రెప్పలా కాపాడుకొన్నారు రవి దంపతులు. గాయత్రి ఓర్పు మాటలకు అందనిది .హరి పెద్దకొడుకు కు హఠాత్తుగా జబ్బు చేయటం ,దానికి ట్రీట్మెంట్ ,అమెరికా ఉద్యోగాలుస్థిరంగా లేకపోవటం తో వాడూ చాలాకస్టాలులు పడుతున్నాడు .వాడి మామగారు అమెరికా వచ్చి జబ్బుపడి అక్కడే చనిపోతే ఆయన్ను ఇండియా చేర్చటం ,హైదరాబాద్ లో కార్యక్రమాలు జరిపించటం తలకు మించిన భారమైంది వాడికి .కాని గుండె నిబ్బరం ఉన్న వాడు .అన్నీ తట్టుకోన్నాడు .రెండేళ్ళ క్రితం తండ్రి రామ కృష్ణ మరణం హైదరాబాద్ లో రవి ఇంట్లో .బాడీ గరివిడి తీసుకు వెళ్లటం స్వంతింట్లో కార్యక్రమమాలు చేయటం అమెరికానుంచి హరి సమయానికి వచ్చి పాల్గొనటం అంతా నిన్నామొన్నా వ్యవహారంగా అయిపొయింది .ఈలోగా మా వదినగారు అంటే మాపాపాయి అమ్మగారు కమలమ్మ గారు నిరుడు జనవరి లో చనిపోవటం ఈజనవరిలో సంవత్సరీకాలు ,వాటికి పాపాయి వాళ్ళు రవి కుటుంబం రావటం అంతా ఖర్చుమీద ఖర్చు .అన్నదమ్ములిద్దరూ ఎంత గుండె ధైర్యంతో ఇవన్నీ భరించారో చూస్తె ఆశ్చర్యమేస్తుంది .ఇంతలో రవి మామగారికి రెండుమూడు నెలల క్రితం బైపాస్ దానికి తోడూ కడపు లో ‘’క౦తి’’ ఆపరేషన్ .బాబోయ్ పగవాడికి కూడా ఇన్ని కస్టాలు రాకూడదని పిస్తుంది .
ఈ ఫిబ్రవరి మాఘమాసం లో రవికొడుకు రేయాన్ష్ ఉపనయనం హైదరాబాద్ లో జరగటం ఒకటే శుభ కార్యం .మేము వెళ్లి వచ్చాం .అందరికి తన చేతనైన విధంగా నూతన వస్త్రాలతో సత్కారం చేయించింది మా పాపాయి కొడుకు కోడలితో .రవి గాయత్రి దంపతులు చూడముచ్చటగా ఉన్తెనేను జోక్ గా ‘’బృందావనం సినిమాలో రాజేంద్రప్రసాద్ రమ్యకృష్ణ లా ఉన్నారు అనగా వాల్లతోసహా అందరూ పగలబడి నవ్వారు .హరికి జాబ్ ప్రాబ్లెం వలన రాలేక పోయాడు .ఢిల్లీ నుంచి రామకృష్ణ మేనకోడలు హేమ కూడా వచ్చింది .రామకృష్ణ పోయినప్పుడూ గరివిడి వచ్చింది హేమ ..పాపాయి మన శ్రీ సువర్చలా ఆంజనేయస్వామికి ,సరసభారతికి విరాళాలు ఇచ్చింది .ఇవే చివరి పనులని అనుకొని ఉండదు .హాయిగా మనవడి ఉపనయనం కళ్ళముందు జరగటం పాపాయికి ఎంతో ఊరట నిచ్చి ఉండాలి .వేదికమీద నిండుగా కూర్చున్నా పాపాయి నిబ్బరంగా ఉన్నట్లు అనిపించినా ఏదో’’ డౌట్’’’మనస్సులో మెదులుతూనే ఉంది .ఉపనయనం అయిన నాలుగు నెలలకే విధి వక్రించి మా పాపాయి మాకు దక్కకుండా వెళ్ళిపోయింది .ఒకరకంగా బాధల కష్టాల కడలి దాటి వెళ్ళిపోయింది .మంచి హృదయం బందుప్రేమ ఆప్యాయత లున్న మాపాపాయి మరణం మాకు తట్టుకో లేనిది అయింది .మా పాపాయి ఆత్మకు శాంతికలగాలని ,మా పాపాయి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ మాపాపాయి కుటుంబం కలకాలం ఆయురారోగ్యాలతోసుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-6-25,-ఉయ్యూరు
