తమిళనాడు లో ఆంధ్రుల భాషా సంస్కృతులకు కృషి చేసిన హెడ్ మాస్టర్ ,శాసన సభ్యుడు భాషా సమితి ,భాషా సమాజం స్థాపించిన , -శ్రీ కె. ఎస్ .కోదండరామయ్య
శ్రీ కారుపల్లి శివరామదాసు కోదండ రామయ్య తమిళనాడు హోసూరు తాలూకా కారు పల్లి గ్రామం లో 1909లో జన్మించారు .తలిదండ్రులు శివరామ దాసు ,రామలక్ష్మమ్మ .హైస్కూల్ చదువు బెంగుళూరులో చదివి ,హోసూరు తాలూకా బాగులూరులో ఎలిమెంటరి స్కూల్ మాస్టారు గా పని చేశారు .ప్రైవేట్ గా చదివి ఎం. ఎ.. బి ఎల్ డిగ్రీలు సాధించారు .టీచర్ ట్రెయినింగ్ అయి హోసూరులో ,కృష్ణగిరితాలూకా వేపనపల్లి హైస్కూల్స్ లో హెడ్ మాస్టర్ గా పని చేశారు .25ఏళ్ళు ఉపాధ్యాయులుగా పని చేశారు ..,
1957 లో రాష్రాల పునర్విభజన సమయంలో హోసూరు ,పరిసర ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో చేర్చాలని ఉద్యమం చేసి ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు .1971లో రాజాజీ గారి స్వతంత్ర పార్టీ లో చేరి తమిళనాడు శాసన సభకు పొటీ చేసి గెలిచారు .తోమ్మిదేళ్ళ కాలం తమిళ శాసన సభలో తెలుగు వినిపించిన ఘనత కోదండ రామయ్య గారిది .అదొక రికార్డ్ .
1977లో మళ్లీ పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయారు .ప్రకాశం పంతులు, కాశీ నాధుని నాగేశ్వరరావు గార్ల నిరాడంబరత ను ఆదర్శంగా టీసుకొన్నారు కోదండ రామయ్య .తమిళనాడు ,కర్నాటక రాష్ట్రాలలో తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికి ,పరిరక్షణకు నిర్విరామ కృషి చేశారు .పొట్టి శ్రీరాములు భాషా సమితి ,దక్షిణాంధ్ర భాషా సమాజం సంస్థలు స్థాపించి తమ ఆశయ వ్యాప్తి చేశారు .అనేకులను క్రమ శిక్షణగల సేవకులుగా తీర్చి దిద్దారు .
హోసూరు పరిసర ప్రాంతాలలో ఊరూరు తిరిగి అమూల్యమైన తాళపత్ర గ్రంధాలు సేకరించారు .తెలుగు భాషకు చిరస్మరణీయుడు శ్రీ కృష్ణ దేవరాయల పట్టాభి షేక మహోత్సవాలను ప్రతి ఏటా ఘనంగా ,వైభవంగా నిర్వహించేవారు .రాయల చరిత్ర సమగ్రంగా రాయాలని ఎన్నెన్నో ఆధారాలు సేకరించి మొదటి సంపుటం ముద్రిస్తుండగా కోదండరామయ్య గారు హఠాత్తుగా 1984లో 75వ ఏట చనిపోయారు .
తరతరాలుగా తమిళనాడులో నివసిస్తున్న ఆంధ్రులను భాషా అల్ప సంఖ్యాక వర్గాల వారు ఆని చెప్పటం పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు .భాషా అల్ప సంఖ్యాక వర్గ కమిషన్ కు ఎన్నో మహజర్లు పెట్టారు .కలిసిమాట్లాడారు ..’’అంతర్జాతీయ తెలుగు సంస్థ’’ ఏర్పడినతర్వాత ఆరు సంవత్సరాలు పాలక మండలి సభ్యులుగా సేవ లందించారు .దక్షిణాది తెలుగు వారి గురించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించ టానికి హైదరాబాద్ వచ్చి ,కొద్ది సేపటికే అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యాలయం లో తెలుగు భవనం లో అనాయాస మృతికి లోనై 4-6-1984న తనువు చాలించారు అంటే ఆఖరు క్షణం వరకు తమిళదేశ తెలుగు వారి భాషా సంస్కృతుల సేవలో జీవితం ధన్యం చేసుకొన్నపుణ్యమూర్తి శ్రీ కే .ఎస్ .కోదండరామయ్య గారు.
ఆధారం -డాక్టర్ ముదిగొండ వీరభద్ర శాస్త్రి గారి వ్యాసం .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-25-ఉయ్యూరు

