గుండెలో  మూడు బడబాగ్నులు దాచుకొని, నవ్వులపువ్వులురువ్వుతూ , విలనీ నిప్పులు చెరగిన  నట కోటీశ్వర వైభవ సంపన్నుడు శ్రీ కోట శ్రీనివాసరావు

 గుండెలో  మూడు బడబాగ్నులు దాచుకొని, నవ్వులపువ్వులురువ్వుతూ , విలనీ నిప్పులు చెరగిన  నట కోటీశ్వర వైభవ సంపన్నుడు శ్రీ కోట శ్రీనివాసరావు

 పెళ్ళి అయిన 11ఏళ్లకే పురిట్లో భార్యకు మతి చలించి భర్తనే గుర్తు పట్టకపోవటం ఎంతదారుణ విషయం .ఇది ఒక బడబాగ్ని .అయినా జీవితాంతం కాపురం చేయటం గొప్ప ఆదర్శం . .రెండవ కూతురు సరదా  పడిందని కారులో పంపిస్తేయాక్సి డింట్ జరిగి కాలుపోవటం .రెండవ బడబాగ్ని .తోటి బ్యాంకి ఆఫీసర్ తన కొడుకుకు ఆపిల్లను ఇచ్చి పెళ్ళి చేయమనటం,చేయటం ఆమె పిల్లా పాపలతో కళకళ లాడటం  కొంత ఊరట .ఇవన్నీ దాటుకొంటూ వస్తున్న  సమయం లో ఒక్క గానొక్క  కొడుకు,,సినీ నటనలో అరంగేట్రం చేసిన వాడు   కొత్తగా కొనుక్కున్న బైక్ యాక్సి డింట్ లో మరణించటం తట్టుకోలేని మూడవ బడబాగ్ని .శివుడు  గరళ కంఠుడు మాత్రమె అయితే, ఈయన త్రిగరళ కంఠుడు . 26ఏళ్ళు నాటకరంగం లో వెలుగులు చిమ్ముతూ ,బంగారు కోడిపెట్టలాంటి స్టేట్ బాంక్ ఉద్యగం వదిలి సినీ రంగ ప్రవేశం చేసి ఎదురులేని మకుటం లేని మహారాజుగా నాలుగు దశాబ్దాలు వెలిగిన  నట కోటీశ్వర వైభవ సంపన్నుడు శ్రీ కోట శ్రీని వాసరావు .ఆయన అన్ననాటక నటుడు  ,తమ్ముడు శంకరరావు కూడా నాటక సినీ నటుడు .తండ్రి శ్రీ సీతారామాంజనేయులు కృష్ణా జిల్లా కంకిపాడులో డాక్టర్ .చుట్టుప్రక్కల గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు .సాహిత్య కళా రంగాలకు సేవ చేసిన వారు .మెయిన్ రోడ్డు కు ఆనుకొనే 70 సెంట్ల భూమిలో ఇల్లు సకల సదుపాయాలతో ఉండేది .అక్కడే కోట వారి అందరి వివాహాలు వగైరా జరిగాయి .ఒక రకంగా అచ్చి వచ్చిన ఇల్లు.తండ్రి మరణం తర్వాత కొత్త ఇల్లు కడదామని ప్రయత్నించి అవకాశం రాక చిన్న నాటినుంచి తనతో స్నేహంగా ఉన్న ఒక నాయీ బ్రాహ్మణ కుటుంబానికి ఉండటానికి ఏర్పాటు చేసి ,ఆస్థలాన్ని తనకూతుళ్ళకు మనవళ్ళకు రాసిచ్చి జాగ్రత్త గా కాపాడుకొంటున్నారు .రెండు నెలల క్రితం కూడా వచ్చి వెళ్లారని ఆ కాపలా కుటుంబం చెప్పి దుఖం పట్టలేక ఏడ్చారు .కోటకు కులభేదాలు లేవని ,తమను అన్నా వదినలుగా భావించేవారని వారిద్దరూ గోడుగోడున విలపించారు .ఇలా తండ్రిగారికి ఉన్న మంచి పేరును తానూ కొనసాగించారు కోట .

  కోటకు ముందు ఎస్వి రంగారావు ,కైకాల సత్యనారాయణ ,రావు గోపాలరావు నాగభూషణం తమదైన శైలిలో నటిస్తూ మంచి పేరు సంపాదించారు .కోట తెలంగాణా మాండలికాన్ని నేర్చి అందులో నిష్ణాతుడై ,సరదాగా రామాయణ భారతాలను ఆ మాండలికం లో చెబుతూనవ్వించటం పైవారికంటే భిన్నం .’భీముడు గదను పిసకతా పిసకతా ఉన్నాడు ‘’అంటూ భారతాన్నీ ,’’దసరద మారాజు ముగ్గురు పెండ్లాలున్నా పిల్లల్ని ఎత్తలేదు’’అంటూ రామాయణాన్ని చెబుతూ పొట్ట చక్కలయ్యేట్లు నవ్వించేవారు.ఇలా చెప్పటం నేను బెజవాడలో క్షత్రయ్య  కళా క్షేత్రం లో ప్రత్యక్షంగా చూశాను .’’నటుడికి టైం వస్తే టైమే ఉండదు ‘’ అనే ఆయనకు నిజంగా డైరెక్టర్ శ్రీ కృష్ణ పిలిపించి ‘’ప్రతిఘటన ‘’సినిమాలో చాన్స్ ఇచ్చాడు .ఇక కోట ను ఎవరికీ పట్టతరం కాలేదు ఆసినిమాకు ,ఆయన కాశయ్య పాత్ర విలనీ మాండలికానికి అవార్డులు వచ్చాయి .ఇలా నవనందులను గెల్చిన వాడు నట కోట  .కోట మార్కు నటన ఒకటి తెలుగు తెరపై ఎస్టాబ్లిష్ అయింది .చిన్న పాత్ర అయినా ,పెద్ద పాత్రయినా తన ఇష్టం వచ్చిన మేనరిజం చొప్పించటానికి డైరెక్టర్లు ఫ్రీహాండ్ ఇచ్చారు .అందుకే ‘’రింగులో ఫింగర్ ‘’అడ్డేడ్డే’’ ఇహిహీ ,నెత్తిమీద చేతులుపెట్టుకొని ‘’ఈ దే౦దండీ బాబూ ‘’అనటం ,కోడిని ఎదురుగా తలకిందులుగా వేలాడదీసి దాన్ని తింటున్న అనుభూతి పొందటం ,న్యూస్ పేపర్ లుంగీ లాకట్టటం ఉత్త గోచీ పెట్టుకోనీ నటించటం కోటమార్కునటన .బాబూ మోహన్ తొ వంద ,బ్రహ్మానందంతో రెండు వందలు సినిమాలు నటించటం ఆషామాషీ  కాదు .ఆయనే అన్నట్లు ‘’పెద్ద గుమ్మడికాయంత ప్రతిభ ఉంటే చాలదు ,ఆవగింజంత అదృష్టం  కూడాఉంతేనే  ఎవరికైనా కలిసొస్తుంది ‘’కోటకు నిజంగానే పెద్ద గుమ్మడి కాయంత  అదృష్టం కలిగింది .750 సినిమాలలో విభిన్న పాత్రల్లో మెప్పించటం అంత ‘’వీజీ ‘’కాదు .రోజుకు 20గంటలు ,రోజుకు మూడు చోట్ల మద్రాస్ హైదరాబాద్ ,బెంగుళూరు లలో నటించటం ఎయిర్ పోర్ట్ లోనే ముఖ ప్రక్షాళనాదులు చేయటం ఆ బిజీ ఆర్టిస్ట్ నిత్య కృత్యం .కుటుంబాన్ని నెలకో రెండు నెలలకో చూడటం ఇప్పుడు తలచుకొని తాను ఏమి కోల్పోయాడో గ్రహించి బాధపడ్డాడు .టైం వస్తే టైం ఉండదు ఆని ఆయనే చెప్పిన మాట నిజమే అయింది . రెండిళ్ళ పూజారి లో లేడీ వేషం ,తొ సహా అనేక విలనీ వేషాలు వేసినా కమెడియన్ గా కోటకు కోట యే సాటి .ఆయన చివరి సినిమా హరిహర వీరమల్లు .సినీ కళాకారులంతా ‘’కోట బాబాయి ‘’అనీ రాజేంద్రప్రసాద్ మాత్రం ‘’కోట మామ ‘’అనీ పిలిచినా రాజమౌళి మాత్రం ‘’గౌరవంగా ‘’మాస్టర్ ‘’ఆని పిలిచేవాడు .అందుకే చనిపోయిన కోట భౌతిక కాయం దర్శనార్ధం అంతమంది వచ్చి తలచుకొని నివాళు లర్పించారు .

  అది  రామారావు  ముఖ్యమంత్రిగా ఉన్నకాలం .ఆయన చీరకట్టుకోవటం నగలు పెట్టుకోవటం ,వగైరా చేష్టలు జనానికి నచ్చేవికావు .కృష్ణ దీనిపై ‘’మండలాధీశుడు ‘’సినిమా తీసి కోట తొ రామారావు ను అనుకరింప చేశాడు .చాలా బాగా చేశాడు కోట .నేను నాలుగు సార్లు ఆసినిమా చూశాను .దాని వల్ల కోట దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది రామారావు అభిమానుల చేత .అప్పుడు రామారావు  అభిమాన దర్శక నిర్మాతలు కోటకు  వేషాలు ఎగగొట్టారు .కృష్ణ కోట కు గొప్పకోట గోడలా నిలబడి తన సినిమాలన్నిటిలో  అవ.కాశాలిచ్చి ప్రోత్సహించాడు .

 ప్రతిఘటనలో మంత్రి కాశయ్య తెలంగాణా మాండలికం ,,శత్రువు సినిమాలో కాంట్రాక్టర్ వెంకటరత్నం గా ‘’సేప్పవయ్యా బాబూ ,ఫోన్ మొగుతో౦దిరా బాబూ ‘’అంటూ సాగతీత డైలాగులు ,గణేష్ సినిమాలో హెల్త్ మినిస్టర్ సా౦బ శివుడుగా ‘’తమ్మీ .నాకు చార్ మీనార్ అంత హిస్టరీ  ఉంది తమ్మీ.పద్నాలుగెల్లకే బచ్చా గాన్ని చెడ్డీ మీద మర్డర్ అన్నట్లు ‘’అంటూ చెప్పిన డైలాగులు చూసిన చూపులు న భూతో న భవిష్యతి  .సర్కార్ సినిమాలో సిల్వర్ మణి పాత్రలో డైలాగ్స్ తొ ఉత్తరాది ప్రేక్షకుల నూ ఆకర్షించాడు .’’అందుకే నేను ఖండిస్తున్నా ‘’అంటూ గురు నారాయణ పాత్రలో ‘’గాయం ‘’సినిమా కు జీవం పోశాడు .రెండిళ్ళ పూజారిలో హిజ్జా పాత్రలో పైకి చిరునవ్వు లోపలమెత్తనికత్తి,కళ్ళలో విలనీ గా ‘’అక్క ‘’పాత్రకు ప్రాణం పోశాడు .కళ్ళతోనే కపటత్వాన్ని పూర్తిగా ప్రదర్శించిన సినిమా శివ లో మాచిరాజు .హలో బ్రదర్ లో తాడి మట్టయ్య గా మల్లికార్జునరావు జోడీ అందించిన హాస్యం చివర్లో మిత్రుడు  మల్లి మరణిస్తే చూపిన హావభావాలు ఆత్మీయతా అనురాగాలు మరువ లేనివి .’’భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ ,భర్తగా మారకు బాచిలరూ’’అంటూ  మని సినిమాలో  అల్లాఉద్దీన్ గా కోట పండించిన హాస్యం తరతరాల నట కోట కు నిదర్శనం .జంబలకిడి పంబ లో హీరోయిన్ తండ్రి గా ఇంటర్వెల్ ముడు ఒకలాగా తర్వాత మరోలాగా నటనతో చెలరేగిపోయాడు కోట .టిపికల్ మేనరిజం తొ ఈవివి సత్యనారాయణకు అద్భుత విజయం ఇచ్చాడు .వినోదం సినిమాలో బంగారం సింగారం పాత్రలలో జీవించాడు .మామగారు సినిమాలో పనీ పాటా లేకుండా వీధి అరుగుమీద కూర్చుని దారిన పోయే వాళ్ళని  ‘’ఒక దేబ్బెసు కొందామా ‘’ అంటూ పేకాటకు పిల్చే పోతురాజు గా బాబూ మోహన్ తొ చేసిన అల్లరి చిరకాలం గుర్తు ఉండిపోతుంది .సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో ‘’గారపాటి బుల్లబ్బాయి ‘’గా ‘’జల్లింది జీలకర్ర మోలిసి౦ది తోటకూర ,పూసింది మల్లెపువ్వు ,వేసింది అరటి గెల .కొబ్బరితోటలో జీడిపిక్కలేరుతున్నాను ,వంగతోటలో పనస గింజ లేరుతున్నాను ‘’అంటూ పండించిన కామెడి కోటకే సాధ్యం.చివరగా ఆహనా పెళ్ళంట’’లో పిసినారి లక్ష్మీ పతి పాత్రలో కోట నట విశ్వ రూపం చూస్తాం .ఆ వేషానికి రావు గోపాలరావు ను పెడదామని రామానాయుడు అంటే  ‘’చూడగానే నికృష్టుడు గా కనిపించాలి కోట మాత్రమె కరెక్ట్ ఆని ఒప్పించి జంధ్యాల డైరెక్ట్ చేశాడు .ఆ సినిమాతో వచ్చిన లాభం తొ రామానాయుడుతన స్టుడియో లోకట్టించిన  ఒక ఫ్లోర్ కు కోట పేరు పెట్టి ఋణం తీర్చుకొన్నాడు .రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘’ఆ నలుగురు ‘’సినిమా లో క్లైమాక్స్ పండించినందుకు కోటకు ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డ్ వచ్చింది .

  మద్రాస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలి రావాలని పట్టుబట్టి ఎవరూ కలిసిరాకపోవటంతో కోట నిరాహార దీక్ష చేశాడు .కార్మిక వర్గం ఫుల్ సపోర్ట్ ఇచ్చింది .చిరంజీవి వచ్చి దీక్ష విరమణకు నిమ్మ రసం ఇస్తుంటే వద్దని తాను రాజేంద్ర ప్రసాద్ కు చెప్పి దీక్ష ప్రారంభించానానీ ఆయన చేత్తోనే నిమ్మరసం తాగి విరమిస్తానని చెప్పగా అలాగే చేయించారు .ఆ ఏడాది నవంబర్ 31 నహైదరాబాద్ లో మొక్కుబడిగా షూటింగులు ప్రారంభమయ్యాయి .ఇదీ కోట సాధించిన అద్భుత విజయం .

వాజ్ పాయి అంటే విపరీత అభిమానం ఉన్న కోటకు బెజవాడ తూర్పు నియోజక వర్గం కు  బిజెపి  టికెట్ 1999లో ఇవ్వగా 57వేల వోట్లతో గెలిచి ప్రజాసేవ చేశాడు అయిదేళ్ళూ .అజిత్ సింగ్ నగర్ పాయకరావు పేట లనుబెజవాడకు కలిపే  మొదటి ఫ్లై ఓవర్  కోట వల్లనే వచ్చింది .అప్పటి బెజవాడ ఎం పి గద్దె రామమోహన రావు తొ మంచి ఆత్మీయ సంబంధాలు ఉండేవి .’’తమ్ముడూ’’ అనిపిలిచేవాడు కోట .ఆంధ్రా యూని వర్సిటి నాటక పోటీలలో ‘కళ్ళు ‘’నాటకం లో రామమోహనరావుహీరోయిన్ గా  కోట శంకర రావు హీరో గా నటిస్తే కోట శ్రీనివాసరావు డైరెక్ట్ చేశాడు  గద్దె కు ఉత్తమ కధానాయిక అవార్డ్ వచ్చింది .

10-7-1942లో జన్మించిన కోట శ్రీనివాసరావు 13-7-25న 83వ ఏట మరణించాడు .భార్య రుక్మిణి .కొడుకు సీతారామ ప్రసాద్ ..9 నంది పురస్కారాలు ,కృష్ణం వందే జగద్గురుం సినిమాక SIIMA అవార్డ్ ,2015 లో పద్మశ్రీ పురస్కారం పొందారు

·         ఈ డెవడ్రా బాబూ…

·         నాకేంటి ..మరి నాకేంటి.

·         మరదేనమ్మా నా స్పెషల్.

·         అయ్య నరకాసుర.

·         అంటే నాన్నా అది

వంటి పాప్యులర్ డైలాగ్ ల పిత కోట .నటనకు భాష్యం చెప్పిన కోట ను మరువలేము .

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-25-ఉయ్యూరు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.