శ్రీలంక డాక్టర్ ,సంగీత శాస్త్ర ప్రచారకులు -శ్రీ సరస్వతి రామకృష్ణయ్య
27-8-1902మద్రాస్ లో శ్రీనివాసమూర్తి శేషమ్మ దంపతులకు సరస్వతీ రామకృష్ణన్ గా జన్మించారు .1927 ఎల్ ఎం పి డాక్టర్ అయ్యారు .1928-32మధ్య శ్రీలంకలో వైద్యవృత్తి చేశారు .ఆతర్వాతకూడా1934-42వరకు సిలోన్ లోనే వైద్య వృత్తీ కొనసాగించి ‘’సిలోన్ డాక్టర్ ‘’గా పేరు పొందారు .
1945-57కాలం లో మద్రాస్ వచ్చి వైద్యులుగా ప్రాచుర్యం పొందారు .వీరి పూర్వీకులు విద్వాంసులు గాయకులూ వైణికులు .అందువలన వీరికి’’ సరస్వతి’’ అనేది ఇంటిపేరయ్యింది .రామకృష్ణయ్య వైద్యంతో బాటు సంగీతంలో కూడా మక్కువ పెంచుకొన్నారు .వైద్య విద్యలో చేరకముందే నాలుగేళ్ళు సంగీత శాస్త్రం లో శిక్షణ పొందారు .సంగీత గ్రంథాలన్నీ చదివి జీర్ణం చేసుకొన్నారు .
శ్రీ సుబ్బరాయ దీక్షితులు రాసిన ‘’సంగీత స౦ప్రదాయ దర్శిని ‘’వీరిని అమితంగా ఆకర్షించింది .వెంకట మఖి సంప్రదాయం తొ పాటు ,సుబ్బరాయ దీక్షితుల ఆధునిక సంగీత పద్ధతులు కూడా వొంట బట్టి౦చు కొన్నారు . వైద్యం వృత్తీ సంగీతం ప్రవృత్తి గా జీవించిన మహానుభావులాయన .మద్రాస్ కార్పోరేషన్ లో పదవీ విరమణ చేసిన తర్వాత త్యాగరాజ కృతులతోపాటు ,ఇతర ప్రసిద్ధ కృతులలో కూడా నిష్ణాతులయ్యారు .
తిరువలక్కేలి లో ఉంటున్న శ్రీ అంబి దీక్షితార్ గారితో సాన్నిహిత్యం పొంది ఎన్నెన్నో కొత్త మెళకువలు ఆకలి౦పు చేసుకొన్నారు .వివిధసంగీత గ్రంధాల సారాన్ని వ్యాసాలుగా రాసి సంగీత ప్రపంచానికి విలువైన సేవ లందించారు రామకృష్ణయ్య .చెన్నై సంగీత అకాడెమీ సభ్యులై సంస్థ కార్య క్రమాలను శ్రద్ధగా నిర్వహించే వారు .1975లో సంస్థ వీరి సేవలకు ఘన సన్మానం చేసింది .వేంకటమఖి ఆధునిక సంప్రదాయం ,సుబ్బరామ దీక్షితుల ‘’సంగీత సంప్రదాయం ‘’,శ్రీ డి .రామమూర్తి’’ మృదంగ తత్త్వం ‘’గ్రంధం ,శ్యామాశాస్త్రి అన్నమాచార్య కీర్తనలపై వీరి వ్యాసాలు విశిష్టమైనవి సంగీత ప్రచారానికి బాగా తోడ్పడేవి .సంగీత సరస్వతి ,అపర ధన్వంతరి అయిన శ్రే సరస్వతీ రామకృష్ణయ్య 1981లో 79వ ఏట సరస్వతీ సాయుజ్యం పొందారు .
వీరి ఫోటో లభించలేదు .
ఆధారం -మా.గోఖలే వ్యాసం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-25-ఉయ్యూరు

