కుంఫిణి సివిల్ ఉద్యోగులకు మొట్టమొదటగా తెలుగు పాఠ్యగ్రందాలు, వ్యాకరణం రాసిన -శ్రీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి
తెల్లదొరలకోసం తెలుగులో పాఠ్య గ్రంధాలు రాసిన వారిలో ప్రధములు శ్రీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారు1770లో పుట్టారు 72ఏళ్ళు జీవించి 1836లో మరణించారు . .బారసాల నాడు పెట్టిన పేరు ‘’గురుమూర్తి .’’ఆరువేల నియోగి కుటుంబం వాడు కనుక శాస్త్రి పదం మొదటి నుంచీ లేదు . .
1819 సెయింట్ జార్జికోట కాలేజి వారు ప్రచురించిన ‘’విక్రమార్కుని కథలు ‘’పుస్తకం లో ‘’ఆరువేల నియోగి యగు రావిపాటి గురుమూర్తి ‘’అనే ఉన్నది .ఆకాలేజీ స్థాపించిన తొలి రోజుల్లోనే ఈయనను తెలుగు ఉపాధ్యాయునిగా నియమించారు .శ్రీ వేదం పట్టాభి రామ శాస్త్రి గారు ప్రథాన సంస్కృత ఆంధ్ర ఉపాధ్యాయులు .గురుమూర్తిగారు డిప్యూటీ తెలుగు మాస్టారు .
తెల్లదొరలకు పాఠ్యగ్రంథంగా గురుమూర్తిగారు 104పేజీల’’ విక్రమార్క కథలు’’ రాశారు .కాలేజివారు 1819లో అచ్చు వేశారు .అదొక్కటే ఆనాటికి ప్రామాణిక పాఠ్యగ్రంధం .1828,1850 ,1858లలో మూడు సార్లు పునర్ముద్రణ జరిగింది .ఈ పుస్తకాలను మద్రాస్ లోని సివిల్ ఉద్యోగులేకాక ఇంగ్లాండ్ లోని వారు కూడా చదువుకోవటానికి పంపించారు .గురుమూర్తి గారి జీతం పెంచి’’ బంగారు కడియాల జత’’ కూడా బహూకరించారు .
1820 లో వేదం పట్టాభిరామ శాస్త్రిగారు చనిపోగా ,హెడ్ మాస్టర్ గా గురుమూర్తి గారిని నియమించి హోదా సూచించే పదంగా ‘’గురుమూర్తిశాస్త్రి ‘’ఆని గౌరవంగా పిలిచారు .విద్యా విధాన విషయాలలో ప్రభుత్వం ఆయన సలహాలను తీసుకొన్నది .1833లో కలక్టరేట్ స్కూళ్ళలో బోధించాల్సిన పుస్తకాలను గురుమూర్తిగారు నిర్దేశించారు .ప్రభవల పుస్తకం ,సులభమాటల పుస్తకాలు ,వచన వ్యాకరణం ,కొంచెం ఛందస్సు ,సులభ పద్యాల పుస్తకం ,అకారాది శబ్ద పుస్తకం ,జాబులు ,భారతం లో ఆదిపర్వం లను అర్దాలతో సహా స్కూళ్ళలో బోధించాలని చెప్పారు .
సివిల్ సర్వెంట్లకు తెలుగు నేర్పటమేకాక ,శాస్త్రిగారు వారి విద్యాభి వృద్ధి ఎలాఉన్నదో నిర్ణీత సమయాలలో పరీక్షలు కూడా సీనియర్ కాలేజి బోర్డు సభ్యులతో జరిపించేవారు .తన వద్ద చదువుకొన్న తెల్లదొరలు పెద్ద పెద్ద హోదాలలో పని చేస్తున్నా ,భాషా విషయంలో వాళ్లకు వచ్చే సందేహాలను గురుమూర్తి శాస్త్రిగారు లేఖలద్వారా తెలిపి అనుమానాల నివృత్తి చేసేవారు .1827లో సిపి బ్రౌన్ దొర ‘’అలమోక ‘’,’’డాబాలు ‘’మాటల అర్ధాలు రాసిపంపమంటే ఒక ఉత్తరం లో సమాధానాలు రాసి బ్రౌన్ కు పంపారు .
1834లో గురుమూర్తిగారు ‘’పంచ తంత్ర కథలు ‘’అనే మరో వచన గ్రంధం రాశారు .ఇదికూడా బాగా ప్రాచుర్యం పొంది నాలుగు సార్లు 1842 ,48 ,64,1869లలో పునర్ముద్రణ పొందింది.తెలుగు మాటలకు ఇంగ్లీష్ అర్ధాలు ఇచ్చే,నిఘంటువు,తెలుగును ఇంగ్లీష్ లో బోధించే వ్యాకరణాలు ,పాఠ్యగ్రంథాలు రాస్తే ,ఆమోదింపబడిన వాటికి నగదు పారితోషికం ఇస్తామని బోర్డ్ ప్రకటించింది .చాలామంది సివిల్ ఉద్యోగులు ఆపనిలో పడగా గురుమూర్తిగారు వారి వెన్నంటి నిలిచారు .జె.సి మారిస్ దొరరాసిన నిఘంటువులో గురుమూర్తి గారి పాత్ర చాలా ఉంది .1835లోఇది అచ్చయినప్పుడుదొర తన గురువుకు పీఠిక లో కృతజ్ఞతలు ప్రకటించుకొన్నాడు .
తెలుగు వారికి తెలుగులోనే వ్యాకరణం బోధించాలని గురుమూర్తి గారు భావించి 1836లో ‘’తెలుగు వ్యాకరణం ‘’అనే పేరుతొ 5ప్రకరణాలతో 316లక్షణ వాక్యాలతో రాశారు .సంస్కృత వ్యాకరణం బట్టి సూత్రాలతోకాకుండా ఇంగ్లీష్ విధానాలతో ‘’వాక్య పధ్ధతి ‘’లో చెప్పటం గురుమూర్ర్తి గారి గురుత్వ విశేషం .ఇందులోఅక్షర లక్షణ ,సంధి ,విశేష్య ,విశేషణ ,క్రియాపద ప్రకరణాలున్నాయి .
శాస్త్రిగారి పాండిత్యం,ప్రామాణికత మీద బ్రౌన్ దొరు అపూర్వ గౌరవం ఉండేది .తన రచనలను ఆయన ఆమోదించి నందుకు బ్రౌన్ ‘’I mention his name because his talents and good sence always entitled his judgement and respect ‘’ఆని 1839లో ప్రశంసించాడు .
1850లో బ్రౌన్ దొర గురుమూర్తిగారి రచనలు ఇతరులురాసిన ఆంధ్రభాషా సంగ్రహం అరేబియన్ నైట్స్ పుస్తకాలను పాఠశాలలో బోధించటం నిష్ప్రయోజనం ఆని ఆదేశించాడు .బ్రిటీష వారికి కావలసింది తక్షణ ప్రయోజనాలే .శాస్త్రిగారు 1836లో రిటైరయ్యారు .సముచిత పారితోషికాన్ని కంపెని ప్రభుత్వం ఇచ్చింది .ఆయన శిష్యులు ఆయనకు కడపజిల్లా కదిరిలో డిస్ట్రిక్ట్ మునసబు గా ఉద్యోగం ఇప్పించారు .కనుక ఆయనకు ఇచ్చిన ‘’గ్రాట్యు టి’’డబ్బు మొత్తాన్ని వాపసు చేయమని అధికారులు ఆదేశించారు .కంపెనీ వారి విశ్వాసాలు ఇలాఉంటాయి .రావిపాటి గురుమూర్తి శాస్త్రిగారు 1836 లో మరణించారు .ఆయనకొడుకు గురవయ్యను మాత్రం కాలేజీలో ఉపాధ్యాయునిగా నియమించారు గుడ్డ్డిలో మెల్ల లాగ ‘’అన్నారు ఆరుద్ర .
ఆధారం -ఆరుద్ర ‘’సమగ్ర ఆంధ్ర సాహిత్యం -కు౦ఫిణియుగం ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-25-ఉయ్యూరు .

