స్విట్జర్ లాండ్ లో తెలుగు వెలుగు ,వైద్య ఆర్ధిక శాస్త్ర నిపుణుడు ,బహుభాషావేత్త ,కవి -శ్రీవేగె నాగేశ్వరరావు
కృష్ణాజిల్లా గన్నవరంతాలూకా ఉంగుటూరుమండలం పెదవుటపల్లి లో శ్రీవేగె నాగేశ్వరరావుగారు శ్రీ వేగె తాతయ్య వెంకట్రామ్మ దంపతులకు 27-2-1932 న ఆఖరి సంతానంగా సామాన్య రైతు కుటుంబలో జన్మించారు . పుట్టిన ఏడాదిన్నరకే తల్లి చనిపోయింది .తండ్రి తీవ్ర దుఃఖ భారం తొ కొడుకులో భార్య రూపు రేఖలు చూసుకొంటూ జాగ్రత్త గా పెంచారు .అక్కలు సుబ్బాయమ్మ ,రంగమ్మ అన్న కృష్ణారావు గార్లు ఈ చిట్టి తమ్ముడిని అల్లారు ముద్దుగా చూసుకొన్నారు .ప్రాధమిక విద్య స్వగ్రామం లో పూర్తిచేసి గన్నవరం జిల్లాపరిషత్ హైస్కూల్ లో ధర్డ్ ఫారం చదివిపాసయ్యారు అన్న కృష్ణారావు దగ్గర నెల్లూరు వి ఆర్ కాలేజి లో ఇంటర్ ఎకనామిక్స్ లో బిఏ చదివి ఉత్తీర్ణులయ్యారు .
నాగేశ్వరరావు గారు 1957లోఇటలీ వెళ్లి పాడువాఅండ్ ఫార్మసి యూని వర్సిటిలో చేరి మెడిసిన్ అండ్ సర్జరి లో ఎం .డి.చేశారు .చదువుపూర్తి అయ్యాక ‘’కర్నీలియా ‘’అనే స్వస్ దేశ అమ్మాయిని పెళ్ళాడి’’ శాంతిప్రియ’’ కూతుర్ని కని, ‘’శాంతిప్రియ ‘’పేరు పెట్టి తమ దేశ సంప్రదాయం ఔన్నత్యాన్ని నిలబెట్టుకొన్నారు .శాంతిప్తియ ఆర్కిటేక్చరాల్ ఇంజనీరింగ్ చదివి అదే విభాగంలో ఇంజనీర్ అయిన ‘’బాలాజీ’’ని వివాహమాడి జ్యూరిచ్ లో సెటిల్ అయ్యారు .
ఆర్ధిక శాస్త్రం లో డిగ్రీ, వైద్యంలో ఎం డి పొందిన నాగేశ్వరావు గారు విశిష్ట వ్యక్తి మేధా సంపన్నులు .సోషలిస్ట్ మేధావి .పార్లమెంట్ లో సోషలిస్ట్ పార్టీ సభ్యులుగా కొంతకాలమున్నారు .ఇండియా వచ్చినప్పుడల్లా పాత తెలుగు సినిమాలు చూడటం ఆయనకు అలవాటు .భారత రామాయణకాల విలువలను గురించి చర్చించేవారు .ఆరాధించే వారు .విదేశాలలో మంచి కవిగా ప్రసిద్ధి చెందారు .ఇంగ్లిష్ ఇటాలియన్ భాషలలో వైదుష్యంతో హృదయాలను ఆకట్టుకొనేలా ఉపన్యసించే వారు .ఆయన రచనలకు విదేశాలలో మంచి గిరాకీ ఉండేది ..న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ యూరోపియన్ ఎడిషన్ లో వీరి కవితలు ప్రచురితమై ,యూరోపియన్ పాఠకులకు దగ్గరయ్యారు .వీరి కవితల పుస్తకం ‘’పీస్ అండ్ లవ్ ‘’కు బెర్ట్రాండ్ రస్సెల్ ముందుమాట రాశారు .రావు గారి కవిత్వాన్ని మెచ్చుకొంటూ ‘’మీ కవితలు అద్భుతం ..శాంతిని గురించి మీరు రాసిన కవితలు సజీవంగా ,ఉన్నత ప్రమాణాలతో ,గొప్ప ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి .అన్నికవితలు మెచ్చదగినవే పేర్కొన దగినవే ‘’ఆని కితాబిచ్చాడు రస్సెల్ .
ఈ కవితా సంపుటిలో ‘’త్రీ మదర్స్ ‘’కవితలో తనకు జన్మనిచ్చిన తల్లి ,మాతృభాష ,మాతృభూమి ముగ్గురు తల్లులు ఆని అత్యంత గౌరవప్రదంగా వినయంతో పేర్కొన్నారు రావు గారు .ఇటాలియన్ భాషలో ‘’ ఆరోరా ,సేనేవిటా,శాంతిప్రియ ,సోషియాలిస్మోపుస్తకాలు రాశారు .ఇంగ్లీష్ లో లైఫ్ అండ్ లవ్ ,పీస్ అండ్ లైఫ్ ,సోషలిజం అనే నాటకం ,లేస్లిబిచ్ ,పోయిసేస్ బి.ఎన్ .కె . దాస్ ,పోయిసేస్ క్లియిసిస్ ,రాశారు .
శ్రీ వేగె నాగేశ్వరరావు తమ భాషా వైద్య ఆర్ధిక సేవలకు బహు విశిష్ట పురస్కారాలు అందుకొన్నారు .అందులో ముఖ్యమైనవి -కొలంబియన్ ట్రోఫీ ,సెయింట్ లూయీ ,రోమా ,తివోర్నో క్రిటేకాలిటరేరియా,రోమా ప్రియో ,జూరిక్ ప్రిమియో ,ప్రిమియో .
27-2-1997న 65ఏళ్ల వయసులో కవి డాక్టర్ ,రచయిత ,మాతృభాషా మాతృదేశాభిమాని శ్రీ వేగె నాగేశ్వరరావు మరణించారు .
వీరి గురించి ఎవరికీ తెలియదనిపిస్తోంది .వీరి జీవితం చూస్తుంటే మా ఉయ్యూరుకు చెందిన ‘’కేమోటాలజి పిత ‘’శ్రీ కొలచల సీతారామయ్య గారు జ్ఞాపకం వస్తున్నారు .ఇద్దరూ కృష్ణాజిల్లా మహోన్నతులే .
ఆధారం -కృష్ణాజిల్లా కోలవెన్నుకు చెందిన శ్రీ పరుచూరి శ్రీనివాసరావు గారి వ్యాసం
.మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-7-25-ఉయ్యూరు

