కందుకూరి వారి రెండు పుస్తకాలు
విజయవాడ శ్రీ కామాక్షీ దేవీ పీఠ౦ కు చెందినఆగమ విద్వాన్ ,శిల్ప శాస్త్ర ప్రవీణ శ్రీ కందుకూరి సత్యబ్రహ్మాచార్య గారు ఈ నెల 27ఆదివారం బెజవాడ రామ్మోహన లైబ్రరీలో శ్రీ తుమ్మోజు వారి ‘’సృష్టికర్త ‘’శతకం ఆవిష్కరణ నాడు నాకు ‘’ఆది విజ్ఞానులు’’ ,’’బాలప్రభ ‘’అనే తమ రెండు రచనలు ఇచ్చారు .వాటి గురించి క్లుప్త పరిచయం .
1-ఆది విజ్ఞానులు -ముందుమాటలో తాము శిల్ప కళాభారతి తరఫున ఇప్పటికి 25 గ్రంథాలు వెలువరించామని ,అవి బహుళ జనాదరణ పొందాయని ,త్వరలోనే విశ్వ కర్మీయం ,మౌన సారం ,అయాది లక్షణం ,ఆత్రేయ తిలకం ,ప్రసాద మండపం ,అగస్త్య సకళాదికార శిల్పశాస్త్రం ,బ్రాహ్మీయ చిత్రకళ శాస్త్రం ,సారస్వతీయ చిత్ర కర్మ శాస్త్రం వంటి అపూర్వ గ్రంథాలను వెలువరింప బోతున్నామని చెప్పారు .వేదం లోని 25మండి శిల్పాచార్యుల గురించి సంక్షిప్త చరిత్ర గల పుస్తకం ఇదీ .స్వయంభూ విశ్వ కర్మతో ప్రారంభించి ,భౌవన విశ్వకర్మ ,అంగీరస బృహస్పతి వగైరా మహానుభావుల గురించి రాసి చివరగా ‘’సుపర్ణ రుషి ‘’తొ పూర్తి చేశారు .రచయిత గారి తీవ్ర అధ్యయనం ప్రతి పదం లో కనిపిస్తుంది .మనకు తెలియని ఎన్నెన్నో విషయాలు ఆధార సహితంగా ఉటంకించి ,మనసుకు హత్తుకోనేట్లు రాశారు .అభినందనీయులు .శిల్పా చార్యుల చిత్రపటాలున్నాయి .ముచ్చటైన ముద్రణ .
2-బాలప్రభ -18 ఆధ్యాత్మిక బాలకథల సంపుటి .బాల గణపతి తొ ప్రారంభించి బాల స్కంద ,బాల సంబంధ మొదలియార్ ,మాండవ్య మొదలైన వారి చరిత్ర బాలలకు అందుబాటైన భాషలో బాలానందంగా రాశారు .అన్నం మహిమ వివరించారు .మేఘ సందేశం లో ‘’దదద ‘’శబ్ద వివరణ ఇచ్చారు .ద అంటే దమనం అంటే దుర్గుణాలకు దూరం గా ఉండటం ,ద అంటే దత్త అంటే దానం చేయటం ,మూడవ ద అంటే దయ కలిగి ఉండటం .ప్రతికథకు అర్ధవంతమైన చిత్రాలున్నాయి .ముద్రణ ఆకర్షణీయంగా ఉంది . ఈ శబ్దాన్నే ప్ర ముఖ ఆంగ్లకవి నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత టి.ఎస్ ,ఇలియట్ తన అజరామర కావ్యం ‘’వేస్ట్ లాండ్ ‘’లో ఉదాహరించాడు .
చక్కటి రంగుల ముఖ చిత్రాలు అరుదైన లోపలి చిత్రాలు ఉన్న ఈ రెండు పుస్తకాలు ఒక్కొక్కటి వంద రూపాయలు .ఆసక్తి ఉన్నవారు -కందుకూరి వేంకట సత్య బ్రహ్మా చార్య -9491411090కు సంప్రదించవచ్చు
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-25-ఉయ్యూరు

