మనం మరచిపోయిన మిల్టన్ లాంటి కవి,విక్రమాదిత్య ,కన్యకా పరమేశ్వరి ఆంగ్ల పద్యకావ్యాలు ,హరిశ్చంద్ర ,సావిత్రి నాటక కర్త, లెక్చరర్ ,ప్రిన్సిపాల్ ,రాజా రవి వర్మ వద్ద మెలకువలు నేర్చిన చిత్రకారులు -శ్రీ కాశీయాజుల సుందర రామ మూర్తి
1868లో శ్రీ కాశీయాజుల సుందర రామ మూర్తి విశాఖ పట్నం లో జన్మించారు .తండ్రి నారప్ప పంతులు గారు జిల్లా మునసబ్ కోర్ట్ లో ఉద్యోగి .మూర్తిగారు కలకత్తా విశాఖ లలో చదివారు .చదువు నేర్పిన విద్యా గురువులపై అపార భక్తీ విశ్వాసాలు కల వీరు అనకాపల్లి లోహిందూ విద్యార్ధులకోసం మొట్టమొదటి ‘’చంద్ర శేఖర శాస్త్రి మెమోరియల్ స్కూల్ ‘’తమ గురువు జ్ఞాపకార్ధం స్థాపించారు.తర్వాత కాకినాడ ,పిఠాపురం లలో మహారాజా కాలేజిలో ఉద్యోగించారు .కోట రామ చంద్రపురం నేషనల్ హైస్కూల్ కు మొదటి హెడ్ మాస్టర్ వీరే .తునిరాజాగారి హైస్కూల్ ప్రిన్సిపాల్ గా ,విశాఖ ఎ వి ఎన్ కాలేజి ఆంగ్ల ఆచార్యులుగా పని చేశారు .వీరి ఆంగ్ల కవిత్వ ,వచన రచన ‘’మిల్టన్ స్టైల్ లో ‘’ఉంటుందని ప్రసిద్ధి పొందారు.ఉపన్యాసం ఉత్సాహం ఉప్పెనె .
రామ మూర్తి గారు విక్రమాదిత్య జననం గురించి ఇంగ్లీష్ లో ద్విపదలు రాశారు .మద్రాస్ మెయిల్ పత్రిక దీన్ని సమీక్షిస్తూ ‘’ఈ కావ్యం వాజ్మయ వైభవ చిహ్నం ‘’ఆని ప్రశంసించింది .కన్యకాపరమేశ్వరి గురించి ఇంగ్లీష్ పద్య కావ్యం కూడా రాశారు భారతి పత్రికలో హరిశ్చంద్ర ,సావిత్రి నాటకాలు రాశారు .బరంపురం వేగుచుక్క గ్రంథ మాల వారు వీరి ‘’ఉత్తమ పంచకుడు ‘’నాటకం ముద్రించారు .
1931 లో ‘’లవంగీ -పండితరాయలు ‘’వ్యావహారిక వచన నాటకం రసజ్ఞ మనో రంజకం గా రాశారు .నాటక రచనతో పాటు అభినయం లో కూడా మూర్తి గారు నిష్ణాతులు .చదరంగం లో చతురులు .తైలవర్ణ చిత్ర రచనలో నేర్పరి .కేరళలో ప్రఖ్యాత చిత్రకారులు రాజా రవి వర్మవద్ద చిత్ర లేఖనానికి వన్నెలు దిద్దుకొన్నారు .ఆంధ్ర ఆంగ్ల ,ఒరియా ,తమిళ హిందు స్థానీ భాషలలో కావ్యాలు రాయగల ప్రజ్ఞా దురీణులు .మహారాజా వారి కాలేజి ప్రముఖ ఇంగ్లీష్ లెక్చరర్ త్రయం’’ లో మూర్తి గారు ముందున్నారు .రాజావారి అనుగ్రహ పాత్రులలో కూడా అగ్రేసరులే .రాజాగారి వ్యక్తిగత పరివారం లోనూ ముఖ్యులే .రాజావారితో వ్యక్తిగత పర్యటనలలోనూ ముఖ్య సహాచరులే .
ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ పొందుతూ ,ఎలాంటి ఒడి దుడుకులు లేకుండా జీవించి ,1939లో ‘’సప్తతి వర్ష ప్రాయాన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కాశీయాజుల సుందరరామ మూర్తి గారు పరమపదించారు .
వీరి ఫోటో దొరకలేదు
ఆధారం -బ్రహ్మశ్రీ రాంభొట్ల నృసింహ శర్మ గారి వ్యాసం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-25-ఉయ్యూరు
