ప్రముఖ నాటకరంగ స్త్రీ పాత్ర ధారి, హిందీ పండిట్ -శ్రీ అవధాన్ల పురుషోత్తం
భద్రాచలం దగ్గర పర్ణశాలలో శ్రీ అవధాన్ల పురుషోత్తం లక్ష్మీ నరసయ్య చల్లాయమ్మ దంపతులకు 1900లో జన్మించారు .71 ఏళ్ల వయసులో1971లో చనిపోయారు .ఆయన నాటకాలలో వేసినవన్నీ స్త్రీపాత్రలే అవటం ప్రత్యేకం విశేషం.నటన సంగీతం గాన మాధుర్యాలు లేకపోయినా ,ప్రేక్షకులను ఆకర్షించే విధంగా పాడటం వల్ల ప్రేక్షక హృదయాలలో స్థిరంగా నిలిచిపోయారు .’’వన్స్ మోర్ ‘’ల వర్షం కురిపించుకున్నారు .
పెద్ద ఎత్తుగడలో పాటకాని పద్యాన్ని కాని మొదలుపెట్టి , క్రమంగా దాన్నే వచనం గా మార్చుకొని ,ఎప్పుడు మార్చారో తెలియకుండా మార్చేసి ,కొత్తతరహాగా ప్రేక్షకులను మెస్మరిజం చేసిన నట ఘనా పాఠి ఆయన .ఆ రోజుల్లో రాజమండ్రిలో గున్నేశ్వర రావు నాటక కంపెనిలో ఈయనే ప్రత్యెక ఆకర్షణ .ఆయనకు అత్యంత ప్రేమాస్పదుడైన నటుడు పురుషోత్తం గారు .
పురుషోత్తంగారు ధరించిన స్త్రీపాత్రలలో శకుంతల ,కైక ,రుక్మిణి ,మంధర పాత్రలు ఆయనకు చిరయశస్సు సంపాదించి పెట్టాయి .15వ ఏటనే ఆ సమాజం లో చింతామణి నాటకం తొ అరంగేట్రం చేశారు గున్నేశ్వరరావు గారి సమాజం ఉన్నంతవరకు అందులో నటించి నాటకరంగ నిష్క్రమణ చేశారు .
హిందీ భాషా ప్రవీణ చేసి హిందీ భాషా వ్యాప్తి చేశారు .భద్రాచలం బోర్డ్ హైస్కూల్ లో 1948నుంచి 1960 వరకు పన్నెండు సంవత్సరాలు హిందీ పండిట్ గా పని చేశారు ,అదే ఆయనకు జీవనో పాధి అయి కాపాడింది .1956నుంచి కళామతల్లి సేవలో తమ కళా కౌశలం మూడేళ్ళు ప్రదర్శించారు.ఆస్కూలు ఉపాధ్యాయుల అభ్యర్ధన మేరకు ఆ స్కూల్ పిల్లలకు నాటక శిక్షణ ఇచ్చారు .దాని వలన ఆస్కూల్ విద్యార్ధులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో భద్రాచలానికి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టారు .
ఆంధ్ర విశ్వ విద్యాలయం ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్ కళాశాల లనాటక పోటీలలో 1961లో బహుమతి పొందినయువకుడు ఎన్ ఆర్ కె పరమహంస పురుషోత్తం గారి శిక్షణ పొందిన వాడే .పురుషోత్తం గారు ఆజన్మ బ్రహ్మ చారి .శుద్ద శ్రోత్రియులు .నిత్య గోదావరీ స్నానం భగవద్గీతా పఠనం ఆయనకు నిత్యకృత్యాలు .ప్రతి సాయంత్రం భద్రాచల రాముని సన్నిధిలో ఆధ్యాత్మిక గ్రంథ పఠనం తొపునీతులయ్యే వారు .అధ్యాపక వృత్తీ నుంచి ఆధ్యాత్మికతకు పరి వర్తనం చెంది జీవితాన్ని ధన్యం చేసు కొని 9-9-1971 న నాటక అవధాని ,ఉత్తమ పురుషులు శ్రీ అవధాన్ల పురుషోత్తం గారు శ్రీరామ సన్నిధికి చేరారు .
ఆధారం -శ్రీ మిరియాల రామ కృష్ణ గారి వ్యాసం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-25-ఉయ్యూరు

