సూత మహర్షి ని బలారాముడు చంపాడా ?
అవును అనే భాగవత పురాణం చెబుతోంది .ఎలా ఎప్పుడు ?
బలరాముడు కౌరవ పాండవులకు యుద్ధం తప్పకుండా వస్తుందని ముందే గ్రహించి తనకు యేపక్షం లోనూ చేరి యుద్ధం చేయాలని లేదు అనిపించి తీర్ధ యాత్రలు చేయటానికి బయల్దేరాడు .అనేక తీర్ధాలు సందర్శించి స్నానాలు చేసి తర్పణాలు వదిలాడు . ,మొదట ప్రభాస తీర్ధం ,అక్కడి నుంచి సరస్వతి ,బిందు సరం వజ్రతీర్ధం ,విశాల ,సరయు ,గంగా యమునా నదులలో స్నానాదికాలు పూర్తి చేసుకొని ,,నైమిశారణ్యం చేరి అక్కడ మహర్షులు చేస్తున్న సత్రయాగం చూసి తానూ వారిని పూజించి వారి పూజలు అందుకొన్నాడు .ఇంతవరకు బాగానే ఉంది .
నైమిశారణ్యం లో అఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుడైన సూతమహర్షి బలరాముని చూసి లేవటం కానీ ఎదురు వెళ్లి మర్యాద చేయటం కానీ చేయలేదు .బలరాముని అహానికి దెబ్బ తగిలింది అనిపించి ,తీవ్రంగా కోపం వచ్చి అక్కడి ముని జనంతో ‘’మహర్షులారా !సూతుడు ప్రతిలోమ జాతుడు .మహాత్ములైన మునిజనం మధ్య తానూ ఒక ముఖ్య వ్యక్తిని ఆని విర్ర వీగుతున్నాడు .ఏదో వ్యాసుల వారి అనుగ్రహం వలన కొన్ని కధలు నేర్చుకొని చిలక పలుకులు లాగా మీకు చెబుతున్నాడు .తనను తానూ సర్వజ్ఞుడి గా భావించుకొని గర్వం తలకకెక్కగా కళ్ళు మూసుకు పోయి విర్ర వీగుతున్నాడు పెద్దలనే గౌరవించటం లేదు చూశారు కదా .వీడెంత వీడి విద్య లు ఎంత ? ఆ విద్యలు వీడి ఒళ్ళు పోగరెక్కి౦చటానికే పనికొచ్చాయి .కానీ సత్వగుణం పెంపొందించేవి కావు .ధర్మ రక్షణ కోసం అవతరించిన మమ్మల్నే లెక్క చేయని వీడిని శిక్షించటం మాకు తప్పనిసరి కర్తవ్యమ్ .’’ఆని చెప్పి అందరూ చూస్తుండగా చేతిలో ఉన్న దర్భ కొనతో ఒక్క పోటు పొడిచాడు .ఆ చిన్న దెబ్బకే సూతుడు ప్రాణాలు వదిలేశాడు .అనుకొని ఈ సంఘటనకు మునిజనం తట్టుకోలేక హాహాకారాలు చేశారు .
కొంచెం తేరుకొని బలరాముడితో ‘’మహానుభావా !మేమే గౌరవంతో సూతమహర్షికి బ్రహ్మాసనం గౌరవంగా సమర్పించుకొన్నాం .అందుకని పీఠ గౌరవంతో సూతమహర్షి ఆసనం నుంచి మీరు వచ్చినప్పుడు లేవలేదు అన్నీ తెలిసిన మీరూ ఈ చిన్న విషయానికే కోపం తెచ్చుకొని ఇలా చేయటం న్యాయం ధర్మం కాదు .మీరు బ్రహ్మ హత్యా మహా పాపానికి ఒడి గట్టారు కనుక తక్షణం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి .మీలాంటి ధర్మాత్ములే ధర్మ౦ తప్పితే మిగిలిన వారి సంగతేమిటి ?ఇంకా లోకం లో ధర్మ౦ నిలుస్తుందా ?కనుక వెంటనే దీనికి పరిష్కారం మీరే చేయాలి .’’అన్నారు .
బలరాముడు జరిగిన తప్పు గ్రహించి మునులతో ‘’అయ్యలారా !తమో గుణం పొంగుకొచ్చి నా చేత ఈ పాపపు పని చేయించింది. దీనికి ప్రతి విధానం ఏమిటో మీరే సెలవివ్వండి .సూతమహర్షికి మళ్లీ ఆయుస్సు ,గొప్ప శక్తీ ఇవ్వాలను కొంటున్నాను మీకు సమ్మతమే కదా ?నా యోగాశక్తితో ఈ పని చేస్తాను .’’అన్నాడు మునులు ‘’మీరు దర్భను అస్త్రంగా చేసిన దానికీ ,ఆయన మరణించటానికి మా మనసు యే విధంగా వైక్లబ్యం పొందదొ అలా చేయమని ప్రార్ధన ‘’అన్నారు .
బలరాముడు ‘’మునులారా !వేదం ఆత్మా వై పుత్రనామాసి ‘’అన్నది అంటే తానె పుత్రరూపుడై వస్తాడు అనే తాత్పర్యం గల వేద వాక్యం అనుసరించి సూతమహర్శిని మళ్లీ బ్రతికించి గొప్ప సంపద ,ఆయుస్సు ,యేరోగం లేని తనం ,విద్యలో గొప్ప ప్రాభవం గల వాడిని గ చేసి నాకు ‘’పుత్ర సమానుడు ‘’గా సంభావిస్తాను .’’ఆని చెప్పి సూతుని బ్రతికించి ‘’కోపా వేషం తొ నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం మీరే సెలవీయండి ‘’ఆని ప్రాధేయ పడగా వారు ‘’మహాత్మా !ఇల్వలుడు అనే రాక్షసుడి కొడుకు పల్వలుడు అమావాస్య ,పౌర్ణమి పర్వ దినాలలో మునులు లోక కళ్యాణం కోసం చేసే యాగ శాలల్లో ప్రవేశించి అగ్ని కుండాలలో మలమూత్రాలు నెత్తురు కుమ్మరిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు వాడి పని పట్టండి ‘’అన్నారు .సరే అన్నాడు ముందుకు సాగాడు .
ఇంతలో పర్వ దినం వచ్చింది .యజ్ఞశాలల చుట్టూ తిరుగుతూ పల్వలుడు బలరాముడికి కనిపించాడు తన ఆయుదాలైన గద,రోకలిని స్మరించి నాగలిని వాడి మెడకు తగిలించి రోకలితో మాడు పగలగొట్టగా నెత్తురు కక్కుకొని చచ్చాడు బలరాముని దుష్ట శిక్షణకు మునులు సంతోషించి ఆనందంతో పూజలు చేసి సత్కరించి సాగనంపారు .’’ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది ‘’అంటే ఇదే .
సూత జనననాదులు
ప్రతి పురాణం ‘’సూతముని శౌనకాది మహర్షుల కిట్లనియె ‘’అనే వాక్యం తో ప్రారంభమౌతుంది .ఇందులో మనకు సూతుడు అనే ముని పురాణాలు శౌనకుడు అనే మహర్షితో సహా మిగిలిన వారికి పురాణ ప్రవచనం చేశాడు అని మాత్రమె మనకు తెలుస్తుంది .అసలు వాళ్ళు ఎవరో మనం ఆలోచించం .ఒక వేల ఆలోచ్చించి ప్రయత్నించినా మనకు లభించే విషయం చాలా స్వల్పమే .ఇదొక నిరుత్సాహం .నాకూ న్తవరకు ఆ ఆలోచన రాలేదు ఇవాళ బల్బ్ వెలిగి తెలుసుకొనే ప్రయత్నం చేశాను .నాకుదోరికిన సమాచారం మీకూ అందిస్తున్నాను .ఇంతకంటే అదనపు సమాచారం ఎవరి దగ్గర ఉన్నా పంపించి దీన్ని నిరభ్యంతరంగా పరిపూర్ణం చేయవచ్చు .
సూత ముని
పృధు చక్రవర్తి పితామహ సంబంధమైన యజ్ఞాలు చేస్తుండగా శ్రీమహా విష్ణువు వచ్చి పౌరాణికుడై సూతుడు అనే పేరుతొ పిలువబడ్డాడు .ఆతర్వాత అతని సంతతి వారందరికీ ఈపేరేవచ్చింది అని బ్రహ్మాండ పురాణ౦లో ఉన్నది .
పృధు చక్రవర్తి నూరు అశ్వమేధ యాగాలను చేద్దామను కొని బ్రహ్మావర్త దేశం లో సరస్వతీ నదీ తీరాన 99పూర్తి చేసి ,నూరవది మొదలు పెట్టగా, ఈర్షతో ఇంద్రుడు యాగాశ్వం అపహిరించి తీసుకు వెళ్ళగా ,అతడి కొడుకు ఇంద్రుని జయించి గుర్రాన్ని తెచ్చాడు .ఇంద్రుడు మళ్ళీ ఎత్తుకు పోయాడు పృధువుకు కోపం వచ్చి విల్లు బాణాలతో యుద్ధానికి బయల్దేరాడు .యాగం మధ్యలో వెళ్లరాదని మునులు చెప్పగా విరమించాడు .బ్రహ్మ వచ్చి ‘’మీరు ఏ దేవుని కోసం యాగం చేస్తున్నారో ఆయన అంశ ఉన్నవాడు ఇంద్రుడు కనుక వధార్హుడు కాడు.పృదువుకు 101యాగాల ఫలితం నేను అందిస్తున్నాను .ఇతడు నారాయణ అంశ సంభూతుడు .ధర్మాన్ని కాపాడటానికి పుట్టాడు ‘’అని చెప్పగా సంతృప్తి చెంది ,ఇంద్రునితో స్నేహం పాటించాడు .పరమేశ్వరుడు ఇంద్రునితో ప్రత్యక్షమై ‘’సత్పురుషులు దేహాభిమానంతో ఉండకూడదు .మత్సర వికారం పొంద రాదు ‘’అని ధర్మం బోధించి ఆశీర్వ దించారు .అలాగే పృధు చక్రవర్తి ధర్మ బద్ధంగా పాలించి రాజ్యం కొడుకులకు అప్పగించి తపస్సుకు వెళ్ళాడు
భాగవతం లో రోమ హర్షుడి కుమారుడు ఉగ్రశ్రవసుడు అనీ ఈయనే శౌనకాదులకు పురాణాలు చెప్పాడనీ ఉన్నది .
భారతం ప్రకారం కృష్ణ ద్వైపాయన వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాసి ,తాను వక్తగా ఉండకుండా నైమిశారణ్యం లో శౌనకుడు మొదలైన మహర్షులు దీర్ఘ సత్ర యాగం చేస్తుంటే ,వ్యాస శిష్యుడు రోమ హర్షణుడు కుమారుడైన సూత మహర్షిద్వారా సత్కాలక్షేపంగా పురాణాలు చెప్పించాడు .
మార్కండేయ పురాణం లో ఇలా పురాణ ప్రవచనం చేస్తుండగా శ్రీకృష్ణుని అన్న బలరాముడు వచ్చాడు .ఆయనను చూసి సూతుడు గౌరవంగా లేచి నిలబడ లేదు .బలరాముడికి కోపం నషాళానికి అంటి క్షణం ఆలోచించకుండా సూతుడిని సంహరించాడు .శౌనకాది మహర్షులు ప్రార్దిస్తే మళ్ళీ సూతుడిని బ్రతికించి పురాణ ప్రవచనం యధేచ్చగా జరిగేట్లు చేశాడు .
ఆధారం -ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారి -భాగవత నవనీతం -దశమ స్కంధం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-25-ఉయ్యూరు .

