శుక మహర్షికి పిల్లా జెల్లా ఉన్నారా ?
ఉన్నారనే దేవీ భాగవతం చెబుతోంది .శుక మహర్షి తన తండ్రి వేద వ్యాస మహర్షి అయిన కృష్ణ ద్వైపాయనుని కుమారుడు .తండ్రి వద్ద వేద వేదాంగాలు అభ్యసించి మహా జ్ఞాని అయ్యాడు .తండ్రి చాలా సంతోషించాడు .ఒక రోజు కొడుకుతో ‘’నాయనా !సకల శాస్త్రాలు నేర్చి మహాజ్ఞాని వయ్యావు .ఇక పెళ్ళి చేసుకొని గృహస్థాశ్రమ ధర్మాలు నెరవేర్చు .వివాహం చేసుకొని కుమారుని పొంది వంశ విస్తరణ చేయి ‘’అన్నాడు .దానికి ‘’తండ్రీ !నాకు సంసార లంపటం లో దిగాలని లేదు.హాయిగా అరణ్యాలలో ఉంటూ తాపోధ్యానాలతో మోక్షం పొందాలనుకొంటున్నాను.;;అన్నాడు తండ్రి ‘’గృహస్థాశ్రమం చాలా పవిత్రమైనది .అందరికి ఆదర్శ ప్రాయం. గృహస్తు లేకపోతె అతిధి అభ్యాగతుల్ని యతుల్ని సన్యాసుల్ని ఎవరుఆదరిస్తారు ?’’అన్నాడు ‘సంసారం లో ఉంటే కామసుఖం మీదే ధ్యాస ఉంటుంది .మరిదేనిపైనా ఆలోచన ఉండదు. ఇంత చదివి నేర్చి నేను మళ్లీ ఆ కూపం లో ఇరుక్కోలేను తండ్రీ .మన్నించు ‘’అన్నాడు .తండ్రి ‘’బాబూ !విదేహ రాజ జనకుడు రాజర్షి .జీవితం సాగిస్తూనే రాజ్యపాలన చేస్తూనే జీవన్ముక్తుడు ఆని పించుకొన్నాడు .నేకేమైనా సందేహాలుంటే ఆయన ను సందర్శించి అనుమానాలు నివృత్తి చేసుకొని మళ్లీ నాదగ్గరకు రా’’అన్నాడు .సరే ఆని .శుకుడు మిధిలకు వెళ్లాడు .
మిధిలా నగరం లో ద్వారపాలకుడి తొ మాట్లాడగానే అక్కడి తత్వజ్ఞత ఏమిటో అర్ధమైంది .అతడు శుకునిలోని బ్రహ్మజ్ఞానిని గుర్తించి గౌరవించాడు .రాజప్రాసాదానికి తీసుకు వెళ్లాడు .ఇంతలో మంత్రివచ్చి శుక మహర్షికి స్వాగతం చెప్పి జనక చక్రవర్తి వద్దకు తీసుకు వెళ్లాడు .అరణి గర్భ సంభూతుడైన పవిత్రమూర్తి శుక మహర్షి దర్శనంతో మహారాజు పరమానందభరితుడై పూజించి సత్కరించి వచ్చిన పని అడిగాడు .శుకుడు తండ్రి దగ్గర పెట్టిన’’ రికార్డే’’ మళ్లీ పెట్టాడు . ఇద్దరిమధ్య చర్చలు తీవ్రంగా జరిగాయి .చివరికి జనకుడు ‘’మహర్షీ !చీమ చెట్టు మొదట్నించి పాకుకుంటూ పైకి హాయిగా అలసట లేకుండా ఎక్కిఫలం అందు కొంటుంది .పక్షి మహావేగం గా , ఎవరైనకోసుకుపోతారేమోఅనే భయంతో ఎగిరి అలసి పోతుంది .మనసుగట్టి పిండం .తగినంత అభ్యాసం లేకపోతె దాన్ని జయించటం కష్టం .అందుకే ఆశ్రమాల క్రమం లోనే జయించాలి .గృహస్థాశ్రమం లో ఉన్నా మంచి బుద్ధి ,శాంతం ,ఆత్మజ్ఞానం ఉన్నవాడు దేనికీ లొంగడు ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ అన్నిటిని సమ దృష్టితో చూస్తాడు .జీయయాత్ర సాగిస్తూనే ముక్తుడౌతాడు .నేను రాజ్యపాలన చేస్తూ కూడా జీవన్ముక్తుడిని అందుకే కాగలిగాను .కనపడేదాన్నిఎలాగో అలా బంధించవచ్చు .నిరంజనం నిర్వికారం అయిన ఆత్మ ఎవరికీ కనిపించనిది .దాన్ని ఎలా బంధిస్తావు? ?.సుఖ దుఃఖాలకు మనస్సు కారణం .మనసు నిర్మలంగా ఉంటే అంతా నిర్మలంగా ఉంటుంది .యాగాలలో నువ్వన్నట్టు హి౦స లేదు .నిజానికి అది అహింస .అగ్నిలో సమిధ వేస్తె పొగ వస్తుంది.వెయ్యనప్పుడు ,కాలిపోయినప్పుడు ఏమీ ఉండదు .నువ్వుగురుపుత్రుడివి .నాకు ఆరాధ్యుడవు .పితృ బంధం వదిలేసి అడవులకు వెడతాన౦టున్నావు . అక్కడ జంతువులూ ఉండవా ?వాటితో అనుబంధం ఏర్పడదా ? మరి నీ నిస్సంగత్వం ఎలా సాగుతుంది ?’’నేను బద్ధుడను కాను ‘’అనుకొన్న వాడికి ఎప్పుడూ సుఖమే .బద్దుడిని అనుకొంటే దుఖం .అందుకే నాకు సుఖం నీకుదుఖం.దేహం ,బంధం నాది కాదు అనితెలుసుకోవటమే ముక్తత్వం .ఈ ధనం రాజ్యం సంపదా ఏవీ నావికావు .అనుకొంటాను .అందుకే జీవన్ముక్తుడిని ‘’ఆని జనక మహారాజు చెప్పాడు సంతృప్తి చెందాడు శుకమహర్షి .
ఇంటికి చేరి తండ్రి వ్యాసునికి ఆనందం కలిగించాడు .సమాయత్త చిత్తం తొ తండ్రి ఆశ్రమం లో కొంతకాలం గడిపాడు . జనకుని తొ సంభాషణ వలన పరనిర్వ్యుతి కలిగింది .యోగమార్గం అనుసరించాడు.’’పీవరి’’ అనే సుందరిని పెళ్ళి చేసుకొన్నాడు .ఆ దంపతులకు కృష్ణ ,గౌరప్రభ ,భూరి , దేవ శ్రుతుడు అనే నలుగురు కొడుకులు ,,కీర్తి అనే కూతురు కలిగారు .కీర్తిని విభ్రాజుడి కుమారుడు ‘’అణుహుడు’’కుఇచ్చి వివాహం చేశాడు .వీరికి బ్రహ్మదత్తుడు పుత్రుడు .ఇతడు రాజయ్యాడు .చాలాకాలం రాజ్యం చేసి నారద ఉపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మారి ,కొడుక్కి రాజ్యం అప్పగించి బదరికాశ్రమం చేరి యోగ మార్గాన్ని అవలంబించాడు.
మనకు దాదాపు ఈ విషయాలేమీ పెద్దగా తెలియవు .
ఆధారం -ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి ‘’శ్రీ దేవీ భాగవతం ‘’.
మీ -గబ్బిట దర్గా ప్రసాద్ -13-8-25-ఉయ్యూరు

