త్రిమూర్తులకు డూప్లికేట్ లున్నారా ?ముగురయ్యలు మగువ లయ్యారా ?
అవును అంటోంది దేవీ భాగవతం
జనమేజయుడికి వ్యాస మహర్షి దేవీ భాగవతం వివరిస్తుండగా తను మోహ జలాలు నిండిన సంసార సముద్రం లో మునిగితేలుతున్నానని జ్ఞాన నావతో దాటించమని కోరగా ,వ్యాసుడు తనుకూడా ఒకప్పుడు ఇలాంటి సంకట స్థితినే అనుభవించి నారద మహర్షి ని అడిగానని ,ఆయనకు తండ్రి బ్రహ్మ చెప్పిన విషయాలే తెలియ జేస్తానని చెప్పాడు .నారదునికి బ్రహ్మ చెప్పిన విషయాలు .
‘’ మహా ప్రళయం సంభవించి నప్పుడు అన౦త జలరాశిలో కమలం నుంచి నేను పుట్టాను .నేను ఎలా పుట్టాను నాకు రక్షకుడు ఎవరు నేను ఏమి చేయాలి ? ఈ నీటికి ఆధారం ఏది,పంకజం చుట్టూ బురద ఏమిటి ?భూమి ఉందా ?ఆని ఆలోచించి బురద లోకి దిగా .వెయ్యేళ్ళు వెతికినా ఏమీ కనిపించలేదు .’’త’’ప ఆని అశరీర వాణి వినిపిస్తే ,పద్మలో కూర్చుని వెయ్యేళ్ళు తపస్సు చేశా .మళ్లీ ఆకాశ వాణి ‘’సృజ ‘’అన్నది .ఎలా ?అనుకోగా మధుకైటభ రాక్షసులు వచ్చి యుద్ధానికి రమ్మన్నారు .నీటిలోకి నెమ్మదిగా జారి తప్పుకున్నా .విష్ణుమూర్తి, ఆతర్వాత శివుడు కనిపించారు .నన్ను రక్క్షించే వారు లేరా ?ఆని అరిచా .జగదంబ నవ్వింది ఇంతలో ఒక దివ్యవిమానం వచ్చింది .త్రిమూర్తులారా మీకో అద్భుతం చూపిస్తా ఎక్కండి అంది .ఓం అంటూ అంగీకారం చెప్పి ముగ్గురం ఎక్కాం.
విమానం స్వర్గం చేరింది అక్కడ మహేంద్రుడుశచీ దేవితో కనిపించాడు .నందన వనం పారిజాతం వగైరాలు కనిపించాయి .ఇంకా పైకి విమానం వెళ్లగా బ్రహ్మలోకం కనిపించింది .అక్కడ మరొక బ్రహ్మ సకల వేదాలు వేదాంగాలు సాగర నదీ పర్వతాలతొ కనిపించి మాకు ఆశ్చర్యం కలిగించాడు .నాల్గు ముఖాలతోఅచ్చం నీలాగా ఉన్నాడు ఎవరయ్యా ?ఆని శివ కేశవులు నన్ను ప్రశ్నించారు .ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాను .తర్వాత విమానం కైలాసం చేరింది .ప్రమధులు యక్షులు అక్కడ ఉన్నారు .వృషభారూఢుడై త్రిలోచనుడు కనిపించాడు .ఈ డూప్లికేట్ శంకరుడిని చూసి నేను మా బాబు విష్ణువు ఆశ్చర్య పోయాం .తర్వాత విమానం ఇంకా పైకి వెళ్లి విష్ణులోకం చేరింది అక్కడ పీతాంబర ధారి శ్రీ మహా విష్ణువు దర్శన మిచ్చాడు .లక్ష్మీ దేవి వింజామర వీస్తోంది .నేనూ శివుడు మరింత ఆశ్చర్యపోయాం .త్రిమూర్తులం ముగ్గురం ఒకరి మొహాలు ఒకళ్ళం చూసుకొంటూ ఆశ్చర్యపోయాం మాకు డూప్లికేట్ లు ఉన్నందుకు .ఎందుకో తెలియనందుకు ?విమానం క్షీర సముద్రం చేరింది .
క్షీర సముద్ర మధ్య లో ఒక శివాకార పర్య౦క౦ పై మహా తేజ్స్వంతంగా ఎర్రని చీర ,ఎర్రని వస్త్రాలు ,ఎర్రపూమాలలు ఎర్రనిపెదవులు ఎర్రని కనులతో ,మిరుమిట్లు గొలిపే చూపులతో ,వరదాభయ హస్తాలతో ,పాశా౦కుశాలతోకరుణా మూర్తిగా చిరునవ్వులు చిందిస్తూ నిత్యారుణ,,నవ యవ్వని ,కుమారి మణి మయ భూషణాలతో కిరీటంతో షట్కోణ పీఠంపై దేవ కన్యలు పరివేష్టించి ఉండగా శ్రీ భువనేశ్వరి దర్శన మిచ్చింది .మేము ముగ్గురం మహాదాశ్చర్యం పొంది పరమానందం పొందాము ..
విష్ణుమూర్తి ‘’ఈవిడే మహాదేచి మహావిద్య మహామాయ .పూర్ణ .సర్వ జనకోటి చిహ్నాలు తన శరీరం లో లీనం చేసుకొంటుంది .మనం ధన్యులం. దుర్లభమైన దేవీ దర్శనం పొందాం .సమస్తం దృశ్యమైతే ఈమె ద్రష్ట .ప్రళయంలో మర్రాకుపై నాకు ఉయ్యాలలూపింది ఈమహాశక్తియే .’’ ముగ్గురం వేర్వేరుగా అమ్మవారిని స్తుతించాం.మా చూపులు దేవి పద్మాలపై పడినాయి బొటన వ్రేలిగోరు అద్దం లాప్రకాశించి బ్రహ్మాండం అంతా అందులో ప్రతి ఫలించింది .నేను నాపద్మం ,సరస్వతి ,శేషశాయి ,లక్ష్మి ,,కైలాసం శివ పార్వతులు అందరూ కనిపించారు .ఆమెను విశ్వ మాత గా భావించాం .ఆమె ఇష్ట సఖులు మమ్మల్ని తమ సఖులుగా భావించారు .మగువలుగా మారిన మా రూప సౌందర్యాలు మాకే మహా మోహనంగా కనిపించాయి. అలా అమ్మ సన్నిధానం లో వంద ఏళ్ళు ఉండిపోయాం .’’ఆని బ్రహ్మ నారదుడికి చెప్పగా ,నారదుడు వ్యాసునికి వివరించగా వ్యాసర్షి జనమేజయునికి తెలియ జేశాడు .
ఆధారం -ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ౦గారి శ్రీ దేవీ భాగవతం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -21-8-25-ఉయ్యూరు .

