పాండవులు రాజసూయ యాగం చేసినా రాజ్యం కోల్పోయి ఎందుకు కష్టాల పాలయ్యారు ?
జనమేజయునికి వ్యాసభగవానుడు ఈ విషయాన్ని దేవీ భాగవతం లో చెప్పాడు .శ్రీ కృష్ణుడు స్వయంగా వచ్చి పూజలందుకొనగా పాండవులు రాజసూయ యాగం చేసినా భూరి దక్షిణలు సమర్పించినా ,యధావిధిగా యాగం చేసినా ,బ్రహ్మాండమైన అన్నదానాలు చేసినా , మూడు నెలలు తిరక్కుండానే ,వాళ్ళు జూదం లో ఓడిపోయి రాజ్యం కోల్పోయి,పాండవ ధర్మపత్నినిండు సభలో అవమానం పాలై , అడవులపాలై కష్టాల మున్నీటిలో మునిగిపోయారు .ఎందుకు ఇలా జరిగింది ?యజ్ఞ ఫలం ఏమైంది ?మహా పరాక్రములై ఉండి కూడా విరాట రాజు కొలువులో ప్రచ్చన్న వేషధారణతో ఎందుకు గడపాల్సి వచ్చింది?కీచకుని చేతిలో యాజ్ఞ సేని పరాభవం ఎందుకు పొందింది ?యాగంలో పాల్గొన్న సద్బ్రాహ్మణులు వర్షించిన అమోఘ పవిత్ర ఆశీర్వాదాలు ఏమయ్యాయి ?స్వయంగా వాసుదేవుడే దగ్గర ఉండి నడిపించిన యాగ ఫలం ఏమైంది ?శ్రీ కృష్ణ పరమాత్మయడల పాండవులకున్న అచంచల భక్తిఏమైంది? సభలో ద్రుపద రాజకుమారిని జుట్టు పట్టుకు ఈడుస్తుంటే పాండవులు ఎందుకు కాపాడ లేకపోయారు ?ఈ ధర్మ విపర్యానికి కారణం ఏమిటి ?
అలా వాళ్ళ ముఖాలమీద రాసి పెట్టి ఉంది కనుక అలాజరిగింది అనుకొంటే పవిత్ర వేద మంత్రాలు వ్యర్ధం అయిపోయినట్లేగా ?అవే వ్యర్ధమైతే మొత్తం వ్యవస్థ వ్యర్ధమై పోయినట్లేగా ?అన్ని ప్రమాణాలు,సర్వ విధ ఉపాయాలు వ్యర్ధమైనట్లేగా ?కనుక జరగాల్సింది జరుగు తుంది అనే ఆలోచన బుద్ధి లోకి రాకూడదు .దైవాన్నీ ,ఉపాయాన్నీ రెండిటిని కలిపి ఆలోచించాలి .
‘’సర్వం ప్రమాణం వ్యర్ధం స్యాత్ భవితవ్యే కృతేహృది -ఉభయం చాపి మంతవ్యం దైవం చోపాయ ఏవచ
‘’కృతే కర్మణిచేత్సద్ది ర్విపరీతా యదా భవేత్ -వైగుణ్యం కల్ప నీయం స్యాత్ ప్రాజ్నైఃపండిత మౌళిభిః’’.
ఒక పని చేసినప్పుడు విపరీత ఫలం వస్తే ,ఆ పనిలో ఎక్కడో పొరబాటు జరిగిందని గ్రహించాలి .దాన్ని శోధించి తెలుసుకోవాలి ? కర్తృ భేదమా , ద్రవ్య భేదమా ?మంత్ర భేదమా ?ఈ మూడింటిలో ఏదో ఒక లోపం జరిగి ఉంటుందని అర్ధం చేసుకోవాలి .పాండవుల విషయం లో ఏం జరిగింది ?అన్యాయార్జిత ద్రవ్యం యజ్ఞానికి పనికి రాదు.దాని వల్ల ఇహలోకం లో కీర్తి రాదు.న్యాయర్జిత ద్రవ్యాన్నే సుకృతాలకు ఉపయోగించాలి .రాజసూయ యాగానికి పాండవులు ఉపయోగించిన ద్రవ్యం న్యాయార్జితం కాదు .రాజులతో యుద్ధాలు చేసి ఓడించి దోచి తెచ్చిన ద్రవ్యం .అందుకే బెడిసి కొట్టింది .గర్విష్టులై అంటే సాభిమానులై అధికార ప్రదర్శనగా చేశారు కనుక వ్యతిరేక ఫలితం వచ్చి అన్నీ కోల్పోయి కస్టాలపాలయ్యారు .ఆని జనమేజయునికి వ్యాసుడు చెప్పాడు .
ఒక సారి దేవేంద్రుడు రాక్షస నాశనం కోసం విశ్వ రూపుడు ను బ్రహ్మగా పెట్టుకొని యాగం చేశాడు .అతడు రాక్షస పక్షం వాడు. వాడు తన రాక్షస పక్షపాతం వదలకుండా ‘’దానవులకు దేవతలకు స్వస్తి అగుగాక ‘’ఆని మంత్రం చెప్పి ముగించాడు. రాక్షస వినాశనం జరగక పోగా వాళ్ళు అంతా తల్లి దగ్గర చేరి దిన దినాభి వృద్ధి చెందారు .ఇదేమిటా ఆని ఇంద్రుడు ఆలోచించి ‘’కర్త్రు’’దోషం ఆని గ్రహించి ఒక రాక్షసుడిని బ్రహ్మ గా తాను పెట్టుకోవటం వలన జరిగిన అనర్ధం ఆని గ్రహించి ,వజ్రాయుధం తొ విశ్వ రూపుడి తన నరికేశాడు .
ద్రుపదుడు ద్రోణుడిని చంపే పుత్రుడు కావాలని ఎలాంటి లోపం లేకుండా కర్త్రుద్రవ్య మంత్ర లోపం లేకుండా యజ్ఞం చేశాడు .ద్రుష్టద్యుమ్నుడు,ద్రౌపది జన్మించారు .యజ్ఞఫలం సఫలమైంది .దశరధ మహారాజు పుత్రకామేష్టి లోపాలు లేకుండా చేసి నలుగురు కుమారులను పొందాడు .అంటే నిర్దుష్టంగా ,యుక్తి యుక్తంగా యజ్ఞాలు నిర్వహిస్తేనే సత్ఫలితాలు ఇస్తాయి .దోష జుష్టంగా చేస్తే విపరీత ఫలితాలిస్తాయి .కనుక అత్యంత జాగ్రత్తగా యజ్ఞ కార్యం నిర్వహించాలని వ్యాసర్షి జనమేజయునికి చెప్పాడు .
ఆధారం -ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ గారి శ్రీ దేవీ భాగవతం .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -23-8-25-ఉయ్యూరు .

