వేద శాస్త్ర పారంగతులైన ఉద్దండ పండితులు,దర్శనాలంకార ,తర్క వేదాంత సార్వ భౌమ -బ్రహ్మశ్రీ మాండలీక వేంకట శాస్త్రి
తూగోజి అమలాపురం దగ్గర భట్నవిల్లి గ్రామం లో 20-10-1900 మాండలీక సుబ్రహ్మణ్యం ,రామ లక్ష్మమ్మ దంపతులకు బ్రహ్మశ్రీ మాండలీక వేంకట శాస్త్రి జన్మించారు .అక్కడే పండిత గొర్తి సుబ్బయ్య శాస్త్రి గారి వద్ద సంస్కృతం నేర్చి కావ్య నాటక అలంకార గ్రంథాలు అభ్యసించారు .తర్క వేదాంత శ్రీ బులుసు అప్పన్న శాస్త్రి గారి వద్ద తర్కశాస్త్రం కొంతవరకు చదివి ,పిఠాపురం ఆస్థాన సంస్కృత పండితులు శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి ,’’తర్క పంచానన ‘’ధూళిపాల సూర్య నారాయణ శాస్త్రి లవద్ద సంప్రదాయ పద్ధతిలో తర్కాన్ని సంపూర్ణంగా నేర్చారు .పిఠాపురం వారు నిర్వహించిన పోటీ పరిక్షలో ఉత్తమ శ్రేణిలో కృతార్ధు లయ్యారు .మహారాజా వారి ఉపకార వేతనం తొ శ్రీ దెందుకూరు నరసింహ శాస్త్రి గారి వద్ద అద్వైత వేదాంతాన్ని నేర్చి పరీక్షలో ఉత్తీర్ణులై గురువు అనుగ్రహం పొందారు .
పండితులలో ఉండాల్సిన భేదకత ,బోధకత ,వాదకత శాస్త్రిగారికి విద్యార్ధి దశనుంచి అలవడిన సుగుణాలు .అసాధారణ ప్రజ్ఞా విశేషం మాండలీక వారిది .శ్రీ జోశ్యుల సీతారామ శాస్త్రి గారి పుత్రిక సుబ్బ లక్ష్మమ్మ గారిని వివాహమాడారు .1926 అక్టోబర్ లో పగోజి గణపవరం వద్ద సిరిపల్లె గ్రామం లో ఈమని వెంకటేశ్వర్లు గారు స్థాపించిన ‘’సఖ్యాభి వర్ధక నిలయం ‘’సంస్కృత పాఠశాలలో తర్క ,వేదాంత ఉపాధ్యాయులై 1920వరకు పని చేశారు .ఎందఱో విద్యార్ధులను తర్క వేదాంత విశారదులను చేసిన ఆదర్శ గురు వరేణ్యులు శాస్త్రి గారు .
తర్వాత ద్రాక్షారామం లో ‘’ద్రాక్షారామ సంస్కృత పాఠ శాల’’లోఅధ్యాపకులుగా పని చేసి ,తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాల’’లో లెక్చరర్ గా ఒక ఏడాది పని చేసి ,అక్కడి నియమాలు సరిపడక పదవీ విరమణ చేసి ,శ్రీ కంచి కామ కోటి పీఠాధిపతి శ్రీ చంద్ర శేఖరసరస్వతీ మహా స్వాముల ఆదేశానుసారం కాశీలో కంచి మఠం లో విద్యార్ధులకు తర్క వేదాంతాలు బోధించారు .1942లో మచిలీ పట్నం లోని ‘’సాంగ వేద పాఠశాల ‘’ ప్రిన్సిపాల్ అయి దాని అభివృద్ధికి విశేష కృషి చేశారు .
1962లో కంచిలో పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి తర్క వేదాంతాలు బోధించారు .కొంతకాలం నెల్లూరు ,ఏలూరు మొదలైన చోట్ల తర్క వేదాంత అలంకార శాస్త్రాలు విద్యార్ధులకు బోధించి తీర్చి దిద్దారు .ఏలూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని 25ఏళ్ళు ఉండి,చుట్టుప్రక్కల భాగవత రామాయణ భారత పురాణ ప్రవచనాలు నిర్విఘ్నం గా సాగించారు .ఆసేతు హిమాచల పర్యంతం తీర్ధ యాత్రలు చేసి ,ధార్మిక ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో చైతన్యపరచి ,ఏలూరు విశాఖ తొ సహా అనేక చోట్ల ఆస్తిక దేవతా జ్ఞాన మందిరాలను ,గీతాభవనం శంకర మఠం లను నెలకొల్పారు .పండిత పరిషత్తులలో తమ వాద కౌశలంతో జ్ఞాన జ్యోతులు వెలిగించారు .
మాండలీక శాస్త్రి గారి అశేష పాండిత్యాన్ని గుర్తించి మచిలీపట్నం లో పండితులు ,పురజనులు ‘’తర్క వేదాంత సార్వ భౌమ ‘’బిరుదునిచ్చి ఘనంగా సత్కరించగా ,నడయాడే దైవం కంచి మహాస్వామి వారు శాస్త్రి గారికి ‘’దర్శనాలంకార ‘’,శాస్త్ర రత్నాకర ‘’బిరుదులందించి గౌరవించి మహాసత్కారం జరిపించారు .1960లో ఏలూరు పురజనులు ,పండితులు ,శిష్యులు షష్టిపూర్తి సమ్మానోత్సవాన్ని నేత్ర పర్వంగా జరిపారు .శాస్త్రి గారు 23-12-1970న 70వ ఏట పరమపదించి ‘’దివిజ పండితవరుల గుండియల్ దిగ్గురనగ ‘’ సరస్వతీ మహాసామ్రాజ్యం చేరారు
ఆధారం -ఏలూరుకు చెందిన శ్రీ బి.వి .దాశరధి గారి వ్యాసం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-25-ఉయ్యూరు .

