మనకు పెద్దగా పరిచయం లేని కంకంటి పాపరాజు తమ్ముడు నరసింహ రాజు రాసిన -విష్ణుమాయావిలాసం నాటకం
పాపరాజు తమిళనాడు లోని ప్రళయకావేరి అనే పులికాట్ లో అమీన్ గా ఉండేవాడు .తండ్రి అప్పయ .తల్లి నరసాంబ .1649 వాడు .సమకాలికులు ‘’సమీర విజయ కుమార ‘’కర్త పుష్పగిరి తిమ్మన్న,వేలూరు రాజధానిగా పాలించిన వీర వెంకట రాయల ఆస్థానకవి మగదల తిమ్మన్న ,కర్నాటక రాజ్యం పై దండెత్తి వచ్చి,ఎలందా వారిని ఓడించి .1649లో పులికాట్ ను ఆక్రమించిన మహమ్మద్ మీర్ జుమ్లా ఖాన్ తొ సన్మానం పొందిన ధరణి దేవుల రామయ మంత్రి .పుష్పగిరి తిమ్మన్న పాపరాజుకు నరసింహరాజుకు రచనలో సాయపడ్డాడు .ఈ విషయం నరసరాజు తన గ్రంథం లో చెప్పాడు -‘ఘను సంస్కృతాంధ్ర కవనాతి దక్షు -మాయన్న సఖుని తిమ్మన్నను గృతి సహాయుని ‘’ఆని చెప్పుకొన్నాడు .
కంకంటి నరసరాజు ‘’సరస విద్వత్ కవి జన శరణ్యుడు’’.ఈ ద్విపదను తన అన్న పాపరాజు కలలో కనిపించి చెప్పినట్లు శ్రీరామ చంద్రునికి అంకితమిచ్చాడు .శ్రీనాథుడు తన హరవిలాసం లో శివ విలాసాలన్నీ ఒక చోట చేర్చినట్లు గా ,నరసరాజు విష్ణు మహిమలను ఒక చోట చేర్చి ఇందులో కూర్చాడు .కథలకు ఒక చక్కని సన్నివేశం ,ప్రణాళిక కూర్చాడు .పురాణ విష్ణు కథలను గుది గుచ్చి స్వతంత్ర రచన చేశాడు .ముక్కు తిమ్మన పారిజాతాపహరణం ఇతనికి స్పూర్తి .సత్యభామ గర్వాప హరణం ఆధారంగా ఈ కథలకు ఐక్యత కల్పించాడు .ఈ రెండిటికి మధ్య కొలికి పూసగా కృష్ణుని నర్మ సఖుడు గోవింద శర్మ ఉంటాడు .
విష్ణు మాయావిలాసం నాటకం మొదటి రంగం సత్యా దేవి సమక్షం .ఆమెకు గోవింద శర్మ ఈ కథలు చెప్పి ,పారిజాత మాలిక బహుమానంగా పొందాడు .రెండవ సారి ధర్మ రాజు సభలో వర్ణించాడు .ఇది అయిదు ఆశ్వాసాల నాటకం .శుక యోగి చెప్పినట్లే గోవింద శర్మ ఇక్కడ కధకుడు .ఎల్లనార్యుని మాటలను వర్ణ ,లోకోక్తులను తన ద్విపదలలో గుప్పించాడు నరసరాజు .మరింతగా రసవంతం చేశాడు నరసరాజు .
లక్ష్మి బ్రహ్మ రుద్రాదులే విష్ణు మాయను అతిక్రమించ లేక పోవటం కథా లక్ష్యం .రెండు మూడు ఆశ్వాసాలలో బ్రహ్మ విష్ణు ల గర్వభంగాలు ,విష్ణువు కల్పించిన ఒక కొలను చూసి లక్ష్మి ఎలా నివ్వెర పోయిందో చూడండి -‘’వనజాకారము జూచే వాడు కల్హార -వనరుహ కైరవాలి గలదాని -నిండార జిగిరించి నిగనిగల్గనక-దండి మానిన వాడు తలిరులతోడ-గలయబూచి మరందగానముల్లేక ‘’
మూడవ ఆశ్వాస౦ లో భక్త పుండరీకుని కధ .శ్రోత్రియ బ్రాహ్మణుడు విష్ణుమాయచే బోయ పడుచు ను ప్రేమించి వెంటపడటం -‘’కరము మీటగు పచ్చ గాజులనొప్పు -కరముల సకుటుంబ గరమ్ములు మెరయ -సన్నంపు టోల్లియు సగమొప్పగట్టి -అధికత మధురమోహరాధాంగమిధున –నిధువన క్రీడలు నెమ్మి గన్గోనుచు-జపము సాలించి యాచమనంబు సేయు -నెపమున లేచి,యన్నెలతుక డాసి ‘’ .అలాగే బ్రహ్మ గర్వభంగం లో మాయాసరస్వతి పోయే హొయలు వికారాలు చూద్దాం -‘’అన్నీరేజ గంధి-కన్నీరు నించు ,తొంగలి రెప్పలార్చి -మన్నించు పతిరాక మసలె నేడనుచు -భూరి మోహనమున చెలువుని చెలువంబు చింతించి కొనుచు ‘’మూడో చెయ్యికల ఆ వెర్రి బాగుల బ్రహ్మ బిత్తర పోడా ‘’అంటారు తిరుమల రామ చంద్ర .
నాల్గవ ఆశ్వాసం లో శివ గర్వ భంగం .మోహిని వేషం లో ఉన్న హరిని చూసి చొంగకార్చుకొనే శివుడు -‘’మరుడను పగవాడు మటు మాయలాడు -హరి యాడు రూపంబు-చవ్వ చేయక గన్న జగములోన -కమలాసనాదులు ఆ ఘనుని మాయలు -భ్రమ గొని యున్నారు ప్రాజ్నత లుడిగి ‘’ఇక భోలా శంకరుడు ఆగుతాడా ?’’
ఇంతటి రసవత్కావ్య నాటకాన్ని శ్రీ పాలపర్తి నాగేశ్వర శాస్త్రి గారు 1865లో మద్రాస్ లో విద్వన్మనోరంజని ప్రెస్ లో ముద్రించారు .పండితులు దీనిపై విమర్శలు కురిపించారు .ఇవాళ ముద్రిత ప్రతికూడా లేదు ఆని ,కనుక విష్ణుమాయా విలాసం పునర్ముద్రణ పొందాలని ,దీనితోపాటు కంకంటి పాపరాజు రాసిన యక్షగానం కూడా ముద్రించాలని శ్రీ తిరుమల రామ చంద్ర ఆశించారు .జరిగిందో లేదో నాకు తెలియదు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-25-ఉయ్యూరు

