ఆంధ్ర నాటక పితామహ శ్రీమాన్ ధర్మవరం రామ కృష్ణమాచార్యుల వ్యక్తిత్వం ,రచనలో మానవత్వం

ఆంధ్ర నాటక పితామహ శ్రీమాన్ ధర్మవరం రామ కృష్ణమాచార్యుల వ్యక్తిత్వం ,రచనలో మానవత్వం

ఆంధ్ర నాటక పితామహ శ్రీమాన్ ధర్మవరం రామ కృష్ణమాచార్యుల వ్యక్తిత్వం ,రచనలో మానవత్వం

 శ్రీ ధర్మవరం రామ కృష్ణమాచార్యులు మొదటగా కన్నడం లో ఉపెంద్రవిజయం ,స్వప్నానిరుద్ధం నాటకాలు రాశారు తర్వాత తెలుగులో చిత్ర నళీయం నాటకం రాశారు.తర్వాత అచ్చు అయినవి -పాదుకా పట్టాభిషేకం ,ప్రహ్లాదనాటకం ,సావిత్రీ చిత్రాశ్వం ,మోహినీ రుక్మాంగద ,విషాద సారంగధర ,బృహన్నల ,ప్రమీలార్జునీయం ,పాంచాలీ స్వయం వరం ,చిరకారి ,ముక్తావళి ,రోషనార ,శివాజీ ,వరూధిని ,అభిజ్ఞాన మణి మంతం అనే 14నాటకాలు రాశారు .అచ్చు కానివి -ఉషా పరిణయం ,సుశీలా జయపాలీయం ,అజామిళీయం , యుధిష్టిర యౌవరాజ్యం ,సీతాస్వయం వరం ,ఘోషయాత్ర ,మదన విలాసం ,ఉన్మాద రాహు ప్రేక్షణికం ,రాజ్యాభిషేకం ,సుగ్రీవ పట్టాభి షేకం ,విభీషణ పట్టాభిషేకం ,హరిశ్చంద్ర ,గిరిజాకల్యాణ౦  ,ఉదాన కళ్యాణం ,ఇంగ్లీష్ హరిశ్చంద్ర అనే 15.మొత్తం 31.

    వీరి నాటకాలు బాగా ప్రసిద్ధి పొందటానికి మూల ఇతి వృత్తం లో కొద్ది మార్పులే చేయటం ,సమకాలిక విషయాలు చొప్పించటం ,రసోషణ ,పాత్ర చిత్రణ ,మానవ చిత్తవృత్తి నిరూపణ,సన్నివేశ కల్పన ,నైపుణ్యంగా నాటకారంభం ,సరళ శైలి ,పాత్రల స్వభావ ఉన్మీలనం లో వైవిధ్యం ,అన్నిటికీ మించి ఆయన నటుడు కూడా కావటం అన్నారు తిరుమల రామచంద్ర .కొందరుమాత్రం ధర్మవరం వారి నాటకాలలో క్రమ పరిణామం ఉండదు ,భావం మళ్లీ మళ్లీ పద్యాలలో రావటం ,ముఖ్య పాత్రల క్రియాశూన్యత్వం ,స్త్రీపాత్రల ప్రాధాన్యం ,సామాన్యమానవుడికి చోటు లేకపోవటం ,ప్రబంధ ధోరణిగా సాగటం ,భావ గాంభీర్యం లేని పదాలు ,విపరీత ఉపన్యాస ధోరణి ,ప్రాచ్య సంప్రదాయాల పరిహారణ ఆని చెవులు కొరుక్కున్నారు ఆని తిరుమల ఉవాచ .మన దేశ నాటకాలలో ఉండే ప్రస్తావన ,భారత వాక్యం విష్కంభం ఆచార్యుల నాటకాలలో తీసే శారు .’’పూర్వ రంగం’’ అనే ఆధునిక పధ్ధతి అవలంబించారు .ఇందులో ప్రధాన పాత్ర చర్యను సమర్ధించటం ఉంటుంది .చిత్రాంగి చర్యను ,కైకేయి చర్యను పాశ్చత్యనాటక ప్రక్రియ’’ ప్రోలోగ్’’ ను అనుసరించారు .అలాగే ‘’ఉత్తర రంగం ‘’కూడా ఆంగ్ల విధానమే .ఇదీ ‘’ఎపిలోగ్ ‘’అనే పధ్ధతి .ఇదీ నాటకం లో నీతిని తెలుపుతుంది .సంస్కృత నాటకం లోని అంకాలు బదులు రంగాలుగా విభజించారు .ముఖ్యంగా ‘’ ట్రాజెడీ’’ ని తెలుగు నాటకరంగం లో ప్రవేశపెట్టిన ఘనత ధర్మవరం వారిదే .సారంగధర కథలాంటివి ప్రతి దేశ భాషలోనూ ఉన్నాయి .ఇదీ మాళవ దేశం లో మాంధాత పురం లో జరిగినట్లు గౌరన నవనాథ చరిత్రలో రాస్తే ,ద్విపద బాలభాగవతంలో ఉన్నది చేమకూర ,కూచిమంచి బాలభారతాన్నే అనుసరించారు .హంపి దగ్గర కంపిలి అనే కా౦పిల్యనగరం లో ఈ కథ జరిగిందని శ్రీసురవరం ప్రతాపరెడ్డి గారన్నారు .పంజాబ్ లో పూరణ్ భగత్ కథ ఇలాంటిదే .అది జలంధర్ లో జరిగినట్లు అక్కడి జానపద గాధలలో కనిపిస్తుంది అన్నారు తిరుమల వారు ..ధర్మవరం వారి విషాద సారంగధర నాటకం ముఖ్య ఉద్దేశ్యం ‘’ఈడుకాని వివాహమిది కారణంబు -జోడు చాలని పెండ్లి శుద్ధాపరాధము ‘’ఆని చెప్పటానికే .సాహిత్యం లో ఇలాంటి ఉదాత్త దృష్టి వున్న ధర్మవరం వారికి నిత్య జీవితం లోనూ అలానే ఉన్నారు .ఆ విషయాలు తెలుసుకొందాం .

 ఆయనకు కొంచెం ముందే పుట్టిన జాతీయోద్యమ ప్రభావం ధర్మవరం వారిపై పడింది .సూరత్ కాంగ్రెస్ సభలకు వెళ్ళివచ్చి ‘’పీపుల్స్ అసోసియేషన్ ‘’స్థాపించారు.మహిళల దుర్దశకు కలత చెందారు  .బీదలపాట్లకు వ్యధ చెందారు .ఆయన నాటకాలలో అభ్యుదయ భావాల ఆణి ముత్యాలు అనేకం .గాంధీ ఉప్పు సత్యాగ్రహానికి ముందే ‘’అభిజ్ఞాన మణిమంత నాటకం ‘’రాసి ఉప్పుపై పన్ను ఖండించారు .పాంచాలీ స్వయం వరం నాటకం లో విదేశీ వస్త్రాల దిగుమతి వద్దన్నారు .అదీ ఆచార్య వర్యుల క్రాంత దర్శనం అన్నారు తిరుమల వారు .ఆయన మూడవ కుమారుడు బళ్ళారి రాఘవ అల్లుడు శ్రీ గోపాలాచార్యులు ‘’మానాన్న గారికి పిల్లలంటే ప్రాణం ..ఉత్సాహంగా ముచ్చటగా మాట్లాడేవారు .నన్నూ నా తోటిపిల్లల్ని తెల్లారు ఝామున నాలుగు గంటలకే లేపి అమరం సంత చెప్పేవారు .మాకు ఇబ్బందిగానే ఉండేది .సంత చెబుతూ దేవతల పేర్లు వచ్చినప్పుడు వారికి చెందిన కథలు చెబుతుంటే మా నిద్రమత్తు వదిలిపోయేది .ఉత్సాహంగా అమరశ్లోకాలు వల్లె వేసే వాళ్ళం .డబ్బు అంటే లెక్కే లేదు విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు .ఇల్లు ఎప్పుడూ పెళ్ళి ఇల్లులాగా బంధుజనంతో కళకళ లాడేది .పెట్టు పోతలంటే ఆయనకు పండగే .ఈ ఖర్చు చూసి మా అమ్మ ఏడ్చేది .అన్నం తినేదికాదు.ఒక వంటవాడు అతిధి అభ్యాగతుల  వంట వడ్డింపు లకు ,మరో ఆయన నాన్నగారు పొరుగూరు  వెడితే వెంట వెళ్లి వంట వార్పుకు .ఒక సారి మాఇంట్లో నాన్నగారు ఆంధ్రసాహిత్య పరిషత్ సభ జరిపారు .ఆంధ్రదేశంలోని కవులంతా వచ్చారు . సంఘ సంస్కరణాభిలాష నాన్న గారికి ఎక్కువ.ప్రమీల నాటకం లో స్త్రీ హక్కులకోసం గట్టిగా  వాదించారు .’’సుతుల గా౦చుట కంటే ,,సతులకు ని౦కొక్క పని లేదనియయెడు మహా ప్రభువులారా ‘’ఆని మెత్తని చెప్పుతో కొట్టినట్లు కొట్టారు  .పంచాలి నాటకం లో రజస్వలానంతర వివాహం అత్యవసరమని ఒకపాత్రతో అనిపించారు .’’

  నాటక ప్రదర్శనకు ఒక నట బృందం’’సరస వినోదిని సభ ‘’ ఏర్పాటు చేసుకొన్నారు .ఆయనే దశరధ,  బాహుక ,రాజరాజ నరేంద్ర పాత్రలు ధరించేవారని గిడుగు సీతాపతి గారు ‘’దశరధ పాత్రలో ఆయన్ను చూశాను  .నటన సహజం ఆకర్షణీయం .ప్రేక్షకులలో ఉన్న ఆయన మిత్రుడు స్టేజిపై దశరధ మరణ సన్ని వేశం చూసి నటనకు ముగ్ధుడై  దుఖం భరించలేక ‘’అయ్యో కృష్ణ మాచారీ ‘’అంటూ బిగ్గరగా ఏడ్చాడు.నిజంగానే ధర్మవరం వారు చనిపోయినట్లు ఆయన వలవలా ఏడ్చాడు ‘’అన్నారు .

  ఆయన నాటకాలలో నటులకు క్రమ శిక్షణ చాలా ముఖ్యం .తాను చెప్పినట్లు నటించకపోతే  రంగం అయిపోగానే తిట్టి చెంపలు వాయించేవారు .తమిళనాటక పితామహుడు పద్మశ్రీ సంబంధ మొదలియార్ ‘’ఈర్ష్య అసూయ ఆయనకు లేనేలేవు .సారంగధరలో నేను చెప్పిన మార్పు చేశారు .సరస వినోదిని చీలీపోయినప్పుడు, బళ్ళారి తెలుగు, నెల్లూరి తెలుగు అనే వాదం వచ్చినప్పుడు ఆచార్యులవారు నోరువిప్పలేదు ఇంతటి సహనం నిర్మలత్వం ఎవరిలోనూ చూడలేదు’’అన్నారు .ఆయన సహృదయ సులభులు .నాటక విషయమై ఎప్పుడు యే సంగతి అడిగినా వెంటనే చెప్పేవారు .’’ఆనాడు నాటకం లో ‘’జుజూటి’’రాగం లో పాడిన పాట మాకోసం పాడరా’’ఆని అడిగితె  ,క్షణం లో గొంతుసవరించుకొని ఉత్సాహంగా అంతటివయసులోనూ పాడి వినిపించే సహృదయులు .వయసులో నటనలో యోగ్యతలో సంపాదనలో అంతటి పెద్దవాడు అంత సులభంగా ఉండటం నేనెక్కడా చూడలేదు .అందుకే వారిని నాగురువుగా భావించాను అన్నారు మొదలియార్ .బళ్ళారి మునిసిపాలిటి ఒక వీధికి ‘’కృష్ణమాచారి వీధి ‘’ఆని పేరు పెడితే, ప్రభుత్వం ఆయన పేర ఒక పోస్టాఫీస్ పెట్టింది . .

  ధర్మవరం వారు మహాకవి చదివి ఆనందించదగిన సామగ్రి వారి నాటకాలలో ఉంటుంది .సమయ స్పూర్తితో నిసర్గ మధుర సంభాషణలు ,ప్రబంధ ధోరణిలో పరవళ్ళు తొక్కే పద్యాలు  ,కర్నాటక సంగీత ధోరణిలో సాగే గేయాలు ఆయన నాటకాలకు అమూల్య ఆభరణాలు అంటారు తిరుమల రామ చంద్ర .1912 నవంబర్ 30నసరసవినోదిని వారు ఒక నాటకం ప్రదర్శిస్తున్నారు నాటకశాల ప్రేక్షకులతో కిక్కిరిసి పోయింది .నాటకంరసకందాయంగా జరుగుతోంది నాటకం మధ్యలో సభాధ్యక్షుడు ‘’ప్రేక్షకమహాశయులారా !ఆలూరుకు వెళ్ళిన మన రామక్రిష్ణమాచార్యులవారు సబ్ మేజిస్ట్రేట్ ఆవరణలో పడి పోయి అకస్మాత్తుగా మరణించారు ‘’ఆని ప్రకటించగా ప్రదర్శకుల వీక్షకుల మనోభావం  వర్ణించ టానికి  మాటలు చాలవు .

 శ్రీమాన్ ధర్మవరం రామ కృష్ణమాచార్యులవారు అనంతపురం జిల్లా తాడిపత్రి లో పరీధావి నామ సంవత్సర (1853)కార్తీక శుద్ధ ఏకాదశి నాడుకృష్ణమాచార్యులు , లక్ష్మమ్మ  దంపతులకు  జన్మించారు తండ్రి బళ్ళారి వార్ద్ లా కాలేజిలో ఆంధ్రపండితులు .తండ్రివద్దనే తెలుగు సంస్కృత కన్నడ భాషలు నేర్చారు .ఇంగ్లీష్ లో ఎఫ్ ఏ..చిన్నప్పుడే అష్టావధానాలు చేసి కొక్కొండ వెంకటరత్నం గారి ప్రశంసలు పొందారు ..ఆదోని తాలూకా కచేరిలో గుమాస్తా చేసి ,బళ్ళారి కంటోన్మెంట్ మాజిష్ట్రేట్ కోర్ట్ లో ప్రైవేట్ వకీలుగా చేరి ,ఫస్ట్ గ్రేడ్ ప్లీడర్ పరీక్ష ప్యాసై ప్రభుత్వ న్యాయవాది అయి ఖ్యాతిపొందారు .1910లో గద్వాల సంస్థానాధిపతి పెద్ద పండిత పరిషత్ జరిపి ‘’ఆంధ్ర నాటక పితామహ ‘’బిరుదు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు .ఆయుర్వేదంలోనూ సిద్ధహస్తులే .

ఆధారం -శ్రీ తిరమల రామ చంద్రగారి -ఆంధ్రనాటక పితామహ ధర్మవరం రామ కృష్ణ మాచార్యులు ‘’వ్యాసం .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -30-8-25-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.